Home » VASUNDHARA » Pelli Chesi Chudu
వెంకట్రామయ్య కు వెంటనే జవాబు దొరకలేదు. ఆయనే కాదు ఏ మధ్యతరగతి మనిషీకి దొరకదు. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా తమ కొడుకుల వివాహాలకు కట్నాలాశించే ఈ విషవలయ సమస్యలో ఎవరి బుర్ర సరియైన తర్కం ప్రకారం ఆలోచించదు. అసలు కట్నమనేది ఎందుకు ----- అన్నది ప్రశ్నగానైనా వారికి స్పురించదు.
"ఏం చెప్పమంటారు చెప్పండి? మీ బాధను నేనర్ధం చేసుకోగలను కానీ నివారించలేను. నాకూ యింకా కూతుళ్ళున్నారు. ఈ పెళ్ళికి తల తాకట్టు పెట్టి తెచ్చి పదివేలు కట్నంగా యిచ్చాననుకొండి. వాళ్ళ గతేం కాను చెప్పండి. మీరు మరీ అంతలాగంటున్నారు కాబట్టి ఎలాగో అలా ఆరువేలువ్వగలను ....'
అక్కణ్ణించి సంభాషణ గురించి ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. కూరగాయల బెరంలా కొనసాగిందని ఒక్కముక్క చెబితే చాలు.
చివరకు బేరం ఏడు వేల అయిదు వందలకు పైనలు చేశారు. అంతకు మించి తను చేయగలిగినదేమీ లేదని చాలా నిక్కచ్చిగా చెప్పేశాడు వెంకట్రామయ్య.
ఈ బేరం స్థిరపడేలోగా వెంకట్రామయ్య, భీమరాజు ఇద్దరూ పరస్పరం యిబ్బందుల గురించి మాట్లాడుకున్నారు. ఒకరి మీద ఒకరు జాలిని ప్రకటించారు. అందులో హోదాను పెంచుకుందుకు ప్రయత్నించారు.
"కట్నంతో నిమిత్తం లేకుండానే ఈ పెళ్ళి స్థిరపడిపోయి నట్లు నేను ముందే చెప్పాను కదా బావగారూ - మీ మాటే నా మాట. ఎటొచ్చీ చాదస్తం అనుకోకుండా నా ఒక్క మాటను మీరు మన్నించాలి. తరతరాలుగా మా యింట వస్తున్న ఆచారమేమిటంటే ---- పెద్ద కుర్రాడి పెళ్ళికి ఇంటిల్లిపాదికి అప్పగింతల బట్టలు పెట్టడం ; ఇంటిల్లిపాదీ అంటే అంతాకాదు . నేనూ నా భార్య పిల్లలూ కాక మా అమ్మగారు ------' అన్నాడు భీమరాజు.
వెంకట్రామయ్య కదో పెద్ద విశేషమనిపించలేదు. అలాగే నన్నాడాయన ఉత్సాహంగా.
భీమరాజు వెంకట్రామయ్య చేతులు పట్టుకుని ----- "ఈ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోతుంది బావగారూ -- నేను హామీ ఇస్తున్నాను. ముహూర్తాల సంగతి ఇప్పుడే మాట్లాడుకుందాం -- ' అంటూ గదిలోంచి బయటకు దారి తీశాడు.
చేతిలో చేయి వేసుకుని ఉత్సాహంగా వస్తున్న ఆ వియ్యంకుళ్ళనిద్దర్నీ విచిత్రంగా చూస్తున్నారు మిగతా జనం.
7
ప్రియమైన చిరంజీవి రాజారావును ఆశ్వీరదించి వ్రాయునది ----
చిరంజీవి లక్ష్మీకి వివాహము నిశ్చయమైనది. వరుడు ఇదివరలో నేను ప్రస్తావించిన హైదరాబాదు వాస్తవ్యులు మహారాజాశ్రీ భీమరాజు బావగారి కుమారుడు చిరంజీవి బాబూరావు. వివాహ ముహూర్తం కూడా ఇంచుమించు నిశ్చయమైనట్లే - మే నెలలోని రెండు తేదీలలో ఒకతేది వరుని తరుపువారు నిశ్చయించి పంపగానే నీకు మళ్ళీ ఉత్తరం వ్రాస్తాను. మిగతా ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి...."
