Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 8


 

    ఈ పర్యాయం ఆమె భాధగా నవ్వి -- " అందమైన అడపిల్ల కోసం వేలకొద్ది రూపాయలు కుమ్మరించగల యువకులు జీవిత భాగస్వామిగా రాబోయే భార్య అంతులేని ధన రాశులు కూడా తీసుకురావాలనుకునే ఆశపోతులూ, దేశంలో అంతులేని పేదరికమూ - ఉన్నంతకాలమూ ఏ ముఠాలూ అవసరం లేకుండానే మాబోటివాళ్ళం మాకు మేమై ఈ వృత్తిలో దిగవలసి ఉంటూనే ఉంటుంది .-" అంది.
    అంతకుమించి ఆమె నుంచి నాకు ఏ సమాధానమూ లభించలేదు. కులాసాగా గడపవలసిన సమయాన్ని వృధా చర్చలతో వెళ్ళ బుచ్చడం ఇష్టం లేక నేను మరి ఆమెను గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.

                                    12
    ఆరోజు నాకు సరిగ్గా ఏడు వుత్తరాలు వచ్చాయి. ఒకటి మామగారి దగ్గర్నుంచీ, ఒకటి నాన్నగారి దగ్గర్నుంచీ , రెండు ఓ మాదిరి పరిచయమున్న స్నేహితుల దగ్గరనుంచీ, ఒకటి చందా గడువు తేదీ పూర్తవున్నట్లు ఒక పత్రిక నుంచి గుర్తు చేస్తూ వచ్చింది- మిగిలిన రెండు శుభలేఖలు.
    ముందు ఉత్తరాలు చదవడం అయ్యేక శుభలేఖలు తీశాను. ఒకటి గత సంవత్సరం దాకా ఇక్కడ నాకు కొలీగ్ గా వుండి ట్రాన్స్ ఫర్ మీద మరో నగరం వెళ్ళిపోయిన ప్రకాశరావుది, పెళ్ళికి సరిగ్గా పదమూడు రోజుల వ్యవధి ఉంది. వధువు పేరు పార్వతి. ఊరు పేరు చదువుతుంటే తెలిసినట్లుగా అనిపించింది. కానీ చటుక్కున గుర్తురాలేదు.
    రెండవ శుభలేఖ ఫ్రం అడ్రస్ చూడగానే ఆ ఊరు నాకెలా తెలుసో స్పురించింది ఆ శుభలేఖ శ్రీధర బాబు దగ్గిర నుండి వచ్చింది. శుభలేఖ ని వధువు అతని చెల్లెలు పార్వతి వరుడు ప్రకాశరావు!
    ప్రకాశరావు నాకు చెప్పుకోతగ్గ స్నేహితుడు పార్వతి వధువుగా కళ్యాణ మంటపం ఎక్కబోతోందన్న వార్త నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందో -- ఆమె పెళ్ళాడ బోయేది ప్రకాశరావుని అన్న విషయం అంత బాధను కలిగించింది. ప్రకాశరావు ఆడవాళ్ళ శీలానికి చాలా ప్రాముఖ్యత నిస్తాడు. అతను కూడా ఎంతో బుద్ది మంతుడు. అలాంటి వాడికి పార్వతి లాంటి దుశ్శీల, నెరజాణ - భార్యగా రావడం నిజంగా దురదృష్టకరం. ఇందులో నేను చేయగలిగినదేమీ లేదా అని తర్జన భర్జన చేసుకున్నాక - ఏమీ లేదని అనిపించింది. అయినా మనసు పీకుతూనే వుంది.
    మొట్ట మొదటిసారిగా శ్రీధర బాబు ఊరికి వెళ్ళాను. నన్ను చూసి శ్రీధరబాబు చాలా సంతోషం వెలిబుచ్చాడు. కానీ నా మనసు అదోలా గుంది. వేళాకోళనికే కావచ్చు, అతన్నోక్కసారి బావా అని పిలిచినందుకు తాత్కలికంగానైతేనేం అతని చెల్లెలు నా సొంతమయింది. ఈ భయంకర కఠోర సత్యం సహాయంతో శ్ర్రీధరబాబు చెల్లెలి వివాహం చెడగొట్టగలను. ఆ విధంగా నన్ను స్నేహితుడిగా నమ్మిన ప్రకాశరావుకు ద్రోహం చేశాననే వ్యధ నన్ను బాధించకుండా చేసుకోగలను.
