Home » Dr C ANANDA RAMAM » Aparajitha


 

                                     15

    మాధవి గుండెల్లో ఎగదట్టిన మంట చెవుల్నీ, చెంపల్నీ వెచ్చని ఆవిరులతో కాలుస్తున్నట్లుగా ఉంది. రాధమీద ద్వేషమో. జాలో ప్రేమో, ఏదో తెలీని ఊహల వెల్లువలో మునిగి ఆవిడ రాతి బొమ్మలా ఉండిపోయింది. చేతులో ఉత్తరం రెపరెప కొట్టుకుంటూ అటూ ఇటూ తారట్లాడుతున్నది. తన మనస్సు ఆ  ఉత్తరంలాగే చలించిపోతూ అందులో ఒకసారి రాధా మరొకసారి మధూ దాగుడు మూత లాడుతూ కనపడుతున్నారు. రాధ తాననుకున్నంత అమాయకురాలు కాదు. ఎవరికీ తెలియకుండా గుప్తంగా విరిసిన ఆవిడ వ్యక్తిత్వంముందు తానే బేలయై వెలాతెలపోతున్నట్లు స్పష్టమై పోయింది.
    'ఎక్కన్నుంచే ఉత్తరం!' పరమేశ్వరి ప్రశ్నించింది. 'రాధ రాసింది పెద్దమ్మా!' అది క్షేమంగా మా స్నేహితురాలి దగ్గరికి చేరిందట. ఉద్యోగంలో చేరబోతున్న దట.నెలకు దాదాపు నూటయాభై రావచ్చు. మొత్తానికి ఆ అల్లరిపిల్ల జీవితంలో పెద్దతనం ప్రవేశించింది. లేకపోతే నవ్వుతూ తుళ్ళుతూ తిరిగేపిల్ల, పైచదువుల మాటేనా ఎత్తకుండా టపీ మని ఉద్యోగంలో ఎందుకు కుదురు కుందంటావ్!' మాధవి జవాబును ఆశించి ప్రశ్న వెయ్యలేదు. ఏదో గలగల మంటూ నోటికొచ్చింది చదివేసింది. తన స్థితిని పెద్దమ్మ పట్టేయకుండా ఉండడనికి చేసిన సఫల ప్రయత్నం అది.
    'ఏమో తల్లీ! దాన్ని కని పెంచానన్న మాటేగాని దానితత్త్వం ఏవిటో ఇంత వరకూ నాకు అంతుపట్టలేదు. ఆ బియ్యే పరీక్ష అయినాక అది కుదురుగా ఇంటి పట్టున ఉన్నట్లే అనిపించలేదు. పొద్దున్నపోయిన పిల్ల చీకటిపడి ఇంటి కొచ్చేది. అదేవంటే బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడేది. ఏ క్షణాన కానీ, తాను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాననీ, ఎంత దూరమైనా సరే కన్నవాళ్ళను వదిలేసి వెళ్ళిపోగలననీ సూచించనైనా లేదు. ఏ బాధ్యతా లేకుండా బతికేస్తూ, ఏదన్నా మంచి చెప్పబోతే నీమీదా నామీదా విరుచుకుపడుతూ జల్సాగా కాలం వెళ్ళబుచ్చిన పిల్ల ఉన్నట్లుండి ఉద్యోగం చేస్తానంటూ అంతదూరం పోవటమేమిటో