Home » Muppala Ranganayakamma » Stree


 

    నీకేం కష్టం కలిగింది? నిన్ను నేనేం బాధ పెట్టాను?" తల్లి కంఠం రుద్దమై పోయింది.
    "అమ్మా!" బావురుమంది సుజా. "వద్దమ్మా నన్ను బ్రతక మనకు. నాకు బ్రతకాలని లేదు. బ్రతికి నేనేమీ సుఖ పడలేనమ్మా! చచ్చిపోతే హాయిగా ఉంటాను. నిజమే అమ్మా! నేను బ్రతకలేను."
    "సుజా! ఏమిటీ పిచ్చి ధోరణీ? అమ్మతోనే చచ్చిపోతానని చెప్తున్నావా? అష్టకష్టాలు పడి ఇన్నేళ్ళు పెంచింది ఇందుకేనా, అమ్మా? నువ్వు చచ్చిపోతానంటే ఊరుకోటానికేనా ? పిచ్చి దానిలా మాట్లాడకు. సంగతేమిటో నాకు చెప్పు.చెప్పు,  సుజా!"
    "వద్దమ్మా,. వద్దు. నీకు చాలా కోపం వస్తుంది. నీ నోటితో నువ్వే చచ్చిపోమ్మని కేకలేస్తావు. అక్కయ్యని కూడా అలాగే తిట్టావు."
    "సుజా!' నిర్ఘాంత పోయింది కామేశ్వరమ్మ. "నీ మనస్సులో ముక్కేమిటో నాకు తెలీటం లేదు, సుజా! అక్కయ్యకీ నీకు పోలీకేమిటే? అది జాతి మతం చూడకుండా పోయింది. నువ్వు లక్షణంగా పెళ్ళి చేసుకో బోతున్నావు."
    "అమ్మా! నా మాట ఒక్కటి వినమ్మా! నేనా పెళ్ళి చేసుకోలేను. ఊహూ! చేసుకోలేనమ్మా!"
    "సుజా!' స్థాణువు లా బిగుసుకుపోయింది కామేశ్వరమ్మ.
    సుజా భూమిలోకి తల దించేసుకుంది. ఎప్పటికో తేరుకోగలిగిన కామేశ్వరమ్మ కటువుగానే అడిగింది. "అందుకేనా ఇంత సాహసానికి పూనుకున్నావు ? పోనీ, నీ కిష్టం లేకపోతె ఆ ముక్క నాతో చెప్పరాదూ? నేనేం తల్లిని కాననుకున్నావా? నిన్ను నా కడుపులో మోసి కనలేదనుకున్నావా?"
    సుజా తలెత్తి కాస్త ధైర్యంగా చూసింది. "అక్కయ్య ని క్షమించని నువ్వు నన్ను మాత్రం ఎలా క్షమిస్తావమ్మా? హటాత్తుగా చచ్చిపోయినా ఓ ఏడుపు ఏడిచి ఊరుకోగలవు కానీ..... మళ్ళా నేను అక్కయ్య లాగే నిన్ను అవమానాల పాలు చేస్తే .....చెయ్యలేనమ్మా! నావశం కాదు. నీ సంతోషం కోసం ఏమైనా చేద్దామనుకున్నను. దానికీ నా శక్తి చాలలేదు. నిన్ను సంతోష పెట్ట గలిగేది ఏమైనా చెయ్య గలిగితే అది నా చావేనమ్మా! మన కుటుంబం ఇప్పటికే నవ్వుల పాలై వుంది. మరోసారి మనం అవమానాన్ని భరించలేము. కోరుకునే వ్యక్తికీ దూరమై మనస్సు లేని మనువు చేసుకుని జీవితాంతం నరకం అనుభవించమని శాసించకమ్మా! నన్ను కని పెంచిన అమ్మవి. నా సుఖ దుఃఖాలు నీకు తెలుసు. నేను అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోతాను. నీ గుండె రాయి చేసుకోక తప్పదమ్మా! నాకోసం ఆ భాధ భరించు. నాకోసం...." సుజా అప్రయత్నంగానే ఆ మాటలన్నీ అంది.
    కూతురు మాటలు వింటూ, కూతురు ఆవేశం చూస్తూ మ్రాన్పడి పోయింది కామేశ్వరమ్మ.