    కానీ తన చెల్లెల్ని పొరబాటునైనా ఎవరైనా చిన్న ముక్క అనడం సహించలేని శ్రీధర బాబు ప్రళయకాళరుద్రునిగా మార్చే అవకాశం కూడా ఉన్నదని నాకు తెలియకపోలేదు.
    నేను ఒక రకమైన ఎక్సయిటెడ్ స్టేట్ లో ఉన్న కారణంగా ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తాని తెలియకుండా ఉంది. ముహూర్త సమయము సమిపిస్తూన్న కొద్ది వదువరిలకూ వారి తల్లిదండ్రులకు లేని ఉద్వేగం నాకు కలగసాగింది. నేను మంచి వాడినో చెడ్డవాడినో నాకే తెలియదు. కానీ వెయ్యి అబద్దాలైనా అది నిలబెట్టవలసిన పెళ్ళిని ఒకే ఒక్క నిజం చెప్పి చెడగొట్టడం  మాత్రం చెయ్యలేదు. పార్వతి ప్రకాశరావు భార్య అయింది.
    రిసెప్షన్ సమయంలో ప్రకాశరావు పక్క వధువు స్థానంలో ఉన్న స్త్రీని చూసి షాక్ తిన్నాను. ఆమె నేనెరిగిన పార్వతి కాదు, ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైము పట్టింది. ఆ తర్వాత రోజంతా జాగ్రత్తగా పరిశీలించి శ్రీధరబాబు చెల్లెలూ, ప్రకాశరావు భార్య అయిన పార్వతి నేననుకుంటున్న స్త్రీ కాదని దృవ పర్చుకున్నాను.
    అంతేకాదు, ఒకప్పుడు పార్వతి ఇతని కోసం ఇల్లు వదిలి పెడితే - ఏమయిందో తెలియక ఇంటిల్లిపాదీ ఖంగారు పడ్డారనీ తను వివాహం జరిపించడానికి పెద్దలు అంగీకరించినాకనే ఆమెను ప్రకాశరావు - తిరిగి తలిదండ్రులకు అప్పగించాడనీ ఒక కొత్త నిజం కూడా తెలుసుకున్నాను.
    పెళ్ళి పీటల మీద పార్వతిని నేను సరిగ్గా చూడలేదు. నేను మంటపానికి దూరంగా ఉండడమూ, విపరీతమైన వస్త్ర వేషధారణలతో ఆమె ముఖం అస్పష్టంగా ఉండడమూ , తప్పు చేసిన వాడి అనుభూతితో వధూవరులను నేను సూటిగా చూడలేక పోవడమూ - వగైరా  కారణాల వల్ల ఈ విచిత్ర సత్యాన్ని ముందుగానే గ్రహించలేకపోయాను.
    నేను గ్రహించిన సత్యం నన్నెన్నో బాధల నుంచి విముక్తి చేసింది. అయితే ఒక సందేహం మాత్రం నాకింకా మిగిలిపోయింది.నాకు తెలిసిన పార్వతి ఎవరు?
    ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా దొరుకుతుందని నేననుకోలేదు. కానీ పెళ్ళి నుంచి తిరిగి వెళ్ళాక -- నాకు తెలిసిన పార్వతి తో గల అనుభవాలు వివరాలనూ ప్లస్ శ్రీధర బాబు చెల్లెలి పెళ్ళికి వెళ్లి షాక్ తిన్న సందర్భమూ - శివరావు కు వివరించి చెప్పగా - అతడు అరటి పండు ఒలిచిన విధంగా నాకు ఏం జరిగి ఉండవచ్చునో చెప్పాడు.
