Home » Muppala Ranganayakamma » Stree


 

    అన్నీ చూస్తూనే ఉంది పార్వతి. కాకపోతే చూడనట్టు నటిస్తుందంతే. రామం పార్వతితో మాట్లాడే అవకాశం కోసం ఆ రెండు రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. రుక్కు దడి దొడ్లో తల స్నానం చేస్తుంటే పార్వతి చంటి వాడితో కబుర్లు చెప్తూ వసారా లో కూర్చుంది. శాంతమ్మ ఎవరో కబురంపితే పోరుగింటికి వెళ్ళింది.
    రామం నెమ్మదిగా వచ్చి దగ్గర కూర్చున్నాడు.
    "వదినా!"
    "ఏం, రామం?"
    "నువ్వేమీ అనుకోనంటే నీతో ఓ విషయం చెప్తాను."
    "బావుంది. నువ్వంత కాని మాటేం చెప్తావు?"
    "కాని మాటా లేని మాటా మాత్రం కాదు. అసలు నీకు ఉత్తరం వ్రాశానంటే బాబుని చూడ్డానికి వస్తావనే కాదు. ఇక్కడో వారం రోజులుంటే ఎవ్వరూ చెప్పనక్కర లేకుండా అన్నీ నీకే తెలుస్తాయని."
    "ఏమిటి, రామం నువ్వు మాట్లాడేది? అసలెవరి సంగతి?"
    "ఇంకెవరి సంగతి వదినా? రుక్కు మాటే. వయస్సు వస్తోన్న కొద్దీ వివేకం పోతోంది. ఏ రోజూ ఇల్లు ఓ నరకమై పోతోందంటే నమ్ము. అమ్మ గుణం నీకు తెలియంది కాదు గదా? ఏ నాడూ ఎవర్నీ ఓ మాట అననూ లేదు. అనిపించుకోనూ లేదు. అలాంటి అమ్మని చూస్తె చాలు -- కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. ఒక్క క్షణం కూడా సామరస్యంగా మసలదు. పెద్దదని మాట ఎప్పుడూ వినదు. ఆఖరికి కూరలు వండుకునే దగ్గర కూడా ఏదో రాద్దంతమే. 'ఎండిపోయిన కూరలు వేయించితే బాగుండవు . పులుసు పెట్టవే' అంటే ససేమిరా వేపడమే చేస్తుంది. ఏదో సామెత చెప్పినట్టే ఉంటుందనుకో దాని వ్యవహారం! ఇంటికి వచ్చేసరికి ఏదో ఫిర్యాదు . అక్కడితో ఒళ్ళు మండి నేను చెయ్యి చేసుకోటం . తను రోజుల కొద్దీ తిండి మాని పస్తు లుండటం . అబ్బ! ఎన్నని చెప్పమంటావు వదినా? ఈ యిల్లు ఎలా బాగు పడుతుందో అర్ధం కావటం లేదు. ఎటైనా పోదామా అనిపిస్తుంది అప్పుడప్పుడూ." రామం పార్వతి కేసి చూశాడు - పార్వతి మౌనంగా కూర్చుంది.
    "మొన్న పండక్కి శకుంతల వచ్చింది. ఏదో యింటికి ఒక్క ఆడపిల్ల. మన కే  లోటూ లేదు. ఎంత సంతోషంగా చూసి పంపాలో ఆలోచించు. అమ్మా, నేనూ ఎంత జాగ్రత్త గా ఉన్నా ఎక్కడి కక్కడ వదిన గారి సూటి పోటీ మాటలతో అది కాస్తా ఏడ్చుకుని ఓ రవిక గుడ్డయినా తీసుకోకుండా వెళ్ళిపోయింది. "నీకేం ఖర్మే! ఇంటికి అడబిడ్డవి. తిరిగి నాలుగూ అనరాదటే?" అంటే దానికలాంటి కీచులాటలు నచ్చవు. 'పెళ్ళి చేసి పంపేసిన్నాడే నేను పరాయి దాన్నయ్యాను. మీ పెట్టుపోతలు నాకేం అక్కర్లేదు' అంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఈవిడ గార్ని ఎన్ని కేకలేస్తే మాత్రం ఏం లాభం? ఓ నాలుగు రోజులు నోరు మెదపకుండా కూర్చుంటుంది. ఐదో నాటికి అంతా సరి. నయానా చెప్పినా భయానా చెప్పినా కూడా దాని గుణం మార్చ లేక పోతున్నాననుకో. నువ్వయినా మందలిస్తే కాస్త వినకపోదని ఊహ వస్తే వెంటనే నీకు వ్రాశాను. ఇక నువ్వు దాని కేలా నచ్చ చెప్తావో , ఎలా చివాట్లు పెడతావో నాకేం తెలీదు. నీకు చెప్పాలనుకున్న మాట కాస్తా చెప్పేశాను. రోజూ ఇంట్లో ఇలాంటి రాద్దంతాలైతే ఎన్నాళ్ళో ఈ సంసారం చెయ్యలేను."
