Home » Muppala Ranganayakamma » Krishnaveni



    ఆశ్యామసుందర్ ని మాత్రం ఎలా మోసం చెయ్యను? ఇన్నాళ్ళూ భర్తగా ఒక వ్యక్తిని వూహించి ఇప్పుడు మరోవ్యక్తి నెలా స్వీకరించను? జీవితమంతా ఎలా నటించను? పాపం కాదా? పాపం అనేది వేరే వుంటుందా? - అనుకొని కుమిలిపోయాను. ఆ రాత్రి నిద్రరాలేదు. తెల్లవార్లూ అంతులేకుండా ఏడిచాను. మర్నాటి సాయంత్రం రేణు వచ్చింది. దానికి వదినావాళ్ళు కిందే అశుభవార్త కాస్తా అందజేశారట-"పెళ్ళంటారేమిటి కృష్ణవేణీ?" అంది నాతో. నాకు తెలిసినంత వరకూ చెప్పాను.
    "ఈ పరిస్థితిలో ఏం పెళ్ళి లెద్దూ! కొన్నాళ్ళు మామూలుగా వుంటే మనసులో గొడవలన్నీ మర్చిపోవటానికి వీలవుతుంది. అప్పుడేమైనా చెయ్యొచ్చు. ఎమ్మెస్సీలో చేరదాం. చదువు మానుకోటం దేనికి?" అంది. రేణుకి చదువు ఆపుచెయ్యాలని ఎన్నడూ లేదు. ఎమ్మెస్సీ చదవాలని ఎన్నాళ్ళనుంచో అంటూనే వుంది. దానికి ఎవరింటోనూ అభ్యంతరాలు లేవు. కాని నేనే ఆ సంవత్సరంలో చదువు చాలించాలని అనుకున్నాను. ఆ సంగతే ఇంట్లోనూ చెప్పాను. అందుకే అన్నయ్య పెళ్ళంటూ తలపెట్టాడు.
    "ఎవరికీ అనుమానాలు రాకుండా ఈ పెళ్ళి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం." అంది రేణు.
    "తప్పించుకొని ఏం చెయ్యమంటావ్?" మామూలుగా అన్నాను.
    "అయితే పెళ్ళి చేసుకోవాలని వుందా?"
    "చేసుకోవాలనీ లేదు. తప్పించుకోవాలనీ లేదు."
    "అయితే మీవాళ్ళకేం సమాధానం చెప్తావు?"
    "నేనొకటి తేల్చుకుంటే గదా వాళ్ళకి చెప్పటానికి? ఏమో! ఏమవుతుందో." అని వూరుకున్నాను.
    మర్నాడు శాంత వచ్చింది.
    "మీ స్నేహితురాలికి పెళ్ళమ్మోయ్!" అంటూ ఆ వార్త కాస్తా దాని చెవినా వేసింది వదిన. శాంత వదిన్నే వివరాలడిగి తెలుసుకుంది. ఇద్దరం పైకి వెళ్ళాం.
    "ఏమిటీ నీ వుద్దేశ్యం?" అంది.
    "నేనేం అనుకోవటం లేదు శాంతా! ఈ సంగతి రేణుకి చెప్తే ఇప్పుడు పెళ్ళేమిటి? ఎమ్మెస్సీ పూర్తిచేద్దాం అంది. ఏమో! నాకు చదువుమీదా లేదు. పెళ్ళిమీదా లేదు." కళ్ళలో తిరిగిన నీళ్ళు ఒత్తుకున్నాను.
