Home » VASUNDHARA » Pelli Chesi Chudu



    "కంట్రాక్టర్స్  పలుకుబడితో మమ్మల్ని ట్రాన్సు ఫర్ చేయించగలరేమో - మేము కంట్రాక్టర్సుని సరాసరి జైలుకే పంపించగలం --- " అనేవాడు మోహనరావు.
    కొన్నాళ్ళకు ఇది వారి కలవాటుగా పరిణమించింది. భార్య పోరుపడలేక బాబయ్యగారు మోహనరావు దగ్గర తన వృత్తి గొప్పతనం చెప్పడం అలవాటు చేసుకున్నాడు. ఆ కారణంగా ఆ ఇద్దరూ కలిసినప్పుడల్లా - రైల్వేలూ, కంట్రాక్టర్లూ గురించి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఒకరు చెప్పేదింకొకరు వినరు. బాబయ్యగారు కాంట్రాక్స్ అన్నప్పుడల్లా మోహనరావు రైల్వేలు అంటాడు.
    బాబయ్యగారిప్పుడు మోహనరావింటికి వచ్చి శ్రీకాంత్ పరిస్థితి తెలుసుకుని - తను ప్రయత్నించి శ్రీకాంత్ కేదైనా ఉద్యోగం వేయిస్తానని అన్నాడు. తనంతటతానె అన్నాడు కదా అని మోహనరావు సరేనన్నాడు. శ్రీకాంత్ ని తీసుకుని తన ఊరు వెళ్ళబోయే ముందు బాబయ్యగారికి గుర్తు వచ్చింది. శ్రీకాంత్ ని తీసుకు రమ్మని ఆయనకు నీలవేణి చెప్పింది. తీసుకువచ్చేముందు ----" ఉద్యోగాలు వేయించడం మీలాంటి ఉద్యోగస్తుల వల్ల అయ్యే పనికాదు. మా కాంట్రాక్టర్లు సిఫార్సు చేస్తే క్షణాల మీద ఉద్యోగాలు వేయించవచ్చు నని" మోహనరావుకు చెప్పడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పింది. గుర్తుకు రాగానే బాబయ్యగారు మాటలు మోహనరావు దగ్గర అనేశాడు.
    మోహనరావు నవ్వి -----' అవుననుకోండి. కానీ కంగారుపడి మీరు మాములుగా ఇప్పించగల కళాసీ ఉద్యోగంలో మాత్రం వీణ్ణి చేర్పించకండి. వీడు చదివింది బియ్యే -" అన్నాడు.
    శ్రీకాంత్ కాస్త ఉత్సాహంగానే బాబయ్యగారితో వెళ్ళేడు. అయితే అతని అదృష్టం బాగున్నట్టు లేదు. బాబయ్యగారతని గురించి చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు ఫలించినట్లులేదు. ఇంట్లో నీలవేణి ప్రతిరోజూ ప్రతిక్షణమూ తన హోదాను శ్రీకాంత్ ముందు వివరించి- కళ్ళారా చూస్తున్నావు కదా - మీ అన్నయ్య లిద్దరూ ఎప్పటి కైనా నా స్థాయి చేరుకోగలరంటావా ? అనడుగుతుండేది. శ్రీకాంత్ కి పిన్ని మీద మాత్రమే కాక అన్నల మీద కూడా గౌరవముండడం వల్ల --'అలా చేరుకోవాలనే కదా - నువ్వయినా మేమైనా అనుకునేది ----" అని చమత్కారంగా ఊరుకునేవాడు. ఈ సమాధానం నీలవేణికి రుచించేది కాదు. "మీ అన్నయ్యలకు నామీద అభిమానం లేదు. నన్ను నానా మాటలూ అంటుంటారు. నేను వాళ్ళను చిన్నప్పటి నుంచీ కన్న బిడ్డలకంటే ఎక్కువగా పెంచాను. అయినా వాళ్ళకా విశ్వాసం లేదు. అలాంటి వాళ్ళు పైకి రారు -----" అంటుండేది. ఆ మాటలు శ్రీకాంత్ ని బాధించేవి. కానీ అతను-- "నువ్వలా ఎండుకంతున్నవో తెలియదు పిన్నీ - వాళ్ళకు నువ్వంటే చాలా గౌరవం -----' అనేవాడు. నాలుగైదు నెలలు అతనక్కడున్నాక తనకింకా ఉద్యోగం రాలేదని బాధపడితే నీలవేణి కోపంగా ----- "బాబయ్యగా రెంతమందికో ఉద్యోగాలు వేయించారు. ఎవళ్ళకీ ఇంతకాలం పట్టలేదు. అయినా నీ అదృష్టం బాగోలేదు. ఓ కంపెనీ వాడు తను కంపెనీ ప్రారంభించగానే నీకుద్యోగమిస్తానన్నాడు. అదేం దురదృష్టమో - అంతవరకూ అన్నీ సవ్యంగా ఉన్నాయనుకున్న ఆ కంపెనీ ప్రారంభం కాలేదు. ఏం చేస్తాం -దేనికైనా టైము రావాలి ------' అనేసింది.
