Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    "భయం నాకెందుకు ?' అంటూ వృద్దుడు పట్టుచీరను ఇనప్పెట్టి లో పెట్టి తలుపు తాళం వేసి తాళాలు గుత్తి కేసి శర్మ మీదకు విసిరి -- "ఇనప్పెట్టి తేరు చూద్దాం-" అన్నాడు.
    అది సవాలుగా తోచింది శాస్త్రికి , శర్మకూ.
    ఇద్దరూ ఆ తాళాలతో చాలాసేపు ప్రయత్నించారు. ఎంత ప్రయాత్నించినా ఇనప్పెట్టి తలుపులు తెరుచుకోలేదు.
    "నువ్వెలా తెరిచావు?' అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
    "అది నేను చెప్పను . ఎవ్వరూ తెలుసుకోలేరు...." అంటూ నవ్వి -- "నేను నిజమే చెప్పానని తెలిసింది గదా! వెళ్ళి మరోసారి చెంగాల్రావు పేట మనిషిని విషయమడిగి రండి. నేను వెళ్ళి ఆమెను కలుసుకుంటాను" అన్నాడు వృద్దుడు.
    "ఆమెను మళ్ళీ కలుసుకోవడమా?' అని శాస్త్రి కంగారు పడ్డాడు.
    "పద -- పోదాం --' అన్నాడు శర్మ.
    మిత్రులిద్దరూ అక్కణ్ణించి బయటపడ్డారు.
    వాళ్ళు జోళ్ళు వేసుకుంటుంటే -- 'అరే! అప్పుడే వెళ్ళిపోతున్నారే --" అంటూ ఆ యింటి యువకుడు వారిని పలకరించాడు.
    "వెళ్ళిపోతున్నాం గాని -- మళ్ళీ వస్తాం!" అన్నాడు శర్మ.
    "మళ్ళీ వస్తారా?" అన్నాడా యింటి యువకుడాశ్చర్యంగా.
    "అమలనూ, విమలనూ వాళ్ళ కర్మానికి వదిలి పెట్టడం మంచిదనిపిస్తోంది. ,మరోసారి చెంగాల్రావు పేట వెళ్ళామంటే ఆ యింటావిడ వేదాంతం పేరు చెప్పి మన ప్రాణాలు తీస్తుంది...." అన్నాడు శర్మ.
    "నువ్వు చెప్పింది నిజమే -- కానీ నేనలా ఊరుకోలేను. మన తెలివితేటల్ని ఓ నడి వయసు స్త్రీ ముందు వృధా అయితే -- మన బలపరాక్రమం అరవై ఏళ్ళ వృద్దుడికి సాటి రాకపోతే మనం బ్రతికి ప్రయోజనం లేదు. పట్టు చీర. ఆ యింట్లో కాపురం సాధించి తీరాలి. ఇది మన శక్తి సామర్ధ్యానికే సవాలు...." అన్నాడు శాస్త్రి.
    శర్మ ఆశ్చర్యంగా శాస్త్రి వంక చూసి -- 'అంటే అమల నన్నాకర్షించిన కంటే ఎక్కువగా విమల నిన్నాకర్శించిందన్న మాట--" అన్నాడు.
    'అలా ఎందుకనుకుంటున్నావు?"
    "మనిషి అవకాశవాది. ఆదర్శం కోసం జీవితమంటాడు. జీవితం కోసం ఆదర్శాలు, సృష్టించుకుంటాడు. నువ్వు విమలను ప్రేమిస్తున్నావు . ఆమెకు ప్రేమ కానుక ఇవ్వాలను కుంటున్నావు....అందుకని మన శక్తి సామర్ధ్యాలకు సవాలంటూన్నావు--" అన్నాడు శర్మ.
    "పోనీ -- అలాగే అనుకో --నీ సంగతేమిటి?'
    "నీకు సహకరించడం నా బాధ్యత అనుకుంటాను..."
    'అంటే నువ్వు అమలను నేను విమలను ప్రేమించినంతగా ప్రేమిస్తున్నావన్న మాట....దానికి సహకరమని పేరు. పెడుతున్నావు...."
    ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
    శాస్త్రికి శర్మ కళ్ళలో అమల కనబడింది. శర్మకు శాస్త్రి కళ్ళలో విమల కనబడింది.
    "మనం నిజంగానే ప్రేమలో పడ్డాం -- " అన్నారిద్దరూ ఒకేసారి.
    'అయితే ఇప్పుడెం చేయాలి?'అన్న సందేహం కూడా వారిరువురికీ ఒకేసారి కలిగింది.
    వృద్దుడు మహా బలవంతుడు.
    నడివయసు స్త్రీ మహాబోరు.
    ఇద్దర్నీ ఎలా జయించాలి?
    "మనకు ఓర్పు కావాలి. వాళ్ళిద్దర్నీ జాగ్రత్తగా పరిశీలించి ఇద్దరి బలహీనతలు తెలుసుకుని సరైన దెబ్బ తియ్యాలి...." అన్నాడు శర్మ.
