Home » Muppala Ranganayakamma » Krishnaveni



    నేను చెయ్యబోయేపని చాలామందిని ముఖ్యంగా నా స్నేహితుల్ని ఆశ్చర్యంతోపాటు ఆనందపరుస్తుంది. వాళ్ళు క్లబ్బులో ఏ పేకాటకో పిలిచినా-సినిమా అంటూ ఆహ్వానించినా-సిగరెట్టు అందించబోయినా మర్యాదగా తిరస్కరిస్తుంటాను. అందుకే వాళ్ళు నన్ను హేళన చేస్తూంటారు-" అలా పర్వతాల పైకి పోతే నీకు జట్టుకి మునీశ్వరులుంటారటరా! మాలాంటివాళ్ళ మద్య ఇక్కడెందుకు చెప్పు? నీకు ఆటలు వద్దు-పాటలు వద్దు. సినిమాలు వద్దు. షికార్లు వద్దు. ఆడదీ వద్దు. ఏదీవద్దు. అందుకే నువ్వెక్కడున్నా ఒకటే. సాయంరమ్మంటావేమిటి అలా పర్వతాలకేసి? అంటూ నవ్వుతారు, నేనూ వాళ్ళతో కలిసి నవ్వుతూంటాను. కాని వాళ్ళు హేళన చేస్తూన్నట్టు నేను మునేశ్వరున్ని కాదు సుమా! నాకు అన్నీ కావాలి. దానికి నాందీవచనం నువ్వే పలకాలి.
    సుస్తీగా బాధపడుతున్నావో -పరీక్షల హడావుడిలో నలిగి విశ్రాంతి తీసుకుంటున్నావో-నన్ను మురిపించాలని సరదా పడుతున్నావో ఎందుకో మరి ఉత్తరం మాత్రం ఆపు చేశావు. నాకు రెండురోజుల్లో ఎటువంటి జవాబూ రాకపోతే నేను బయల్దేరి వస్తాను. నిన్ను చూడాలని అనుకుంటున్నాను.
    ఒక్కమాట! నీకనుసన్నల...... నీ చిరునవ్వుల జీవితమంతా గడిపి వెయ్యాలి- అదె నాకోరిక!
    నీ జాబుకోసం స్వాతి వానకై ముత్యపు చిప్ప ఎదురుచూసినట్లు చూస్తాను.
                                                                                    ప్రేమతో, నీ వాడు,
                                                                                       మాధవ్!
    "నీవాడు మాధవ్!" అస్పష్టంగా గొణుక్కున్నాను. "కాదు మాధవ్! కాదు. నువ్వు నావాడివి కాదు." అంటూ ఏడిచాను. ఉత్తరం చదువుతూన్నంతసేపూ జలజలా రాలుతూన్న కన్నీటి బిందువులు పడి అక్షరాలన్నీ అలుక్కుపోయాయి. మాధవ్ రాసిన అటువంటి రాతలు నాకు కొత్త గాక పోయినా ఆ వుత్తరంలో ఏదో కొత్తదనమే గోచరించింది. వెర్రి మాధవ్ ఇంకా అమాయకంగానే ఆలోచిస్తున్నాడు. ఈ పిడుగు వంటి విషయం ఎలా తెలియ జెయ్యను? అందుకే నేను భయంతో కంపించి పోయాను. కాని తప్పదు, మాధవ్ కి చెప్పుకొని ఏడవటంలోనైనా కొంత మనశ్శాంతి వుంటుంది. మొండి పనులు చేసే నావంటి దానికి మొండి ధైర్యానికేం తక్కువ?
                                                                                              మాధవ్!
    నమస్తే!
    మీ వుత్తరాలు అందుతున్నాయి. జవాబులిచ్చే సాహసంలేక తప్పుకొంటూ వచ్చాను. కానీ ఎన్నాళ్ళు తప్పుకుంటాను?
    ఈ వుత్తరం చదివి ఈ విషయం తెలిసి మీరే మంటారో కూడా ఊహించే ధైర్యం లేదు నాకు. నా పెళ్ళి శ్రీ శ్యామసుందర్ ఎం. ఎ. తో నిశ్చయమైపోయింది. ఎన్నో విషయాలు ఆలోచించిన మీదట ఈ నిర్ణయానికి లొంగిపోవలసి వచ్చింది. ఎక్కువగా చెప్పటానికి నోరు రాదు. క్షమించమని మాత్రం కోరలేను.
                                                                                         కృష్ణవేణి!


