Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

    "చిన్నప్పుడు దొరబాబులా గుండె వాడివి" అన్నాడు చక్రపాణి నిట్టురుస్తూ.
    'ఆ రూపమే మీ మనసులో ఎల్లకాలమూ వుండిపోవాలనుకున్నాను. కానీ పరిస్థితులు నన్ను మీ ముందుకు నడిపించాయి. నేను అరుణ కోసం అయిదు వేల రూపాయలు తీసుకువచ్చాను. ఆ డబ్బు దాని పెళ్ళికి వినియోగిస్తే అది నాకు చాలా తృప్తినిస్తుంది" అన్నాడు విశ్వం.
    "సినిమాలో హీరోల్లా ఆ మాతలేమిటిరా? నీ ముఖం బాగుండక పొవచ్చు కానీ నీ మనసు బంగారం. అరుణ మనసు దాని బావ మనసుతో ముడి పడింది కానీ రూపంతో కాదు. నువ్వు నీ పిచ్చి కబుర్లు చెప్పకు. పద- ఇంటికి పోదాం" అన్నాడు చక్రపాణి.
    "ఇంటికి వస్తాను గానీ పెళ్ళి విషయం నువ్విక మరిచి పోవాలి. నన్నూ అరుణ నూ కలిపి పక్కపక్కన ఊహించుకుంటుంటే నా గుండె చెరువై పోతోంది. సామాన్యంగా కనబడే ఆడపిల్లలే నేనంటే ఇష్టపడడం లేదు. ఏదో సెంటిమెంటు తాత్కాలికంగా ఔననిపించినా అది శాశ్వతం కాదు. కాలేదు. పెళ్ళంటే క్షణికావేశం కాదు మావయ్యా- నూరేళ్ళ జీవితపు పంట!" అన్నాడు విశ్వం.
    "చాలా పెద్ద మాటలు నేర్చావు?" అన్నాడు చక్రపాణి.
    ఇద్దరూ అక్కణ్ణించి కదిలారు. ఈ దృశ్యాన్ని కాస్త దూరాన్నుంచి గమనిస్తున్న నేను పార్కుకు బయల్దేరాను.

                                    8
    "ఇంక నీతో, అబద్దం చెప్పలేను అరుణా! నా పేరు విశ్వం కాదు. రఘునాద్!" అన్నాను దీనంగా ముఖం పెట్టి.
    అరుణ నమ్మలేనట్లు నావంక చూసి -- "ఏమన్నావ్. మళ్ళీ అను" అంది.
    ఈ పర్యాయం ఆమెకు అంతా నిజమే చెప్పాను. ఆమెను నేను ఏ ఉద్దేశ్యంతో పలకరించింది. ఆమె బావ అనగానే నా ఊహ లేలా మారిందీ వగైరా చాలా నిజాలు చెప్పాను.
    అరుణ కళ్ళలో నీళ్ళు తిరిగాయి "ఇది నిజం కాకపొతే ఎంత బాగుండును?' అందామె . నిరుత్సాహం ఆమె ముఖంలో గూడు కట్టుకుంది.
    బావ చుట్టూ ఎన్నో ఆశలు పేర్చుకున్న అరుణకు నేను బావను కానని తెలిసేసరికి ఎక్కడ లేని బాధ కలిగినట్లయింది.
    "నీ బావగా పుట్టి వుంటే బాగుండునని నాకూ వుంది. నీ బావను కానన్న ఒక్క కారణం ఆధారంగా నన్ను పెళ్ళి చేసుకోవడం మానేస్తావా అరుణా!" అన్నాను.
    అరుణ కోపంగా నావంక చూసి - "నన్ను పేరు పెట్టి పిలవద్దు. నువ్వొట్టి మోసగాడివి" అంది . అంటూనే ఆమె లేచి నిలబడింది. నేనూ లేచాను.
    "వెళ్ళిపోతావా అరుణా!"
    "నీ తోటి వెంట నా పేరు రావడం సహించలేను" అంటూ అరుణ అక్కణ్ణించి కదిలింది. ఆమె విసిరికోట్టినా కలిసి ఇంటికి బయల్దేరాను. అయితే ఆమె నా పక్కన పక్కన వుండడం లేదు. నేను పక్కగా వచ్చినప్పుడల్లా ఆమె విసురుగా ముందడుగు వేస్తున్నది. ఆ విసురు , ఆ నిజంగా అరుణ నా భార్య అయినట్లయితే ఈ జీవితానికి అంతకు మించిన వరం అవసరం లేదు!
    అరుణ ఇల్లు చేరేసరికి ఇంటి అరుగు మీద చక్రపాణి విశ్వం కూర్చుని వున్నారు.
    "ఇతడెవరో చెప్పుకో!" అన్నాడు చక్రపాణి అరుణ కు విశ్వాన్ని చూపించి.
    "ఏమో - నాకు తెలియదు" అంది అరుణ.
    "పోనీ ఊహించు -"
    "ఊహించలేను "
    "నీ బావ విశ్వం అమ్మ" అన్నాడు.