    "ఇప్పుడింకా నువ్వు చదువు సాగించటం ఏవిధంగానూ మంచిది కాదు. మనశ్శాంతి లేకుండా చదవనూ లేవు. అనుకున్నట్టు మాధవ్ ని మర్చిపోనూలేవు. అరుణకి విడాకులిస్తాననీ నిన్ను పెళ్ళి చేసుకుంటాననీ మాధవ్ అడిగితే అడగొచ్చు. నీకుబడి ఒక ఆడది వుసూరుమంటే నువ్వు సుఖపడిపోయేదేమిటి చెప్పు? అలాని ఇద్దరూ వుండట మనేది సాధ్యంకాదు గదా?.....నాకు మాత్రం ఈ పెళ్ళిచేసుకోవటం చాల వుత్తమంగా తోస్తూంది కృష్ణవేణీ! శ్యామసుందర్ నీకన్ని విధాలా నచ్చితేమాత్రం ఇక అనుమానం అనవసరం. మాధవ్ ని మర్చిపోవాలీ అంటే మరో వ్యక్తి ధ్యాసలో మునిగిపోవాలి. ఆదిలో కష్టం అని పించినా రానురాను నువ్వే ఓర్చుకోగలుగుతావు. అంతేగానీ ఒంటరిగా వుంటే మాత్రం మాధవ్ ని మర్చిపోవటం నీకు సాధ్యంగాదు. ఆలోచించు చూడు." అంది శాంత. కాస్సేపు కూర్చుని శాంత వెళ్ళిపోయింది. కొత్తగా ఆలోచించేదేమిటి? ఎప్పుడూ లక్షలాది ఆలోచనలు తలలో తిరుగుతూనే వుంటాయి. మాధవ్ ని మర్చిపోలేని కారణం తప్పితే శ్యామసుందర్ ఏవిధంగానూ అయోగ్యుడు కాదు. కానీ ఎంతటివాళ్ళ యినా మాధవ్ కి సాటిరారు. నా దృష్టిలో మాధవ్ కి మాధవేసాటి. ప్రేమమయుడైన మాధవ్ ని దూరంచేసుకొంటున్నా నేనెంత దౌర్భాగ్యురాలిని  ప్రభూ! ఇక భాగ్యమనేది ఆ బ్రతుకులో ఏదైనా వుంటుందా?
    ఆ రాత్రే వదిన అడిగింది- "మీ అన్నయ్య వాళ్ళకి వుత్తరం రాస్తారట. ఎన్నిసార్లడిగినా చెప్పవు, ఇదేం చోద్యమమ్మా? ఇన్నాళ్ళు ఆలోచించుకోవాలా?"
    "మీ ఇష్టం వదినా! నా అభ్యంతరం ఏం లేదని అన్నయ్యకి చెప్పు."
    "అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి చెప్తున్నావా?"
    "చెప్పానుకదా? ఇంకా ఎందుకా గొడవ?
    "అయ్యో! రాజాలాంటి మొగుణ్ణి తెస్తుంటే మామీద చిరాకు పడతావేమిటి? కొన్నాళ్ళు ఆగు. ఆ చిరాకులూ ..... పరాకులూ తీర్చుకునేవాళ్ళ మీదే తీర్చుకొందువుగాని....."  అంటూ నవ్వి వెళ్ళిపోయింది వదిన.
    సముద్రపు కెరటాల్లా ఏడుపు పొంగుకొచ్చింది. కావలసినంత సేపు ఏడవటం మాత్రం చేతనైంది. వదిన చేసిన హాస్యాలన్నీ మనసుని రంపపుకోత కోశాయి. తెలీక వదిన అలా అనగలిగిందిగానీ నా పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు పెట్టుకొంటుంది. ఎవరికీ చెప్పి మాత్రం ఏం ప్రయోజనం? భగవంతుడు కూడా నాకు ఓదార్పు కల్గించలేదు..... అన్నిటికీ కారణం. నేను అదృష్టవంతురాల్నికాను. వదినని తల్చుకొని-"ఎంత అదృష్టవంతురాలివమ్మా! ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నావు. ఎవరికో ప్రేమభిక్ష పెట్టావు. ప్రతిఫలం అనుభవిస్తున్నావు." అనుకున్నాను.
    శ్యామసుందర్ తో పెళ్ళికి అంగీకరించాను.-అనుకొంటే నాలో పరివర్తనకి నేనే అమితంగా ఆశ్చర్యపోయాను. నేను శ్యామసుందర్ భార్యని. మాధవ్ నాకు పరాయివాడు. అయోమయంలో శిలలా స్తంభించిపోయాను.
    మాధవ్ దగ్గిర్నుంచి వుత్తరం వచ్చింది-మాధవ్ వుత్తరాలకి జవాబులు రాయటంలేదు నేను. వణుకుతూన్న చేతులతో వుత్తరం విప్పుకో లేక ..... మాధవ్ ఏం రాశాడో చదివే ధైర్యం లేక చాలాసేపు కూర్చున్నాను. ఇక మాధవ్ ప్రేమతో రాసే వుత్తరాలు కావాలన్నా చదువుకోలేను. పోనీ ఇప్పుడైనా ఈ లేఖ చదువుకుంటాను. అనుకొని ఆతృతగా వుత్తరం విప్పాను. మాధవ్ రాసిన అక్షరాల బారులు ముత్యాల మాలల్లా లేతాకుపచ్చ కాయితం మీద మిలమిలా మెరిసిపోతున్నాయి.
