Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    వాడు-- ఆ దొంగ వెధవ.
    "నేను వెళ్ళిపోతున్నాను. సీత బట్టలు కట్టుకుంటుంది--" అని వాడు అక్కణ్ణించి మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు.
    నాలో సంతరించుకోబోయిన చేష్టలు మళ్ళీ ఆగిపోయాయి. వాడు వెళ్ళిన ఒక్క నిముషానికి లోపలకు పరుగెత్తాను! తలుపు గడియ వేయాలన్న ధ్యాస కూడా నాకు కలగలేదు. నేను లోపలకు వెళ్ళేసరికి పడకగదిలో సీత చీతకు కుచ్చేళ్ళు దోపుకుంటోంది! నన్ను చూసి తాపీగా -- "ఈరోజు పెందరాళే వచ్చేశారే?" అంది.
    ఆవేశం తారాస్థాయి నందుకుంది నాకు! సాచి లెంపకాయ కొట్టాలనిపించింది. కానీ ఆమెను సమీపించనైనా లేదు నేను. అలా దూరంగానే నిలబడి -- "యేమిటిదంతా?" అన్నాను.
    "వాడు మళ్ళీ వచ్చాడు!" అంది సీత.
    "మళ్ళీ కత్తి తెచ్చాడా?' అన్నాను వెటకారంగా.
    "లేదండీ -- మీ మాటలు గుర్తున్నాయి. మళ్ళీ కత్తి తెస్తే ప్రాణాలు పోయినా మానం కాపాడుకుందామనుకున్నాను కానీ...." అని ఆగింది సీత.
    "కానీ ....యేమయింది?"
    "వాడు నా అందాన్ని పొగిడాడు. నా నడకల్ని పొగిడాడు. నా మాటల్ని పొగిడాడు. అలా పొగిడితే నాకెంతో బాగుందండీ! నా అందాన్ని చూసి నన్ను ప్రేమించి కోరిన మొట్టమొదటి మగాడు వాడు. వాణ్ని నేను కాదనలేకపోయాను---"
    "నీకు పెళ్ళయిందనీ -- మొగుడున్నాడనీ గుర్తుందా?" "అదేంటండీ -- ఒకసారి మేరేమన్నారో గుర్తు లేదా?" అంది సీత.
    "ఎమన్నాను?" అన్నాను తీవ్రంగా.
    "ఆరోజు మన పెళ్ళి రోజు. మీరు ఆఫీసు నుంచి పెందరాళే వస్తారని ఎదురు చూశాను. కానీ మీరు ఆలశ్యంగా వచ్చారు. అదీ ఒంటరిగా కాదు...."
    ఇల్లాలు చెబుతుంటే కాసేపు నాకు నోట మాట రాలేదు.

                                      4
    "ఈమె పేరు రాధ , మేమిద్దరం భోం చేసే వచ్చాం. నువ్వు భోం చేసేయొచ్చు--' అన్నాను.
    సీత మాట్లాడకుండా లోపలకు వెళ్ళిపోయింది. మేమిద్దరం డ్రాయింగ్ రూంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఓ అరగంట పోయాక సీత వచ్చి -- "రాధకు పక్క ఎక్కడ వేయమంటారు?" అనడిగింది.
    "రాధ మానసికంగా దెబ్బతింది. ఒంటరితనం అంటే భయం. కొద్ది రోజులు మనింట్లో ఉంటుంది. పడక నా గదిలోనే -- " అన్నాను.
    "అలా ఎలా కుదుర్తుందండీ?' అంది సీత.
    "ఏం ఫరవాలేదు. రాధ వున్నానాళ్ళూ నువ్వు వేరే గదిలో పడుకో--" అన్నాను.
    చిన్నప్పట్నించీ నేను విలాస పురుషుడ్ని. ఆడవాళ్ళంటే నాకు మోజు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎలాగో రాధను లోబర్చుకున్నాను. రాధకు మంచి సంబంధం రాగా చదువు మధ్యలో మానిపించి పెళ్ళి చేసేశారు. పెళ్ళయిన రెండేళ్ళ కు రాధ మొగుడు పోయాడు. వెధవ అయిందామే. అప్పుడు తనెక్కడో ఉద్యోగం సంపాదించుకుంది. ట్రాన్స్ ఫర్ మీద నిన్ననే ఈ ఊరు వచ్చింది.