    "ఆ" అంది అరుణ అప్రయత్నంగా ....'అయితే వాడు నిజంగా రఘునాదే నన్నమాట" అంది ఆఖరి ఆశ కూడా నశించిపోయినట్లు. తనకు బావగా పరిచయమైన కొత్త వ్యక్తీ వంక ఆమె చాలా నిరుత్సాహంగా చూసింది. అందుకు కారణం అతను అందవికారంగా వుండడం మాత్రమే కాదనీ, ఆమె తనకు తెలియకుండానే నన్ను ప్రేమిస్తున్నదనీ వూహించగలిగాను. ఆ ఊహ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఆ ఆనంద సమయంలో చక్రపాణి గారు నన్ను చూసిన విచారకరమైన విషయం జరిగింది.
    "నువ్విక్కడి కెందుకొచ్చావ్?" అన్నాడాయన కోపంగా.
    "నాన్నా ఇతడేనా రఘునాద్ అంటే?" అనడిగింది అరుణ. ఆమెలో ఇంకా ఏమైనా ఆశ మిగిలి వుంటే అది చక్రపాణి జవాబు తుడిచి పెట్టేసింది.
    "ఇతడు నన్నుమోసం చేశాడు" అంది అరుణ.
    చక్రపాణి కంగారుగా -- "మోసం అంటే?" అన్నాడు.
    అరుణ చతికిలపడిపోయింది.
    'అంతా వివరంగా చెబుతానుండండీ" అంటూ నేను అరుణ నన్నెలా ఆకర్షించింది , మా పరిచయం ఎలా వృద్ది పొందిందీ వివరంగా చెప్పాను. నేనా వివరాలు చెబుతుంటే చక్రపాణి కాస్త కంగారు గానే విన్నాడు. మోసం అన్న పదానికి అయన ఊహించిన లాంటి అర్ధం నేను చెప్పిన వివరాల్లో లేకపోవడంతో అయన మనసు కాస్త కుదుట పడిందనుకుంటాను. మళ్ళీ నార్మల్ కు వచ్చాడు. అంటే నా మాటలు భరించే ఓర్పు పోయిందన్న మాట.
    "నువ్వు తక్షణం ఇక్కణ్ణించి వెళ్ళిపో!" అన్నాడు చక్రపాణి.
    "మీ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నా జీవితాని కోక అర్ధం ఏర్పడుతుందనుకున్నాను. నా ఆశలు అడియాసలు చేయకండి. నన్ను నిరుత్సాహ పరచకండి. నాకు బోలెడు డబ్బుంది" అన్నాను.
    "నీ జీవితాని కర్ధం ఏర్పరచడం కోసం నేను నా కూతుర్ని కనలేదు. అలాంటి దౌర్భాగ్యుడి భూమ్మీద వుంటాడనుకోను. నువ్వు ఇక్కన్నించి వెళ్ళు!" అన్నాడు చక్రపాణి.
    నేను దీనంగా అయన కళ్ళలోకి చూసి అక్కణ్ణించి కదిలాను.
    
                                       9
    "నన్ను క్షమించరా రఘూ!" అన్నాడు వాడు.
    "ఎందుకు?"
    "అరుణ నన్నే పెళ్ళి చేసుకుంటా నంటోంది"
    "అయితే నిన్ను క్షమించడ మెందుకు? ఆమెకు తన బావ మీద ప్రేమ అంతగా వుంది."
    "అవుననుకో -- నేనంత చెప్పినా ఆమె నిన్ను పెళ్ళి చేసుకోనంటోంది. బావను తప్ప ఊహలో కూడా ఇంకోకర్ని తనకు భర్తను చేసుకోలేనంటోంది. ఇంతకాలం నీతో సరదాగా గడిపినందుకు ఆమె ఎంతో సిగ్గుపడుతోంది .'
    'అవును , నెమ్మదిగా ఆమెను మార్చాలి " అన్నాను.
    "మారదురా, ఆమె మారదు."
    "అయితే ఏమంటావ్?" అన్నాను విసుగ్గా.
    "నువ్వు నన్ను క్షమించాలిరా."
    "ఎందుకు?"
    "నేను అరుణను పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను."
    పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాను -- "ఏమన్నావ్?"
    "ఈ జీవితంలో అరుణ లాంటి బంగారు బొమ్మ నా లాంటి వాణ్ణి ప్రేమించడం జరుగదు. నీ దయ వల్ల ఎలాగో జరిగింది. ఈ అదృష్టాన్ని వదులుకోలేను."
    "బాగుందిరా -- స్నేహితుడివి కదా అని నిన్ను రంగం లోకి దింపితే -- నాకే ఎసరు పెడతావా ?"
    "ఇందులో ఎసరు ప్రసక్తి ఏముంది? అరుణ నిన్ను అసహ్యించు కుంటోంది . నన్ను కోరి వరించింది!"
