Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

                               జ్ఞానోపదేశం?

                                                                    వసుంధర

    పోస్ట్ అందుకున్న కొడుకు వంక ఆత్రుతగా చూసి "ఏమిట్రా అవి" అంది సావిత్రి ఆశగా.
    "మూడు రిగ్రేట్ లెటర్స్!" అన్నాడు సోమరాజు ఏడవలేక నవ్వుతూ.
    సావిత్రి నిట్టూర్చి ఏమీ అనకుండా లోపలికి వెళ్ళి పోయింది. ఈ జన్మకు నీ కుద్యోగం దొరుకుతుందా అన్న ప్రశ్న సోమరాజుకు తల్లి కళ్ళలో కనిపించింది.
    ఉద్యోగాలకని ఇంటర్వ్యూ లకు వెళ్ళడం , రిగ్రేట్ లెటరు, సంపాదించడం సోమరాజుకు కొత్త కాదు. అయితే అతని తల్లి సంతృప్తి కి కారణం వేరు.
    సోమరాజీ శతాబ్దంలో పుట్టవలసిన వాడు కాదు. సత్ప్రవర్తన కు సంబంధించి అతనికి కొన్ని నీతి నియమాలున్నాయి. ఏ పరిస్థితుల్లోనూ వాటిని దాటడు. ఎవరికీ లంచాలివ్వడు. రికమెండేషన్ కోసం తనకు తానై ప్రయత్నించడు. అన్నింటికీ స్వయం ప్రతిభ మీదనే ఆధారపడతాడు. అతను గొప్పవాడై ఉంటె ఈ లక్షణాలకు చాలా ప్రచారం లభించి ఉండేది. కానీ అతను గొప్పవాడు కావడాని కీ లక్షణాలే అడ్డు వస్తున్నాయి.
    సోమరాజు తలిదండ్రులకు ఇద్దరాడపిల్లలు తర్వాత కలిగిన మగబిడ్డ. అల్లారు ముద్దుగా పెరిగాడు. అతను లోకం గురించి అట్టే నేర్చుకోలేదు. తలిదండ్రులు చెప్పేవీ , మేష్టర్లు బోధించేవీ బాగా అతనికి తలకేక్కాయి. తన జీవితం ఇలానే నడపాలనుకున్నాడు. నడుపుతున్నాడు. బియ్యే ప్యాసై రెండేళ్ళయింది. ఇంతవరకూ అతనికి ఉద్యోగం లేదు.
    సోమరాజు తండ్రి గుమస్తా. ఆయనింటి పక్కనే ప్రసాదరావని ఇంకో గుమస్తా ఉండేవాడు. అయన బాగా లంచం పట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ అయిపోయి వ్యాపారంలోకి దిగి అదృష్టం కలిసి రాగా గొప్పవాడై పోయాడు. దివ్యభవనంగా మారిపోయిన అయన పెంకుటిల్లు ఇప్పటికీ సోమరాజు ఇంటి పక్కనే ఉంది.
    సోమరాజు తండ్రి, ప్రసాదరావు ప్రాణ స్నేహితులు. దృక్పదాలు వేరైనా వారి స్నేహం నిరాటకంగా కొనసాగి పోయింది. ప్రస్తుతం ఇద్దరూ తమ స్నేహాన్ని స్వర్గంలో కొనసాగిస్తున్నారు.
    తన భర్త ప్రసాదరావును చూసి నేర్చుకుంటాడెమోనని సావిత్రి ఎంతో ఆశ పడింది. కూడు పెట్టని సిద్దాంతాల వల్ల ప్రయోజన మేమిటని ఆవిడ భర్తను నిలదీస్తే . "నీకు ఇష్టమేనా ?' అనడిగాదాయన. అవాక్కైపోయిన భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుని "నువ్వు డబ్బు కోసం మానం వదులుకొలేవు. కానీ నన్ను మానాభిమానాలు వదులుకోమంటవా ?" అన్నాడు.    
    భర్తతో వాదించి నెగ్గలేకపోయిన సావిత్రి ఆశలన్నీ కొడుకు మీదనే పెట్టుకుంది.
    ప్రసాదరావుకి సోమరాజు కీడైన వెంకట్రావనే కొడుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పట్నించీ ఎంతో స్నేహంగా ఉంటున్నారు. వెంకట్రావు కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి గొప్ప వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. దురదృష్టవశాత్తూ సోమరాజు క్కూడా తండ్రి పోలికలే వచ్చాయి. అతనూ గుమస్తా ఉద్యోగం కోసమే ప్రయత్నిస్తున్నాడు.
    వీలునప్పుడల్లా సావిత్రి వెంకట్రావుని కలుసుకుని అతని ప్రయోజకత్వాన్ని పొగిడి కొడుకు అప్రయోజకత్వాన్ని నిందించి కొడుకును ప్రయోజకుడిగా చేయవలసిందిగా వెంకట్రావును కోరుతూ ఉండేది. వెంకట్రావుకూ స్నేహితుడిని బాగు చేయాలనుండేది. కానీ ఇద్దరివి రెండు రకాల దారులు. వాటిని కలవడమేలాగ?
    ఈరోజు మూడు రిగ్రేట్ లెటర్స్ వచ్చేక సావిత్రి మళ్ళీ వెంకట్రావుని కలుసుకుని పరిస్థితి వివరించి ఎలాగో అలా అతను కొడుక్కు సాయపడి తీరాలంది.
