Home » Dr Dasaradhi Rangacharya » Manavatha
ఇద్దరూ కర్రలు పారేశారు. చేతులు కలుపుకునే దశకు వచ్చారు. పాల్ అటు వచ్చాడు. చూచాడు. ఊరికి వచ్చాడు.
"ఏమిటి ఫాదర్ ఇది?"
ఫాల్ ను ఇద్దరూ చూచారు. ఇద్దరూ నిశ్చేష్టులైనారు. నుంచున్నారు.
"చూశావా, వీడి రాముడు గొప్పవాడట!"
"ఏసు గొప్పవాడా....ఎవడు ఏసు?"
"మళ్ళీ ఏసు మాట ఎత్తావంటే....."
"మా రామున్ని ఏమన్నా....."
"ఏమిటి ఫాదర్, ఏమిటీ-తాగాదా? ఏమిటండీ, ఎందుకీ పోట్లాట?"
"వరద తగ్గించింది మా రాముడు కాదంటాడయా, మీ ఫాదర్! ప్రార్ధన చేసింది నేను. కళ్ళారా చూచాను రాముడు బాణం విడవడం, కాదంటాడు....."
"చెప్పు, బుద్ది చెప్పు మనం చూళ్ళేదూ శిలువలోంచి ఏసు రావడం!"
ఫాల్ కు ఏమి అర్ధంకాలేదు. అతనికి కనిపించింది శిలువ మాత్రమే!
"సరే, తగ్గాల్సింది వరద. అది తగ్గింది. వాన పోయింది. మనుషులు, పక్షులు, పశువులు హాయిగా ఉన్నారు. వారికి కావలసింది వాన తగ్గడం. వరద గుంజడం. ఎలా గుంజింది అని పోట్లాడుకోవడంకాదు. పూలు పూస్తాయి, గాలి వీస్తుంది. సెలయేరు పారుతుంది. వీటిని చూసి అంతా ఆనందిస్తారు. ఇవి ఎక్కడ్నుంచి వచ్చాయి అని పోట్లాడుకునే వారుండరు. మనకు కావాల్సింది ఫలితం. అది జరిగింది. అందరూ హాయిగా ఉన్నారు. మనమూ అలాగే ఉందాం. రండి ఫాదర్ వెళ్దాం." ఫాల్ ఫాదర్ ను తీసుకుని సాగిపోయాడు. ఫాదర్ వెనక్కు తిరిగి ముకుందంగారిని చూస్తూ వెళ్ళి పోయాడు. ముకుందంగారు కిందపడ్డ కర్ర అందుకున్నారు. అక్కడే ఫాదర్ జాన్ కర్ర కనిపించింది. దాన్ని తాకలేదు. వెనక్కు తిరిగి సాగిపోయారు.
ముకుందంగారు సాగిపోతున్నారు. తోవలో కుక్కలు కాట్లాడుకుంటున్నాయి. ఒకదాన్ని ఒకటి కరుస్తున్నది. ఒకటి కిందపడేస్తున్నది. కొరుకుతున్నది, అరుస్తున్నది. కిందపడ్డది లేచింది, ఉరుకుతున్నది. రెండోది వెంటపడ్డది. మళ్ళీ కొట్లాట. ఈ తడవ వెంబడించిన కుక్క పడిపోయింది. పైనున్న కుక్క కరుస్తున్నది, కొరుకుతున్నది, అరుస్తున్నది.
'ఎందుకు పోట్లాడుకుంటాయి కుక్కలు' అనుకున్నారు ముకుందంగారు. వెంటనే 'వెధవ కుక్కలు' అనే మాట నోట వచ్చింది. చేతి కర్రతో కుక్కలవైపు నడిచారు. అదిలించారు, భయపెట్టారు. కర్రను చూచాయి కుక్కలు. చెరోవైపు ఉరికాయి. తోక ముడుచుకొని, అలా కొంతదూరం పోయి రెండూ నిలిచాయి. వెనక్కు తిరిగి చూచాయి. ఒకదానికి ఒకటి కనిపించింది-దూరంగా. రెండూ తమ తమ స్థానాల్లో నుంచున్నాయి. చెవులు రిక్క పొడిచాయి. గుర్రుమంటున్నాయి. ముకుందం గారు చూచారు. ఒక కుక్కను అదిలించారు. అది ఉరికింది. వెనక్కు చూచారు ఫాదర్ జాన్ కిందపడిన కర్ర అందుకున్నారు. వెళ్ళిపోతున్నారు.
'మూర్ఖుడు!' అనుకోకుండా ముకుందంగారి నోటివెంట వచ్చింది. కర్ర ఊపుతూ కదిలిపోయారు ముకుందంగారు.
4
ఏరు నిర్మలంగా పారుతోంది. ఏట్లో బండలున్నాయి. అవి బట్టలు ఉతికేవి. వరదలో మునిగిపోయాయి. ఇప్పుడు బయటపడ్డాయి.
రమాదాసి ఏట్లోకి దిగింది. ఆమె నెత్తిన బట్టల మూట ఉంది. ఆమె చేతిలో కుండ ఉంది. ఒక బండ దగ్గరికి వచ్చింది. ఆ బండమీద ఏసుదాసు వున్నాడు. అతడు బట్టలు ఉతుకుతున్నాడు. రమాదాసి ఏసుదాసును చూచింది. మండిపడింది.
