Home » Dr Dasaradhi Rangacharya » Manavatha
ముకుందంగారు కాలకృత్యాలు తీర్చుకున్నారు. జానకి ఇల్లు కడిగింది. దేవుని గది శుభ్రం చేసింది. తలమీంచి స్నానం చేసింది. ముకుందంగారు స్నానం ముగించుకున్నారు. దేవుని గదిలోకి వచ్చారు. ప్రమిదలు వెలుగుతున్నాయి. విగ్రహాలు వెలుగుతున్నాయి. ముకుందంగారు విగ్రహాల ముందు కూర్చున్నారు. జానకి కోసం చూడసాగారు. పూల బుట్టతో జానకి వచ్చింది. తండ్రి పక్కనే కూర్చుంది. ముకుందంగారు పూజ సాగించారు. జానకి పూలు వేస్తున్నది. కర్పూరం వెలిగించారు ముకుందంగారు. జాణకు మంగళ హారతి పాడింది. జానకి గొంతు బావుంటుంది. ముకుందంగారికి చాలా ఇష్టం. మరోపాట పాడమన్నారు. పాడింది, కొబ్బరికాయలు కొట్టారు. ప్రసాదం సిద్దం చేసింది జానకి! ముకుందంగారు జానకికి తీర్ధం ఇచ్చారు. ఆమె కళ్ళకు అద్దుకుని పుచ్చుకుంది. ముకుందంగారూ తీర్ధప్రసాదాలు తీసుకున్నారు. జానకిని ప్రసాదం పంచిపెట్టమన్నారు. జానకి ప్రసాదపు పళ్ళెంతో బయల్దేరింది. చేతికర్ర అందుకొని ముకుందంగారు బయలుదేరారు! వారి ముఖాన బొట్టుంది. మెడలో మాల ఉంది. చేతిలో కర్ర ఉంది. గుమ్మంలో జానకి పక్కన నుంచున్నారు.
జానకి చేతిలో పళ్ళెం చూచారు పిల్లలు. పళ్ళెంలో ప్రసాదం ఉందని గ్రహించారు. జానకి ముందు మూగారు. చేతులు చాస్తున్నారు. గొడవ చేస్తున్నారు. జానకి ఒకరికొకరికే ప్రసాదాలు అందిస్తూంది, ఆనందంగా చూస్తున్నారు ముకుందం గారు.
రెండు చిన్న చేతులు ప్రసాదం అడిగాయి.
ముకుందంగారు చూచారు; భగ్గుమన్నారు. కర్ర అడ్డం పెట్టారు. జానకి బిత్తరపోయింది. తండ్రిని చూచింది.
"వాడు కిరస్తానీ.....వాడికి ప్రసాదం ఇవ్వద్దు"
జానకి చిత్రంగా చూచింది తండ్రిని. తండ్రి ముఖంలో అసహనం, క్రౌర్యం కనిపించాయి.
జానకి అటు చూచింది. పసివాడు. మొలకు గుడ్డ కూడా లేదు. ముఖం అమాయకంగా ఉంది. దోసిలిపట్టి ప్రసాదం అడుగుతున్నాడు. అలాగే నుంచొని ఉన్నాడు.
"నాన్నా! పసివాడు చూడు, చేతులు చాచాడు" అని ప్రసాదం పెట్టబోయింది.
ముకుందంగారు కర్రతో కుర్రాణ్ణి నెట్టేశారు.
ప్రసాదం నేలమీద పడిపోయింది - కొబ్బరి ముక్కలు - పంచదార!
కుర్రాడు వెనక్కు జరిగాడు. కర్ర వీపుమీద పడింది. కుర్రాడు మట్లోపడిపోయాడు. అతని మెడలో వేలాడుతున్న శిలువ ప్రసాదంమీద పడింది.
ముకుందంగారు జానకిని లోనికి నెట్టారు. 'పద పద.....లోనికి పద' జానకిని అదిలించి వాకిలి తలుపేశారు.
కుర్రాడు లేచి కూర్చున్నాడు. ఆశగా కొబ్బరి ముక్కలు ఏరి చేతులో పట్టుకున్నాడు. నోట్లో వేసుకోబోతున్నాడు. 'ఆగు. పారేయ్' అనే కేక వినిపించింది.
కుర్రాడు తలెత్తి చూచాడు.
ఫాదర్ జాన్ కనిపించారు. చేతిలో కర్ర ఉంది. కుర్రాడు లేచి నుంచున్నాడు. కొబ్బరిముక్కలు వదలలేదు.
'నిన్నే! పారేయ్. ఇలారా!' కుర్రాడు వణికిపోయాడు.
ఫాదర్ ను చూచాడు.
ఫాదర్ మండిపడుతున్నారు. 'వదులు, వదుల్తావా లేదా?" ఫాదర్ కర్రఎత్తాడు. కుర్రాడి దగ్గరికి వస్తున్నారు.
కుర్రాడు చేతిలో చూచుకున్నాడు. కొబ్బరిముక్కలున్నాయి.
పిడికిలి బిగుసుకుంది.
అమాంతం పరుగు లంకించుకున్నాడు. దూరంగా ఫాదర్ గాలిలో కర్ర ఊపుతూ ఏవో కేకలు పెడుతున్నాడు. ఫాదర్ తనని అందుకోలేడని ఆ కుర్రాడికి తెలుసు. కొబ్బరిముక్కలను నోట్లో వేసుకున్నాడు.
జానకి విసురుగా లోనికి వెళ్ళింది. పళ్ళెం విసురుగా పడేసింది.
పడిపోయిన కుర్రాడు, ప్రసాదం ఆమెకు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె చుర చుర లాడింది. ముకుందంగారు చూస్తూ నుంచున్నాడు.