    రాధకు మళ్ళీ పెళ్ళి కష్టంగానే వుంది కానీ మగతోడు కష్టంగా లేదు. నిన్న మా ఆఫీసులో ఆమె తటస్థ పడగానే మాకు మా పాత పరిచయాలు గుర్తొచ్చాయి. రాధకు నేనంటే ఇంకా మోజు పోలేదు. మా ఇంట్లో వచ్చి వుండు -- అన్నాను.
    "పెళ్ళయిన వాడివి కదా!' అని తటపటాయించింది రాధ.
    "మొగుణ్ని భోగం దాని ఇంటికి మోసు కెళ్ళేటంతటి పతివ్రత నా పెళ్ళాం -- " అని చెప్పాను రాధకు.
    రాధకు పెళ్ళి చేసుకుని సుఖంగా బ్రతుకుతున్న ఇల్లాలంటే కక్ష వుంది. తనను పెళ్ళి చేసుకోకుండా వాడుకుని గడిపేస్తున్న మగాళ్లంటే కక్ష లేదు. ఆడదాని అసూయంతా ఆడదాని మీదే! అందుకే మగవాడు వాళ్ళని అదుపు చేయగల్గుతున్నాడు. నేనూ రాధను మళ్ళీ నా గదిలోకి తెచ్చుకోగలిగాను.
    సీతను వేరే గదిలో పడుకోమనగానే దాని ముఖం మాడిపోయింది. రాధ ముఖం వెలిగింది.
    "ఇది అన్యాయమండీ--" అంది సీత.
    "నేను అన్యాయాలు చేయను. రాధ నేనంటే మోజు పడి వచ్చింది. నీడరిద్రపు ముఖాన్ని చూసి ఏ - మగాడైనా మోజుపడితే నువ్వూ వాణ్ని తెచ్చుకో. అప్పుడు నేను వేరే గదిలో పడుకుంటాను--" అన్నాను తేలికగా నవ్వుతూ.
    సీత ఏడ్చింది. తనది దరిద్రపు మొహం అని నేను చాలాసార్లు అన్నాను. ఎప్పుడూ ఏడవలేదు. మరో ఆడదాని ఎదురుగా అలా అన్నందుకు ఏడుస్తోందది. ఆ ఏడ్పు నాకు ఏమాత్రం బాధ కలిగించడం లేదు.
    ఎందుకంటె రాధ నవ్వుతోంది. ఆమెతో పాటు నేనూ నవ్వుతున్నాను.
    సీత అలా ఏడుస్తుండగానే మేమిద్దరం వెళ్ళి గది తలుపులు వేసుకున్నాం.

                                     5
    
    "ఇదన్న మాట కధ!" అనుకున్నాను. సీత నామీద ప్రతీకారం తీర్చుకుంటుంది.
    నావల్ల తను మానసికంగా చాలా హింసపడింది. అదేలాంటి హింసో నా కిప్పుడు అర్ధమవుతోంది.
    సీత చదువు లేనిది కాదు. బియ్యే రెండేళ్ళు చదివింది. సీత అనాకారి కాదు - అవయవ పుష్టి కూడా వుంది. సీతకు వంట బాగా వచ్చు. సీతకు నాపై ప్రేమ వుంది. నాతో పెళ్ళి జరిగినపుడు పదివేల కట్నం కూడా తెచ్చిందామె.
    మరి నేను సీత నెందుకు ద్వేషిస్తున్నాను....?
    నిజానికి నేను సీతను ద్వేషించడం లేదు. అదంటే నాకు చులకన భావం. అది నా పెళ్ళాం. నా కాలికింద చెప్పు. నా బానిస. -- ఇవీ దాని గురించి నాఅభిప్రాయాలు.
    పూర్వ కాలం బానిసల్ని హింసించి ఆనందించే ఆచార ముంది. అదే జాతికి నేనూ చెందుతాను.
    ఇప్పుడు సీత తెగించింది. తనూ నాపద్దతుల్నే అనుసరిస్తోంది.
    సీత నాతొ సమంగా అరిచి వాదించినా, కొడితే అల్లరి పెట్టినా నేను దాన్ని ఏమైనా చేయగల్గి వుండేవాణ్ని. కానీ అది చాపకింద నీరులా ప్రవర్తిస్తోంది. తడిగుడ్డ తో గొంతు కోస్తోంది.
    "సీతా!"అంటూ అరిచాను.
