Home » VASUNDHARA » Trick Trick Trick
అప్పుడే బేరర్ గోపీవద్దకు వచ్చాడు.
బేరర్-ఎవరామె?" అనడిగాడు గోపీ.
బేరర్ జాలిగా ముఖంపెట్టి- "పాపం-పెద్దింటమ్మాయిసార్! ఈ మధ్యనే ఈ ఊరొచ్చింది. ఉద్యోగం చేస్తోంది. నేనుండే వీధిలోనే ఉంటోందిసార్.....కానీ నేనేమీ సాయం చేయలేను. లోకల్ గూండా సోముదృష్టిలో పడింది. వాడామెను తరుముకు వచ్చాడు. ఆమె ఇక్కడ దూరింది. కానీ లాభంలేదు. ఆమె పని అయిపోయినట్లే-" అన్నాడు.
"అంటే?" అన్నాడు గోపీ.
"ఆమె హోటల్లో అడుగుపెట్టగానే సోము హోటల్ గుమ్మంవద్ద ఆగి-" నిన్ను బలవంత పెట్టడం నాకూ ఇష్టంలేదు. ఈ హోటల్లో నిన్నెవ్వరైనా నా బారినుంచి రక్షిస్తామంటే చాలు. నిన్ను వదిలిపెట్టేస్తాను. సరిగ్గా అయిదు నిముషాలు గడువిస్తున్నాను. అయిదునిముషాల్లో ఎవ్వరూ దొరక్కపోతే నువ్వు నాకు లొంగిపోవాలి. లేదా నేనే నిన్ను లొంగదీసుకుంటాను-" అన్నాడు. ఆమె ఎప్పుడు తన్ను తాను రక్షించుకోవడంకోసం వృధా ప్రయత్నాలు చేస్తోంది-" అన్నాడు బేరర్.
"ఇది చాలా దారుణం. ఇంత పెద్ద హోటల్లో ఆమెను రక్షించడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రారా? వీళ్ళు తాగుతున్నది బీరా, నీరా?" అన్నాడు గోపీ.
"ఏం తాగినా తన పెళ్ళాం బిడ్డలు ముఖంగా జీవించాలనుకునే వాడెవడూ ఆ సోము జోలికి వెళ్ళడు-" అన్నాడు బేరర్.
"మరి హోటల్ యజమాని ఏం చేస్తాడు? తన హోటల్లో అడుగుపెట్టినవారికి రక్షణ ఏర్పాటు చేయలేడా?"
"ఎలా చేస్తాడు? ఆయనకూ పెళ్ళాంబిడ్డలున్నారు-"
"అయితే పోలీసులేమయ్యారు?"
"వాళ్ళకూ ఉన్నారు పెళ్ళాం బిడ్డలు..."
గోపీ నవ్వుతూ- "ఎవ్వరూ లాభం లేదంటున్నావ్. నీకైనా ఆ ఆడకూతురుమీద జాలివెయ్యడంలేదూ-" అన్నాడు.
"సార్- మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తున్నట్లులేదు. నాకూ ఉన్నారు పెళ్ళాం బిడ్డలు....." అన్నాడు బేరర్.
"అయితే పెళ్ళాంబిడ్డలులేని వాడెవడైనాఉంటే వాడే ఆ సోమును ఎదిరించాలంటావ్!" అన్నాడు గోపీ.
"కాదు-ప్రాణాలమీద ఆశలేనివాడే వాడి జోలికి వెళ్ళాలి...."అని-"అయిదు నిముషాలూ అయిపోయినట్లున్నాయి. ఆ సోము హోటల్లో అడుగుపెట్టాడు. ఇంక ఆ పిల్లనెవ్వరూ రక్షించలేరు...." అంటూ బేరర్ కంగారుగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
గోపీ చటుక్కున జేబులోంచి రివాల్వర్ తీసి ఎవరికీ తెలియకుండా ఆ చేతిమీద జేబురుమాలు ఉంచాడు. అతడి దృష్టి ఆ యువతిపైనే ఉంది. ఆమె ఎటూదారి కనపడక-మెట్లవైపుపరుగెత్తి చకచకా పైకి వెళ్ళసాగింది. ఆమె కొంత పైకి వెళ్ళేసరికి ఆమెను తఃరుముతూ సోమువచ్చాడు.
చూడగానే గూండా అని తెలిసిపోయేలా ఉన్నది వాడి రూపం. వాడి ముఖంలో నిర్లక్ష్యం, గర్వం స్పష్టంగా కనబడుతున్నాయి. వాడు త్వరత్వరగా తనూ మెట్లెక్కడం ప్రారంభించాడు. గోపీ లెక్కపెడుతున్నాడు-వాడు ఎన్ని మెట్లెక్కుతున్నదీ- ఒకటి.....రెండు.....మూడు.....
ప్రతిమెట్టుకూ అలంకరణగా ఇవతల చివరగా సుమారు రెండడుగుల విస్కీబాటిలు ఉంచబడింది.