"నాన్నా! మీరు పొరపాటు చేశారు, పాపం పసివాడు ప్రసాదం అడిగాడు. వాణ్ని కొట్టారు. నెట్టారు."
"తల్లీ! నీకు తెలీదమ్మా-ఇంకా చిన్నపిల్లవు. ఈ కిరస్తానీలు పరమ దుర్మార్గులు. నీచులు" వాలుకుర్చీలో కూలబడ్డారు ముకుందంగారు.
"పసిపిల్లలు భగవంతునితో సమానం నాన్నా! వాళ్ళకు మతం అంటకట్టడం ఎందుకు! పాపం ప్రసాదం కోసం వచ్చాడు కుర్రాడు. వాణ్ని మీరు కొట్టారు."
"మనది ఆర్యావర్తం - తల్లీ-ఇది పుణ్యభూమి. వేదం అవతరించిన దేశం. ఉపనిషత్తులు వెలసిన చోటు. పురాణాలు పుట్టిన నేల. చాతుర్వర్ణ వ్యవస్థ విలసిల్లిన ప్రదేశం. ఆ వ్యవస్థే విలసిల్లినన్నాళ్ళూ పాడిపంటలు పొంగిపొర్లాయి. మ్లేచ్చులు మన దేశానికి వచ్చారు. మన దేశానికి చ్యుతి ఏర్పడింది. మన ధర్మం పతనం అయింది. ఈ కిరస్తాన్లు వచ్చారు. వర్ణ సంకరం చేశారు. వారికి తెలుసు మన ధర్మం అగ్గిలాంటిదని-దాని దరి చేరలేమని....అందుకే వర్ణ సంతకం ప్రారంభించారు. తెల్లవాడు పోయినా వారు వేసిన వలపోలేదు. అందులో చిక్కుకుని ఉన్నాం మనమంతా, విన్నావా, అమ్మా! కిరాస్తాన్లకు చాలా దూరంగా ఉండాలి. వారి నాశనమే మన కళ్యాణం."
` 'నాన్నా!' జానకి అరిచి, అంతలోనే తమాయించుకుని సరళ స్వరంలో "మనది ఆర్యావర్తం-నిజమే నాన్నా! అనార్యుల్ని అంతం చేయడానికి మారణహోమం జరిగింది ఇక్కడే నాన్నా! ఇది పుణ్యభూమి నాన్నా-పుణ్యభూమి. నిండు సభలో ద్రౌపది వలువలు విప్పిన భూమి. సీతను అవమానించి అడవులను పంపిన భూమి. అన్నదమ్ముల పోట్లాటలకు పద్దెనిమిది అక్షౌహిణులను బలిచేసిన భూమి. రక్తం ప్రవహింపచేసిన భూమి. నాన్నా నాలుగు వర్ణాలన్నారు. బావుంది, పంచములు ఎలా వచ్చారు? సరే నాలుగు వర్ణాల వ్యవస్థ ఎన్నడో ఉందన్నారు. పరశురాముడు రాజ్యంకోసం రక్తపు టేరులు పారించాడు. అతడు బ్రాహ్మడు. అతనికి రాజ్యంతో నిమిత్తమేమి? విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మర్షి ఎందుకయినాడు! అరుంధతి ఎవరు? విదురుడెవరు? నాన్నా, గతం మంచిదనుకోవడం మన భ్రమ. చరిత్రలో ఎన్నడూ భారతభూమి ఇంత ఐక్యంగానూ, ఇంత విశాలంగానూ లేదు."
"జానకీ, చాలించు నీ మెట్ట వేదాంతం. ఇదంతా కిరస్తానీ చదువుల ప్రభావం. నిన్ను ఇంగ్లీషు చదివించడం నా తప్పు. నా ధర్మాన్ని వేలెత్తి చూపేవాణ్ని నేను సహించను." కాస్త ఉద్రేకంగానే అన్నారు ముకుందంగారు.
"నాన్నా! కిరస్తాన్లు మనుషులు కారా?"
"కారు, రాక్షసులు, దయ్యాలు, భూతాలు, వాదించకు. నడువ్ నా ముందు నుంచి" పెద్ద కేక పెట్టారు ముకుందంగారు.
జానకి హడలిపోయింది. తండ్రిని చూచింది.
ముకుందంగారికి చెమటలు పట్టాయి. వణికిపోతున్నారు.
'నాన్నా!' అని కేక పెట్టింది జానకి. తండ్రిమీద పడి, 'నాన్నా' అంది గోముగా. ముకుందంగారు జానకి తల నిమిరారు.
"ఏం లేదు తల్లీ? కాస్త ఉద్రేకపడ్డాను అంతే"
"నాన్నా! మీరు ఉద్రేకపడ్డారు" జానకి తండ్రి కాళ్ళదగ్గర కూలబడ్డది. "మీరు ఉద్రేకపడ్డారు నాన్నా!" ఆమె గొంతు సగం పూడిపోయింది. మాటల్లో కన్నీటి తడి ఉంది.
"పడను తల్లీ....ఉద్రేకపడను. ఇది ఉద్రేకపడే వయసు కాదు.....తెలియలేదమ్మా! తెలుసుకోలేక పోయాను. ఉద్రేక పడను, ఇహపదను" ముకుందంగారు కూతురు తలమీద ముఖం పెట్టారు.
ముకుందంగారు దేవుని గదిలో కూర్చున్నారు-వంటరిగా వారి ఎదుట విగ్రహాలున్నాయి. విగ్రహాల ముందు సెమ్మెలున్నాయి. వాటిల్లో వత్తులున్నాయి-నూనె లేదు.