    మొండిధైర్యంతోనే ఆ వుత్తరం పోస్ట్ చేయించాను. ఏక్షణానో ఏదో భూకంపంవంటి ఆపద విరుచుకు పడుతుందని ఎదురు చూశాను. అనుకున్నట్టే అయింది. మాధవ్ జవాబు రాశాడు.
    కృష్ణవేణికి!
    నీ వుత్తరం చదివాను. నాకేమీ అర్ధం కావటంలేదు. ఆలోచిస్తున్న కొద్దీ నువ్వురాసిన విషయం నిజమేనేమో నన్న అనుమానం బాధిస్తోంది. ఈ విషయం గురించి ఇక్కడ ఏమీ ఆలోచించదలచలేదు. రెండు రోజుల్లో బయల్దేరి వస్తున్నాను. నన్ను పార్క్ లో కలుసుకొని నువ్వు చెప్ప వలసిందేమిటో చెప్పు, నన్ను నీ ఇష్ట మొచ్చినట్టు ఆడించాలని మాత్రం అనుకోకు.
                                                                                    మాధవ్ రావ్!
    మాధవ్ కి కోపం వచ్చింది. అవును వస్తుంది. నేను ఆడుతూన్న నాటకానికి మనిషైన ఏ వ్యక్తి కైనా కోపం వస్తుంది. అసహ్యం వేస్తుంది. ఏం చెయ్యను? అనుభవించాల్సిందే.
    కాని మాధవ్ వస్తాడు ఒక్క రోజులో ఎలా మొహం చూపించను? ఏమని సంజాయిషీ లు చెప్పను? అసలు ఎన్ని గుండెలతో మాధవ్ కెదురు పడను? నాకేమీ తోచటం లేదు. నేను మాధవ్ ని కలుసుకోలేను. ఆ కళ్ళలోకి చూడలేను. ఏది ఏమైనా పార్క్ కి వెళ్ళను. మాధవ్ ని కల్సుకోను.
    మర్నాటి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతాన......
    నీ దగ్గి రెవరైనా వున్నారా? సాయంత్రం పార్క్ కొస్తున్నావ్ కదూ?"
    "క్షమించాలి. నా ఒంట్లో ఏమీ బావుండటం లేదు, నేను ఎక్కడికీ రాలేను."
    "నిజంగానా? అయితే ఇప్పుడే మీ ఇంటి కొస్తాను."
    "ఒద్దు. ఒద్దురావుగారూ! రేపునేనే వస్తాను."
    "కృష్ణవేణీ! చాలా చిత్రంగా మాట్లాడుతున్నావ్. నీలో అనుకోనంత మార్పు గోచరిస్తోంది. ఏమిటిదంతా? రేపటి వరకూనా? వీల్లేదు. చాలా విషయాలు మాట్లాడాలి. సాయంత్రం పార్క్ కి రా . లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను."
    "అవసరం లేదు. సాయంత్రం నేనే వస్తున్నాను."
    మాధవ్ మరేదో చెప్తున్నా విన్పించుకోకుండా రిసీవర్ పెట్టేసి నా గదిలోకి వెళ్ళి పోయాను....మరి కొన్ని గంటల్లో మాధవ్ కెదురుపడి విషయం చెప్పుకోవాలి. ఏమని? నాకే తెలీదు. మాధవ్ చాల కోపంతో - ఆవేశంతో వున్నాడు. వెళ్ళి ఏం మాట్లాడను? ఏమీ పాలుపోక అర్ధం లేని విషయాలేమిటేమిటో ఆలోచిస్తూ కూర్చున్నాను. క్రిందటి సారి తహతహతో పలువిధాల అలంకరించుకోని-పొంగి పొరలుతూన్న భావాలు, గుండెల్లో దాచుకొని- సిగ్గు దొంతరల ముసుగు కప్పుకొని-అభిసారికనై అడుగుతీసి అడుగువెయ్యటమే భారంగా వెళ్ళి చేరాను. కాని ఇప్పుడు ఏం చెప్పను? చేతులతో మొహం కప్పుకున్నాను.

