Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    "నాకు తెలుసు -- వచ్చే పున్నమికి మనమిక్కడే జంటలుగా విడివిడిగా కూర్చుంటామని!" అన్నాడు శర్మ.

                                   2
    సోమయాజులు గారి బావమరిది ప్రభాకరం సెన్సారు బోర్డు మెంబర్ల గది మధ్యలో బరకం మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు.
    అతడికి కుడి పక్క కాస్త దూరంగా శాస్త్రి, విమల.
విమల అందంగా, అమాయకంగా వుంది. ఆమె శరీర ఛాయా మెరుగు పెట్టని బంగారం లా వుంది.
    ఆమె మాట్లాడుతుంటే పెద్ద పెద్ద కళ్ళు చక్రాల్లా తిరుగుతున్నాయి.
    శాస్త్రి చాలాసేపు ఆమెనే చూస్తూ మాటలు వినడం లేదు.
    విమల తన కష్టాలు చెప్పుకుంటోంది.
    ఆమె అంట్లు తోమాలి. ఇల్లూ ఉడ్వాలి. బట్టలుతకాలి. కూరలు, సరుకులు తేవాలి!
    ఆమె మంచి బట్టలు కట్టుకోకూడదు. పౌడరు రాసుకోకూడదు. ప్రత్యేకంగా అలంకరించుకోకూడదు.
    ఇవన్నీ ఆయింట్లో శిలాశాసనాలు.
    శాస్త్రి కామె మాటలు లీలగా వినబడుతున్నాయి. భావం మనసు కంటడం లేదు. చూపులామేను గమనిస్తున్నాయి. తనువుపరవశిస్తోంది.
    "మీరు నా మాటలు వినడం లేదు...." అంది విమల.
    శాస్త్రి ఉలిక్కిపడి "వింటున్నాను --" అన్నాడు.
    "అయితే నా కష్టాలు మిమ్మల్ని కదిలించలేదు.." '    
    "కదిలించాయి...."
    "కదిలిస్తే కంట తడి పెట్టరేం?" కనీసం ఓ సానుభూతి మాటైనా చెప్పరేం?" అంది విమల.
    "ఏడ్చే మగాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు...."అన్నాడు శాస్త్రి.
    "కష్టసుఖాలు మనిషిని కదిలిస్తే సామెతలు గుర్తుండవట. మా నాన్న అమ్మను తల్చుకుని ఎడ్చినపుడల్లా ఈ మాటే అంటాడు....' అంది విమల.
    "పురుషోత్తముడు దేనికీ చలించడు....నేను సామాన్యుణ్ణి కాదు...." అన్నాడు శాస్త్రి వెంటనే.
    "పోనీ సానుభూతి గా ఓ మాట చెప్పవచ్చుగా...." అంది విమల.
    "అవును....పాపం నీకష్టాలన్నీ పెళ్ళి తోటే తీరాలి...."
    "నా పెళ్ళి అంత సులభం కాదు. నాన్న కట్న మివ్వలేడు...."
    "ఇవ్వలేకుంటే ఎలా కుదుర్తుంది? ఎంతో కొంతైనా ఇచ్చుకోక తప్పదు కదా!"
    విమల నిట్టూర్చి - ""ఎదురు కట్నమిచ్చే వెధవనే నాననిచ్చి పెళ్ళి చేస్తానంటుంది పిన్ని--" అంది.
    "ఎదురు కట్నం  తీసుకుంటూ వెధవ కూడా అనడమెందుకు ?' అన్నాడు శాస్త్రి కాస్త యిబ్బందిగా.
    "ఎందుకంటె -- ఎదురు కట్నం వెధవలే యిస్తారుట!"
    "నీవంటి ఆడపిల్లల కిలాంటి అభిప్రాయమేర్పడడం స్త్రీ జాతికే దురదృష్టం -- వెధవలని తెలిసీ -- వాళ్ళనే పెళ్ళి చేసుకోడమెందుకు?"
    "మా పిన్ని నన్ను వెధవకే కట్టబెడతానంటోంది..."
    "అంటే?"