    ప్రేయసీ!
    ఏమిటీ మౌనం? అలిగావా? ఆ సంగతైనా నాకు తెలియకపోతే ఎలా బ్రతిమాలుకో గలను దేవీ? ఏ క్షణాన్నో, ఏ ఘడియనో, ఏదో సందేశం అందజేస్తావని ఎదురు చూస్తున్న కొద్దీ దూరం చేస్తున్నావు. నా ఆరాటం నీకెలా అర్ధమవుతుంది? నిన్ను స్మరించని క్షణం-నిన్ను ధ్యానించని ఘడియవుందా? సదా జాగ్రదావస్థలో, నిద్రావస్థలో ఛాయగా వెన్నంటుతున్నావే! ఎన్నాళ్ళిలా వూహలతో కాలం గడపను వేణూ? ఇకనాకు సాధ్యం కాదు. ఇంకా నీకు దూరంగా క్షణం కూడా వుండలేననిపిస్తున్నది. ఎంత తొందరగా నిన్ను నాదగ్గరికి చేర్చుకుంటానా-ఎంత తొందరగా ప్రేమలోకాలలో షికార్లు చేద్దామా-అని ఒకే తహతహ! ఆబంగారు క్షణం ఇంత దగ్గిరలో వుందనుకొంటే మనసు ఏమిటో అయిపోతుంది వేణూ!
    వెన్నెల్లో ఏదో మాధుర్యం వుంటుందంటారు. విన్నదేగాని అనుభవించింది లేదు, కాని అది నిజమే నేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మల్లెపువ్వులా విచ్చుకొంటున్న పండు వెన్నెల్లో పడుకొని చందమామలోకి చూస్తూంటే నీరూపమే సాక్షాత్కరిస్తుంది. చేతులు జాపుతూన్నకొద్దీ బెట్టు చేస్తావు. నేను బాధపడితే చూసి సంతోషించాలని పిస్తుంది నీకు. కాని నువ్వలా ఆకాశంలో కూర్చుని మురిపిస్తూంటే నక్షత్రాలలో నక్షత్రం లా మెరిసి పోతూంటే చూసి సంతృప్తి పడటం నాకు సాధ్యం కాదు. 'నిన్నందుకోలేనివాడిని వేణూ! నన్ను కరుణించి దిగిరావూ?' అనుకుంటాను. ఎందుకో నాకళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. "తప్పు మాధవ్! వచ్చేశాను కదూ? ఎప్పుడూ ఇక్కడే వుంటాను", అంటూ నన్ను నీ హృదయానికదుముకొని కన్నీరు తుడిచి నట్లు అనుభూతి చెందుటాను. నువ్వు దగ్గిరుంటే నేనెన్నడూ కన్నీళ్లు కార్చను వేణూ! శాశ్వతంగా నాకన్నీరు తుడిచి నన్ను నవ్వించ గలదానివి నువ్వే కృష్ణా!
    మన ప్రణయానికిక్కడ ప్రకృతి కూడా శోభనిస్తుంది. ప్రతీ సంధ్యాసమయం అలా ప్రకృతి మాత ఒడిలో షికార్లు చేస్తాం. ఎత్తైన చెట్లూ-పచ్చికపరుపులూ-రాతిగుట్టలూ ..... ఆటలకీ, దాగుడు మూతలకీ కోరుకున్నన్ని అందాలు పచ్చిక పరుపులో పడుకొని కబుర్లు చెప్పుకుంటూ సూర్యాస్తమయం చూస్తూ గడపాలని లేదూ నీకు? ఎంత బుజ్జగించి అడిగినా ప్రతీ విషయం గుట్టుగా దాచుకుంటావు. కాని నీమనసు నాకు తెలుసు వేణూ! అందుకే నేనింత ఆరాట పడేది. మనం కలిసి వుంటే ప్రతీ రాత్రి కోయిల కూస్తుంది-వెన్నెల పూస్తుంది. కానీ వెన్నెల నీ కన్నా తెల్లగా వుంటుందా? కోయిల నిన్నుమించి మధురంగా పాడుతుందా? లేదు కదూ? వెన్నెల అందం-కోయిల కంఠం నీలోకే వచ్చి చేరుతాయి....నీతో ఏది పోటీపడినా పరాజయం పొంది తలదించుకొంటుంది. నేనూ అంతే మరి.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.