Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "ఏమిటండీ అలా చూస్తున్నారు నా మొహాన్ని" అంది కామేశ్వరి.

    ప్రసాదరావులో ఏదో అసూయ కదలింది. ఆమెకీ తనకు గల వ్యత్యాసం కొట్టవచ్చినట్టు కనబడుతోంది. తమ ఇద్దరి మధ్యా వయస్సులో గల తేడా కూడా గుర్తుకువచ్చి అతని ప్రాణం గిజగిజలాడింది. ఎనిమిదేళ్ళు వ్యత్యాసం ఉంది తమ ఇద్దరి వయసులో . ఆమెకు ముప్పైరెండు ఏళ్ళు. అయినా చిరాకులూ బాధ్యతలూ తనకున్నంతగా లేనందువల్ల కాబోలు ఆమె యింకా నాలుగేళ్ళు చిన్నదిగా కనబడుతోంది. ఆమె బుగ్గల్లో, భుజాల్లో ఆరోగ్యపు నిగనిగ ఉంది. అతని మొహంలో వయసు పెరిగిన తాలూకు చారలు తొంగి చూస్తున్నాయి. అతను నీరసంగా విషాదంగా నవ్వి మంచంమీద చతికిలబడ్డాడు. ఆమె అతని దగ్గరగా నుంచొని జుట్టులోకి వేళ్ళుపోనిచ్చి గోముగా అంది. "ఏం అలా ఉన్నారు దొరగారు?"

    అతను నిట్టూర్చాడు. "ఇదిగో యిలా రా" అని ఆమెని అద్దం ముందుకు లాక్కువెళ్ళి నిలుచున్నాడు. తన నొసటిమీద ఉన్న తెల్లవెంట్రుకల్ని చూపించి  "చూడు" అన్నాడు ఆమె కిలకిల నవ్వింది. "అయ్యో ముసలి మొగుడు" అని సాగదీసింది నవ్వులాటగా హేళన చేస్తూ. కాని అతనికి బాధకలిగింది. మళ్ళీ అసూయ ప్రజ్వరిల్లింది. ఒకే జీవనయాత్ర చేస్తున్న తమ యిరువురిలో వ్యత్యాసం యింతగా ఉండడం సబబు కాదనిపించింది. కళ్ళు మూసుకొని మంచంమీద పడుకున్నాడు. బాధగా నిట్టూర్చాడు.

    ఆమెకి పెట్టి పోషించేందుకు తానున్నాడు. నౌకర్లున్నారు. వంటవాడున్నాడు ఆమెకి ఏ విషయంలోనూ నలిగిపోవల్సిన అవసరం లేదు. చివరికి ఆమెకు కాన్పులు కూడా ఎక్కువలేవు. ఒకడే కొడుకు. బుద్దిగా చదువుకొంటున్నాడు. ఆమె కోరిక కోరికలన్నీ తీరుతున్నాయి. రేడియో, సినిమా, పేరంటం, వ్రతాలూ, ఆమెకి అంతా కాలక్షేపమే. ఆమె ఉపవాసాలుంటుంది. నిజమే -కాని అవి ఆమె ఆరోగ్యాన్ని మరింత సంరక్షిస్తున్నాయి. అతనికి ఏదో బెంగపుట్టింది.  "కామీ" అన్నాడు బాధగా.

        "ఏవండీ" అంది కామేశ్వరి సిగలో పువ్వులు సర్దుకుంటూ.

    "ఇక నేను ఎక్కువకాలం బ్రతకను -నేను ముసలివాణ్ణయి పోతున్నాను" అన్నాడతను. ఆమె వింతగా భయంగా అతనివైపు చూసింది.

    "నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది. నాకు తెలుసును" ఆమె వెళ్ళి అతనిపక్కన కూర్చొంది. "ఛఛ - ఏమీలేదు - మీకు -నూరేళ్ళాయిష్షు నాకు తెలుసును" అంది.

    "నేగనక పోతే నువ్వొక్కత్తెవూ బాబుని పెంచుతూ ఉండగలవా" అన్నాడు. అతను గద్గదికంగా. ఆమె అతన్ని హత్తుకుంది. "ఏఁవిటి యిలా పిచ్చివారైపోతున్నారు యివ్వాళ? అసలు ఏమొచ్చింది?" ఆమె సాలోచనగా నిశ్చయంగా అంది. "నేను ముందుపోతాను. నాకు తెలుసును.పసుపు కుంకుమలతో నేను పునిస్త్రీగానే చచ్చిపోతాను!"

    "ఏడిశావ్!"

    "నిజం - త్రిపురసుందరి నన్ను అన్యాయం చెయ్యదు, మీకేం ఫరావాలేదు. అయినా ఒక్క తెల్లవెంట్రుకకి యింత బేజారెత్తిపోతున్నారేమిటీ! మా పినతండ్రి కొడుక్కి పాతికేళ్ళు రాకుండానే జుట్టంతా తెల్లబడిపోయింది.!"

    "కాని నా విషయం వేరు. తెల్లవెంట్రుక నాకు సూచన కామీ, నా ఒంట్లో ఉన్న సత్తువ క్రమంగా హరించుకుపోతుంది!"

    "ఎప్పుడూకాదు. నా దేవతమీదా నా పూజమీద నాకు నమ్మకముంది. త్రిపురసుందరి ఎన్నోసార్లు కలలో కనబడి నాకు చెప్పింది-" ఆమె గొంతులో విశ్వాసం ఖంగని మ్రోగింది.

    "మూఢనమ్మకం" అన్నాడతను.

    "ఇదిగో యిలా అంటే అలా అంటారు. పోన్లెండి బాబూ, నా నమ్మకాలు నావి. మీరు పడుకోండి. వెర్రి మొర్రి ఆలోచనలు పెట్టుకోక. ఛా, ఇంత భయస్థులనుకోలేదు మీరు-" ఆమె అనునయంగా మాట్లాడి అతని పాదాలు నొక్కుతోంది.

    ప్రసాదరావు కళ్ళుమూసుకొన్నాడు. అతను కొంచెం సిగ్గుపడ్డాడు తన ఆవేశానికి భయానికి. కాని తన భార్యకున్న విశ్వాసం తనకిలేదు. తన ఉద్దేశ్యంలో ఆమె మంచిది, శీలవతి, సద్గృహిణి - అన్నిటికన్నా ఆమె మూఢురాలు. తనకి దేవుడూ మతాలూ పూనకాలూ తావేదులూ -ఇలాంటి వాటిమీద నమ్మకంలేదు ఆమెకి అన్నీ నిజాలు. గడ్డం పెంచుకున్న ప్రతీ బైరాగిలోనూ ఆమెకి మహత్తు గోచరిస్తుంది. ప్రతీ పఠంలోనూ దేవుణ్ణి చూస్తుంది - వ్రతాలు చేస్తుంది. ఉపవాసాలుంటుంది. తననీ తన కుటుంబాన్నీ దేవుళ్ళు వేయికళ్ళతో కనిపెట్టి రక్షిస్తున్నారని ఆమె నమ్మకం. దేవుళ్ళూ దేవతలూ ఆమెకి కలల్లో కనపడి ఆమెకి వరాలు అడిగినన్నీ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. ఆమెలో ద్వైదీభావం లేదు. సంశయంలేదు. అందుకే ఏమో ఆమె ఎప్పుడూ హాయిగా నిశ్చలమైన సరోవరం లాగుంటుంది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.