    "నన్ను పెళ్ళి చేసుకునేవాడు తనో వెధవనని రుజువుచేసుకోవాలి...."
    "కాబోయే భార్య తన్ను వెధకోవనువాలని ఏ వెధవా అనుకోడు...."
    విమల అందంగా నవ్వి..... "ఎదురు కట్నం మిచ్చిన వాడిని వెధవ అని యే భార్య అనుకొదు. నేనిందాకా చెప్పింది మా పిన్ని అభిప్రాయం....' అంది.
    ఆమె నవ్వుకు శాస్త్రి పులాకరించి పోతూ -- "మరి నీ అభిప్రాయ మేమిటి?' అన్నాడు.
    "కాబోయే భర్త నన్ను పెళ్ళికి ముందే ప్రేమించాలి. నా ప్రేమను పొందడం కోసం ఓ గొప్ప కానుక ఇవ్వాలి. అప్పుడు నేనతడి ప్రేమ అంగీకరిస్తాను...."
    "గొప్ప కానుక అంటే ఏమిటి?"
    "పట్టుచీర...."
    శాస్త్రి నవ్వి-- "చాలా సింపుల్ కోరిక నీది!" అన్నాడు.
    "నా కోరిక సింపుల్ కాదు...."
    "నీకు సింపుల్ కాకపోవచ్చు. నాకది చాలా సింపుల్...."
    "నిజంగా?" అంది విమల ఆశ్చర్యంగా  "ఆ పట్టుచీర ఎక్కడుందో కూడా మీకు తెలుసా?"
    "ఈ ఊరి మొత్తానికి పట్టుచీరలు మంచి వెక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. దుకాణం పేరు చెప్పను. తెచ్చి చూపిస్తాను" అన్నాడు శాస్త్రి.
    "నాక్కావలసింది పట్టుచీర దుకాణం లో లేదు...."
    "మరెక్కడుంది?"
    "వెంకటేశ్వరరావు గారింట్లో!"
    "అక్కడెందుకుకుంది?"
    "ఆ పట్టుచీర మా అమ్మది. ఒకసారి డబ్బవసరమై నాన్న దాన్ని వెంకటేశ్వరరావు గారికి తాకట్టు పెట్టాడు. అయన వడ్డీ వ్యాపారి. అమ్మ కా పట్టుచీరంటే ప్రాణం. నాకూ అదంటే ఏంతో యిష్టం. ఆ చీర ఎప్పుడూ కొత్తగా కనబడుతుంది. అప్పుడే దుకాణం లోంచి తెచ్చామా అనిపిస్తుంది. అమ్మ ఆ చీర నా పెళ్ళికిచ్చేస్తానని చెప్పింది. కానీ" విమల ఒక్క క్షణం ఆగి కళ్ళు తుడుచుకుంది. "చీర విడిపించి తెచ్చేలోగానే అమ్మ చచ్చిపోయింది. తర్వాత పిన్ని వచ్చింది. పట్టుచీర గురించి ఎన్నోసార్లు నాన్నకు చెప్పాను. నాన్నకు పిన్నిని నొప్పించాలంటే భయం. ఆ పట్టుచీరను విడిపించడం పిన్ని కిష్టం లేదు. అదీ కాక వడ్డీ బాగా ఎక్కువయింది.... ఆ ధర పెడితే రెండు పట్టుచీరలు వస్తాయట...."
    "అయితే పట్టుచీర వెంకటేశ్వరరావు గారింట్లో ఉందన్న మాట. నాకాయన ఇంటి అడ్రసు కావాలి."
    "ఎందుకు?'
    "నేనా పట్టుచీర తెస్తాను!"
    "మీరు నన్ను ప్రేమిస్తున్నారా?' అంది విమల చటుక్కున.
    'అలా ఎందుకనుకుంటున్నావు!" అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా.
    "మీరు పట్టుచీర తెస్తానన్నారుగా!"
    శాస్త్రి తడబడి "నిజమే! అది నీకు ప్రేమ కానుక అవుతుంది. నేనే గనుక ఆ చీరను ప్రేమ కానుకగా ఇస్తే నువ్వు నన్నుప్రేమిస్తావా ?' అన్నాడు.
