Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "నా పాదాలు కళ్ళకి అద్దుకుంటా వేమిటి ఛఛ" అంటాడతను.

    "నా దేవుడెవరో నాకు మీకన్నా బాగా తెలుసులెండి" అంటుంది ఆమె.

    "ఈ పూజలూ, ఉపవాసాలూ ఏమిటి కామీ? నీ ఆరోగ్యం పాడైపోతుంది" అంటాడతను. ఆమె అతనిని చూసి జాలిగా నవ్వి ఖాతరు చెయ్యదు.

    ఏమైనా తర్వాత రోజునుంచీ ప్రసాదరావు మారిపోయాడు. భార్యని చూడగానే అతనికో అసూయ అనుకోకుండా కలిగేది. అతనిలో భయం పెరగజొచ్చింది. డాక్టర్లకి చూపించుకొంటాడు. వాళ్ళు కొంచెం బ్లడ్ ప్రెషర్ ఉందనో లేదనో మరోహటో ఏదో అంటారు. దానితో అతనికి మతిస్థిమితం పోతుంది. ఇప్పుడతను ఆహార విహారాలు చాలా నియమంగా చేస్తున్నాడు. చప్పిడి తింటున్నాడు. రాత్రుళ్ళు నిద్రకోసం అప్పుడప్పుడు మాత్రలు మింగుతున్నాడు. భార్యని కసురుకొంటున్నాడు. ఆమె పక్కన ఉంటే అతనికోవిధమైన బాధా, అసూయా, పైబడుతూన్న వయస్సూ అన్నీ జ్ఞాపకం వచ్చి పిచ్చివాడైపోతున్నాడు. అతను కసురుకున్న కొలదీ కామేశ్వరి మరీ ఓర్పుగా ఉంటోంది. చిరునవ్వుతో, లాలనతో అతన్ని మరిపించాలని చూసేది. "మీరు కూడా వచ్చి నాతో పూజచేయండి. ఈ సంశయాలు బాధలూ ఉండవు" అనేది. నిజమే ఏమో అనుకునేవాడు. కాని ఇంతలోనే అతని శాస్త్రీయ దృక్పథం అడ్డువచ్చేది. హేళన చేసేవాడు. ఆమెనీ ఆమె విశ్వాసాల్ని ఏదో తెలియని కసితో.

    ఆరునెలల్లో మరికొన్ని వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. ప్రసాదరావుకి అద్దంలో చూసుకోవడమే భయంగా ఉంది. లోపల్లోపల పెరుగుతూన్న అసంతృప్తినీ అస్థిమితత్త్వాన్నీ కోపం నిర్దయగా మార్చి భార్యమీద, నౌకర్లమీద, రైతులమీద, మిల్లుకూలీలమీద చూపించేవాడు. హఠాత్తుగా ఒకనాడు అతని భార్య తెలివితప్పి కిందపడిపోయిందని ఫోన్ లో చెప్పినప్పుడు ఆఫీసునుంచి ఇంటికి పరుగెత్తుకు వెళ్ళాడు. ఆమె పెద్ద మంచం మీద దిండ్ల నానుకొని పడుకుని ఉంది. డాక్టరూ ఆ ఇంటి నౌకర్లూ అక్కడే ఉన్నారు - "ఏమైంది డాక్టరు?" అని ప్రసాదరావు గాభరాగా అడిగాడు.

    "ఈమెకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. న్యూమోనియా అని అనుమానిస్తున్నాను" డాక్టరు తల పంకించి చెప్పాడు.
 
    "ఏం ప్రమాదం లేదుకదా!"

    "ఈమె గుండెకూడా సరిగా పనిచేయడంలేదు. ఔను కాని ప్రసాదరావు గారూ! మీరీమె విషయంలో ఏశ్రద్ధ తీసుకోనట్టు తెలుస్తోంది. ఈమె రోజురోజూ ఉపవాసాలు, స్నానాలూ చేస్తున్నారట. మీరెందుకని వారించలేదు" .అని ప్రశ్నించాడు డాక్టరు.

    నిజమే తాను పట్టించుకోలేదు. కాని ఆమె చేసే స్నానాలు, పూజలూ, వ్రతాలూ, ఉపవాసాలూ తనకోసమే. నిజంగా తన కామేశ్వరి తనకోసమే ఏం చేసినా! స్వార్ధం ఒకింత కూడా లేని ఆమె గృహిణి జీవితం అతని కళ్ళకు కట్టింది. అతనిలో ఏదో పశ్చాత్తాపం బాధా వెల్లువై ఉబికాయి. ఆమెతో పోల్చుకుంటే తనెంత అల్పుడుగా గోచరిస్తాడో కూడా తెలుసుకున్నాడు.

    కామేశ్వరి కళ్ళు తెరచి అటూ యిటూ చూసింది. తనని చూసి నీరసంగా చిరునవ్వు నవ్వి "నాకేం భయంలేదు. మీరు వెళ్ళి భోంచెయ్యండి. ఇప్పటికే ఆలస్యమైపోయింది" అంది.

