Home » Muppala Ranganayakamma » Stree


 

 

                            

    "ఇదేమిటి? మాటా మంతీ లేకుండా వచ్చావు" అంటూ విస్తుపోయింది రుక్మిణి అక్కగారిని చూస్తూ.
    వీధి గుమ్మం లోంచి లోపలికి వచ్చి చేతి సంచి గోడ వారన పెడుతూ "కాసిన్ని మంచి నీళ్లియ్యి , రుక్కూ!" అంది పార్వతి అలుపుగా. రుక్మిణి గబగబా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ముంచుకు వచ్చింది. రుక్కు హడావుడి కి గదిలో పడుకున్న రా మం లేచి వచ్చాడు. "అరె! వదిన వచ్చేసిందే!" సంభ్రమంగా చూచాడు. "ఇంత తొందరగా వస్తావను కోలేదు, వదినా! తీరా వ్రాశానే గానీ నీకూ సెలవులు అవీ ఉంటాయో లేదోనని తటపటా యించాను. పోనీ, కంగారేం లేదులే అని మళ్ళా వ్రాద్దామనుకుంటున్నాను ఇవ్వాళ. రా లోపలికి , ఏమిటలా నిలబడి పోయావ్?"
    "సెలవు కేం బాధ లేదులే, మా ఆఫీసరు చాలా మంచివాడు. కష్టసుఖాలు చెప్పుకుంటే అర్ధం చేసుకుంటాడు. బాబుకీ బాగా లేదని వ్రాస్తే నాకేమిటో ఒక్క క్షణం కూడా ఉండ బుద్ది కాలేదు, బయల్దేరి వచ్చేశాను."
    "మీరు అక్కయ్యకి ఉత్తరం వ్రాశారా? నాతొ చెప్పనే లేదేం?" నిలదీసి అడిగినట్టే ఆడిగింది రుక్మిణి మొగుణ్ణి.
    "అప్పుడలా బుద్ది పుడితే మొన్న ఆఫీసులో వ్రాసి పడేశాను. తర్వాత మరిచేపోయాను" అన్నాడు రామం ఏమంత పట్టించుకోనట్టు.
    "పోనీ, ఇప్పుడు బాబు కేలా ఉంది, రుక్కూ?" ఆత్రుతగా అడిగింది పార్వతి.
    "ఏం? బాబుకేం? వాడికే మైంది ?" విస్మయంగా చూసింది రుక్కు.
    "అదేమిటి? బాగాలేదని వ్రాశావుగా  , రామం?" మరిది కేసి చూసింది పార్వతి.
    "రాత్రి నుంచి కాస్త బాగానే ఉన్నాడు గానీ నిన్నటి వరకూ జ్వరం తోనే బాధపడ్డాడు. నేను ఉత్తరం వ్రాసిన పూటైతే వాంతులు కూడా అయ్యాయి. కంగారు పడి వ్రాశానంతే." తనను తను సమర్ధించుకొంతున్నట్టు చెప్పుకున్నాడు రామం.
    "పిల్లాడికి జ్వరం వస్తే అక్కయ్యేం చెయ్య గలదు? అవిడెం డాక్టరనుకున్నారేమిటి?" వెటకారం లాగే అంది రుక్మిణి. "పోనీ, ఇలా  ఉత్తరం ముక్క వ్రాస్తానని నాతొ అనకూడదు? అక్కడి నుంచి ఓ డజను తల పిన్నులు తెప్పించుకునేదాన్ని గా?"
    రామం చిరాగ్గా చూశాడు. "కావాలంటే వెళ్ళాక పంపిస్తుందిలే. నాలుగైదు నెలల తర్వాత గుమ్మం లో కి వచ్చినందుకు సంతోషించక ఏమిటా సాధింపు?" అంటూ కసిరాడు.
    "బావుంది. నాతోడబుట్టింది వచ్చినందుకు నాకు కాకపొతే మీకా ఏమిటి సంతోషం? పదవే, అక్కయ్యా, లోపలికి కొంచెం కాఫీ పెడతాను."
    "ఇంతకీ బాబు కనిపించడెం ? అత్తయ్యేది?" అంటూ లోపలికి చూపులు తిప్పింది పార్వతి.
    "బొత్తిగా ఏడిపించుకు తింటుంటే కాస్సేపలా తీసి కెళ్ళమని ఇచ్చాను. చంకన వేసుకు వెళ్ళారు."
