Home » Muppala Ranganayakamma » Stree


 

                               

     సంభ్రమంగా పేపరు పట్టుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది సుజాత. "అమ్మా! నీకో మాట చెప్పేదా?"
    "ఏమిటే అదీ? అంత చిత్రంగా అడుగుతావూ?"
    "మరి కోప్పడవుకదూ?"
    "చెప్పరాదూ? నీ అపనమ్మకాలూ నువ్వునూ."
    సుజా కాస్సేపు తటపటా యించి చెప్పేసింది.
    'అక్కయ్యనీ, బావగారినీ మన ప్రభుత్వం వారు విదేశాలు పంపిస్తున్నారటమ్మా! ఇవ్వాళ పేపర్లో పడింది."
    కామేశ్వరమ్మ మొహం చిట్లిస్తూ అంది. "ఈ కబురేనా నువ్వు చెప్పోచ్చింది? సిగ్గు లేదూ? ఆవిడేదో వెలగ బెడుతోందని ఈవిడ మురిసి ముక్కలౌతోంది. ఇల్లు విడిచి పోయింది దేశాలు తెగించి పొతే విడ్డూర మేమిటి? ఎలాగో తగలడుతుంది. నీకెందుకా గొడవ? అయినా ఈ వెధవ కాయితాలు తెప్పించ కురా అని మొత్తుకుంటే వాడు వింటున్నాడా నా మాటా? అంతా నా రాత? ఖర్మ!"
    సుజాత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది.
    ఆ రోజంతా సుజాత మనస్సు మరీ ఆందోళన గా ఉంది. చంద్రశేఖరం ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. తను పరిస్థితులకు బానిసనని మనస్సు విప్పి ఏనాడో తెలియ జేసింది. అయినా అతను తన ఆశలు విడుచు కోవటానికి అంగీకరించటం లేదు.
    "వసు  ద్వారా ,మీ యింట జరిగిపోయిన సంగతులు నాకు తెలుసు. అక్కగారి అడుగు జాడల్లో నువ్వు నడవగలవన్న ధైర్యంతో నే ఈ స్నేహాన్ని బ్రతికించు కొంటూ వస్తున్నాను. నువ్వు కాదన్న నాడు, నిజంగా నువ్వు నాకు దూరమై పోయిన నాడు నేనే మౌతానో నాకు తెలీదు. చచ్చిపోకపోయినా పిచ్చి వాణ్ణి కావచ్చు. ఈ కాలంలో సర్వ సామాన్యమై పోయిన వర్ణాంతర వివాహాన్నే నువ్వింత ఘోరంగా భావిస్తే ఇక నేనేమీ చెప్పలేను. ఆ అర్హత కూడా నాకు లేదు."
    చంద్రశేఖరం వ్రాతలు తననే పిచ్చిదాన్ని చేస్తున్నాయి. పులి మీద పుట్ర లా అన్నయ్య తీసుకొచ్చిన సంబంధం వాళ్ళు త్వరలో నిర్ణయించు కోటానికి వస్తామంటూ ఆరోజే ఉత్తరం వ్రాశారు.
    ఇన్నాళ్ళకు అమ్మ తేలిగ్గా నిట్టూర్చింది. "నా బిడ్డకి శుభకార్యం జరిగి పోనీ , వెంటేశ్వరా! నూతన దంపతుల్ని తీసుకొని నీ కొండ కోస్తాను" అంటూ అందరూ వింటుండగానే చేతులెత్తి మొక్కుకుంది. సుజా గుండెలు అదిమి పట్టుకుని గదిలోకి నడిచింది.
    చంద్రశేఖరం అఖరి ఉత్తరం వ్రాశాడు.
    అమ్మ ధోరణేమీ మారినట్టు లేదు. ఏం చెయ్యాలి తను? సుజా వెర్రిగా తిరిగింది ఇల్లంతా.
    గదుల్లో ఎక్కడా లైట్లు లేవు. వదినా, అన్నయ్యా ఎటో వెళ్ళినట్లున్నారు. అమ్మ కూడా ఏం చేస్తుంది? "అమ్మా! పిలుస్తూ పెరటి వైపు వెళ్ళింది. కొంగు చాటున  ఏదో అడ్డం పెట్టుకుని నూతి వెనక నుంచి వచ్చేస్తున్న అమ్మ, సుజా ను చూడడం తోనే కూల బడిపోయింది. చటుక్కున ఏడవటం మొదలు పెట్టింది.
