Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 14


 

                           కక్కుర్తి లేని దొంగ

                                                         జొన్నలగడ్డ రామలక్ష్మీ

    అదొక చిన్న బంగళా.
    చల్లని సాయం సమయం.
    బంగళా ముందు లాన్లో నాలుగు కుర్చీల్లో కూర్చున్నారు శేషగిరి - అయన స్నేహితులు !
    వారి మధ్య కబుర్లు జోరుగా సాగిపోతున్నాయి.
    అ సమయంలో గేటు దగ్గిర చిన్నగా చప్పుడయింది.
    స్నేహితుల మధ్య కబుర్లాగి పోయాయి.
    గేటు దగ్గర ఓ యువకుడు.
    శేషగిరి కుర్చీలోంచి లేచి గేటు దాకా వెళ్ళాడు.
    ఆ యువకుడెవరో ఆయనకు తెలియలేదు.
    "ఎవరు కావాలి?" అన్నాడాయన ఒరియాలో.
    "నేను తెలుగువాడినండీ --" అన్నాడా యువకుడు.
    "ఎవరు కావాలి ?" అన్నాడు శేషగిరి తెలుగులో.
    యువకుడాయనకు నమస్కరించి -- "తెలుగు మాట వినిపించి ఇలా వచ్చానండి--" అన్నాడు.
    ఇదేమైనా చందాల బాపతా అని అనుమానించాడు శేషగిరి. పైకది వ్యక్తం చేయకుండా -- "మీదీ ఊరు కాదా ?" అన్నాడు శేషగిరి.
    "కాదండి --"
    "నేను మీకేవిధంగా సాయపడగలను?"
    "నేను చిన్నవాణ్ణి. నన్ను మీరనకండి సార్...."
    అతడి విషయం మెచ్చుకో తగ్గదే అయినా శేషగిరి అసలు విషయమింకా తేలక విసుగ్గా ఉంది - "నేను నీకే విధంగా సాయపడగలను ?' అన్నాడాయన మళ్ళీ.
    'సాయం కాదండి. నేనే మీ యింట్లో కాసేపు సరదాగా ...." అని అర్ధోక్తిలో ఆగిపోయాడతడు.
    శేషగిరి ఇబ్బంది పడ్డాడు.
    మనిషి చూడ్డానికి పెద్ద మనిషిలాగున్నాడు. అంత మాత్రాన అపరాచితుడి నింటిలో కేలా  రానిస్తాడు?"
    "నీ ఉద్దేశ్యం నా కర్ధం కాలేదు....." అన్నాడు శేషగిరి.
    "లోపలకు రావచ్చా అండీ ?" అన్నాడతడు.
    కాదనలేకపోయాడు శేషగిరి.
    లాన్లో కుర్చీలు అయిదయ్యాయి. శేషగిరి స్నేహితుల కా యువకుడు కూడా జతపడ్డాడు.
    "నా పేరు గోపాల్ " అన్నాడతడు -- " నా ఊరు రాజమండ్రి --"
    శేషగిరి మనసులో విసుక్కుంటూన్నాడు. లేనిపోని కంఠసం వచ్చి తనకు తగులుకుందని అయన చిరాకు.
    "ఏం చేస్తున్నావు నువ్వు?" అన్నాడు శేషగిరి స్నేహితుడు.
    "ఇంకా ఏం చేయడం లేదండీ . ఖాళీ ...." అన్నాడతడు.
    "ఈ ఊరే పని మీదోచ్చావు ...."
    "వీసీ ఆర్ కొందామని ...."
    "ఏం -- అక్కడ దొరకడం లేదా?"
    "దొరుకుతున్నాయి కానీ పేపర్సుండవండీ . ఏ కస్టమ్స్ వాళ్ళైనా రెయిడ్ చేస్తే అసలుకే మోసం గదా...."
    'అంటే వీసీఆర్ కోసం రాజమండ్రి నుండి భువనేశ్వర్ వచ్చేవా?" అన్నాడు శేషగిరి స్నేహితుడాశ్చర్యంగా.
    'అవునండి ...."
    "ఇక్కడనీ కెవరైనా స్నేహితులున్నారా?"
    "లేరండీ --"
    "మరి వీసీఆరెలా కొందామనుకుంటున్నావు?"
    "కోనేశానండి ...." అన్నాడు గోపాల్.
    శేషగిరి స్నేహితుడాశ్చర్యంగా "ఊరు తెలియకుండా ఊళ్ళో వాళ్ళెవరూ తెలియకుండా, ఊళ్ళో బేరమారమేలా చేశావు?" వచ్చి ఎన్నాళ్ళ యిందేమిటి ?" అన్నాడు.
