Home » Dr C ANANDA RAMAM » Aparajitha


   
    'ఏవిటో ఆలోచిస్తున్నావ్ రాధా!'        
    'ఏం లేదండీ! మీ మాటల్నే నెమరు వేసుకుంటున్నాను.'    
    'నా మాటలు కేవలం పెదాల మీద నుండి వచ్చినవి కావు తల్లీ! దాదాపు పది సంవత్సరాల అనుభవాన్ని రంగరించుకుని వెలువడ్డ కఠిన సత్యాలు. నేను నడుపుతున్న రెస్క్యూ హోమ్ ని ఇంకా నువ్వు చూడలేదు. దైవోపహతులైన ఎందరు అభాగ్య జీవులకీ శరణాలయం బ్రతుకు మీద మమకారాన్ని పెంచిందో ఎరుగుదువా రాధా? ఒక్కొక్కసారి సంఘం చేత నిర్దాక్షిణ్యంగా బహిష్కరింపబడిన స్త్రీల హృదయ విదారక గాథలు వింటుంటే భగ వంతుడి మీద చెప్పరాని అసహ్యం కలిగేది. న్యాయా న్యాయాలను సమదృష్టితో విచారించే కరుణామయుడు ఒక తప్పుకు స్త్రీకొక న్యాయాన్నీ పురుషుడికి మరో న్యాయాన్నీ ఎందుకు కలిగించినట్లు! సర్వ సాక్ష్యాలతోటీ స్త్రీనే అపరాధిని చేసి పురుషుణ్ణి ఏ న్యాయస్థానానికీ అందనీయకుండా ఎందుకు తప్పిస్తున్నట్లు! ఇందులో స్త్రీ ప్రత్యేకంగా చేస్తున్న అపరాధమేమిటి? తెలిసో తెలియకో క్షణికమైన ఇంద్రియోద్రేకాలకు లొంగిన నేరానికి, తాము పెరిగిన సంఘంలో ఉండే అర్హతనే ఆవిడ పోగొట్టు కోవడమేమిటి వివాహమైన స్త్రీ మాత కాబోతుంటే ఎంత కోలాహలం! ఎంత ఉత్సాహం! అదే మాతృత్వాన్ని అవివాహిత వహిస్తే ఎంత ఈ సడింపు, ఎంత జుగుప్స! ఎక్కడుందీ భేదం! ఈ అనాధ స్త్రీలు నిర్భయంగా తల ఎత్తుకుని సంఘంలో తాము కన్న బిడ్డలతో గౌరవం! బ్రతికే యోగం ఎలా వస్తుంది! - ఆ రోజుల్లో నా మనస్సంతా ఇటువంటి ఆలోచనలతోటే సతమతమై పోయేది. దారీ తెన్నూ తోచేదికాదు. ఒక అల్పప్రాణిని, ఈ నిర్భాగ్యులకు నేనేం చెయ్యగలను, అని ఆక్రోశించే దానిని. నాకు కావలసినంత ఆస్తి ఉంది. ప్రాణానికి ప్రాణం పెట్టే భర్తా, ముగ్గురు పిల్లలూ ఉన్నారు. సుఖమయమైన సంసారాన్ని కలిగిఉండీ, నా మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోయింది. అందుకు నా కళ్ళ యెదుట జరిగిన ఒక హృదయ విదారక సంఘటన మరీ తోడయింది రాధా! మేమున్న యింటికి నాలుగిళ్ళ అవతల ఓ మధ్యతరగతి కుటుంబం ఉండేది. ఇంటి యజమాని కలక్టరాఫీసులో క్లర్కు యజమానురాలు పిచ్చి కల్లాలు. నలుగురు ఆడపిల్లలకు తల్లి. పెద్దపిల్ల పదహారేళ్ళది. సృష్టిలో ఉన్న సొగసంతా రంగరించి పోత పోసి నట్లుగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ చలాకిగా తిరిగే ఆపిల్ల మా వీధికే చల్లని వెలుగు. వీధిలో ఉన్నవాళ్ళ నందరినీ పిన్నీ, అత్తా, వదినా అంటూ వరసలు కల్పించుకుని కలుపుగోలుగా తిరిగేది. చిన్నపనికీ పెద్దపనికీ అవసరం వచ్చి నప్పుడు అరమరికలు లేకుండా సాయం వచ్చి ఆదుకుంటుండేది. నవ్వుల బండిలా తిరిగే ఆ పిల్ల జీవితంలోకి ఒక మగవాడు ప్రవేశించాడు. ఫలితం చెప్పనక్కరలేదు. తల్లీ తండ్రీ నెయ్యిపోసిన అగ్నిలా మండిపోయారు. మా వంశానికి అప్రతిష్ఠ తెస్తున్నావే, అంటూ తండ్రి తన కన్న కూతుర్ని తాను పెంచిన చేతుల్తోనే చావ బాదాడు. తల్లి అనరాని మాటలన్నీ అన్నది. నీవు ఏ నూతిలోనన్నా పడిచస్తే ఈ అప్రతిష్ట ఉండదంటూ వాపోయింది. జీవితమంతా పువ్వుల నావలా సాగించిన ఆ పిల్లకు రానున్న క్లిష్టపరిస్థితి అవగత మయింది కాబోలు! ఫలితాన్ని గూర్చి ఊహించకుండా అవితర్కితంగా ప్రవర్తించినందుకు చావే తగిన శిక్ష అనుకుని నూతిలో దూకింది. అంత సౌందర్యరాశినీ గుప్పెడు మట్టికింద మార్చిన వారంరోజులకు కథానాయకుడు రంగంమీద కవతరించాడు. ఆ పిల్లవాడు వాళ్ళ యెదురింటి మేడమీద అద్దెకున్నవాడు. కాలేజీలో చదువుకుంటుండే వాడు. పరీక్షలై సెలవలకింటికి వెళ్ళిన వాడు. నిన్ను చూచుకోడానికి మా అమ్మా నాన్నా వచ్చారన్న శుభవార్త ఆ పిల్ల చెవిన వేయడానికి వచ్చాడట. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. వాకిట్లో గుడ్లప్పగించి నిలుచుండి పోయిన ఆ పిల్లవాడి తల్లీ దండ్రీ వాడి నిజాయతీకి సాక్ష్యంగా కనిపించారు. ఆ పిల్లచేసిన చిన్న తప్పుకు నిండు నూరేళ్ళ జీవితమూ పరిహారంగా చెల్లించబడ్డదా! తల్లీ దండ్రీ కొంచెం వోపిక పట్టి, రవ్వంత సానుభూతితో ఎందుకు ప్రవర్తించలేకపోయారు! అమానుషంగా చేతలతోటీ మాటలతోటీ హింసించి పువ్వు లాంటి ఆ పిల్ల జీవితాన్ని విరిసీ విరియని దశలో, నేలవేసి కాలరాచారెందుకని! ఇంత ఘోరమైన సాంఘిక దురన్యాయం ఎంత మంది సంఘ సేవకులు పట్టుపట్టి ఎన్ని రకాలుగా శ్రమిస్తే సమసిపోతుంది! ఈ సంఘటన నా మనస్సులో పెద్ద కల్లోలాన్నే సృజించింది. భర్తనూ, ఇంటినీ, పిల్లల్నీ దాదాపు మర్చిపోయినట్లే చేసి ఎప్పుడూ ఈ విషయమే తలుచుకుంటూ వాపోయేదాన్ని. నా భర్త నా స్థితికి భయపడిపోయారు - 'ఇలా మనస్సులో మధన పడుతూ సాధించేదేదీ ఉండదు సత్యం! నువేధన్నా చెయ్యదలచుకుంటే, ఆలోచన ల్తోటే ఆగిపోక ఆ పని కావడానికి మార్గాలు వెదకాలి. నేనొక మాట చెప్తాను శ్రద్ధగా విను! నీ పుట్టింటి నుండి నువ్వు బోలెడు ఆస్తితో వచ్చా నిక్కడికి. నేనూ ధనవంతున్నే. నాకున్నది మనం సుఖంగా ఈ లోకంలో బ్రతక డానికి సరిపోతుంది. నీ ఆస్తితో, నీ మనస్సును పీల్చి పిప్పి చేస్తున్న ఈ సాంఘిక దురన్యాయాన్ని ఎదుర్కోగలవేమో చూడు! అంగబలంతోపాటు అర్ధబలాన్ని కూడా పొంది ఉండకపోతే ఆధునిక ప్రపంచంలో పనులు జరగవు' అన్నారాయన. కొంత సేపు నేనేం వింటున్నానో కూడా గ్రహించలేని స్థితిలో ఉండిపోయాను. ఆయనమీద కృతజ్ఞతో గౌరవమో ప్రేమో తెలియని స్థితి నన్నావరించుకుంది. లోకంలో సాధారణంగా స్త్రీ పడే కష్టాలకన్నిటికీ ఒక కారణంగా పురుషుడు ఎత్తి చూపబడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఆ పురుషుడే సంఘం చేత చావు దెబ్బలు తింటున్న స్త్రీ యొక్క అసహాయస్థితికి జాలిపడి సానుభూతిలో చేయూత ఇవ్వడానికి నడుము కడుతూనే ఉన్నాడు. వీరేశలింగం పంతులు, రామ్ మోహన్ రాయ్ లాంటి వాళ్ళంతా ఎవరు? ఆ క్షణాన నా భర్తను కూడా వాళ్ళ కోవలోకి చేర్చుకుని ఆత్మ తృప్తితో తనిసిపోయాను. ఆయన సలహావల్ల యేర్పడిన, అభాగినుల పాలిటి చల్లని నీడ రాధా ఈ రెస్క్యూ  హోం.' సత్యవతమ్మ గారు ఒక్కక్షణం మాట్లాడకుండా ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని భంగం చెయ్యాలన్న తొందరలో రాధే మొదలు పెట్టింది మాట్లాడడం.
