Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


     సిద్దయ్య తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. మేమూ వెళ్ళాం గుడిసెలో ఒక ప్రక్కన కుండలూ, యిటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి. మరొక ప్రక్కన దండెంమీద బట్టలూ, అక్కడే ఒక నులక మంచమూ వున్నాయి. మంచంమీద సిద్దయ్య కూతురు కాబోలు పడుకుంది.

    "సూరీడు లేలే" అంటూ తట్టి లేపాడు సిద్దయ్య. ఆ యువతి కళ్ళు తెరచి మమ్మల్ని చూసి గబుక్కున లేచింది. ఆ వూపుకి ఆమె కొప్పు విడివడి వినీల జలపాతంలాగా ఆమె జుట్టు జర్రున జారి పిరుదుల్ని తాకింది.

    సిద్దయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచంమీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా, భయంగా చూస్తూ నిలుచుంది. సిద్దయ్య తొందరగా రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదుకుతున్నాడు. చివరికి కింద బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరుముక్కలూ, రాళ్ళూ ఏవేవో వున్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్దయ్య.
 
    యువతి చటుక్కున ఆతృతతో "ఈ అయ్యకి పెదవులు నల్లపడిపోతున్నాయి బాబూ" అంది.

    భూషణం అదిరిపడ్డాడు. "సిద్దయ్యా! త్వరగా మంత్రం వెయ్యి. ఆలస్యం చెయ్యకు" అని కేకలేశాడు. సిద్దయ్య నిరుత్సాహంగా, విషాదంగా లేచినుంచున్నాడు. "కావలసిన వేరుముక్క లేదు బాబూ. ఉందనుకున్నాను" అన్నాడు.
 
    "అయితే ఇప్పుడెలాగా?" భూషణం భయంతో ప్రశ్నించాడు.

    "ఏం చెయ్యనుబాబూ, లేదని తెలిస్తే ముందేతెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగసెట్టు అవతల పొదలకాడ యీ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేం. పాము పుట్టలూ ముళ్ళపొదలూ జాస్తిగా ఉంటయ్"

    "ఎక్కడుంది వెలగచెట్టు?"

    "శానాదూరం బాబయ్య రెండు మూడొందల గజాలు పోవాలి.

    "ఎలాగో వెళ్ళు సిద్దయ్యా నీమేలు మరచిపోను. నా కాళ్ళు పట్టుకుంటాను.
 
    "చెప్పాలా బాబయ్యా. నిష్కారణంగా బాబు సచ్చిపోతుంటే వూరుకుంటానా! అందులో నాకు చీకటిపడితే చూపు ఆనదు సరీగా. ఏది ఏమిటో తెలియదుగదా -ఈ చీకట్లో మొక్క ఆనవాలు ఎట్లా తెలుస్తుంది బాబయ్యా"

    భూషణం జేబులోంచి పర్సు తీశాడు. అందులోంచి రెండు వందల రూపాయలనోట్లు కొన్ని పదులూ పైకితీసి "ఇవిగో సిద్దయ్యా ఇంకా యిస్తాను, ఎంతయినా ఇస్తాను. నా రామచంద్రాన్ని రక్షించు. నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి" అంటూ సిద్దయ్య ఒళ్ళో పడేశాడు.

    సిద్దయ్య కంగారుగా పక్కకి తప్పుకున్నాడు. నోట్లు చిందర వందరగా పడిపోయాయి.

    "ముందా డబ్బుతీసి లోపల పెట్టుకోబాబూ. మీ డబ్బుకి ఆశపడ్డానా నా మంత్రం పనిచెయ్యదు" సిద్దయ్య కఠినంగా అన్నాడు.  "తియ్యండి బాబూ తియ్యండి"

    భూషణం విధిలేక నోట్లని ఏరి పర్సులో కుక్కి "ఇంక లాభం లేదా" అన్నాడు దిగులుగా.

    సిద్దయ్య లేదన్నట్టు తలవూపాడు. భూషణం గుండెలు బాదుకుని "రామచంద్రం!" అంటూ ఏడుస్తూ కూలబడ్డాడు. అతనిలో యింతకుముందు రేగిన ఆశ ఒక్కసారి గప్పున ఆగిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు.

    "పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబూ" సూరీడు సన్నని గొంతు. అదిరిపడి చూశాడు భూషణం.

    "నువ్వా?" కంగారుగా అన్నాడు సిద్దయ్య.  "వద్దు ప్రమాదం సూరీడూ అక్కడ పాము..... అమ్మో"

    "ఈ అయ్య చచ్చిపోతూంటే....పాపం"

    "వద్దు వద్దు" అంటున్నాడు సిద్దయ్య.

    "వెళ్ళొస్తాను" సూరీడు గొంతులో నిశ్చయం జుట్టుముడి వేసుకుని క్షణంలో గుడిసె అవతలికి దూసిన బాణంలా వెళ్ళిపోయింది.

    "వద్దు సూరీడు! నా మాట విను వెళ్ళొద్దు" అంటూ సిద్దయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూరీడు దూరంగా వెళ్ళి అడవిలో చీకటిలో కలిసిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చేరగిలబడిపోయి నీరసంగా "ఓపలేని మనిషి బాబూ, విన్నది కాదు" అంటూ వణకే చేతులలో మొహం కప్పుకున్నాడు.

    భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్దయ్య ప్రాణం బిగబట్టుకున్నట్టుగా కూర్చున్నాడు. ఏ చప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతడి కడుపుతీపి అతనిది. మంచంమీద రామచంద్రం చివరి ఘడియల్లో వున్నాడు. ఒక పక్క కటిక చీకట్లో అడవిలో విపత్తుని కోరి తెచ్చుకుంటోంది వయస్సులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారితీస్తుందో - సరదాకి వీళ్ళతో ప్రయాణం చేస్తున్న నాగతి ఏమవుతుందో తెలియక ఒక్క క్షణం ముందుకు ఆలోచించే శక్తికూడా లేక నిశ్చేష్టుడనై ఉన్నాను నేను. మేకలు గుడిసె అవతల సిద్దయ్యవి కాబోలు అరుస్తున్నాయి. మృత్యుచ్ఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకొన్నాయి. ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.