    విమల చటుక్కున "మిమ్మల్ని ప్రేమించదానికి పట్టు చీర తేనక్కర్లేదు. నన్ను ప్రేమించను కూడా అక్కర్లేదు. ప్రేమిస్తున్నానని ఒక్క మాట అన్నారు కదా అది చాలు" అంది.
    అప్రయత్నంగా శాస్త్రి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతడామెను ప్రేమిస్తున్నానని అన్నాడో లేదో అతడికే గుర్తు లేదు. కానీ కళ్ళు తుడుచుకుంటూ "విమలా! నువ్వు నన్ను ప్రేమించినప్పటికీ-- నీకు ప్రేమ కానుక యిచ్చినాక నీ ప్రేమకు అర్హుడ్ననిపించుకుంటాను. నీ కోరిక యింత సింపుల్ గ ఉన్నప్పుడు -- నేనామాత్రం చేయాలి" అన్నాడతను.
    ఆమె కోరిక అంత సింపుల్ కాదని అప్పుడతడికి తెలియదు.
    అదే సమయంలో ప్రభాకరానికి ఎడమ పక్కగా కాస్త రూరంలో అమల కూడా శర్మను పట్టుచీర కాకపోయినా అలాంటిదే యింకో కోరిక కోరింది.
    శర్మ కూడా అది సింపులేనని పొరబడి మాట ఇచ్చాడు.

                                    3
    గదిలో ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు శాస్త్రి, శర్మ.
    'అమలకు పెద్ద కోరిక లేమీ లేవు. ఎనిమిదేళ్ళ క్రితం సోమయాజులు గారు తనకున్న రెండిళ్ళలో ఒకటమ్మేశాడు. అది చెంగాల్రావు పేటలో వుంది. పెళ్ళైతే ఆ యింట్లో కాపురం పెట్టాలనుంది అమలకు. ఆ యిల్లంటే వాళ్ళమ్మ కెంతో యిష్టంట...."
    'అమల కంటే విమలే నయం. పట్టుచీరతో సరిపెట్టుకుంది ...."
    "ఇల్లు నేను కొనక్కర్లేదు. అద్దెకు సంపాదిస్తే చాలు...."
    "ఇంటి గురించి వాకబు చేశావా?"
    "ఇప్పుడే ప్రారంభించాలి."
    "మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు?"
    "ఇంతవరకూ నేను అమలతో పెళ్ళి కబురు మాట్లాడలేదు. మన్నిద్దరి పెళ్ళిళ్ళూ ఒక్కసారే జరగాలి. అమల, విమల మనకు సరైన జోడీ అనిపించింది...."
    "గతంలో కూడా ఒకసారి గుర్తుందా?' అన్నాడు శాస్త్రి.
    'అది వేరు , వాళ్ళు మనపై ప్రేయోగించబడ్డారు.... వీళ్ళు అసలు సిసలు సంసార పక్షం అమ్మాయిలు...."
    "వాళ్ళ సంగతి సరే ....మనం సంసార పక్షమేనా అని!"
    "పెళ్ళి చేసుకునేముందు ప్రేమ కానుకలిస్తే మనమూ సంసార పక్షమే అవుతాం" అన్నాడు శర్మ.
    "అలాంటి వాళ్ళను వెధవ అంటుంది సోమయాజులు భార్య."
    'అంటే అనుకోని మనకేమీ నష్టం?"
    "నిజంగా మనం వెధవలమే ననిపిస్తోంది. లేకుంటే ఇంతవరకూ మనకు పిల్లనిస్తామంటూ ఎవరైనా వచ్చారా?"
    "బాధపడకు -- నవ్విన ఊళ్ళే పట్నాలవుతాయి...." అన్నాడు శర్మ.
    "కానీ మనం పట్నం లోనే వున్నాం."
    "శాస్త్రీ ! నిరాశ మనకు తగదు."
    "పెళ్ళి గురించి తలచుకోగానే నిరాశ మొదలయింది. పెళ్ళైతే యింకేలా మారిపోతామో -- మనకు పెళ్ళిళ్ళు   వద్దు."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.