    "కానీ చెంగాల్రావు పేటవిడ వేదాంతం వింటుంటే బుద్ది పనిచేస్తుందా?' అన్నాడుశాస్త్రి.
    "కాలమే నీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది --" అన్నాడు శర్మ.
    

                                      7

    మళ్ళీ మిత్రులిద్దరూ చెంగాల్రావు పేటలో ఆ ఇంటికి వెళ్ళారు.
    ఆమె వారి మాటలు వినిపించుకోకుండా వారికి వేదాంత బోధ చేసింది.
    రెండు గంటల పాటు వారామేను సహించారు.
    ఆమె అందుకేంతో సంతోషించి -- "మీరు నాకు నచ్చారు. ఎందుకంటె నా వేదాంతం విని మళ్ళీ నా యింటికి వచ్చారు --" అంది.
    "అసలెప్పుడూ మీ యింట్లోనే ఉండిపోదామనుకుంటున్నాం మేము--" అన్నాడు శర్మ.
    "నాకు కొత్త మనుషులు కావాలి. ఎప్పుడూ మీకే చెప్పాలంటే విసుగ్గా వుంటుంది--" అందామె.
    "వేదాంత బోధకు కొత్త మనుషులెందుకు?" అన్నాడు శాస్త్రి.
    "నాకు తెలిసింది చాలా తక్కువ. మీకు రెండ్రోజుల్లో నాకు తెలిసినదాంట్లో నాలుగింట మూడొంతులు చెప్పేశాను. ఇంకొక్క వంతు మిగిలింది. ఆ తర్వాత నుంచి నా పాఠం మళ్ళీ మొదటికి వస్తుంది--" అందామె.
    "ఫరవాలేదు. ఎన్ని సార్లైనా మీ పాఠం మేము మళ్ళీ మళ్ళీ వినగలం--" అన్నాడు శర్మ వినయంగా.
    "వినడానికి మీకు విసుగు లేకపోవచ్చు. కానీ చెప్పడానికి నాకు విసుగే మరి!" అందామె.
    శాస్త్రి, శర్మ ముఖ ముఖాలు చూసుకున్నారు.
    'అవునూ -- నిన్న మీకో కాపలావాడి సంగతి చెప్పాను. మాట్లాడారా?' అందామె మళ్ళీ.
    "మాట్లాడేము. అతడు మీ మాటలు నమ్మడం లేదు. ఇల్లొదిలి పెట్టాలనుకునే వారికి కాపలా వాడేందుకు అంటూన్నాడు....' అన్నాడు శర్మ.
    "జీవితంలో తన బాధ్యత నంత గొప్పగా నిర్వహించే వాళ్ళు అరుదు. నేనిల్లు వదిలిపెడితే అలాంటి వాడికే వదుల్తాను. అతడితో కాసేపు మాట్లాడాలని నా కోరిక. ఏవిధమైన సందేహాలు పెట్టుకోక అతణ్ణి నా వద్దకు రమ్మని చెప్పండి..." అందామె.
    'అలాగే -- ఈరోజుకు సెలవు." అంటూ మిత్రులూ యింట్లోంచి బైటపడ్డారు.
    మోటార్ సైకిల్ శర్మ స్టారు చేశాడు. శాస్త్రి వెనక కూర్చున్నాడు.
    దారిలో -- "నీకావిడ బలహీనతే మైనా తెలిసిందా?" అన్నాడు శర్మ.
    "తెలిసింది. అమెకిలా వేదాంతం బోధించడం యిష్టం లేదు. ఈ యిల్లోదిలి పోవాలనుకుంటోంది. కానీ మనకు మాత్రం యిల్లేద్డేకిచ్చేలా లేదు...."
    'అంటే మనం ఆ ముసలి కాపలావాడినే కాకా పట్టాలి. పట్టుచీర, అద్దె యిల్లు --రెండూ అతడి వల్లనే మనకు దొరకాలి...." అన్నాడు శర్మ.
    "చూద్దాం. మన అదృష్ట మెలాగుందో --" అన్నాడు శాస్త్రి.
    ఇద్దరూ మువ్వలవాని పాలెంలో ఆ యిల్లు చేరుకున్నారు.
    ఆ యింటి యువకుడు వాళ్ళిద్దర్నీ చూసి ఆశ్చర్యపడుతూ -- "నిజంగానే మళ్ళీ మీ యిద్దరూ వచ్చారు--" అన్నాడు.
    "అందులో ఆశ్స్యర్య మేముంది?" అన్నాడు శాస్త్రి.
    "గజదొంగలు కూడా ఆ గదిలోకి రెండో సారి వెళ్ళాలనుకోరు...."
    "మేము గజదొంగలం కాదు. పెద్దమనుషులం..." అంటూ శాస్త్రి అతడి అనుమతి కోసం ఎదురు చూడకుండా లోపలకు నడిచాడు. తర్వాత యిద్దరూ జోళ్ళు దిగ విడిచి ఇనపెట్టి ఉండే గదిలో ప్రవేశించారు.