అందుకు నువ్వూ తాళం వేసినట్లే చేసి, మా స్నేహితురాలుంది, అన్నీ చూచుకుంటుందని దాన్ని పంపించడమేవిటో, ఇదంతా నా కిప్పటికీ అర్ధం కాలేదు మాధవీ! అది లేకపోతే ఈ యింటికి కళే లేదు. పెద్దది మనల్నందరినీ మోసంచేసి దాని దార్న అది తిరిగి రాని లోకాలకు వెళ్ళనే వెళ్ళింది. ఇదయినా కళ్ళెదుట ఉండకుండా ఊళ్లుపట్టుకు వెళ్ళిపోయింది. పెంచిన మమకారానికి నువ్వు మాత్రం మమ్మల్ని విడవలేకుండా ఉన్నావు. నీ జీవితం నట్టేట ముంచుతున్నా మామీద నీకు కోపం రావడం లేదు. తల్లీ! అది మాకు అదృష్టమే అయినా నీకుమాత్రం కాదు!-' పరమేశ్వరి గొంతు రుద్ధమై పోయింది. మాధవి కళ్ళల్లో తెరలాడిన నీటిపొరలు ఒక్క పరమేశ్వరిని పది బొమ్మలుగా చూపించసాగాయి, మాధవ్ చప్పున కళ్ళు ఒత్తుకుంది.
    'ఛ! ఊరుకో పెద్దమ్మా! ఇప్పుడు నీకీ ఆవేదన అంతా ఎందుకో తెలియడం లేదు. అసలేం జరిగిందని నువ్విలా బాధ పడుతున్నట్లు! రాధ ఉద్యోగంకోసం పొరుగూరికి పోవడం తప్పా? ఇక నేనంటావా! నా పెళ్ళి గురించేగా నీ మనస్సులో బాధంతా! విను పెద్దమ్మా! ఈ జన్మ కిక నేను పెళ్ళి చేసుకోను. అమ్మ ఎవరో ఎరగకపోయినా తల్లి ఆదరణ ఎటువంటిదో చూపించినదానివి. నువ్వు తప్ప ఈ లోకంలో నాకెవరూ లేరు. ఎప్పటికీ నిన్ను వదిలి పెట్టి వెళ్ళేస్థితి ఈ జీవితంలో రానీయను' - మాధవి ఆవేశంలో చెప్తున్న మాటలు మంత్ర ముగ్ధలా వింటూ ఉండిపోయింది పరమేశ్వరి. రెండుక్షణాల నిశ్శబ్దంతర్వాత, కొంచెం సంకోచం ధ్వనించే గొంతుకతోనే,
    'మధు ఆచూకీ ఏమీ తెలియనేలేదా మాధవీ?' అని ప్రశ్నించింది-
    చేసిందంతా చేసి, మధును దూరంగా తరిమేసినట్లే చేసి వీళ్ళకిప్పుడీ ప్రశ్నలెందుకు! వీళ్ళ అనిశ్చిత స్థితివల్ల కదూ 'తన్ను మనఃపూర్వకంగా ప్రేమించిన మధు దేశాలు పట్టిపోయింది! ఇప్పుడా చపలచిత్తుడు తిరిగి వచ్చి మాధవీ నువ్వు లేందే నేను బ్రతకలేను అని తనముందు మోకరించి అర్ధించినా అతన్ని స్వీకరించే స్థితి తనకు ఎక్కడ మిగిలిందని! ఇక మధు తనవాడు కాడు! కాలేడు? ఈ ఊహవల్ల మాధవి శరీరం గర పొడి చింది. దుఃఖం కసి అసూయ ముప్పిరిగొని ఆవిణ్ణి వేగించ సాగాయి. కళ్ళనిండా కమ్ముకుంటున్న నీటిపొరను రెప్పలమాటు అణచివేయడానికి విశ్వప్రయత్నం చేసింది.