సోము సరిగ్గా పన్నెండవమెట్టుమీద అడుగుపెట్టగానే గోపీ చేతిలోని రివాల్వర్ పేలింది. సోము అడుగుపెట్టిన పన్నెండవమెట్టుమీది కాళీ విస్కీ బాటిల్ పగిలింది.
సోము ఉలిక్కిపడి అప్రయత్నంగా ఒకడుగు క్రిందకువేశాడు. అప్పుడు పదకొండవ మెట్టుమీది విస్కీబాటిల్ పగిలింది. సోము మరోమెట్టు క్రిందకు దిగాడు. మళ్ళీ మరోబాటిల్....
అలా సోము ఆరవమెట్టుమీదకురాగానే గోపీ మరోరివాల్వర్ అందుకుని వరుసగా, చకచకా, ఆగకుండా ఆరుగుళ్ళు పేల్చి-ఆరుసీసాలను పగులగొట్టాడు. అదేవేగంతో సోముకూడా మెట్లన్నీ దిగిపోయాడు. అన్ని మెట్లూ దిగేక వాడి బుర్రపనిచేయడం మొదలుపెట్టింది.
తనను ఎదిరించే మొనగాడొకడీ హోటల్లో ఉన్నాడు. ఎవడువాడు?
రివాల్వర్ ప్రేలినదిశగా చూశాడు సోము.
గోపీ తాపీగా బీరుతాగుతున్నాడు. అతడిముందు బల్లపైన ఒక రివాల్వరున్నది. అతడి చేతిలోని గోలీ ఆడుతున్నది.
సోము కసిగా గోపీవంకచూశాడు. గోపీ వాడిని చూడడంలేదు.
ఒక్కక్షణం ఆలోచించాడు సోము. ఈ హోటల్లోకివచ్చి తననెదిరించాడంటే వాడు ప్రాణాలకు తెగించినవాడై ఉండాలి. గురి తప్పకుండా పన్నెండు సీసాలను పేల్చాడంటే వాడు సమర్ధుడై ఉండాలి. ఇలాంటి వాడికి ఎదురు వెళ్ళకూడదు. చాటుగా దెబ్బతీయాలి.
సోము హోటల్లోంచి బైటకు వెళ్ళిపోతున్న వాడిలాచరచరా గుమ్మం వరకూ వెళ్ళాడు. అక్కడినుంచి చటుక్కున వెనక్కుతిరిగి ఊహించలేని వేగంతో చాకును విసిరాడు.
గోపీ చేతిలో గోలీ ఆడుతూనే ఉన్నది. హోటల్ గుమ్మానికి అతడివీపు కనపడుతూండవచ్చును. కానీ గోలీలో అతఃడు స్పష్టంగా సోమును చూశాడు. సోము చాకువిసరగానే, అతడు పక్కకు తప్పుకున్నాడు. సోము విసిరిన చాకు బల్లకు గుచ్చుకున్నది. ఈలోగా సోముమరో చాకు విసిరాడు. గోపీ మళ్ళీ పక్కకు తప్పుకున్నాడు. అదీ బల్లకు గుచ్చుకున్నది.
గుమ్మంవద్ద సోము తెల్లబోయి అలాగే నిలబడిపోయాడు. హాల్లోని వారందరూ తమతమపనులు మరిచిపోయి విడ్డూరం చూస్తున్నారు. మేడ మెట్లెక్కిన యువతి క్రిందకు దిగిరాబోయి-సీసా పగిలిన మెట్టువరకూవచ్చి అక్కడే ఆగిపోయి చోద్యం చూస్తున్నది.
బేరర్ వణుకుతూ గోపీకి బిల్లుతెచ్చి ఇచ్చాడు. గోపీ బల్లమీదున్న రెండుచాకులూతీసి ట్రేలో ఉంచి-"బేరర్-ఇవి సోమూకిచ్చేయ్-" అన్నాడు.
"సార్.....నా భార్యాబిడ్డలు...." అన్నాడు భయంగా.
"వాళ్ళకోసమే.....వెళ్ళు...." అంటూ గద్దించాడు గోపీ.
బేరర్ భయం భయంగా ట్రే అందుకున్నాడు.
"ఉండు-వాడికి చదువంటూవస్తే ఈ చీటీ కూడా చదువుకోమను-" అంటూ ఓ కాగితంమీద-"మిస్టర్ సోమూ! ఈ చాకులు నీకెందుకు పంపిస్తున్నానో తెలుసా? నీగురి ఎలాంటిదో చూద్దామని. ఇందాకా నీవు చాకు విసిరినప్పుడు నేను పక్కకు తప్పుకుని నా ప్రాణాలు రక్షించుకున్నాను. ఈ పర్యాయం అలాకాదు. నీకెదురుగా నిలబడతాను. ఒక్క అంగుళం కూడా అటూ, ఇటూగానీ, ముందువెనుకలకుగానీ జరుగను. నీ రెండు చాకులూ ఉపయోగించి నీగురి ఎలాంటిదో నాకు తెలియజెప్పు-" అని రాసి ఆట్రేలో ఉంచాడు.