    పార్వతి స్నానం చేసి కాఫీ తాగి కూర్చుంది.
    "కొంచెం ఏరి పెట్టవే" అంటూ బియ్యం చేట ముందు పడేసింది రుక్కు, బియ్యం ఎరుతుంటే శాంతమ్మ మనవడ్ని ఎత్తుకు వచ్చింది. ఏమమ్మా, పారూ! బొత్తిగా నల్ల పూసవై పోయావు. నెల్లాళ్ళ కోసారి వచ్చి చూసి పోకూడదు?' అంటూ నిష్టూర మాడింది. "సూరి బావున్నాడా? మీ మరదలు కులాసాగా ఉందా? ఏమిటి కబుర్లు?" అంటూ కుశల ప్రశ్నలు వేసింది. బాబి గాణ్ణి ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అత్తయ్య అడిగే అన్ని ప్రశ్నలకూ జవాబులు చెప్తూ కూర్చుంది పార్వతి. "పిల్లాడు బాగా చిక్కి పోయాడత్తయ్యా ! ఎన్ని రోజులు జ్వరం కాసిందేమిటి?" అంది వాడి మొహం లోకి పరిశీలనగా చూస్తూ.
    "ఏదో అయిందిలే. ఇప్పటికేనా కులాసా చిక్కింది." ప్రసంగం మారుస్తూ అంది శాంతమ్మ. "ఓ వారం రోజులైనా సెలవు పెట్టి వచ్చావా? లేకపోతె చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు మరీ కూర్చున్నావా?"
    "అక్కయ్యా, బియ్యం కాస్త కడిగి తెచ్చి పెడతావూ?" కూరకు తాలింపు పెడుతూ అంది రుక్మిణి.
    "అయ్యో! నేను సరిగా ఏరనే లేదే! బాబి గాణ్ణి చూస్తూ మరిచే పోయాను. " అంటూ చేట దగ్గరికి లాక్కో బోయింది పార్వతి.
    "నే నేరుతాను. ఇలా ఇవ్వమ్మా, పార్వతీ!" కూర్చున్న చోటు నుంచి లేవలేక చెయ్యి జాపింది శాంతమ్మ.
    బియ్యం చేట అందించబోయింది పార్వతి. విసురుగా లాక్కుంది రుక్మిణి. "ఆవిడ ఏరితే ఇక తిండి తిన్నట్టే. ఏ రాయో పంటికింద పడితే నా తల వాచేలా చివాట్లు పెడుతారు. ఎసరు పడేసి నేనే ఎరుకుంటాలే" అంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చుంది.
    చెల్లెలి రుసరుసలు కనిపెట్టనట్టే ఊరుకుంది పార్వతి. తనేమీ పట్టించుకోనట్టు మళ్ళా కబుర్లు సాగించింది శాంతమ్మ. పిల్లవాడు ఒళ్ళో నిద్రపోతుంటే పడుకో బెట్టడానికి లేచింది పార్వతి. రామం పొలం కేసి వెళ్ళినట్టున్నాడు. గదిలో లేడు. పిల్లవాణ్ణి పక్కలో వేసుకు పడుకుంది పార్వతి. గోడల నిండా రకరకాల సినిమా తారల కాలెండర్లూ ఫోటోలు వెళ్ళాడు తుంటే ఆ బొమ్మలన్నీ చూస్తూ పడుకుంది.
    శాంతమ్మ నెమ్మదిగా గదిలోకి వచ్చింది. "పడుకున్నావేమిటమ్మా, పారూ?"
