Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    "సీతా-- నువ్వు బీచిలో నలుగురి ఎదుటా నా పరువు తీశావు -- " అన్నాను. నా మాటల్లో కోపం లేదు. అసహాయత వుంది. సీత నా గురించి రాధ దగ్గర అన్నమాటలు నిజమవుతున్నాయి. నేను ఏమీ చేయలేని, ఏమీ చేతకాని ఉత్త చవట మనిషిని!
    "నేను మీ పరువు తీయలేదు. మీ గురించిన నిజం చెప్పాను. అదే మీ పరువు తీయడం అనిపించుకుంటే -- మీ చుట్టూ అటువంటి నిజాలు సృష్టించుకోవడం మీరే మానేయాలి!" అంది సీత.
    ఇంటికి వెళ్ళేక సీత కాళ్ళు పట్టుకున్నంత పని చేసి -- "సీతా! ఈ హింస భరించలేను. నువ్వెలా చెబితే అలా నడుచుకుంటాను--" అన్నాను. మానసికంగా నేనెంత దిగజారిపోయానంటే నేనప్పుడు ఎడ్వడానికి సిద్దంగా ఉన్నాను. సీతతెలివి తేటల ముందు నా తెలివి తేటలు చాలడం లేదు.
    "దీన్నే -- అందితే జుట్టు , అందకపోతే కాళ్ళు అంటారు--" అంది సీత కఠినంగా.
    సీత అలా ఎండుకందో నాకు కొద్ది క్షణాల తర్వాత అర్ధమయింది.
    దాని చేతిలో మొత్తం మూడు ఉత్తరాలున్నాయి.
    "పనుండిపోస్టాఫీసుకి వెళ్ళాను. మీ ఆఫీస్ లోని కొలీగ్ భాస్కరరావు అక్కడికి వచ్చాడు. ఎలాగూ వచ్చాను కదా అతను పోస్టు చేస్తున్నారట్ట. అందులో నా పేరున మీ ఆఫీసు అడ్రసు కి ఉత్తరం ఉందిట. అతను అది తీసుకుని నాకిచ్చాడు. ఉత్తరం చదివాను. నాకున్న ప్రియులు నాకుతెలుసు. వాళ్ళను నేను నిర్లక్ష్యం చేయడం లేదు. వాళ్ళింకా "మాజీ"  కాలేదు. కానివ్వనుకూడా. ఉత్తరాన్ని బట్టి అది మూడోది.
    నా ప్రాణంతకమైన మొదటి రెండు ఉత్తరాలూ నాకెందుకు రాలేదు? ఇంట్లో వెతికాను. మీ పుస్తకాల్లో దొరికాయి ఆ రెండు త్తరాలూ! వాటి గురించి మీరు నాకు చెప్పలేదు. ఆ ఉత్తరాలు మిమ్మల్నే విధంగానూ బాధించినట్లు లేదు. నా గురించి మీరేమాత్రమూ ప్రత్యేకమైన జాగ్రత్తలూ తీసుకోలేదు. అంటే ఆమాజీ ప్రియుడు నన్ను చంపడం మీకు ఇష్టం. లేదా వాడి పేరుతొ మీరే ఉత్తరాలు రాసి నన్ను చంపడానికి పధకం వేస్తున్నారు. నా అనుమానం రెండో దే నిజమని! అందుకే నా జాగ్రత్త నేను తీసుకున్నాను. పాపం- రాధ కోరిన వెంటనే సహకరించింది. ఆమెకు నా ధన్యవాదాలు చెప్పుకోవాలి!"అందిసీత.
    మాట్లాడకుండా ఈ అభియోగం విన్నాను.
    భాస్కరరావు గా డెంతపని చేశాడు? ఆ విషయం కూడా నాకు చెప్పలేదు వాడు. ఎందుకు చెబుతాడు?
    ఈ మధ్య సీత కాస్త తెలుసుకున్న మగాడేదురైతే చాలు -- గోముగా చూస్తోంది. గత రెండు మాసాలుగా భాస్కరరావు మా ఇద్దరికీ చాలాసార్లు తటస్థపడ్డాడు. వాడు దీనికేసి ఆకలి చూపులు చూడ్డం నేను గమనించక పోలేదు. ఈరోజు పోస్టాఫీసులో ఒంటరిగా ఒక్కర్తే కనబడేసరికి ఏదో వంక పెట్టుకుని దాన్ని పలకరించడం కోసం -- పేస్ట్ చూసి....
    నా అనుమానాలు మరి కాస్త దూరం వెళ్ళాయి.
    అంతేనా? లేక వాడుత్తరం చూసి -- తీసుకుని ఇంటికి కూడా వెళ్ళేడా? వెధవ.....ఎంతకైనా తగును!