    "నిన్ననే వచ్చానండి ...."
    శేషగిరి విసుగ్గా - "నువ్వు చాలా ముక్తసరిగా సమాధానాలు చెబుతున్నావు అసలు నీ  గురించి పూర్తిగా చెప్పు ...." అన్నాడు.
    గోపాల్ నొచ్చుకోలేదు - "చాలా సారీ అండి. నేను రాత్రి కోరమండల్లో వెళ్ళిపోవాలి. నా కెక్కువ టైము లేదు. వచ్చిన పనేమిటో త్వరగా చెబుతాను " అన్నాడు.
    గోపాల్ బియ్యే ప్యాసయ్యాడు. తండ్రిది బట్టల వ్యాపారం. కొడుకును కూడా వ్యాపారంలో పెట్టాలని అయన కోరిక. గోపాల్ కి బ్యాంకు ద్యోగం సంపాదించాలని కోరిక. ఉద్యోగమైతే టైముకు వెళ్ళి టైముకి వచ్చి  హాయిగా జీవితం ఎంజాయ్ చేయొచ్చునని అతడి భావం. బ్యాంకు పరీక్షలు రాశాడు. ఫలితా లింకా రాలేదు.
    వ్యాపారం పని మీద గోపాల్ తండ్రి స్నేహితుడి ఊరొచ్చాడు. అప్పుడాయనకు తెలిసింది వీసీఅర్ సంగతి. అదీ అనుకోకుండా మాటల సందర్భంలో తెలిసింది.
    ఒకాయనకు వీసీఅర్ కొన్నాక ఏమీ కలిసి రాలేదు. చాలామంది అందుకు వీసీఅర్ కారణమన్నరుట. చివరకో రోజున క్రికెట్ బంతి తగిలి కలర్ టెలివిజన్ స్క్రీన్ బద్దలయింది. ఆయనిక వీసీఅర్ అమ్మేయాలనుకుంటూన్నాడు. అయన వీసీఅర్ పదిహేను వేల రూపాయలకు కస్టమ్స్ డ్యూటీ  వగయరాలన్నీ చెల్లించి మరీ కొన్నాడు. పేపర్సన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే అయన తన వీసీఅర్ ని భువనేశ్వర్ లో ఎవరికీ అమ్మదల్చు కోలేదు. ఏమైనా అయితే  తనేదో తప్పు చేసినట్లు ఫీలవ్వాలి.
    గోపాల్ తండ్రి వీసీఅర్ కొనాలనుకొంటున్నాడు. అదాయన స్నేహితుడికి తెలుసు. అయన వీసీఅర్ ఓనర్ తో - 'అప్పుడే మీరితరులకు మాటివ్వకండి. నేను కొంటె కొంటాను ...." అని చెప్పాడు.    
    అయన పదమూడు వేలకయితే వీసీఅరివ్వడానికి సిద్దంగా ఉన్నాడు.
    విషయం  గోపాల్ తండ్రికి చేరింది.
    పేపర్స్ తో వీసీఅర్ దొరుకుతోందంటే ఆయనకు సంతోషమే.
    కానీ వీసీఅర్ చరిత్ర ఆయనకు నచ్చలేదు.
    అసలే అయన వ్యాపారస్తుడు . ఎన్నో రకాల సెంటిమెంట్స్ ఉంటాయి.
    బాగా అలోచించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు.
    వ్యాపారం లో కొడుక్కింకా భాగం లేదు. కాబట్టి వీసీఅర్ ని కొడుకుని కొనమన్నాడు. ఏ నష్టం జరిగినా కొడుక్కే జరుగుతుంది. అది తాను సరి చేయగలడు. తను పచ్చగా ఉన్నంతకాలం కొడుక్కే యిబ్బందీ ఉండదు. తనే దెబ్బతింటే కష్టం.
    అదీకాక - పదమూడు గోపాల్ తండ్రికి అచ్చొచ్చిన అంకె!
    వీసీఅర్ ఖరీదు పదమూడు వేలు!
    కొనడం కూడా పదమూడో తారీఖున అని అయన నిర్ణయించాడు.
    "ఈ రోజు పదమూడో తారీఖు...." అన్నాడు గోపాల్.
    "ఇంతకూ నీకు నాతొ పనేమిటి?" అన్నాడు శేషగిరి.
    "అమ్మినాయన ఇంట్లో టీవీ లేదు. వీసీఅర్ ఎలా పని చేస్తున్నదీ తెలుసుకోవాలంటే వేరే మార్గం లేదు. టీవీ తెప్పించి డిమాన్ స్ట్రేట్ చేయడానికి కాయనోప్పుకోలేదు. వీసీఅర్ కండిషన్ లో ఉంది. ఇష్టమైతే తీసుకో లేకపోతె మానేయ్యమన్నాడు."
