Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 1



    కొంతదూరం వచ్చేక "వస్తా గురూ-కారు రిపెయర్ కిచ్చాను. బహుశా ఈపాటికి బాగయుంటుంది" అని సెలవు తీసుకున్నాడు రమేష్.
    ఇల్లు చేరుకున్నాక మోహనరావు పదేపదే ఆలోచించసాగాడు. తన జీవిత సర్వస్వం అనుకున్న మంజుల ఒట్టి కులట అని తెలిసింది. డబ్బుకోసం శరీరాన్నమ్ముకునే నీచురాలనే గ్రహింపయింది. ఆ నీచురాలికోసం తనిన్నాళ్ళూ తపించిపోయాడు. అదృష్టవశాత్తూ ఈ రోజు రమేష్ కలిశాడు. రమేష్ తనను కలిసి ఉండకపోయి నట్లయితే.....
    అసలు రమేష్ చెప్పినవి నిజమేనా అన్న అనుమానం హఠాత్తుగా అతనిక్కలిగింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రతీ అమ్మాయినీ కులట అనేవాడు రమేష్. అతని తీరే అంత. స్త్రీలను భోగవస్తువులుగా చూడడమొకటే అతనికి చేతనై నది.
    అయితే మంజుల విషయంలో అతనుచెప్పిన దసత్యం కావడానికి వీల్లేదు. అతను ఆమె గురించి చాలా చనువైన పదాలుపయోగించాడు.
    అంతలోనే అతనికి అనిపించింది. రమేష్ బుద్ది మంచిది కాదు. ఒకే ఊరిలో ఉన్నందువల్ల ఆమె గురించి బాగా తెలిసి ఉండాలి. ఆమెకోసం ప్రయత్నించి భంగపడి ఉంటాడు. అందువల్ల కనిపించిన వాళ్ళతో ఇలా చెప్పుకుని మానసికంగా తృప్తిచెందుతున్నాడేమో-
    ఈ ఆలోచన మోహనరావుకు కొంచెం సంతృప్తి నివ్వకపోలేదు. కానీ అదతనిలోని అసంతృప్తిని మాత్రం తొలగించలేకపోయింది.
    ఏదేమయినా మంజులను కలుసుకుని మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు మోహనరావు.
    