    'అయితే దీనికి ప్రభుత్వ సహాయం లేదాండీ?'
    'లేకేం! ప్రభుత్వ సహాయమే లేక పోతే ఇంతగా రాణించేదా! నేను విత్తనం వేసి నీళ్ళు చల్లాను. భూమి సారవంతంగా ఉండేట్లు చేశాను గొడ్డూ గోదాలాంటివి తొక్కి పాడుచెయ్యకుండా ఉండేట్లు సంరక్షణ చేశాను. గింజ మొలకెత్తి తీగ సాగింది. దట్టమైన పందిరిలా ప్రభుత్వమే నిలవకపోతే, అది గాలిలో అల్లాడకుండా చెయ్యడం నాకు కష్టసాధ్యమే అయ్యేది'- ఆమె గొంతులో మాతృత్వపు మమత తొణికిసలాడుతోంది. రాధ చిన్నగా నవ్వుతూ,
    'మీ ధోరణి చూస్తే మీ బిడ్డల మీద కంటే, ఈ రెస్క్యూ హోమ్ మీదే మీకు మమకారం ఎక్కువలాగా కనిపిస్తోందండీ!' అన్నది.
    సిగ్గువల్ల కాబోలు- సత్యవతమ్మగారి చెవుల దగ్గర, ఎర్రదనం పలచ పలచగా వ్యాపిస్తూ, చెక్కిళ్ళను నింపింది.
    'నిజం! దీనిమీద నాకు అంతులేని మమకారమే ఉంది. ఇది నా కలలకన్నిటికి ఆకారం తెచ్చిపెట్టిన అద్భుతవరం. ఇది కేవలం సంఘం దృష్టిలో పతితలైన అనాధ స్త్రీలను ఆశ్రయమివ్వడానికే నిశ్చయింపబడ్డది. ఏయే స్త్రీల విషయంలో 'మోరల్ లాప్సెస్' కనిపించిన వాళ్ళు సంఘం చేత నిరసింపబడ్డారో వాళ్ళకందరికీ ఇక్కడ చోటున్నది రాధా! ఇందులో అవివాహితలై మాతృస్థానం వహించబోయేవారున్నారు. భర్తలు వెళ్ళగొట్టగా ఎక్కడా తలదాభుకోనుచోటు దొరకక ఇక్కడ గోప్యంగా గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళున్నారు. తెలిసో తెలియకో ఉన్న యిల్లు విడిచి, మనసు కోరిన వాడివెంట లేచి వచ్చి, వాడు మోసం చెయ్యగా రికామీగా నిలిచిపోయిన పడుచులూ ఉన్నారు. అందరి సమస్యా ఒక్కటే. గత జీవితాన్ని పీడకలలా మర్చిపోయి, తిరిగీ సంఘంలో గౌరవ భాజనమైన జీవితాన్ని ప్రారంభించడమే. ఆ మహాకార్య సాధనలో మా ఆశ్రమం సర్వవిధాలా పాటుపడుతుంది. తన అండన చేరినవాళ్ళ కన్నీళ్లు తుడిచి బ్రతుకులు సరిదిద్ది, వాళ్ళు కల కల విరిసే కల్హార పుష్పాలు కాగా చూసి మురిసిపోవడమే మా ధ్యేయం రాధా!'-
    'ఇలా మీ అండన చేరినవాళ్ళకు ఎన్నాళ్ళు ఆశ్రయ మివ్వగలుగుతారు మీరు.'
