Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

    శోభ ఆశ్చర్యపోతూ 'ఐతే నీబావ నిన్నెలా గుర్తు పట్టాడు?' అంది.
    "బావ దగ్గర నా ఫోటో వుంది" అంది అరుణ.
    "మరి బావ ఫోటో నీ దగ్గర లేదా?"
    "లేదు" అని నిట్టూర్చింది అరుణ.
    శోభకు ఆశ్చర్యం వేసింది. "నిన్న మీయిద్దరి సంభాషణ విని రచయిత్రిగా కుతూహలంతో ఇక్కడేం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను. అయితే వాస్తవం నేనూహించినదానికి భిన్నంగా వుంది. నీ కధేమిటో చెప్పకూడదు?"
    "చెబుతాను" అంది అరుణ. ఆమె ఒకసారి టైం చూసుకొని చుట్టూ చూసి చెప్పడం ప్రారంభించింది.
    "కధంటూ పెద్దగా ఏమీ లేదు. నా బావకూ తల్లీ తండ్రి లేరు. మా ఇంట్లోనే పెరిగాడు. అతనికి ఏడు ఏళ్ళ వయసప్పుడు ఇంట్లో ఏదో గొడవ పడి యిల్లు వదలి వెళ్ళిపోయాడు. ఏమయిపోయాడో తెలియదు గానీ ఏడాది క్రితం ఇంటికి ఉత్తరం రాశాడు. ఇంటి నుంచి పారిపోయి తను చెడిపోలేదని -- ప్రస్తుతం వ్యాపారం చేస్తూ బాగా డబ్బు గడిస్తున్నాని రాశాడు.
    బావ ఇల్లు వదిలేటప్పుడు నాకు మూడేళ్ళనుకుంటాను. నా ఫోటో ఒకటి పంపించమని రాశాడు. ఫోటో చూసినప్పటి నుంచి నాకు ప్రేమ లేఖలు రాయడం మొదలు పెట్టాడు. నేనూ జవాబులు రాస్తూ తన ఫోటో పంపించామన్నాను. ఫోటో ఎందుకూ, త్వరలో నేనే వస్తున్నానని రాశాడు.
    తను వస్తున్నట్లుగా బావ నెలరోజుల క్రితం నాకో ఉత్తరం రాశాడు. ఫలానా ట్రయిన్ కి వస్తున్నానని స్టేషన్ కి రమ్మనమని రాశాడు. తనే నన్ను గుర్తించి పేరు పెట్టి పిలుస్తానని రాశాడు. ఆరోజు యింటిల్లిపాదీ స్టేషనుకు వెళ్ళాం. బావ రాలేదు. ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత ఇంతవరకూ బావ దగ్గర్నుంచి కబురూ రాలేదు. నిన్న బావ నన్ను స్వయంగా పలకరించగానే ప్రాణం లేచి వచ్చినట్లుంది--"  
    శోభ ఆమె చెప్పిన వివరాలన్నీ విని - " ఈ కధంతా తెలియక మీ విషయాన్ని నేనింకోలా అర్ధం చేసుకున్నాను. నీ బావ ఇక్కడే ఎక్కడో వుండి వుంటాడు. నేనుండడం వల్ల అనుమానపడి అతను రావడం లేదేమో. నీకు శ్రమ ఇచ్చినందుకు విచారిస్తున్నాను . సెలవు -" అని వెళ్ళిపోయింది.
    శోభ వెళ్ళిపోయిన నిముషంలో 'అమ్మయ్య - ఆ రచయిత్రి వెళ్ళిపోయిందా?" అంటూ నేను అరుణను సమీపించాను.
    "బావా!" అంది అరుణ ప్రేమ నిండిన కంఠంతో.
    ఆ పిలుపు విన్నాక ఈ ప్రాణం పోయినా ఫరవాలేదనిపించింది.
    ఇద్దరం అక్కడే చతికిలపడ్డాము.