    'అరుణ నీ రూపాన్ని చూసి వరించలేదు. నువ్వు నిజంగా విశ్వాని వేనని నమ్మింది. ఆమె ప్రేమ బావకు అంకితమై పోయింది. ఆ బావ స్థానంలో నేనున్నంతకాలం నన్ను ప్రేమించింది. ఇప్పుడు నువ్వు రాగానే నిన్ను ప్రేమిస్తోంది. నిజం ఏదో ఒకరోజున బయట పడకపోదు . ఆరోజుతో మీ బంధం తెగిపోతుంది, ఆశాశ్వతమైన ఆ బంధం కోసం శాశ్వతమైన మన స్నేహ బంధాన్ని దెబ్బ తీయకు" అన్నాను.
    'అరుణతో బంధం శాశ్వతం కాదని నాకు తెలుసు. కానీ డబ్బిచ్చినా నన్ను ప్రేమగా భావించలేక పోతూన్నాడు ఆడవాళ్ళు. అలాంటప్పుడు తాత్కాలికంగానే అయితేనేం -- అరుణ వంటి అమ్మాయి ప్రేమ నాకు లభించడం చాలా అదృష్టం. ఆమెతో ఒక్కరోజు గడిపినా ఈ జన్మకు సరిపోతుంది."
    నాకు గుండెలు మండిపోయాయి -=- "బాగుంది రా -- నిన్ను విశ్వం స్థానం లో ప్రవేశ పెట్టింది నేనేనని చెప్పమంటావా ?" అన్నాను.
    "చెబితే అరుణ నన్నసహ్యించుకోవచ్చు. కానీ అప్పుడు ఆమె నిన్నింకా ఎక్కువగా అసహ్యించుకుంటుంది. అరుణను నాక్కాకుండా చెయ్యగలవేమో కానీ -- అలా చేయడం వల్ల నువ్వు బావుకునే దేముంది. -- మన స్నేహబంధాన్ని దెబ్బతీయడం మినహాయించి " అన్నాడు వాడు.
    ఏంచేయాలో నాకు పాలుపోలేదు . నా పధకాలు ఒక దాని తర్వాత ఒకటి దెబ్బ  తింటూ అరుణను నాకు రోజు రోజుకీ మరింత దూరం చేస్తున్నాయని గ్రహించాను.

                                     10
    "విశ్వం కావాలి" అన్నాను.
    "ఎందుకు?" అందామె.
    "అతనితో అర్జంటుగా మాట్లాడాలి."
    "విశ్వం ఇంట్లో లేడు."
    "ఎక్కడికి వెళ్ళాడు ?"
    "చెప్పలేదు."
    ఆమె సమాధానం నాకు ఆశ్చర్యంగా తోచింది" "ఎప్పుడు వస్తాడు?"
    "తెలియదు .'
    "సరేనండి . అతన్ని కలుసుకోవడం నాకు తప్పని సరి. అతను వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను" అన్నాను.
    "ఎంత కాలమని ఇలా కూర్చుంటారు? అతనొక వేళ నెలల తరబడి రాకపోతే ...."
    "అతను ఎప్పుడు వచ్చేదీ మీకు తెలియదు గా. కాసేపట్లో వచ్చినా రావచ్చు. నాకు చాలా ఓపిక వుంది" అన్నాను.
    ఆమె అసహనంగా నావంక చూసి "విషయమేమిటో నాతొ చెప్పు. విశ్వానికి చేరవేస్తాను" అంది.
    "నేను విశ్వంతో స్వయంగా మాట్లాడాలి" అన్నాను.
    "ఐతే నీకర్మ!" అన్నదామె.
    "కర్మ నాది కాదు. విశ్వానిది. అతని ప్రియురాలికి అనగా స్వయానా మరదలికి త్వరలో వివాహం కానున్నది" అన్నాను.
    "ఎవరితో?" అన్నాదామే కంగారుగా.
    "విశ్వంతో --"
    "విశ్వానికి తెలియకుండానా?"
    "తెలియకుండానే మరి....అని నవ్వి 'అక్కడ విశ్వం ఉంటున్నట్లు మాత్రం విశ్వానికి తెలుసా మరి?" అన్నాను.
    'అంటే?"
    "ఒకడు విశ్వం పేరుతొ అక్కడ చేరాడు. వాణ్ని వాళ్ళు నమ్మి ఆదరించి పెళ్ళికి మూహూర్తం పెట్టారు."
    "సరే - ఈ సంగతి వాడికి చేబుతాన్లె . వాడు వెంటనే వుత్తరం రాసి పారేస్తాడు."
    నేను నవ్వి 'అదంత సులభం కాదు. అరుణ ఇంటికి వెళ్ళే ఉత్తరాలన్నీ ముందుగానే తనకు చేరే యేర్పాటు చేసుకున్నాడు నకిలీ విశ్వం. వాటిని చదివి విశేషాలు తెలుసుకొని ప్రమాదకరమయినవి వుంటే నొక్కి పెట్టేస్తున్నాడు వాడు" అన్నాను. ఐతే పోస్టు మాన్ కు లంచం ఇచ్చి ఈ పని చేస్తున్నది నేనే కానీ నకిలీ విశ్వం కాదు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.