    ఇప్పుడూ - ఇంత జ్వరం తీవ్రతలోనూ తనని గురించే ఆమె ఆందోళన! ప్రసాదరావు సిగ్గులో పశ్చాత్తాపంలో కూరుకుపోయాడు. ఆమె దగ్గర కూర్చొని నొసటిమీద కురుల్ని సవరిస్తూ "కామీ! నీకు నయమయే దాకా ఇంకొక పని ఏదీ చూడను. నీ దగ్గరే ఉంటాను" అన్నాడు. ఆమె స్నేహ పిచ్ఛిలంగా నవ్వింది.
 
    వారం రోజులైనా జ్వరం తగ్గే సూచనలేమీ కనబడలేదు. ఆమె హృదయ పరిస్థితి భయావహంగా ఉందని చెప్పాడు  డాక్టరు. ప్రసాదరావుకి అన్నం సయించదు, నిద్రపట్టదు. అలాగే ఆమెను కనిపెట్టుకుని కూర్చున్నాడు. ఆమెకి ధైర్యం చెబుతూన్నాడు.

    "నాకేమీ భయంలేదు. అన్నింటికీ త్రిపురసుందరే ఉంది. మీరు నా ఎదురుగా ఉన్నారు. నా కొడుకున్నాడు. నాకు కావలసిందేముంది? ఇంక చనిపోయినా సరే......."

    చప్పున ఆమె నోరు మూశాడు ప్రసాదరావు. అంత ఆందోళనలోనూ అతనికొక ఆశ్చర్యం కలిగింది. ఆమెలో వున్న నిబ్బరం! ఆమె తన జబ్బుని గురించి తన పరిస్థితిని గురించి ఏమాత్రం భయంలేదు. ఒక్క తెల్లవెంట్రుక కనపడగానే తాను చలించిపోయాడు. ఆమె ఆసన్న మృత్యువుకికూడా కొంచమైనా కంగారుపడదు. బాధపడదు. భయపడదు. నిశ్చల సరోవరంలాగా నిర్మలంగా ఉంది! ఏ అఖండ విశ్వాసం, ఏ రహస్యం ఆమెకీ శక్తినిచ్చింది? ఇంత విజ్ఞానంతో, శాస్త్రీయ దృక్పథంతో కూడా తానెందుకింత చపలుడూ, దర్భలుడూ అయిపోయాడు?
 
    ఒకనాడు ఉదయమే కామేశ్వరి భర్తని పిలిచింది. ఇద్దరు డాక్టర్లు ఆమె మంచం ప్రక్కనే ఉన్నారు. ప్రసాదరావు ఏడుపునాపుకుంటూ ఎర్రని కళ్ళతో చూస్తున్నాడు.

    "చూడండి" అంది నీరసంగా కామేశ్వరి. "నా నొసట మీ చేత్తో కుంకుమ పెట్టండి" అంది.

    ప్రసాదరావు వొణికే చేతులతో ఆమె ఫాలాన బొట్టుపెట్టాడు. ఆమె తలను తన వొళ్ళో పెట్టుకున్నాడు. "కామీ! నన్ను అన్యాయం చెయ్యకు" అని ఏడ్చాడు.

    ఆమె కళ్ళు తెరచి పాలిపోయిన పెదాలమీద చిరునవ్వు వెలుగుతూండగా ఇలా అంది. "నేను మీకు చెప్పాను కదూ! పసుపు కుంకుమలతో నేనే మీ సెలవు తీసుకుంటానని, త్రిపురసుందరి నాకు అన్యాయం చెయ్యదు"

    ఆమె వదనంలో శాంతమూ, తృప్తీ అలముకొని ఉన్నాయి. అవిశ్వాసి అయిన ప్రసాదరావు రెండు చేతులెత్తి పైకి నమస్కరించి "ఓ భగవంతుడా! నా భార్యని బ్రతికించు" అని ఆక్రోశించాడు.

    డాక్టర్లు క్షణంక్షణం మందులిస్తూ, యింజెక్షన్లు యిస్తూ మృత్యువుతో కుస్తీపడుతున్నారు. ప్రసాదరావు లేచి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని కామేశ్వరి పూజామందిరంలోకి వెళ్ళి త్రిపురసుందరి ముందు మోకరిల్లాడు. కన్నీళ్ళతో ఆమెని వేడుకొంటున్నాడు. ఇంతలో కెవ్వనికేక నలుగురూ ఏడ్చిన ధ్వని -ప్రసాదరావు స్పృహతప్పి త్రిపురసుందరి పాదాగ్రాల వద్ద పడిపోయాడు.

                                                         (రేడియోలో ప్రసారితం)

                                             (ఆనందవాణి - తిలక్ సంచిక, 1969)

                                                             *********




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.