    "లేదత్తా! లేదు. రా, కూర్చుందువు" అంటూ పిల్లాడి పక్క లోంచి నెమ్మదిగా లేచింది పార్వతి. శాంతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంటూ కంఠం తగ్గించి మాటిమాటికీ తలుపు కేసి చూస్తూ చెప్పింది. "దాని ఎదటే చెప్పటం ఎందుకని ఊరుకున్నాను గాని పిల్లాడి కెంత జబ్బు చేసిందనుకున్నావ్? ఏడెనిమిది రోజులౌతుందేమో? ఆ ఫ్లాస్కు లో పోసి ఉంచిన పాలు కాస్త విరిగాయి. మళ్ళా నీళ్ళు వెచ్చ బెట్టి పాలు కలపటానికి బద్దకించి ఆ సన్న విరుగుడు పాలే పట్టించేసిందట వాడికి. పోనీ, నన్ను లేపితేనే నైనా కాసిన్ని నీళ్ళు వెచ్చబెట్టి ఇచ్చేదాన్ని. తెల్లారినప్పటి నుంచే పట్టుకున్నాయి దోకులు, విరోచనాలునూ. కాస్త కంగారు పడి అప్పుడు చెప్పింది అసలు ముక్క. చెప్పద్దూ? నాకు ఒళ్ళు మండి తల వాచేలా చివాట్లు పెట్టెను. సిగ్గుపడి నోరు మూసుకోక , "నాయిష్టం! నా పిల్లాణ్ణి చంపేసుకుంటాను . నాకు లేని బాధ మీకెందుకు?" అంటూ ఎదురు తిరిగి దేబ్బలాడటం మొదలెట్టింది. అప్పుడే బయటి నుంచి వచ్చిన నీ మరిది కళ్ళేర్ర చేస్తూ పెళ్లాన్నో లెంపకాయ వేశాడు. ఇదెక్కడి సంతరా భగవంతుడా! నా మూలంగా వాళ్ళిద్దరూ కీచు లాడుకు చస్తారేమోనని కళ్ళు ఒత్తుకుంటూ పెరట్లో కి పోయి కూర్చున్నాను. ఏవేవో మందులూ మాకులూ కాస్త శ్రద్ధ పెట్టి వేశాననుకో. పిల్లాడు దక్కాడు. అదే పది వేలు. అప్పట్నుంచీ నాతొ మాటా మంతి మానేసింది. ఏం చెయ్యను? చంటి వాణ్ణి ఆడించుకుంటూ నా మానాన నేను ఏ మూలో కూర్చుంటాను."
    అంతా వింది పార్వతి. ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? రుక్కు గురించి ఏ కబురు విన్నా విడ్డూరం లేదేమో!
    "నీ తోడబుట్టిన దాని మీద ఉన్నవీ లేనివీ చెప్తున్నానని కష్ట పెట్టుకోకమ్మా, పార్వతీ! నాకు కోడలైనా అదే, కూతురైనా అదే అనుకుంటాను. నా కడుపున పుట్టిన ఆడపిల్ల కన్నా దీన్నే ప్రాణంలా చూసుకుంటాను. ప్చ్! ఎందుకూ? అంతా నా రాత."
    "అత్తా! నీ గురించి నేనెప్పుడూ అలా అనుకోను. నీ గుణం నాకు తేలీదంటావా? చిన్న వాళ్ళమని తేలిక చెయ్యకుండా దయతలచి చేరదీశావు. నీ ఋణం ఎలా మరిచి పోతానత్తా! రుక్కు సంగతి వింటోంటే నాకు బాధగానే ఉంది. అయినా నువ్వు పెద్దదానివి. దాని తప్పోప్పులన్నీ నీ కడుపులో దాచుకోక తప్పదత్తా! నా మొహం చూసైనా.
    "ఊరుకోవే , పిచ్చిదానా! ఏదో మాట వరసకి అన్నాలే. అదేం నాకు పరాయిదా? మీ అమ్మనీ, నాన్న నీ కంఠం లో ప్రాణం వుంటే మరిచి పోగలనా? ఏమిటో , ఇలాగే పోతుంది కాలం! సరేగాని , నువ్వు లేచిరా! వేడివేడిగా ఓ ముద్దతిని కాస్సేపు నడుం వాల్చుకుందువు గాని" అంటూ నెమ్మదిగా లేచింది శాంతమ్మ.
    పార్వతి వచ్చి రెండు రోజులైంది.
    రుక్కు ధోరణి బొత్తిగా కంటగింపుగా తయారైంది. అత్తగారి మాటంటే నే ఒంటి వేలు మీద లేస్తుంది. మొగుడు మాట్లాడబోతే వెటకారాలూ, వ్యంగ్యాలూ విసురుతుంది. ఉత్త పుణ్యానికే పసివాణ్ణి చావబాదుకొంటుంది. అక్కగారేమైనా బాధపడుతుందేమో అన్న ఇంగితమే లేకుండా సూటీపోటీ మాటలు విసురుతుంది.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.