                                     4
    
    అనుకున్న రోజు రాత్రి పన్నెండున్నరకు మంజుల ట్రయిన్ దిగింది. ఆమెతోపాటు ఆమె బాబాయిట-తోడుగా వచ్చాడు. అంతా మోహనరావు రూమ్ కి చేరుకున్నారు. మోహనరావు దారిలోనే మామూలుగా రమేష్ ప్రస్తావన తీసుకొచ్చాడు. రమేష్ పేరు వింటూనే మంజుల కళ్ళలో నిప్పులు కురిశాయి.
    "వాడు మీకెలా తెలుసు మేష్టారూ!" అనడిగింది మంజుల.
    "ఊళ్ళో ఆడపిల్లలకు వాణ్ణి చూస్తే చాలా భయం ఒట్టి రౌడీ వెధవ-" అన్నాడు మంజుల బాబాయి.
    ఆ మర్నాడు మధ్యాహ్నం-రమేష్ కి ఫోన్ చేశాడు మోహనరావు-మంజుల తన బాబాయితో వచ్చిందనీ-ప్రస్తుతం తన ఇంట్లో ఉన్నదనీ!
    రమేష్ జవాబులో ఆశ్చర్యం ధ్వనించింది. "బాబాయితో వచ్చిందా, దానికి బాబాయెవడున్నాడు? ఎవడో ప్రియుడయివుంటాడు-ఏమైనా చాలా కాలం తర్వాత వచ్చింది-ఓసారి కలుసుకోవాలనుంది. కారేసుకుని సాయంత్రానికి వస్తాను-" అన్నాడతను.
    బాగా ఆలోచిస్తున్నాడు మోహనరావు. రమేష్ మంజులలో ఒకరు అబద్దం చెబుతున్నారు. అదెవరో ఈ రోజే తేల్చేయాలి.
    రమేష్ కి ఫోన్ చేసి తన గదికి వెళ్ళేసరికి గదిలో మంజుల ఒక్కతే ఉంది. ఆమె బాబాయి సినిమాకి వెళ్ళి పోయాడు.
    "సాయంత్రం రమేష్ ఇక్కడికి వస్తానన్నాడు-" అన్నాడు మోహనరావు.
    మంజుల ఆశ్చర్యంగా-"ఎందుకు? -" అనడిగింది.
    "అతను నీ గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు. నీతో వదల్లేదు. నీ అక్కల గురించీ, నీ కుటుబం గురించీ కూడా చెడ్డగా చెప్పాడు. అంత పచ్చి అబద్దాలకోరుని నే నెక్కడా చూడలేదు. అవన్నీ అబద్దాలని అతనిచేత నువ్వు ఒప్పించాలి-"
    "రానివ్వండి వెధవని కడిగేస్తాను....." అంది మంజుల.
    సాయంత్రం రమేష్ వచ్చాడు కారులో. "మీ ఇంటికి వెళదాం పద-" అన్నాడు మోహనరావు. అతనికి తన గదిలో గొడవ జరగడం ఇష్టం లేదు.
    మోహనరావు, రమేష్, మంజుల-కారులో బయల్దేరారు.
    రమేష్ ఇల్లు ఊరికి చివరగా ఉంది. కంపెనీవారు అతని హోదాకని పెట్టిన ప్రత్యేకమైన బంగళా అది. అటువంటి బంగళాలు అక్కడ మరికొన్ని ఉన్నాయిగానీ విసిరేసినట్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వున్నాయి.
    రమేష్ కారు దిగాడు. అతని వెనుకే మంజులా, మోహనరావూ దిగారు.
    మాటల్లేకుండానే ముగ్గురూ బంగళాలో అడుగుపెట్టారు. "కాసేపు ఇక్కడ సోఫాలో కూర్చుందామా?" అన్నాడు రమేష్. అంతా కూర్చున్నారు. కాసేపు మౌనం రాజ్యమేలింది.
    "నన్ను గురించి ఈయనదగ్గర ఏమిటి కూశావ్?" అంది నిశ్శబ్ధాన్ని చేదిస్తూ.
    రమేష్ ఇద్దరివంకా ప్రశ్నార్ధకంగా చూసి "కూయడమేమిటి డార్లింగ్!" అన్నాడు.
    అతనలా అనడం తడవుగా మంజుల తిట్టడం మొదలెట్టింది. నీకు చెల్లెళ్ళు లేరా అంది. ఆడదాన్ని గౌరవించడం చేతకాదా అంది. ఆఖరికి నీచుడు, దుర్మార్గుడు లాంటి పదాలు ప్రయోగించింది.
    "హద్దు మీరుతున్నావు డార్లింగ్.....!" అన్నాడు రమేష్.
    "ఎవర్రా నీకు డార్లింగ్....?" అంటూ అరిచింది మంజుల.
    మోహనరావు,  రమేష్ వంక చూసి "నిజమే చెబుతోందా ఈమె?" అన్నాడు.
    రమేష్ అదోలా నవ్వి "ఎందుకడిగావీ ప్రశ్న?" అన్నాడు.
    "నేనీమెను ప్రేమిస్తున్నాను. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను...." అన్నాడు మోహనరావు గంభీరంగా.
    "నాయనా-ఇంతకుమించి కాండిడేట్సు దొరకలేదు నీకు...." అన్నాడు రమేష్.
    "లేదు......" అన్నాడు మోహనరావు.
    "నీకు చేతకాని పక్షంలో లక్షణమైన పిల్లని నేను వెదికి పెడతాను కానీ ఇలాంటి కక్కుర్తిపనులు చేయకు. ఒకప్పుడు ఫరవాలేదు కానీ ఇప్పుడు దీనిది చాలా పెద్ద కంపెనీ వ్యవహారం. ఎదురిస్తానన్నా దీనితో పొందుకంగీకరించన్నేను....."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.