    పార్వతి రామం మొహంలో కి చూస్తూ అంది -- "అలా ఆవేశపడకు , రామం" అని.
    "ఆవేశం కాదు, వదినా! ఇంట్లో సుఖ శాంతులు లేకపోతె బ్రతికిమాత్రం ఏం ప్రయోజనం , చెప్పు! అమ్మదారిన అమ్మ కుళ్ళి పోతోంది. నా దారిన నేను బాధపడుతున్నాను. ఉన్న ఒక్క ఆడపిల్ల కష్ట పెట్టుకు వెళ్ళింది. ఇలా అందర్నీ ఏడిపించి తనేం బాముకొంటుంది? ఆఖరికి పసిబిడ్డ ని కూడా నా కళ్ళ ముందే చావబాదుతుంది. చూస్తూ నేను ఊరుకోగలనంటావా? కోపం వచ్చి చెయ్యి చేసుకుంటే నేనే మూర్ఖుడిని అంటారు కదూ? అన్ని విధాలా నన్నే పశువుని చేస్తోందనుకో."
    పార్వతి మరి మౌనంగా ఉండలేక పోయింది. ఓదార్పుగా చూస్తూ అంది. "చ! నువ్వలా బాధపడకు, రామం! అన్నీ నేను కనుక్కుంటాను. మందలిస్తాను. మిమ్మల్నందర్నీ ఏడిపించి అదేం సుఖపడుతుంది? దాని వ్యవహారం చక్కజేసే నేను వెళ్తాను. సరేనా?"
    "ఆ నమ్మకం తోనే కదూ, వదినా , నీకు వ్రాశాను? అసలు ఈ గొడవలన్నీ నీకు చెప్పి నీ మనస్సు బాధ పెట్టటం నా కిష్టమే లేదు. అయినా తప్పలేదు మరి."
    "సరే! ఇక నువ్వేమీ మనస్సు లో పెట్టుకోవద్దన్నానుగా?దాన్ని నేను మండలిస్తాను."
    రామం లేచి వీధిలోకి వెళ్ళుతుంటే రుక్కు స్నానం ముగించి చాలీ చాలని తుండు గుడ్డ అడ్డదిడ్డంగా చుట్టుకొని జట్టు వెంట నీళ్ళు కారుతుండగా గబగబా వచ్చింది. "ఎవరో నీతో మాట్లాడుతున్నట్టున్నారు. గుడగుడా మాటలు వినిపించాయి దొడ్లోకి" అంటూ నాలుగు వేపులా పరికిస్తూ అడిగింది.
    "ఇప్పటివరకూ మరిదే కూర్చుని వెళ్ళాడు. ఇంకెవరూ లేరే? అదేమిటి, రుక్కూ చీర తెమ్మని నాతొ చెప్పలేక పోయావ్? ఆ తుండు తలకి చుట్టుకునేదానివి గా? పోనీలే. తొందరగా తల తుడుచుకో. జలుబు చేస్తుంది. అయినా ఇంత చీకటి పడ్డాక తలంటేమిటి?"