    ఎక్కువదూరం ఆలోచించలేదు. మన బంగారం మంచిది కానపుడు ఎవర్నినుకుని ఏం లాభం.

                                    11
    వారం రోజులు ప్రశాంతంగా గడిచాయి. ఈవారం రోజులూ నేను కర్తవ్యం ఆలోచిస్తూనే ఉన్నాను. సీత సృష్టించిన సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఏవిటా అన్నది ఎంత ఆలోచించినా నాకు స్పురించడం లేదు.
    ఇంటి వద్ద మాత్రం నేను పూర్తిగా సీతకు దాసుడి నయ్యాను.
    "సీతా! నేను పాపిని, దుర్మార్గుడ్ని. ఇంతకాలం నిన్ను హింసించాను. అందుకు నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు. ఇంక మీదట జరిగింది మర్చిపోదాం. ప్రతి నేలా జీతం తెచ్చి నీ చేతుల్లో పోస్తాను. నువ్వెలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను. ఇంక ,మీదట ఒక్క తప్పు చేసినా నన్ను నువ్వు క్షమించవద్దు. ప్రస్తుతానికి నీ నడవడిక మార్చుకో సీతా!" అంటూ దాని కాళ్ళ మీద పడ్డాను. నా చేతులు, తల -- దాని పాదాల్ని స్పుశిస్తున్నాయి.
    అందరు ఆడవాళ్ళులా అది పాదాలు వెనక్కు తీసుకోలేదు. "తప్పతాగి కారు నడిపితే -- ఒక మనిషి ప్రాణాలు పోయాయి. అ తర్వాత తప్పు చేసినవాడు వాడి కాళ్ళ మీద పడితే మాత్రం పోయిన ప్రాణం తిరిగొస్తాయా? మంచులా చల్లబడిన ఆ కాళ్ళ లోకి రక్తం వెచ్చబడి తిరిగి ప్రవహిస్తుందా?" అనడిగిందామె.
    నేను లేచి కూర్చుని -- "అయితే ఏమంటావ్?' అన్నాను.
    "మీరు నాలో మనిషిని చంపేశారు" అంది సీత.
    "నన్నేం చేయమంటావో చెప్పు --" అన్నాను దీనంగా.
    "మెడికల్ కాలేజీకి వెళ్ళి -- ఏ ప్రొఫెసర్నయినా కలిసి --చచ్చిన వాళ్ళను బ్రతికించే మందు కనిపెట్టి ఇమ్మని అడగండి. అలాంటి మందు కనిపెట్టాక అది తెచ్చి నాకివ్వండి--"
    ఇంక సీతతో మాట్లాడి ప్రయోజనం లేదని గ్రహించాను. ఆమె నాకు లొంగదు. కొంతకాలం పాటు ఆమెతో సహజీవనం చేస్తాను. ఆమె భర్తకులా, నేను భార్యా కులా ఉంటాం. అప్పటికీ ఆమెలో మార్పు రాకపోతే అది నా దురదృష్టం.
    "ఈరోజు నుంచీ నువ్వు నా భర్తవు. నాలోని పాత మనిషి కూడా చచ్చిపోయాడు--" అన్నాను సీతతో.
    సీత యేమనుకుందో చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు నాకు సంతోషాన్ని కలిగించేలా లేదు. చచ్చిన పాము పైకి కర్ర ఎత్తిన వాడు నవ్వితే --ఆ నవ్వు బహుశా అలాగే ఉండి వుంటుంది....
    మర్నాడు సాయంత్రం నేను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి సీత చక్కగా అలంకరించుకుని ఉండటమే కాక నావంక ముగ్ధ మనోహరంగా చూసి నవ్వింది. చాలారోజుల తర్వాత సీత నాకు అటువంటి నవ్వును ప్రసాదించింది. ఆనవ్వు నాకు సంతోషాన్ని కలిగించింది. సీతలో మార్పు వచ్చినట్లు అది సూచిస్తుందా?
    ఇద్దరం డ్రాయింగు రూంలోకి వెళ్ళాం.
    ఆ గది అలంకరణ లో మార్పు ఉంది. మాములుగా ఉండే బొమ్మలూ అవీ అక్కడ లేవు. సోఫాలున్నాయి. షోకేసు స్థానంలో ఓ బల్ల వుంది. ఈ బల్ల షోకేసు కంటే కాస్త ఎత్తుగా -- దాని కంటే సన్నగా వుంది. ఆ టేబులు మీద ఒక తాడు వుంది.
    "యేమిటిదంతా?" అనడిగాడు.
    "నాకీ రోజు మీతో సరదాగా ఉండాలని ఉండండి--" అంటూ సీత నా దగ్గరగా వచ్చి నా నడుం చుట్టూ చేయి వేసింది. ఆమె అలా చేయగానే నాకు చాలా ఉత్సాహం కలిగింది.