    ఆరోజు వెంకట్రావు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చే యతనికి. నాలుగు రోజులు ఇంట్లో తీరికగా విశ్రాంతిగా ఉండదలిచాడు. ఈ సమయంలో సావిత్రి వచ్చి మాట్లాడడంలో ఎలాగో అలా మార్చాలని సోమరాజు కోసం కబురు పెట్టాడు. సోమరాజు వచ్చాడు.
    'చూశావా ఇదీ ఎయిర్ కండిషన్డ్ గది. వేసవికాలం ఈ గదికి లేదు. డబ్బుతో అన్నింటినీ మార్చేయవచ్చు . ఒప్పుకుంటావా?" అన్నాడు వెంకట్రావు.
    సోమరాజు నవ్వి ఊరుకున్నాడు.
    'చూడూ సోమూ - మనిద్దరం చిన్నప్పట్నించీ కలిసి తిరిగాం. నీ ధోరణి నీదే కాని ఇప్పుడు కూడా మనమెందుకు కలిసి తిరక్కూడదు?" అన్నాడు వెంకట్రావు.
    "తిరగాలని నాకూ ఉంటుంది. అందుకవసరమైన తీరుబడి కూడా నాకిప్పుడుంది కానీ నీకే లేదు."
    "నా ఉద్దేశ్యమది కాదు." అన్నాడు వెంకట్రావు. "నువ్వూ నాతొ చేతులు కలిపి నాకు లాగే డబ్బు సంపాదించాలి...." అన్నాడు వెంకట్రావు.
    'అన్ని పనులూ అందరికీ చేతకావు" అన్నాడు సోమరాజు క్లుప్తంగా.
    "ఎందుకు చేతకావు? ప్రయత్నిస్తే కదా అ విషయం తెలిసేది! చదువులో ఎప్పుడూ నువ్వే తెలివైనవాడివిగా ఉండే వాడి నాన్న విషయం నేనెప్పుడూ మరువలేదు."
    'అయితే నీ జీవనవిధానం సరైనదేనని నువ్వు ఒప్పుకోవాలి. నీకంటే తెలివైనవాడు తీసుకున్న నిర్ణయానికి నువ్వు విలువనివ్వాలి."
    వెంకట్రావు నవ్వి, "ఫ్రెండూ లోకజ్ఞానానికి, చదువుకూ చాలా తేడా ఉంది. నీకు చదువుంది కానీ లోకజ్ఞానం లేదు. అది కలిగించడానికే ఈరోజు నిన్ను పిలిచాను..." అని కాసేపు జ్ఞానోపదేశం చేశాడు వెంకట్రావు.
    వెంకట్రావుకు పేద ప్రజలంటే చాలా జాలి ఆట. అయినా గుమస్తా ఉద్యోగం చేసి పేదవాళ్ళ నాదుకోవడం సాధ్యపడదుట. అందుకని సమాజానికి పట్టిన చీడపురుగు లను బెదిరించి డబ్బు లాగి అందలో కొంత పెదలకిస్తున్నాడట. ఆ విషయాన్ని నిరూపించడం కోసం తను విరివిగా ఇచ్చిన విరాళాల వివరాలను చూపించాడతను.
    సోమరాజు కళ్ళు తిరిగిపోయాయి. ఈ నెలలో వెంకట్రావు విచ్చిన విరాళాల మొత్తం పదివేలు దాటిపోయింది.
    'సమాజానికి చీదపురుగులని నీకు తెలిసినపుడు వాళ్ళను ఏరి వేయవచ్చుగదా" అన్నాడు సోమరాజు.
    వెంకట్రావు నవ్వి అక్కడున్న అల్మారా దగ్గరకు వెళ్ళి అందులోంచి కవర్ ఒకటి తీసి మిత్రుడి కందించాడు. సోమరాజు ఆ కవర్ తెరచి అందులో ఉన్న ఫోటో ఒకటి బయటకు తీశాడు. ఫోటోలో నలుగురు వ్యక్తులు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని ఉన్నారు. బల్ల మీద విస్కీ సీసా, గ్లాసులూ ఉన్నాయి. ముగ్గురు వ్యక్తుల ముఖాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక వ్యక్తీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి.
    "మంత్రిగారిని గుర్తుపట్టాను. మిగతావాళ్ళాయన స్నేహితులయుంటారు...." అన్నాడు సోమరాజు.
    "అవును , కానీ నలుగురికీ చెప్పుకోగలిగిన స్నేహం కాదది. ఇంటర్నేషనల్ స్మగ్లర్ జాన్ ఫోటోలో మంత్రి గారి కుడిపక్క ఉన్నాడు . చట్టానికి , దేశానికీ సంరక్షకుడిగా ఉన్న మంత్రి గారి వ్యక్తిగత చరిత్ర ఇది. ఇప్పుడు చెప్పు తెలివిగా చీడ పురుగుల్ని ఏరి వేయడం మనవల్లవుతుందా?"
    సోమరాజు ఆలోచనలో పడ్డాడు.
    'ఈ ఒక్క ఫోటోతో ఆయన్ను పదవి నుంచి దింపేయవచ్చు. కానీ ఇలాంటి వాడే ఇంకొకరు గద్దె నెక్కుతాడు. అది ఆపడం మనవల్ల కాదు. అందుకని ఈ ఫోటోతో డబ్బు సంపాదించి అందులో వీలుపడ్డంత ఆపదలో వున్నవారి నాదుకోనడానికి వినియోగించాలి...." అన్నాడు వెంకట్రావు.
    సోమరాజేమీ మాట్లాడలేదు.
    "నాతో పద. లోకమంటే ఏమిటో చూపిస్తాను. సుఖపడే విధానం తెలియబరుస్తాను. పేద ప్రజల కడుపు కొట్టనంత కాలం డబ్బు ఎలా సంపాదించినా ఫరవాలేదు...." అన్నాడు వెంకట్రావు.
    మిత్రులిద్దరూ లేచారు. సోమరాజు, వెంకట్రావు ననుసరించాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.