    "అక్కయ్య తప్పు చేసిందని నేననుకోవటం లేదు. అయినా అలాంటి సాహసం చేసి పది మందిలో నిన్ను మాత్రం నవ్వుల పాలు చెయ్యను. ఆ భయం నీకెప్పుడూ వద్దు. కాని కాని...... నన్ను వెళ్ళి పోనీ, అమ్మా! నిన్ను చేతులెత్తి ప్రార్ధిస్తున్నాను. నా మనస్సు విప్పి అమ్మని కోరుకుంటున్నాను. నాకు బ్రతకాలని లేదు. బ్రతికి నేను సుఖ పడేదేమీ లేదు. నా మాట వినవా, అమ్మా?"
    "సుజా! " నిర్లిప్తంగా చూసింది కామేశ్వరమ్మ. "నువ్వు కోరుకునే ఆ వ్యక్తీ ఎవరు?"
    "అమ్మా...."
    "సరే! ఎవరు కానీ! అది నీకు నువ్వే నిర్ణయించుకున్నావు. ఆ కోరిక తీరనప్పుడు చావటానికి కూడా సిద్డంయ్యావు. పట్టుబడిపోతే చావనివ్వమని పాకులాడుతున్నావు. బిడ్డ తల్లిని ఇలా అడిగే దుర్గతి ఏ తల్లి కైనా పడుతుందా? బిడ్డ మరణిస్తోంటే తల్లి సంతోషించే ఘోరం ఏ యింటయినా జరుగుతుందా? లేదమ్మా, లేదు కన్నబిడ్డ చచ్చిపోవాలనుకునే మూర్ఖత్వం నాలోనూ పోయింది. నీ సుఖం కన్నా నీ సంతోషం కన్నా నాకూ ఏమీ అక్కర్లేదమ్మా! అక్కర్లేదు."
    విస్మయంగా చూసింది సుజాత. తల్లి కళ్ళు చెరువులయ్యాయి. "బిడ్డల్ని కనటం చంపుకోటానికి కాదు. అల్లారు ముద్దుగా పెంచుకోటం జీవితమంతా దుఃఖ పెట్టటానికి కాదు. నీ ఆశలూ, నీ కోరికలూ నీకు ఉన్నాయి. నా కంటికి పసిదానివే అయినా నీకు నువ్వు పసి దానివి కావు. సాధించీ, బాధించీ ఇష్టం లేని వ్యక్తితో నీ బ్రతుకు నెందుకు బంధించాలి? తెలిసీ తెలిసీ తల్లిగా నీకన్నీళ్ళు తుదవలేక పొతే ఈ తల్లి జన్మెందుకమ్మా? ఇన్నాళ్ళూ పిచ్చిదాన్నై -- ఏవేవో కోరికలు కోరుకున్నాను. నీకైనా అయినింట పెళ్ళి చేసి అచ్చటా ముచ్చటా తీర్చు కుందామని భ్రమ పడ్డాను. పోనీ, తల్లి! బ్రతుకులే భగ్న మౌతుంటే పిచ్చి పిచ్చి కోరికలకి విలువేమిటి? ఇదంతా నా అదృష్టమే నని నేనెందుకు కనుకోరాదు? కడుపున పుట్టిన బిడ్డలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంటే తృప్తి పడలేక పోతానా? అమ్మ గురించి ఎలాంటి భయమూ పెట్టుకోకమ్మా! మనస్పూర్తిగా ఆశీర్వదిస్తాను."
    'అమ్మా!" అయోమయంగా చూసింది సుజాత. తల్లిలో ఊహించని ఆ మార్పు దాదాపు వెర్రిదాన్ని చేసింది. అమ్మ ఎంత నోచ్చుకోకపోతే , బాధతో ఎంత తల్లడిల్లక పొతే అంత నిరాశ చేసుకుంటుంది? అమ్మ ఇంత చిత్రంగా మారిపోయిందా? మనస్పూర్తిగా అంగీకరించిందా? సాధ్యమేనా? అమ్మ వంటి వ్యక్తికీ పరివర్తన సాధ్యమేనా?