    "చాకిరీ తెమిలేసరికి ఈవేళైంది. మరేం చెయ్యను? తలపోటు కూడా వస్తోంది. కంగారు కంగారుగా నీళ్ళు పడేసుకుని చీర సంగతే మరిచి పోయాను. చీర మాట అలా ఉంచి వీపు మీద ఓ చెయ్యి వేస్తావేమో నిన్ను పిలుద్దామా అంటే మీ కబుర్ల లో నా అరుపెం వినిపిస్తుంది లే అని ఊరుకున్నాను. సందెవేళ వదిన గారితో మంతనాలాడుతూ కూర్చోటానికి ఆయనగారి కంత తీరికేలా అయిందేమిటి?"
    శుద్దీ బద్దీ  లేని రుక్మిణి మాటలు వింటుంటే పార్వతి శరీరం జలదరించింది. మరిది తనతో మంతనాలాడటం ఏమిటి? ఛ! నోటి కెంత మాట వస్తే అంత మాటా అనేయ్యటమేనా? ఇక వెనకా ముందూ ఆలోచన లేదూ? రుక్కు అప్పటికే కడుపులో బాధ కాస్తా తీర్చేసుకుని గదిలోకి పోయి తల తుడుచుకుని చీర కట్టుకు వచ్చింది. "అక్కయ్యా! కాస్త దీపం వెలిగించవే! బొత్తిగా చీకటి పడింది."
    పార్వతి లేచి దీపం వెలిగించి చావిట్లో తగిలించింది. రుక్కు తడి తల చిక్కులు విప్పుకుంటూ కూర్చుంది. అడిగేమాట ఎప్పుడో ఓసారి ఎలాగూ అడగాలి కదా అన్నట్లు పార్వతి రుక్కు చేతిలో దువ్వెన అందుకొని నెమ్మదిగా చిక్కు తీస్తూ ప్రారంభించింది. "రుక్కూ! నిన్నోమాట అడగాలనుకుంటున్నానే!"
    "ఏమిటే అదీ? నన్నేమిటి అడుగుతావ్?' విస్తుపోయినట్టే అంది రుక్కు.
    "అబ్బే! మరేం లేదు. నువ్వు అత్తయ్య తో మాట్లాడుతున్నట్టే లేదే?"
    "ఏం, మాట్లాడక పొతే? ఆవిడకేం నష్టమా? కొడుకు కొండలా వెనకేసుకు వస్తాంటే కోడల్ది మాటాడితే ఎంత? మానుకుంటే ఎంత?"
    ఇరవై ఏళ్ళయినా నిండని చెల్లెలు అంత అరిందలాగా చేతులు తిప్పుకొంటూ మాట్లాడుతుంటే ఏమిటో ఎబ్బెట్టు గా తోచింది పార్వతికి. "అది కాదమ్మా, రుక్కూ! నష్టాలు లాభాలు గుణించుకుని మాట్లాడుకుంటామా? ఒక్క యింట్లో ఉండవలసిన వాళ్ళు అభిమానాలతో కలిసీ మేలిసీ బ్రతికితే సుఖంగా ఉంటుందని గానీ...."
    "నా మొహం అభిమానం లే. కట్టుకున్న మొగుడి కే లేదు. ఇక ఆరళ్ళు పెట్టె అత్త కెక్కడోస్తుంది?"
    "నువ్విలా మాట్లాడితే నా కర్ధం కావటం లేదు, రుక్కూ! మరిదీ, అత్తయ్యా నిన్ను సరిగ్గా చూడటం లేదంటే నాకెందుకో నమ్మకంగా లేదు."
    "అవును. నీకెలా నమ్మకంగా ఉంటుంది? నాకన్నా వాళ్ళే నీకు ఎక్కువ. అయినా వాడికి ఆకులో, కాని వాడికి కంచంలోనూ."
    "అదిగో . నువ్వలా నిష్టూరాలు వెయ్యకు. అసలు సంగతేమిటో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అత్తయ్య నిన్నేమైనా కేకలేస్తూ ఉంటుందా?"
    "కేకలేస్తే నేనేం పడి ఉంటానా? అంతకు పది రెట్లు అప్పగిస్తాను. నా దగ్గరా పప్పులెం ఉండకవ్."




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.