    'పెద్దమ్మా! దయచేసి యిక నెప్పుడూ ఆయన ప్రసక్తి నా దగ్గర తేకండి. అలాగే నా పెళ్ళి ప్రసక్తి కూడా! శ్యామలక్కయ్య పెళ్ళికని తీసుకున్న అప్పు నయాపైసలతో ఆయనకు తీర్చేశాను. ఇక మనకూ ఆయనకూ మధ్య ఎటువంటి ఋణానుబంధమూ లేదు. అటు వంటి మనిషొకడు మన మధ్య మసిలే వాడన్న జ్ఞాపకాన్ని కూడా తుడిచివేయండి. నా కోసం. నా మనశ్శాంతికోసం ఈ నాలుగు గోడల మధ్యా వినబడకుండా ఉండేట్లు చేయండి. ఈ మాత్రం నాకోసం చేయలేరా పెద్దమ్మా! జీవితాన్నంతా మీ కోసం మీదు కట్టుకొన్న నా కోసం ఈ చిన్నపని చేయలేరా?-' ఈదర గాలికి చలించే చిగురాకులా ఉద్రేకంతో ఊగిపోతూ గట్టిగా అంటున్న మాధవిని విస్తుబోయి చూడసాగింది పరమేశ్వరి. అవిరళంగా చెంపలమీదికి జారుతున్న కన్నీటి ధారకు కరిగిపోయి చప్పున మాధవితలను తన రెండుచేతుల మధ్యా పొదుపుకుని గుండెకు హత్తుకుంది.
    'నే చచ్చిపోయాను తల్లీ! చేతులారా పెంచిన నీ మనస్సులో ఆరని చిచ్చు రగులు కోడానికి మేమే కారణం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఏదో నిరవాకం చెయ్యగలనని నిన్ను తెచ్చాను. చదువుకుని బుద్ధిమంతురాలివై పెంచిన దోషానికి, ఈ కుటుంబానికి పెద్ద అండగా నిల్చిన నువ్వు పెళ్ళి చేసుకుని పిల్లాపాపతో సుఖంగా ఉంటే చూద్దామన్నదే నా ఆశ. కాని మనుషులూ దేవుడూ, నీ జీవితంలో సుఖోదయానికీ రాహువుల్లా అడ్డుపడుతుంటే తటస్థంగా చూస్తూ ఉండిపోయానే తప్ప నీకేమీ చెయ్యలేకపోయాను. అందరూ వంటింట్లో పడుండే ఛాందసురాలను కుంటుంటే, నేనూ అదే పదే పదే మనస్సులో అనుకుంటూ, నన్ను నేను నమ్మించుకుంటూ నిన్ను నిరక్ష్యం చేశాను. తెగించి నీ జీవితం చక్కదిద్దే ప్రయత్నం చెయ్యలేకపోయాను. ఈ పాపం నాదేనమ్మా!' అంటూ భోరుమంది పరమేశ్వరి. మాధవి చప్పున కళ్ళు తుడుచుకుని,
    'ఛ! ఊరుకో పెద్దమ్మా! ఏమీ తెలియ దనుకున్న నీ మనస్సును కూడా ఇంత కోత పెడ్తున్నాననుకోలేదు. నువ్వు ఊరుకోకపోతే నామీద ఒట్టే-' అన్నది.