    సీత నాకు దూరంగా వెళ్ళి పోతున్నప్పట్నించీ , ఆమె అందడం అరుదైన క్షణం నుంచీ, ఆమె నన్ను నిర్లక్ష్యం చేయడం ఆరంభించినప్పట్నించీ పరాయి పురుషులామె ఒంటిపై చేయి వేయాలనుకుని ప్రయత్నిస్తున్నప్పటించీ-- ఆమె పై నాకు ఆకర్షణ పెరగడం మొదలు పెట్టింది. ఆలోచనల్లో కూడా సీతను--" అది" అనుకోలేక పోతున్నాను.
    అప్రయత్నంగా నేనూ ఆమెను దగ్గరగా తీసుకున్నాను.
    ఉన్నట్లుండి సీత చటుక్కున నా పెదాలకు బలంగా స్పుశించింది. నాకు కలిగిన థ్రిల్ ఇంతా అంతా కాదు.
    "సీతా! థాంక్యూ సీతా!"అన్నాను. ఆమె పట్ల నాకు ఆ క్షణంలో కృతజ్ఞతా భావం కలిగింది.
    సరిగ్గా అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ మ్రోగించారు. తలుపు తట్టిన వాడిపై నాకు కలిగిన చిరాకు ఇంతా అంతా కాదు.
    "ఉండండి- నేను వెళ్ళి వస్తాను --" అంటూ సీత నన్ను విదిపించుకుంది.
    నేను ఉన్నపళంగా , నీరసంగా సోఫాలో కూలబడి-- "వచ్చిన వాళ్ళను అలాగే పంపించేసిరా!" అన్నాను.
    సీత అడుగుల చప్పుడు దూరమయింది. నేను అసహానంగా ఎదురు చూస్తూండగా మళ్ళీ అడుగుల చప్పుడు వినబడింది. తలెత్తి చూశాను. ఎదురుగా ....వాడు....దొంగ వెధవ.....
    
                                       12
    ఆ దొంగవెధవ సీత నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుని తీసుకు వస్తున్నాడు. సీత వాడికి దగ్గరగా అంటుకుని పోయి నడుస్తోంది. ఆమె కన్నుల్లో తన్మయత్వం గోచరిస్తోంది.
    "వాటీజ్ దిస్ !" అంటూ అరిచాను.
    "అరవకండి--" అజ్నాపిస్తున్నట్లు గా అంది సీత-- "ఇప్పుడు మీరు నాకు భర్త కాదు, నేను మీ భర్త ను, మీరు నా భార్య. నేను అన్యాయాలు చేయను. ఇతను నేనంటే మోజుపడి వచ్చాడు. మీ దరిద్రపు ముఖాన్ని చూసి యే మగాడైనా మోజుపడితే మీరూ వాణ్ని తెచ్చుకోండి. నేను పడకగదికి వెళ్ళిపోతున్నాను--"
    మ్రాన్పడి పోయాను.
    సీత కావాలనే నన్ను రెచ్చగొట్టి -- అప్పుడు తన ప్రియుడ్ని రప్పించుకుంది.
    నేనేదో మాట్లాడేలోగా ఇద్దరూ పడకగదికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. నేను వినాలనో ఏమో, తలుపులు చాలా గట్టిగా చప్పుడు చేస్తూ వేశారు.
    ఇప్పుడు నేనేం చేయాలి?    
    నా రక్తం మరిగిపోవడం లేదు కానీ అవమానంతో ముఖం కమిలి పోతోంది. మనసు కుమిలిపోతోంది.
    నాపై ఎన్ని దెబ్బలు తీయాలో--అన్ని దెబ్బలు తీసింది సీత! ఇప్పుడు....ఆమె బ్రతుకు బైటపడితే ....పదిమందిని పిలిచి అల్లరి చేస్తే....
    చేసేముందు సీతను హెచ్చరించాలనుకున్నాను. ఆ విధంగా వాడు బైటకు పోయినా నాకు కాస్త తృప్తి కలుగుతుంది. అందుకే మా పడక గదికి పరుగెత్తి తలుపులు తట్టి - "సీతా! పదిమందిని పిలిచి నీ బ్రతుకు బైట పెడతాను, మర్యాదగా బైటకు రా--" అన్నాను.
    లోపల ఎవరో కదిలిన చప్పుడయింది. అడుగుల చప్పుడు తలుపులవతలి వైపు దాకా వచ్చి ఆగాయి.
    "యేమండీ-- మీకింకా బుద్ది రాలేదా? నాకంత తెలీదనుకున్నారా? పదిమందినీ పిలిచి చూడండి. డబ్బు కోసం నా భర్తే నన్ను నలుగురికీ తరుస్తున్నాడంటాను. జనం మీమాట నమ్ముతారో, నామాట నమ్ముతారో చూద్దురు గాని...."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.