    "డబ్బు తెచ్చారా?' అన్న గంబీర స్వరం వారి చెవులకు వినపడింది.
    ఇద్దరూ అటు చూశారు.
    ఒక మూల నుంచి వచ్చాడు వృద్దుడు.
    "డబ్బెమిటి?' అన్నాడు శాస్త్రి.
    "పట్టుచీర విడిపించుకుని వెళ్ళరూ?"
    "మా దగ్గరంత డబ్బు లేదు. మేము నిన్ను చెంగాల్రావు పేట పంపించడానికి వచ్చాం. నువ్వు తిరిగొచ్చే దాకా మేమిక్కడే నీ గదిలో కాపలాగా ఉంటాం--" అన్నాడు శర్మ.
    వృద్దుడు వారి వంక అదోలా చూసి -- "మీ మనసులో ఏదో దురాలోచన వుంది...-----" అన్నాడు.
    "ఉంటె మాత్రం మావల్ల నేమవుతుంది? ఇనప్పెట్టె తెరవడం కూడా మాకు చేతకాదు-" అన్నాడు శాస్త్రి.
    వృద్దుడు నవ్వి -- ఆమాత్రం నిజం గ్రహించారు. తెలివైనవాళ్ళే! ఇక నా మాటకు బదులు చెప్పండి. ఏమంటుంది చెంగాల్రావు పెటావిడ!" అన్నాడు.
    శాస్త్రి, శర్మ విషయం వృద్దుడికి చెప్పారు. ఇల్లతడికి వస్తే తామందులో అద్దె కుండి అతడికి సక్రమంగా అద్దె కూడా చెల్లించుకుంటామన్నారు.
    వృద్దుడొక్క నిమిషం అలోచించి -- 'సరే -- నేను వెడతాను....అయితే నేను వచ్చేవరకూ మీరిక్కడే ఉండండి. వెళ్ళడానికి ప్రయత్నించినా, వెధవ పనులు చేసిన తిరిగి వచ్చి మీ అంతు చూస్తాను...." అన్నాడు.
    శాస్త్రి, శర్మ బుద్దిగా తలడించారు.
    వృద్దుడు గదిలోంచి వెళ్ళిపోయాడు.
    కాసేపు మిత్రులిద్దరూ గదిలో బుద్దిగానే కూర్చున్నారు. కానీ ఉన్నట్లుండి శాస్త్రి లేచి నిలబడి -- మనం మరో ప్రయత్నం చేద్దాం--"అన్నాడు.
    శర్మ భయంగా -- "వద్దు --" అన్నాడు.
    "ఇప్పుడు టైము పదిన్నర దాటింది. ఈరాత్రి వృద్దుడు బయల్దేరి వెళ్ళాడు. చెంగాల్రావు పేట కతడు కాలినడకన వెడితే గంటకు పైగా పడుతుంది. ఏ ఆటోలోనైనా వెడితే అది వేరే సంగతి. అయినా అతడు తిరిగి రావడానికి చాలాసేపు పడుతుంది. ఈలోగా మనం కనీసం పట్టుచీర సాధించవచ్చు...."
    "నువ్వు పట్టుచీర సంపాదిస్తే నీ పని అవుతుంది. మరి నావల్ల నేమవుతుంది?' అన్నాడు శర్మ.
    "నువ్వు అమలను పెళ్ళి చేసుకున్నాకే -- నేను విమలను పెళ్ళి చేసుకుంటాను, సరా?" అన్నాడు శాస్త్రి.
    "తాళం మీద చేయ వేయగానే ఆ కాపలావాడు కనబడితే !"
    "వాడు బైటకు పోయాడుగా...."
    "ఏమో-- పోయాడో-- లేదో -- ఎలా తెలుస్తుంది. నిన్న వాడు ముందు మనకు కనబడలేదు. తర్వాత ప్రత్యక్ష మయ్యాడు.
    శాస్త్రి సాలోచనగా -- "వాడి సంగతి నాకు తెలిసింది. వాడు మనిద్దర్నీ హిప్నటైజ్ చేస్తున్నాడు. వాడు ప్రత్యక్షం కావడం, మనల్ని విసిరేయడం , వాడికి పనిచేసిన తాళాలు మనకు పనిచేయకపోవడం -- అంతా హిప్నటైజ్ ఎఫెక్టు ...." అన్నాడు.
    "అదంతా ఎందుకంటావు?"
    "ఆలోచిస్తుంటే ఇదంతా పెద్ద గూడుపుఠాణీ అనిపిస్తోంది. అమల, విమలకు కూడా ఇందులో పాత్ర ఉందేమో! చెంగాల్రావు పేటలోని ఆడమనిషి, మువ్వలవాని పాలెం లోని ఈ వృద్దుడిని కలుసుకుని మాట్లాడుకోవాలనుకోవడం లో ఒక రహస్యముంది. అందుకు మననుపయోగించుకున్నారు..."
    "ఎలా?' అన్నాడు శర్మ.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.