    విస్తుబోతూ సుజా తల్లి దగ్గరికి వెళ్ళాలో కూడదో తెలీనట్టు నిలబడి పోయింది.
    కామేశ్వరమ్మ కొంగు చాటు పేపరు గాలికి దూరంగా వెళ్ళి పడింది. సుజా గమ్మున దాన్ని అందుకుంది. అంతా అర్ధమై పోయింది .అక్కయ్య గురించి పేపర్లో ఏదో ఉందని తను చెప్పినప్పుడు కసిరేసిన అమ్మ ఒంటరిగా రహస్యంగా నూతి చాటున కనీ కనిపించని వెలుగులో ఏదో వెదుక్కుంటుంది పేపర్లో.
    "అమ్మా!" అంటూ దగ్గర కూర్చుంది సుజా.
    కామేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అక్కయ్యా బొమ్మ లేదే అందులో?"
    "లేదమ్మా! వార్త ఒక్కటే వేశారు. బహుశా వాళ్ళు బయల్దేరి వెళ్ళే ప్పుడు ఫోటో కూడా వేస్తారేమో!"
    "అక్కయ్య ఎక్కడికి వెళ్తోందసలు?"
    "హోల్ వరల్డ్ టూర్-- అంటారమ్మా?" దాదాపు ప్రపంచంలో ముఖ్య దేశాలన్నీ తిరుగుతారు. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి ,మెడికల్ అస్సోసియేషన్ తరపున పంపిస్తున్నారు. ఆరు నెలలో తిరిగి వస్తారు."
    "ఎలా వెళ్తారే , సుజా? రైళ్ళ లోనే?"
    "విమానం లో వెళ్తారమ్మా! రైలు ప్రయాణమైతే చాలా రోజులు పడుతుంది కదా?"
    "ఆ పసి ముండని కూడా తీసుకెళ్తారా ఏమిటి?"
    "అదేమో? మనకెలా తెలుస్తుంది? బావగారికి తల్లీ వాళ్ళూ ఉన్నారు కదా? అక్కడే ఉంచేసి వెళ్తారేమో!" కామేశ్వరమ్మ మరి మాట్లాడలేదు. అక్కడే కూర్చుని ఎప్పటికో లేచింది.
    అక్కయ్య గురించి అంతసేపు ఎప్పుడూ మాట్లాడని అమ్మ, అన్ని వివరాలు తెలుసుకోటానికైనా ఇష్టపడని అమ్మ అలా మనస్సు విప్పి అన్నీ అడగటం చిత్రంగా తోచింది సుజాకు.
    కామేశ్వరమ్మ కూడా ఎంతో తప్పు పని చేసిన దానిలాగ సిగ్గు పడిపోతూ ఇంట్లోకి పోయి  పడుకుంది.
    అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతం. కామేశ్వరమ్మ పడుకున్న గది చాలా చీకటిగా ఉంది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టని కామేశ్వరమ్మ నిశ్శబ్దంగా ఆలోచిస్తూ పడుకుని ఉంది. పద్మజ...పద్మ కోసం ఆ తల్లి ఏడవని రోజు లేదు. ఆలోచించని ఘడియ లేదు. అందర్నీదిక్కరించి వెళ్ళి పెళ్ళంటే చేసుకుంది గానీ పద్మ కూడా ఎవ్వర్నీ మరిచి పోదని ఆ తల్లి మానస్సుకు తెలుసు. పార్వతి పద్మను చూశానని చెప్పినప్పుడు కూతురు గురించి ఎంతో తెలుసుకోవాలని , ఎన్నో అడగాలనీ మాతృ హృదయం విలవిల్లాడి పోయింది. ఏదో రాక్షస హస్తం ఆమె నోటిని బలవంతంగా మూసి వేసింది. విన్నట్టు నటిస్తూనే కూతురి క్షేమ సమాచారాలన్నీ వింది.
    పద్మజ గర్భవతి గా ఉందని వింటే ఆనందం అణుచుకోటానికి అశక్యమై పోయింది. గబగబా ఏదో గొణుక్కుంటూ వంటింట్లో కి వెళ్ళి పోయింది. పద్మజ కడుపు తో వుంది. ఎలా తింటుందో? ఎలా తిరుగుతుందో? అన్న ధ్యాసే అధికమై పోయింది. ఆడపిల్ల పుట్టిందని మళ్ళా తేలిసినప్పుడు తేలిగ్గా హాయిగా గాలి పీల్చుకుంది. 'అదీ ఓ కూతుర్ని కంది. దానికీ కష్ట సుఖాలు తెలిసి వస్తాయి. తల్లి చేసినట్టే పిల్ల చెయ్యక పోతుందా? తన బిడ్డ ధిక్కరించి పోయినప్పుడు గాని దానికి తెలిసి రాదు' అంటూ శపించింది చాలా సేపు . అంతలోనే ఆవిడకో అనుమానం రేగింది. 'నేను కాబట్టి ఇలా తల బద్దలు కొట్టు కుంటున్నాను. పద్మే అయితే కూతురు ఏం చేసినా ఊరు కుంటుందేమో? అకాలానికి ఎవ్వరేం చేసుకున్నా తప్పు పట్టరేమో!"