తండ్రి రాసిన ఈ ఉత్తరం మరోసారి చదువుకున్నాడు రాజారావు. అడనికా ఉత్తరం అంది సుమారు మూడు వారాలవుతోంది. తర్వాత అతనికే మళ్ళీ ఉత్తరం లేదు. పెళ్ళి నిశ్చయమయిందని తనకో ఉత్తరం వచ్చిందనీ తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరన్నుంచీ సమాచారం లేదనీ కంగారుపడుతూ మోహనరావు కూడా కలకత్తా నుంచి ఉత్తరం రాశాడు రాజారావుకి. తన పరిస్థితి అంతేనంటూ జవాబు రాశాడు రాజారావు.
అన్నదమ్ములిద్దరిదీ ఒకటే భయం. ఇద్దరికీ ఒకటే బాధ. తండ్రి డబ్బు గురించి ఏమీ వ్రాయలేదు . అన్నీ ముఖాముఖీ మాట్లాడుకోవచ్చునని రాశాడు. అయన వ్రాసిన ప్రకారం పెళ్ళి ముహూర్తాని కింక నెలరోజులు కూడా వ్యవధి లేదు మరి. మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నట్లు వ్రాశాడు.అంటే పెళ్ళికి ఖర్చు ఎంతని అంచనా వేస్తున్నారు - ఎంత డబ్బు సమకూరుస్తున్నారు- అన్న విషయాలేవీ తెలియడం లేదు.
ఇవి అంత సామాన్యమైన విషయాలు కావు. క్షణాల మీద వేలకొద్ది డబ్బు పుట్టించడం మాటలు కాదు. పెళ్ళి ముహూర్తం నిశ్చయమైనట్లు తెలియగానే రాజారావు ప్రావిడెంట్ ఫండ్ లో రెండు వేల రూపాయల లోన్ కు అప్లయి చేశాడు. మే 1 వ తేదీ కింటికి వెళ్ళే పక్షంలో ఆనెల జీతం ఇంటికి తీసుకుపోవచ్చు. అన్నీ కలిపి సుమారు మూడువేల రూపాయల క్యాషు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు. మోహనరావు దగ్గర డిపాజిట్ల బాపతూ అదీ ఇదీ కలిపి మూడు వేల రూపాయల క్యాషున్నదట. అదికాక మరో మూడు వేలకు లోన్ పెడతానని అతను వ్రాశాడు.
అంటే సుమారు తొమ్మిది వేలు క్యాషు పోగుపడుతుందన్న మాట - పెళ్ళికి కట్న మెంతో ,ఖర్చు లేమిటో - అసలు మొత్తం ఎంతవుతుందో - ఇటువంటి ఆలోచనలు అన్నదమ్ములిద్దర్నీ పీడిస్తున్నాయి. ముహూర్తపు తేదీని సూచించడమైతే జరిగింది కానీ అసలైన ముహూర్తపు తేదీ ఇది అని ఒక వుత్తరం రావాలి కదా!
రాజారావుకు ఏప్రిల్ 19 న పుత్రోదయమైంది. తన కొడుకును చూడాలని అతను తహతహ లాడుతున్నాడు. మామగారతనికి ఉత్తరం రాస్తూ కుర్రాడి నక్షత్రం మంచిదే అయినప్పటికీ ఎప్పటి లాగానే సంప్రదాయం ప్రకారం- ఇరవై ఒకటో నాడు నూనెలో ముఖం చూసే తంతు ఏర్పాటు చేస్తామని రాశారు. అనగా మే తొమ్మిదవ తేదీ వరకూ కుర్రాడిని చూడ్డం ఎలాగూ పడదు. ఎటొచ్చీ అప్పటికి తను ఆంధ్రాలో ఉండాలి. చెల్లెలి పెళ్ళి ముహూర్తం తెలిస్తే ఏకంగా పెద్ద సెలవు తీసుకుని ఇంటికి బయల్దేరిపోవచ్చును. కానీ ఇంటి దగ్గర్నుంచీ ఉత్తరం లేదు. ఏం చేయాలో అతనికి పాలుపోవడం లేదు. అతను కంగారుగా ఇంటికి రాసిన ఏ ఉత్తరానికీ జవాబు రాలేదు. ఆ కారణంగా లక్ష్మీ పెళ్ళి గురించి తండ్రి రాసిన ఒకే ఒక ఉత్తరాన్ని ప్రతిరోజూ పటిస్తూ ఉంటాడు రాజారావు. తనుసరిగా అర్ధం చేసుకోలెకుండా వదిలి పెట్టిన వాక్యాలేమైనా అందులో ఉండిపోయాయేమోనని. ఎన్నిసార్లు చదివితే మాత్రం అందులో కొత్త విశేషాలు పుట్టుకొస్తాయి ?