    మనిషికి తన సుఖం, తన సంతోషం , తన స్వార్ధం తప్పితే ఏమీ లేవా? మనిషి మరో మనిషి  కోసం త్యాగం చెయ్యలేడా? త్యాగం లో ఉన్నతృప్తి స్వార్ధం లో లభిస్తుందా? అమ్మ కోసం ..... అమ్మ కోసం తనేమీ  చెయ్యలేదా?
    "అమ్మా! నన్ను క్షమించవూ? మూర్ఖత్వంతో నా స్వార్ధం నేనే ఆలోచించుకున్నానమ్మా! ఈ ప్రాణం నువ్వు పోసింది. ఈ శరీరం నువ్వు పెంచింది. ఈ జీవితమే నువ్వు ప్రసాదించిందమ్మా! నీ ఆశలు నాశనం చేసి, నీ నమ్మకాలు వమ్ము చేసి , నిన్ను నలుగురి లోనూ నవ్వుల పాలు చేసి, నేను సుఖ పడగలనా, అమ్మా? చిన్నదాన్ని. మన్నించమ్మా! నీ యిష్ట ప్రకారమే నడుచు కుంటాను. నువ్వు కన్న కలలన్నీ సఫలం చేస్తాను. ఈ బిడ్డ మీద నీకు సర్వ హక్కులూ ఉన్నాయమ్మా! నా తప్పు నీ కడుపులో దాచుకో. అంతా మరిచి నన్ను ఎప్పటి లాగే ఆదరించు..... నీ కోసం.... నీ కోసం..... అమ్మ కోసం.... ఏమైనా చేస్తాను. ఏదైనా అనుభవిస్తాను. ఎంత దుఃఖాన్నయినా దిగ మింగుకుంటాను. నన్ను-- నమ్మలేవా, అమ్మా?"
    "సుజా!' కామేశ్వరమ్మ తన కొంగుతో కూతురు కన్నీళ్ళు ఒత్తింది. "తప్పు, తల్లీ! నువ్విలా కంట తడి పెట్టకూడదు. నీ కంట మరి కన్నీరు తిరగాకూడదు. నాకోసం నువ్వు ఏమీ చెయ్యకూడదు. నేనేమిటి? రాలిపోవటానికి సిద్దంగా ఉన్న పండుటాకుని. జీవితంలో అన్ని సుఖాలూ, సంతోషాలూ అనుభవించాను. అన్ని సంవత్సారాలుగా నేర్చుకున్న అనుభవంతో నా కోసం నిన్ను త్యాగం చెయ్యమని అడిగేంత మూర్ఖత్వం సంపాదించుకో లేదమ్మా! తల్లి సంతోషం కోసం బిడ్డని దుఃఖ పెట్టటం అమానుషం కాదా? నీ సుఖ దుఃఖాలు గుర్తించవలసిన బాధ్యత నామీదే ఉంది. కష్టమైనా నిష్టూరమైన ఆ బాధ నేనే భరించి నా బాధ్యత నెరవేర్చు కుంటాను. తల్లికీ, బిడ్డకూ లేని అనుబంధాలూ, మనకారాలూ లోకంలో మరెక్కడున్నాయమ్మా? నీకిష్టం లేని పెళ్ళి చెయ్యలేను. కోరుకున్న వివాహాన్ని తిరస్కరించనూ లేను."
    "అమ్మా!" నమ్మ శక్యం కానట్టే అడిగింది సుజాత. "లోకం భయం నీకు లేదా, అమ్మా?"
    "ఉంది, తల్లీ, ఉంది! కాని, ఈ గర్భ శోక భయం కంటే ఎక్కువది కాదు. ఈ కమ్మటి కడుపు తీపి కంటే గొప్పది కాదు."
    "అమ్మా! అక్కయ్యంటే ఇప్పుడు నీకు కోపం లేదా?"
    "అక్కయ్యంటేనా కెప్పుడూ కోపం లేదమ్మా! ఏ తల్లీ ఏ బిడ్డనీ అసహ్యించుకోలేదు. బిడ్డ చేసిన నేరానికి శిక్ష విధించలేదు. తన శరీరాన్ని తనే బాధించుకోగలదా? తన హృదయాన్ని తనే చీల్చి వేసుకోగలదా? అక్కయ్య కోసం నేనెంత కుళ్ళి పోతున్నానో ఎవరికి తెలుసమ్మా? భగవంతుడికి తప్పితే ఇంకెవరికి తెలుసు?"




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.