    అదీ నిజమే ననిపించింది కాస్సేపు.
    ఎవ్వరేన్ని అడిపోసుకుంటే మాత్రం అదేం చెడిపోయింది? లోకంలో అంతులేనన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చు కుంటుంది. కోరుకున్న భర్తతో, బిడ్డలతో సుఖ పడుతుంది . బ్రతుక్కు అంతకు మించి.........
    అలమారు దగ్గరేదో అలికిడైంది. గాజుల ఘల్లు మన్న చప్పుడు వినిపించింది. భయంతో లేచి కూర్చున్న కామేశ్వరమ్మ చీకట్లో కి కళ్ళు చిట్లించి చూసింది. అలమారు దగ్గరే నిలబడి ఉన్న వ్యక్తీ అడమనిషని మాత్రం గుర్తు తెలుస్తుంది.
    "ఎవరదీ?' అంది వణుకుతున్న గొంతుతో.
    జవాబు రాలేదు. ఏడుపు బలవంతంగా అణుచుకుంటున్నట్టు వెక్కిళ్ళు చప్పుడు వినిపించింది.
    కామేశ్వరమ్మ కేదో అనుమానం రేగింది. చటుక్కున లేచి తడుముకుంటూ వెళ్ళి లైటు వేసింది.
    కుప్పలా కూలబడిపోయింది సుజాత.
    దిగ్భ్రాంతి తో తల్లడిల్లి పోతూ కామేశ్వరమ్మ కూతుర్ని పొదివి పట్టుకొంది. సుజాత తల్లి ఒడిలో తల దాచుకుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చింది.
    కూతురు వీపు నిమురుతూ అయోమయంగా కూర్చుంది కామేశ్వరమ్మ.
    గట్టిగా బిగుసుకుంటున్న సుజా గుప్పిడి పట్టుకుంది. "సుజా! అమ్మా! ఏమిటే ఇది?"
    అశక్తతతో సుజా గుప్పిడి విడిచింది. గుప్పెడు మాత్రలూ రాలి పడ్డాయి. అదిరి పడింది కామేశ్వరమ్మ. "అమ్మా! ఏమిటే ఈ పని? ఇవి నిద్ర మాత్రలు కావూ?"
    వణుకుతున్న కంఠం తో నెమ్మదిగా నసుగుతూ అంది సుజా : "నీకు.....నిద్ర మాత్రలు ...ఇవ్వలేదని..... జ్ఞాపకం వచ్చి....."
    "నన్నింత మభ్య పెట్టకే. తల్లీ! రోజులా ఎనిమిది గంటలకే నాకు మాత్ర లిచ్చావు. అవి మింగినా నిద్ర రావటం లేదీ రాత్రి. నువ్వు మాత్రం ఎలా మరిచి పోయావనుకొనే!"
    "లేదమ్మా! నిజంగా నీకిద్దామనే,......"
    "అయితే గుప్పెడు మాత్రలూ మింగుతానా నేను? నన్ను చంపేద్దామనుకుంటున్నావా ఏమిటే?"
    భయంతో తల దించేసుకుంది సుజా. అతి అమాయకురాలైన కూతురు ఎందుకింత సాహసానికి పూనుకుందో అర్ధం కాక తల్లి మనస్సు కొట్టు మిట్టాడింది.
    "చెప్పు తల్లీ! నాతొ చెప్పవూ? నీకేం కష్టం వచ్చింది? నిన్నేవ్వరేమన్నారు? ఎందుకే అర్ధరాత్రి లేచి ఇలాంటి పని చేయ్యబోయావు?"
    మాట్లాడలేదు సుజాత.
    "సాధ్యమైనంత తొందరలో నీ కల్యాణం కన్నుల పండువు గా చూసుకోవాలని కలలు కంటున్నాను. ఎందుకమ్మా ఇంత తెగించావు? నాకు చెప్పు తల్లీ! కడుపులో దాచు కుంటాను.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.