తండ్రి మీద చాలా కోపం వచ్చింది రాజారావుకు. ఆయన్ను గురించి ఏమనుకోవాలో అతని కర్ధం కాలేదు. ఏదో ఒక విషయం ఉత్తరం రాస్తే అయన సొమ్మేం పోయింది? పోనీ ముహూర్తం విషయం ఇంకా అనిశ్చితంగా ఉంటే ఆ సంగతే వ్రాయవచ్చు గదా!
హటాత్తుగా రాజారావుకో విషయం స్పురించింది. తండ్రి మిగతా ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతున్నట్లు వ్రాశాడు , అంటే అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటున్నాడన్నామాట! బహుశా ఆ వ్యవహారాలూ చూసుకుంటున్న హడావుడిలో అయన వుత్తరం రాసే తీరిక కూడా చిక్కి ఉండదు. అదే నిజమైతే అంతకంటే కావలసినదేముంది?
కానీ తండ్రి గురించి చిన్నతనం నుంచీ ఎరిగున్న అతను అయన తాము వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లూ చేసి వుంచుతాడనే విషయాన్ని నమ్మలేకుండా వున్నాడు.
చిట్టచిరవకు రాజారావు ఎదురు చూస్తున్న ఉత్తరం వచ్చింది. ఉత్తరం చాలా క్లుప్తంగా ఉంది. మే 21 వ తేదీకి ముహూర్తం నిశ్చయించారనీ. దైవానుగ్రహం వల్ల అన్ని పనులూ సక్రమంగా జరిగిపోగలవనీ - ఉత్తరం అందిన వెంటనే అర్జంటుగా బయల్దేరి రావలసిందనీ వ్రాశారయన. డబ్బు గురించి ఏమీ వ్రాయలేదు. అదే రోజున మామగారి దగ్గర్నుంచీ కూడా ఉత్తరం వచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారనీ, అనుకున్న ప్రకారం ఇరవై ఒకటో రోజుకి తప్పకుండా బయల్దేరి రావాల్సిందనీ రాశారాయన. అంటే మే తొమ్మిదవ తేదీకి కొడుకును చూడగలుగుతాడు తను. ఈలోగా వెళ్ళినా ప్రయోజనం లేదు మరి. జీతం తీసుకుని ఒకటవ తేదీని బయల్దేరడానికి రాజారావు నిశ్చయించుకున్నాడు. ఎలాగూ భార్య దగ్గరకు వెళ్ళి ప్రయోజనం లేదు కనుకనూ - స్వగ్రామంలో పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి కనుకనూ - తిన్నగా ఇంటికి వెళ్ళి పోయి - అక్కణ్ణించి మామగారు వ్రాసిన తేదీకి అత్తారింటికి వెళ్ళదల్చుకున్నాడతను. అదే విషయాన్ని మామగారికి వ్రాశాడతను. వివాహ ముహుర్తం మే 25 న అయితే ఆ విషయాన్ని తండ్రి అతనికి ఏప్రిల్ 25 కు అందజేశాడు. పెళ్ళి ఏర్పాట్ల కావ్యవధి చాల్తుందో చాలదో అతనికి అర్ధం కావడం లేదు.