    దూర ప్రాంతాల తక్కువ వ్యవధిలో ఉండే ఎందరో యువకులకు ఆడవాళ్ళను సరఫరా చేసే సంస్థ ఒకటి ఉంది. దానికి దేశం నిండా బ్రాంచీలున్నాయి. నేను ఆ సంస్థ ద్వారానే ఉమను రప్పించుకున్నాను. శివరావుకు ఆ సంస్థ గురించి చాలా వివరాలు తెలుసు వారి వారి సౌకర్యాన్ని బట్టి యువకులు- యువతులను తమకు కావలసిన బంధుత్వపు వరుసలతో రప్పించుకోవచ్చును.
    శ్రీధరబాబు ఆ విధంగా చెల్లెలి పేరుతొ యువతులను తమ అవసరానికి రప్పించుకుంటూ ఉండి ఉండవచ్చు. చెల్లెలు లనగానే ఎవరూ చటుక్కున తప్పు సంబంధం అంటగట్టలేరు. ఉండేది తక్కువ కాలమైనప్పుడు -- ఆ బంధుత్వం లోని నిజానిజాల విచారణ ప్రసక్తి ఉండదు . శ్రీధరబాబు బుక్ చేసుకున్న అమ్మాయి వస్తున్నట్లు వచ్చిన టెలిగ్రామ్ అతడు లేని సమయంలో నాకు అందడం జరిగింది.
    ఆ అమ్మాయికి వ్యాపారరీత్యా ప్రతి రోజూ కూడా ముఖ్యం ఆమె చక్కగా నన్ను వినియోగించుకుని- శ్రీధరబాబు లేనప్పటికీ తన ఆదాయం దెబ్బతినకుండా చేసుకోగలిగింది. ఆమె శ్రీధరబాబు కు చెల్లెలే అయుంటుందన్న అపోహ - నాకు ఆమె పట్ల ఆకర్షణనూ, అంతులేని ఆతురతను కలిగించింది.
    నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ ఒక్క విషయం నాకు చాలా బాధను కలిగించింది. తన చెల్లెల్ని ఎంతగానో అభిమానిస్తున్న శ్రీధర బాబు - ఇతర ప్రాంతాల్లో నలుగురూ తన చెల్లెలుగా భావిస్తున్న స్త్రీతో కాపురం చేస్తున్నాడు. ఆ విషయం అతను తప్పుగా బావిస్తున్నాడనుకొను. కానీ అతన్ని తప్పు పట్టబోయేముందు- నాకటువంటి అర్హత ఉన్నదా అని కూడా ఆలోచించవలసి ఉన్నది. అలా ఆలోచించ వలసిన అవసరం లేనివ్యక్తి నాకు తెలిసిన వాళ్ళలో ప్రకాశరావు ఒకడే ననుకుంటాను.
    స్నేహితుడి చెల్లెలు అని తెలుసుండీ అందుబాటులోనికి వచ్చినపుడు అనుభవించి ఆ తర్వాత మరిచిపోవాలని వ్యక్తిని ప్రయత్నించిన నేను! తను నమ్మి తనకోసం ఇల్లు వదలి వచ్చిన ఆడదాన్ని ఏమాత్రమూ మోసం చేయకుండా నిగ్రహంతో వ్యవహరించి- చిట్టచివరకు ఎలాగో పెద్దల నొప్పించి ఆమెనే వివాహం చేసుకున్న వ్యక్తీ ప్రకాశరావు!    
    బహుశా అందుకే నన్నుకుంటాను- తన చెల్లెలి పై మాట విసర బడడం సహించలేని శ్రీధరబాబు - మనిషినే స్వంతం చేసుకోవాలను కున్న ప్రకాశరావు చర్యను క్షమించగలిగాడు. నాబోటి వ్యక్తితో పార్వతి లేచి వచ్చి ఉంటె శ్రీధరబాబు చేతిలో ఆ వ్యక్తీ హత్య చేయబడి ఉండేవాడనడంలో సందేహం లేదు.
    ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీతిపరుడి ముందు - అవినీతి పరుడేప్పుడూ బలహీనుడు గానే ఉంటాడన్న సత్యం నా అనుభవంతో మరోసారి రుజువైంది .

        
                                         ---: అయిపొయింది :--- 




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.