    'దాదాపు మూడేళ్ళ పాటు! అసలు మా పథకాన్ని వివరించి చెప్తాను విను! అవివాహితలై గర్భాన్ని ధరించిన వాళ్ళకు రెండోకంటివాడికి తెలియకుండా ఆశ్రయమిచ్చి పురుడుపోసే బాధ్యత మాది. అందుకు తగిన హాస్పిటల్ సౌకర్యాలూ నిపుణుల సహాయమూ ఉన్నది. పుట్టిన పాపను తల్లి అక్కరలేదనుకుంటే అనాధ శిశు శరణాల యాలకి పంపేస్తాము. పరిస్థితులు చక్కబడి తల్లి తన బిడ్డను తీసుకుపోవాలను కుంటే ఆ బిడ్డ ఆమెకు అందుబాటులో ఉండేట్లు చూచే బాధ్యతకూడా మాదే. తల్లి తనవాళ్ళను కలుసుకోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. లేక ఇక్కడే ఉండిపోదల్చుకుంటే ఉండవచ్చు. కాని అట్లా ఉండే కాలపరిమితి మూడు సంవత్సరాలు మాత్రమే. ఈ వ్యవధిలో ఆవిడ మేము నడిపే సంక్షిప్త శిక్షణాలయంలో చేరి మెట్రిక్ పరీక్ష యిచ్చి ఉద్యోగ మేదన్నా సంపాదించుకోవచ్చు. లేకపోతే! ఇక్కడే మేము నడుపుతున్న వివిధ శిక్షణ కేంద్రాలలో తరిఫీదుపొంది తన పొట్టతాను పోసుకోవచ్చు. ఈ అర్హత పొందే వరకూ ప్రతిమనిషికీ నెలకు 40 రూపాయలు ఉచిత వేతనం ఇచ్చే ఏర్పాటు చేశాము - భోజనం, బట్టలూ, అన్నీ అందులోనే జరుపుకోవాలి. ఈ మొత్తం ఇంక కొంచెం ఎక్కువ చెయ్యడానికి ఎలా వీలవుతుందా అని, తల బద్దలు కొట్టుకుంటూ ఉంటాను. కాని, రాధా! అది వీలుకావడం లేదు' - ఆవిడ గొంతుకలో నిస్పృహ ధ్వనించింది-
    'మీ మాటలు వింటుంటే ఒళ్ళు పులకిస్తున్నదండీ! మీరు ఎంత ఈ అభాగినులకు చేయగలుగుతున్నారన్న దాని కంటే, ఎంత గాఢంగా వారి సుఖమయ జీవితాన్ని వాంఛిస్తున్నారన్నదే ముఖ్యం. ఈ సమాజంలో ఉన్న మనుషుల్లో సగం మందికయినా మీకున్న సానుభూతి ఉంటే, వీళ్ళలా అభాగినులుగా చరిత్రలో ఎందుకు పాతుకుపోతారు చెప్పండి! వాళ్ళ అభిశప్త జీవనం మీద మంత్రజలాన్ని చల్లే కరుణామయులు మీరు' -
    'అంతపెద్ద మాటలెందుకులే! - అయినా యిటువంటి ఆశ్రమాలు ఒకటి అరా చాలవు రాధా! కాలుజారిన ఏ స్త్రీ కూడా నిరాశ్రయంగా వీధుల్లోకి విసిరి వేయబడనినాడు నా ఆశ్రయం సంపూర్ణంగా నెరవేరినట్లు నీవన్నట్లు ముఖ్యంగా ఈ రకమైన కృషి సఫలం కావటానికి మనస్సులలో పరివర్తన కలగడమే ముఖ్యం. సాంఘిక న్యాయ మనేది పొరపాటు చేసిన వ్యక్తికి సానుభూతితో రక్షణ నిచ్చేదిగా ఉండాలే కాని, ఆ వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించి శపించేదిగా ఉండకూడదు. ఈ సూత్రానికి స్త్రీ అయినా పురుషుడైనా సమానంగా అన్వయింపబడ్డనాడే మనషులు మనుషులుగా బ్రతకగలరు. మన సమాజ వ్యవస్థకు అటువంటి బంగారు కాలం ఎంత దూరంలో ఉందో కనీసం ఊహకైనా అందడం లేదు.'




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.