"ఈ బండ నాది. నువ్వెట్ల ఉతుకుతున్నవ్?" అంది కోపంగా.
ఏసుదాసు తలపైకెత్తి చూచాడు. రామాదాసి - చేతిలో కుండ, నెత్తిన మూట....వయ్యారంగా నుంచుంది. అతను మాట్లాళ్ళేదు. చూస్తున్నాడు.
"ఏందట్ల చూస్తవ్? దయ్యమనుకున్నవా?"
"దయ్యాన్ని చూస్తరా? కళ్ళు మూసుకుంటరు, పారిపోతరు. బాగున్నవని చూస్తున్న"
"బాగున్నవ్ లే. అందుకనే చూస్తున్నలే, మొగంజూడు ఎట్లున్నదో! జరుగు అన్నుంచి. ఈ బండ నాది. బట్టలుతుక్కోవాలె"
"అట్లనా! ఈ బండ నువ్వేసినవా? నీ అయ్యేసిండా? నీ తాతేసిండా?" బాసు బట్టలుతకసాగాడు.
బాసి భగ్గున మండింది.
మూట పడేసి కుండ కింద పెట్టింది. పయట నడుముకు బిగించి చండికలా ముందుకు దూకింది.
"నీకు నా సంగతి ఎరక లేనట్లున్నది. నా బండమీద దేవుడొచ్చి ఉతికినా ఊరుకోను. జరుగు ఇంకో బండకుపో!"
దాసు ఎదటికి వచ్చి నుంచుంది దాసి. కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. ఆవేశంతో ముక్కుపుటాలు ఎగిరి పడుతున్నాయి. గుండెలు కదులుతున్నాయి. మన్మధుని మీదికి కయ్యానికి కాలుదువ్వినట్లుంది. ఏసుదాసు ఆమె అందాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్నాడు.
రమావాసి అరిచింది. "కదుల్తవా? లేదా?"
ఏసుదాసు ఈ లోకంలోకి వచ్చాడు. "కదలను....ఏం చేస్తవ్?" అన్నాడు, స్థిరంగా నుంచున్నాడు.
ఇద్దరూ ఎదురుబదురుగా నుంచున్నారు.
శ్వాసలు కలిసేంత దగ్గరలో ఉన్నారు.
"ఏం చేస్తనా? చూడు" రమాదాసి అమాంతం అతన్ని వెనక్కి నెట్టింది. ఏసుదాసు బెండులా పడిపోయాడు. నీళ్ళల్లో పడిపోయాడు.
రమాదాసి పకపకా నవ్వుతూంది. ఆమె ముఖం వికసించింది. విజయగర్వం తాండవిస్తూంది.
ఏసుదాసు మునిగిపోలేదు-నీరు లోతుగా లేదు. నిలదొక్కుకుని నీళ్ళలో కూర్చున్నాడు. రమాదాసిని చూస్తున్నాడు-ఆమె ముఖం వికసించింది. వెన్నెల విరిసినట్లుంది.
"ఏందట్ల చూస్తవ్? చాలయిందా? బట్టలు తీస్కపో" అని బండమీదున్న బట్టలు ఇసుకలో గిరాటేసింది. బండమీద కూచుంది. మూట విప్పింది. నీళ్ళలో తడుపుతూంది.
ఏసుదాసు ఓడిపోయాడు. కయ్యానికి దిగదల్చలేదు. ఏటిలోంచి లేచి వచ్చాడు, బట్టలు అందుకున్నాడు. మరో బండమీదికి వెళ్ళిపోయాడు.
ఏరు గలగల పారుతూంది. ఆడీ గలగలా నవ్వినట్లుంది.
రమాదాసి బట్టలు ఉతికింది. పిండింది. భుజాన వేసుకుంది. కుండలో నీరు నింపుకుంది. నెత్తికి ఎత్తేవారు కావాలి. అటుచూచింది. ఏసుదాసు కనిపించాడు. బట్టలు పిండుతున్నాడు.
"ఏయ్...." పిలిచింది-"ఆడపిల్ల కష్టపడ్తున్నది. కనపట్టంలే, కడవెత్తు"
ఏసుదాసు వొచ్చి కడవ ఎత్తాడు.
కడవ ఎత్తుకున్న రమాదాసి సాగిపోతూంది. ఆమె నడకతో వయ్యారం కనిపించింది ఏసుదాసుకు.
ఏసుదాసు చూస్తున్నాడు - రమాదాసి నడకను. రమాదాసి సాగిపోయింది. ఆమె పోయిన దిక్కును చూస్తూ వుండిపోయాడు దాసు.
5
శనివారం, తెలతెల వారుతూంది. పిట్టల కిచకిచలు వినిపిస్తున్నాయి. చల్లని గాలి వీస్తూంది. తూర్పు ఎర్రవారింది. ముకుందంగారు లేచారు. జానకిని లేపారు. రేడియోలో 'సుప్రభాతం' వస్తూంది. గుడి గోపురానికి లౌడ్ స్పీకరుంది. అదీ సుప్రభాతం వినిపిస్తూంది. ముకుందంగారు గొంతు కలిపారు. జానకిని పాడమన్నారు. ఇంట్లో 'సుప్రభాతం' ప్రతిధ్వనిస్తూంది. వాతావరణంలో సుప్రభాతం నిండింది.