                            


    పరమేశ్వరి మరేమీ అనకుండా లోలో పల ఆలోచనల్ని తవ్వుకుంటూ అలాగే ఉండిపోయింది.

                                *    *    *

    సత్యవతమ్మగారు మెత్తని గొంతుకతో లాలిస్తున్నట్లుగా రాధకేసి చూసి అంటున్నారు. 'నీ అభిప్రాయాల్లో ఉన్న నిర్భయత్వానికి నేను ముచ్చట పడుతున్నాను. కాని అన్నివేళలా మనిషికి భయరాహిత్య మొక్కటే శ్రీరామరక్ష కాలేదు. సమాజం నిర్భయంగా ఉండే మనుషుల్ని గౌరవించగలదేమోగాని, సమయం దొరికినప్పుడు ఆ గుణాన్నే ఒక వంకగా తీసుకుని ఆ మనిషిని అథ్యపాతాళానికి తొక్కివేయాలనే పధకాలు వేస్తూ ఉంటుంది. నలుగురు నడిచే తోవలో నడిచినన్నాళ్ళూ నిన్నెవరూ గుర్తించనే గుర్తించరు. కాని నీకున్న ఆత్మధైర్యం వల్ల, నీ మనస్సుకు అబ్బిన విశాల దృక్పథం వల్ల, నీవు మంచి దనుకున్న వేపే కొంచెం మొగ్గి, అందరి కంటే భిన్నంగా నీవు కనిపించావా, అప్పుడు సమాజం నిన్ను పరిశీలించడం మొదలుపెడుతుంది. నిన్ను విమర్శిస్తుంది. అలనాడు భేతాళుడు విక్రమార్కుడిని పరీక్షించినట్లు నిన్నూ రకరకాల పరీక్షల్లో పడేస్తుంది. నీవలా అందరికంటే వేరుగా ఉండడం తప్పని నిరూపించడానికి నానా తంటాలూ పడుతుంది. చివరకు అర్ధంలే కసితో వేటకుక్కలా నిన్ను వెంటాడడానికైనా వెనుదీయకుండా తయారవుతుంది. అందుకేనమ్మా ఇటువంటి సమాజంలో, ఆత్మధైర్యమొక్కటి కాదు, సమయస్పూర్తి సందర్భోచితంగా ఇతరులు మనల్ని గమనించని విధంగా మెసిలే మెలుకువా, అవసరం.'
    రాధ వింటోంది. ఆవిడ మాటలూ, వాటిని మీంచి ఆవిడ వ్యక్తిత్వమూ అపూర్వంగా కనిపించసాగాయి రాధకు.
    ఆవిడ నిండుకుండ లాంటి మనిషి. యాభైకి దరిదాపుల్లో ఉన్న వయస్సు. సగం నెరిసీ నెరవని వెంట్రుకలు, బియ్యమూ నువ్వులూ కలబోసినట్లుగా కనిపిస్తూ ఆవిడ ముఖానికి వింత అందాన్నీ పెద్దరికపు హోదానీ కలిగిస్తున్నాయి. ఒంటిమీద పెద్దగా నగలు లేవు. పచ్చగా ఉన్న శరీరానికి అతికినట్లుగా మెళ్ళో నానూ, చేతులకు రెండు గాజులూ అందంగా అమిరాయి. ఆవిడ ముఖం చూస్తే ఏ కోణంలోనూ చులకనభావం కలిగించే రేఖలే కానరావు. ఆవిడది అద్భుతమైన సౌందర్యం కాకపోయినా చేయెత్తి దణ్ణం పెట్టాలనిపించే సొగసు.
    రాధ ఆలోచనలు వెనక్కు పరిగెత్తి నయ్ - ఈవిడ చెప్తున్న మాటలకూ మాధవి ఆలోచించిన పద్దతికీ ఎంతైనా సామరస్యం ఉంది. తన విషయం తెలిస్తే అమ్మా నాన్నా బయటికి తరిమేస్తారని తను ఊళ్లోనే వేరే ఉంటానన్నది. ఉద్యోగం చూచుకుని తనవాళ్ళతో తెగ తెంపులు చేసుకుని తన బతుకేదో తానే బతుకుతానన్నది. అప్పుడు మాధవి ఎంత చక్కగా చెప్పింది?
    'నీ అభిప్రాయాలు నీవు రాసే నవలల్లో అయితే బాగుంటయ్. కాని కార్యాచరణంలో కొంత సమయస్ఫూర్తి అవసరం. ఈ ఊళ్ళో ఉండి నీవు నిశ్చింతగా బ్రతకలేవు. ఎంత నీవు నమ్మిన ఆదర్శమైనా, దానికీ సంఘం ఆమోదముద్ర ఉంటేనే నిశ్చింత. అది లేనినాడు సంఘంతో ఘర్షణ పడకుండా తప్పించుకుంటూ సమయస్పూర్తితో నీవు నమ్మిన ఆదర్శాలను అనుసరించడం ఉత్తమం' - అన్నది. అంతేకాకుండా అందుకు పరిష్కారంగా తనే ఊరికి దూరంగా ఈ హైదరాబాదు నగరానికి ఉద్యోగ మిషమీద పంపించింది - తన స్నేహితురాలి అక్క దగ్గరికి పంపిస్తానంటే ఆవిడ తనకేం ఒరిగించగలదని అనుకున్నది గాని, ఆ స్నేహితురాలి అక్కరూపంలో ఇంత విజ్ఞాన ఖనిని, ఇంత సౌమ్యరాశిని చూడగలరని అనుకోలేదు -




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.