    సీత భయపడకుండా నావంక అదోలా చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చూపుల్లో రవంత గర్వం కూడా వుంది. గర్వపడక ఏం చేస్తుంది? దాని అందాన్ని ఏనాడూ నేను పొగడలేదు. ఈరోజు ఒకడు దాని అందాన్ని పొగిడాడు. ఇప్పుడు దానికి నా పొగడ్తలు అవసరం లేదు.
    "ఏం చెయ్యాలి-- నేనిప్పుడు?"    
    ఆలోచించగా ఒక్కటే స్పురిస్తోంది -- సీతను చంపేయాలి!
    వంటింట్లోకి వెళ్ళాను -- "సీతా - నిన్ను చంపేస్తాను" తాపీగా అన్నాను.
    "మీకు భార్య నైన మరుక్షణమే -- మనిషిగా ఏనాడో నేను చచ్చిపోయాను. నన్ను మీరు చంపుతానంటే నాకు నవ్వొస్తోంది--" అంది సీత.
    సీత చాలా తెలివిగా మాట్లాడుతోంది. నాలో ఏదో బలహీనత వుంది. అందువల్ల నేను దాన్నేమీ చేయలేకపోతున్నాను -- "నన్నెందుకిలా చంపుతున్నావ్ సీతా!" అన్నాను.
    "మిమ్మల్ని చంపడం నాకు చాలా సులభం. నేను వండిన వంట తిని బ్రతుకుతున్నారు. మీకు మంచినీళ్ళు దగ్గర్నుంచీ అన్నీ నేనే అందిస్తాను మీకు. కానీ నేను మిమ్మల్ని చంపలేదు. ఎందుకంటె అంత సులభంగా మీరు చావకూడదు. మీరు నన్నెలా చంపుతున్నారో -- నేనూ మిమ్మల్నలాగే చంపాలి--"
    "నీకా అవకాశం ఇవ్వను. ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను--"అంటూ చటుక్కున ముందుకు వెళ్ళి దాని గొంతు పట్టుకున్నాను. అది అరవాలని ప్రయత్నించింది. కానీ నోరు నోక్కేశాను. ఇప్పుడు నాలో విపరీతమైన ఆవేశం పొంగుకొస్తోంది. ఒక మనిషిని చంపడానికి తగ్గ ఆవేశం నాకున్నదిప్పుడు.
    నా చేయి దాని కంఠం చుట్టూ బిగుస్తుండగా ఎవరిదో బలమైన చేయి నా భుజం మీద పడింది. ఉలిక్కిపడి నా పట్టు వదిలి వెనక్కు తిరిగాను.
    సీత గొంతు సవరించుకుంటోంది. దాని కళ్ళలో భయం మాత్రం లేదు.
    వెనకాల వుంది పక్కింటి పార్వతీశం.
    "మిస్టర్ -- నువ్విప్పుడో హత్య చెయ్యబోయావు. ఇందుకే నేనే సాక్షిని!" అన్నాడు పార్వతీశం.
    నాకు కాళ్ళూ, చేతులూ వణికాయి. ఓ క్షణం ఆగి - "నువ్విక్కడి కెందుకొచ్చావ్?" అడిగాను.
    "న్యూస్ పేపర్ కోసం వస్తే -- ఈ గొడవ కళ్ళ బడింది--"
    "న్యూస్ పేపరు కోసం పరాయిళ్ళలో వంటింట్లోకి రావడం మంచి అలవాటు కాదు. గుర్తుంచుకో!"
    "అది మంచి అలవాటేనని నాకిప్పుడనిపిస్తోంది.ఆ విధంగా ఒక నిండు ప్రాణాన్ని రక్షించగలిగాను--"
    "భార్యాభర్తల గొడవల్లోకి కలగజేసుకోకు . నేనేం నా భార్య ప్రాణాలు తీయబోవడం లేదు. మేమేదో నాటకం రిహార్సల్సు వేస్తున్నాం--' అన్నాను.
    "అదే నిజమైతే నీ నటనా శక్తి అద్భుతం. నువ్వు నిజంగా హత్య చేస్తున్నావనే అనుకున్నాను. కానీ నీ కల్పనా శక్తి బాగున్నట్లు లేదు. ఎందుకంటె నువ్వు చెప్పింది నిజంగా తోచడం లేదు. అందుచేత నువ్వు చెప్పింది నిజమే నని నీ భార్య కూడా అంటే వెంటనే వెళ్ళిపోతాను --" అన్నాడు పార్వతీశం.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.