                              *    *    *

                      

    హోటల్ దిల్ కుష్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరు పిలిచేదీ నాకు తెలుసు, మాధవ్ వచ్చాడనుకొంటే ఒళ్ళు జల్లుమంది-"ఇప్పుడు కిందికి రాలేను వదినా! లేనని చెపుదూ!" అంటే వదిన వెళ్ళిపోయింది. దుఃఖం ముంచుకొచ్చింది. మాధవ్ తో మాట్లాడాలని తహతహలాడిన నేను ఇప్పుడు మాధవ్ ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా?
    అరగంటలో వదిన మళ్ళా పిలిచింది-"ఒక సారి మనింటికొచ్చిన లెక్చరర్ మాధవరావట కృష్ణవేణీ! మళ్ళా పిలుస్తున్నాడు. వచ్చికొంచెం చూడకూడదూ?" అంది.
    గత్యంతరం లేక గుబగుబలాడుతూన్న గుండె లతో వెళ్ళాను. రిసీవర్ అందుకొంటూంటే చేయి వణికింది. మొండిధైర్యంతో నిలబడ్డాను. -"హల్లో! ఎవరండీ?"
    "కృష్ణవేణీ! నువ్వేనా మాట్లాడేది? నువ్వే కదూ?"
    "అవును నేనే కృష్ణవేణిని మీరు..."
    "మాధవ్ ని వేణూ! పోల్చలేకపోతున్నావా? అరగంట క్రిందటే వచ్చాను. వస్తూనే నీకు ఫోన్ చేశాను. నువ్వు లేవని చెప్పారు. ఎక్కడి కెళ్ళావ్? ఈ అరగంటా నువ్వూ వచ్చి పిలుస్తావే మోనని ఫోన్ దగ్గిరే కూర్చున్నాను. నావుత్తరం అందింది కదూ?"
    "అందింది."
    "ఎందుకంత పొడిగా మాట్లాడుతున్నావ్ కృష్ణవేణీ"
    "ఏమీ లేదు మాధవ్..... సాయంత్రం పార్కులో కలువు. వివరంగా మాట్లాడు కుందాం!" అని ఫోన్ పెట్టేసింది.
    
                            *    *    *

    మాధవ్ ని చూసేసరికి గూడుకట్టుకొన్న శోకమంతా పెల్లుబికింది. మాధవ్ చేతుల్లో వాలి బావురుమన్నాను.
    "ఏమిటిది? ఎందుకిలా అయిపోయావ్ కృష్ణవేణీ? ఎంత చిక్కిపోయావ్! ఏమిటి దంతా?" అంటూ మాధవ్ విస్మయంతో అడుగుతూన్న కొద్దీ వెక్కివెక్కి ఏడిచాను-"నన్ను క్షమించు మాధవ్! క్షమించు మాధవ్!" అంటూ మనసు ఘోషపెట్టింది.
    "ఎందుకిలా మారిపోయావు? ఏమీ చెప్పవు? నాకెలా తెలుస్తుంది? మన విషయం ఇంట్లో తెలిసిందా? మీవాళ్ళేమైనా గొడవ చేశారా? చెప్పు కృష్ణవేణీ!......ఛ! తప్పుకదూ? ఎందుకీ కన్నీళ్లు?" మాధవ్ ఓదార్చుతున్నాడు.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.