    అరుణ సమాచారం రేలుసుకోవడం కోసం శోభను నేనే నియోగించాను. అందుకామెకు పాతిక రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు అరుణ కధ విన్నాక నాలో ధైర్యం పెరిగింది. అయితే అరుణను మోసం చేయడం నా అభిమతం కాదు. ఆమె మనసును నా వైపు మళ్ళించుకుని పెళ్ళి చేసుకుని సాఫీ అయిన జీవితం గడపాలని నా ఆశ! అరుణ వంటి భార్య వుంటే జీవితంలో బోర్ అన్నది ఉండదని-- వేరే థ్రిల్ కోసం వెతుక్కో నవసరం లేదనీ నాకు బాగా అనిపిస్తంది.'
    "నీ బావ ఎలా వున్నాడు అరుణా -- నువ్వు ఊహించిమత్నట్లున్నాడా?" అనడిగాను.
    "నేనూహించినదాని కంటే ఎన్నో రెట్లు అందంగా వున్నాడు" అంది అరుణ నావైపు ఆరాధన భావంతో చూస్తూ.
    ఆమె నుండి ఇలాంటి సమాధానం వస్తే బాగుంటుందని నాకూ వుంది. నేను అందంగా వుంటానని నాకు తెలుసు. కానీ అరుణ వంటి ఆడపిల్ల కంటికి అందంగా కనిపిస్తున్నానంటే అది థ్రిల్!
    "నువ్వు మాత్రం ఫోటో కంటే కోటి రెట్లు బావున్నావు" అన్నాను.
    "బావా - నువ్వు ఇంటికి రాకూడదా- నువ్వు వచ్చేవన్న ఆనందాన్ని నేనోక్కర్తినే పొందడం నాకు బాగోలేదు. నిన్న రాత్రి అమ్మ నా ఉత్సాహాన్ని గమనించి గుచ్చి గుచ్చి కారణం అడిగింది. ఏం చెప్పాలో తెలియక సినిమా చాలా బాగుందని, గుర్తోస్తోందని అన్నాను" అంది అరుణ.
    'సమయం వచ్చినపుడు తప్పక వస్తాను అరుణా! కొంతకాలం నా ఉనికి రహస్యంగా వుంచాలి. అసలు నీ దగ్గర కూడా బయట పడకూడదనుకున్నాను. కానీ నిన్ను చూసి ఊరుకోలేక పోయాను" అన్నాను.
    అరుణ నిట్టూర్చి "కనీసం ఈ ఊళ్ళో నైనా కొన్నాళ్ళు వుంటావా?' అనడిగింది.
    "వుంటాను. నువ్వు కరుణిస్తే ప్రతిరోజూ ఈ సమయంలో నిన్నిక్కడ కలుసుకుంటూనే వుంటాను" అన్నాను.
    "బావా- నీకు స్వయానా మరదలి ని గదా -- నువ్వు చేస్తున్న వ్యాపారమేమిటో , ఈ రహస్యాలన్నీ ఏమిటో నాకు చెప్పకూడదా?" అంది అరుణ. ఆమె నాతొ చాలా చనువుగా మాట్లాడుతోంది.
    "నీ దగ్గర నాకు రహస్యాలేమిటి? అన్నీ నీకు సమయం వచ్చినపుడు చెప్పేస్తాను. అయితే నేను ప్రమాదకరమైన పని ఏమీ చేయడం లేదని మాత్రం గుర్తుంచుకో" అన్నాను.
    తర్వాత ఇద్దరూ కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాము. సునిశితమైన శృంగార పదాలు ఒకటి రెండు ఉపయోగించి మరదలి ,ముఖం ఎర్రబడితే చూసి ఆనందించాను. ఆఖరున విడిపోయేటప్పుడు "ఏమీ అనుకోకపోతే రేపు నేను నీకు రాసిన ఉత్తరాలన్నీ తీసుకు వస్తావా?' అన్నాను. అరుణ అలాగేనని తలాడించింది.
    అంటే రేపు కూడా నన్ను కలుసుకోడానికి వస్తుందన్న మాట! ఆ ఉత్తరాలన్నీ చదివి ఆమె అసలు బావ గురించి తెలుసుకోవాలి. అసలు అతనెవరో - నెలరోజుల క్రితం వస్తానని రాసి ఎందుకు రాలేకపోయాడో?"
    నా నాటకం మరికొంత కాలం పాటు కొనసాగాలంటే అరుణ బావ గురించి బాగా తెలుసుకోవాలి. అందుకా ఉత్తరాలు నాకు బాగా సహకరిస్తాయి.