    "ఎవరు బాబూ అయన?"
    "పేరెందుకు లెండి చెప్పడం -- అయన పెరేవరికీ చెప్పకూడదని మా ఒప్పందం" అన్నాడు గోపాల్.
    "అయితే అదెలా టెస్టు చేశావు?" అన్నాడు శేషగిరి.
    "ఆ టెస్టు చేయడానికే మీ సాయం కావాలండి !"
    "సాయమా!" అన్నాడు శేషగిరి ఆశ్చర్యంగా.
    "అదేనండి - మీ యింట్లో టీవీ ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. నేను వీసీఅర్ తెచ్చి మీ యింట్లో ప్లే చేస్తాను" అన్నాడు గోపాల్.
    "మాది బ్లాక్ అండ్ వైట్ టీవీ" అన్నాడు శేషగిరి కాస్త మొహమాటంగా.
    "టెస్టింగు కు పనికొస్తుందని నేను కూడా తెచ్చిన సినిమా కూడా బ్లాక్ అండ్ వైటే?" అన్నాడు గోపాల్.
    "ఏ పిక్చరేమిటి బాబూ అది?" అన్నాడు శేషగిరి స్నెహితుడోకాయన కుతూహలంగా.
    "మాయాబజార్ !" అన్నాడు గోపాల్.
    "మాయబజారా!" అక్కడున్న వారందరూ ఉలిక్కిపడ్డారు.
    శేషగిరి కూడా కుతూహలంగా - "మాయాబజార్ సినిమా వీడియో ప్రింటు గా రిలీజ్ చేశారేమిటి?" అన్నాడు.
    "నిర్మాతలు చేసినట్లు లేదు. కానీ కాసేట్ దొరుకుతోంది. ప్రింటు బాగుందండి. రాజమండ్రిలో చూశాను"
    "ఇలా కాసెట్లు చూడ్డం నేరం కదూ?" అన్నాడు శేషగిరి.
    "నేరమేమిటండి ! ఆంధ్రాలో రిలీజయిన ప్రతి తెలుగు సినిమా కాసేట్ నేనిక్కడ విడియో పార్లర్స్ లో  చూస్తూనే ఉన్నాను. ఎవరూ పట్టించుకోవడం లేదు."
    "మీ యింట్లో మాయాబజారు సినిమా వేసుకుందామండి. మీరు సినిమా చూసినట్లూ ఉంటుంది. నా వీసీఅర్ టెస్టింగ్ అయిపోతుంది" అన్నాడు గోపాల్.
    శేషగిరి ఆలోచనలో పడ్డాడు.
    "కావాలంటే మీరు మీ స్నేహితుల క్కూడా కబురు పెట్టుకోండి...."
    శేషగిరి స్నేహితులు వెంటనే "ఒప్పుకోండి- మేమూ మా వాళ్ళను తీసుకుని వస్తాం " అని "ఎన్నింటికి వేస్తావేమిటి నాయినా సినిమా!" అనడిగారు గోపాల్ని.
    "ఏడింటికి మొదలు పెడితే పదింటికయిపోతుంది! నేను కోరమండల్ కి సులభంగా అందుకోగలుగుతాను."
    "మరి నీ భోజనం ?" అన్నాడు శేషగిరి.
    "శనివారం నేను ఫలహారం కూడా చేయను. పానీయము కూడా తాగను - మంచినీళ్ళు తప్ప ...." అన్నాడు గోపాల్.
    శేషగిరి మనసు తేలిక పడింది. భోజనం కోసం గోపాల్ తనింటికి వస్తున్నాడని అనుమానించినందుకాయన నొచ్చుకున్నాడు కూడా.
    "సినిమా కోసం ఈ యిల్లే ఎందుకెన్నుకున్నావు?" అన్నాడు శేషగిరి స్నేహితుడోకడు.
    "ఇలా వెడుతుంటే తెలుగు మాటలు వినిపించాయి. ఇంటి మీద యంటేన్నా కనబడింది. ప్రయత్నిద్దామని వచ్చాను. మీ కిబ్బంది కలిగించినందుకు మన్నించాలి" అన్నాడు గోపాల్.
    "ఊరికే సినిమా చూపిస్తుంటే ఇబ్బందే ముంది? అందులోనూ తెలుగు సినిమా - అదీ మాయాబజార్ !" అన్నాడు శేషగిరి స్నేహితుడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.