                                     3

    ఉత్తరాలు చదివితే కొన్ని వివరాలు తెలిశాయి నాకు.
    అతను హైదరాబాదు లో వుంటున్నాడు. పేరు విశ్వం. అతను ఉత్తరంలో తన వ్యాపారం గురించి కానీ, తన గురుంచి కానీ ఎక్కువ వివరాలు ఇవ్వలేదు. అతను అరుణకు ఇచ్చిన కేరాఫ్ అడ్రస్ అప్పటికప్పుడు కంఠతా పట్టేశాను.
    ఉత్తరాల్లోని శృంగారాన్ని కూడా మననం చేసుకున్నాను. ఆ మాత్రపు శృంగారం ఆమెకు అభ్యంతరం వుండదన్నమాట!
    అరుణ గురించీ, విశ్వం గురించీ కొంత అవగాహనకీ ఉత్తరాలు నాకు ఉపకరించాయి. ఉత్తరాలు చదివి ఇచ్చేసి -- "నువ్వు దగ్గర లేనప్పుడు నిన్నూ హించు కోవడం వల్ల ఆ భాష అప్రయత్నంగా వచ్చేసిందనుకుంటాను. ఆ ఉత్తరాలు చదువుతుంటే నేనే రాశానా అని ఆశ్చర్యంగా వుంది" అన్నాను.
    "నువ్వుత్తరాలు బాగా రాస్తావు. కానీ మాట్లాడ్డం బొత్తిగా రాదు" అంది అరుణ.
    నేను నవ్వి - "నువ్వు దగ్గర లేనప్పుడు ఎలాగో ఉత్తరాలు రాయగలిగాను. పక్కన వుంటే నాకు మాటలు రావడం లేదు" అన్నాను.
    "ఏదో ఒకటి మాట్లాడకపోతే విలువైన సమయం వృధా అయిపోదూ?" అంది అరుణ.
    "నీకు తెలుసో తెలియదో కానీ ప్రేమికులు దగ్గర లేనప్పుడు ఉత్తరాలు రాసుకుంటారు. దగ్గరుంటే మాటలు కూడా ఉండవు . అన్నీ చేతలే!" అన్నాను.
    "ఛీ - "అంది అరుణ ఏదో స్పురించి.
    'అలా అన్నదంటే ఆడపిల్లలకు ఇంకా ప్రాయం రాలేదని అర్ధం" అన్నాను.
    ఇద్దరి మధ్యా కాసేపు మాటలు నడిచేక "నేనంటే నీ కిష్టమేనా? నన్ను పెళ్ళి చేసుకుంటావా?' అనడిగాను. కాస్త సిగ్గుపడినా తనకు ఇష్టమేనని చెప్పింది అరుణ.
    నా మనసులో ఏదో పధకం మెరుస్తోంది. అరుణ అసలు బావ వచ్చేలోగా నేను అరుణను ఏదో విధంగా లోబరుచుకుని ఆమెను పెళ్ళి చేసుకోవాలి. ఐతే ఈ లోగానే అతను వచ్చేస్తే!
    అందుకు తిరుగులేని పధకం ఆలోచించాలి.

                                      4

    బాగా అలోచించి ఒకరోజు అరుణను నా గదికి ఆహ్వానించాను. అందుకోసం హోటల్లో ప్రత్యేకంగా ఒక గది తీసుకున్నాను. అరుణ నిస్సంకోచంగా హోటల్లో నా గదికి వచ్చింది.
    నేను తలుపులు వేస్తుంటే ఆమె వారించలేదు. సరికదా అనుమానాన్ని కూడా ప్రకటించలేదు. అరుణ మంచితనాన్ని మనసులో అభినందించుకున్నాను.
    కాసేపు మళ్ళీ ఇద్దరి మధ్యా కబుర్లు నడిచాయి. అలా పది నిముషాలు గడిచేసరికి నేను మా ఒంటరితనాన్ని గుర్తించి ఆవేశ పడ్డాను. నెమ్మదిగా అరుణ చేయి తాకాను. మృదువుగా ఆ చేతిని తొలగించిందామె.
    నేను ఒక్కడుగు ముందుకు వేసి ఆమెను కౌగలించుకొని ముద్దు పెట్టుకోబోయాను.
    అరుణ నన్ను బలంగా వెనక్కు తోసేసింది. అందుకు నేను సిద్దపడి లేనేమో వెల్లకితలా పడిపోయాను. అదృష్టవశాత్తు మంచమడ్డుగా వుంది కాబట్టి దాని మీద పడ్డాను. సర్దుకొని లేచి కూర్చొని "తోసేశావా?" అన్నాను.
    "నువ్వు చేసిన పనేమిటి?" అంది అరుణ కాస్త కోపంగా.
    "మనం ప్రేమికులం !" అన్నాను.
    "కానీ భార్య భర్తలం కాదు..."
    "కాబోతున్నాం కదా" అన్నాను.
    "ఇంకా కాలేదు కదా" అంది అరుణ  నాగొంతును అనుకరిస్తూ.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.