    ఉద్యోగం గురించి మనిషి మీద కాక టైము మీద ఆధారపడే పక్షంలో మరోచోటా మరోచోటా గడపడమెందుకూ అని శ్రీకాంత్ అభిప్రాయపడి నెలరోజుల క్రితమే తండ్రి దగ్గర కొచ్చేశాడు. వెంకట్రామయ్య కు తెలిసిన కొందరు పెద్దలు కూడా ఉద్యోగం వేయిస్తామని వాగ్దానం చేశారు కానీ ఆ టైము వచ్చినట్లు లేదు.....
    కాళ్ళు కడుక్కున్నాక రాజారావు తల్లి దగ్గరకు వెళ్ళాడు.
    'అలా కూర్చో -------' అంది పార్వతమ్మ. రాజారావు తల్లికి దగ్గరగా పీట వేసుక్కుర్చున్నాడు. పార్వతమ్మ ఒకసారి కొడుకు వీపు ఆప్యాయంగా నిమిరి -----"నిన్ను చూశాను రా - కాస్త మనసు తేలికపడింది ----' అంది.
    "ఎమ్మా - ఏమయింది ?"
    "ఏం చెప్పాన్రా - ఏదో పెద్ద ప్రాణం. వయసు మీద కొస్తుంటే మునుపటి ఆరోగ్యం నిలబడుతుందా?" అంది పార్వతమ్మ నిట్టురుస్తూ.
    ఇంటెడు చాకిరీ ఒక్క చేతిమీద చేసేది పార్వతమ్మ . నాలుగైదేళ్ళ క్రితం ఆమె జబ్బు పడింది. విశ్రాంతి బాగా అవసరమన్నారు డాక్టర్లు. ఇంట్లో పిల్లలంతా ఎదిగినవారే కాబట్టి అంతా తలోపని  పంచుకుని ఆవిడకు బాగా విశ్రాంతి నిచ్చేవారు. చిన్నప్పాటి నుంచీ పని అలవాటు పడ్డ పార్వతమ్మ కు ఊరికే కూర్చోవడం నచ్చక పోయినా క్రమంగా సుఖానికి అలవాటుపడింది. అయితే ఆవిడ కిప్పుడు కొత్త బాదొచ్చిపడింది. సంసారంలో కష్టాలు పడ్డ వ్యక్తిగా చుట్టుపక్కల పార్వతమ్మకో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు కారణంగా ఆవిడ'కెప్పుడూ నలుగురి సానుభూతీ లబిస్తుండేది. మామగారు ఆస్తి పాడు చేస్తున్నాడనీ, ఆ తర్వాత పిల్లలెక్కువనీ, ఆ తర్వాత ఇంటిపని పెరిగిందని, ఇలా నిత్యమూ ఏదో రకంగా ఆవిడకు సానుభూతి లభించేది. ఇప్పుడావిడకు చెప్పుకోదగ్గ బాధ్యత లేదు. పనీ లేదు. అందువల్ల ఇంటికేవరోచ్చినా ---"నీ పిల్లలు రత్న మాణిక్యలమ్మా - నిన్ను కూర్చోపెట్టి పని చేస్తున్నారు. ఒకనాడు కష్టపడ్డా ఇప్పుడు సుఖపడుతున్నావులే ---' అనడం మొదలు పెట్టారు. ఎప్పటికీ ఏదో విధంగా అందరూ తనమీద జాలిపడాలన్నది పార్వతమ్మ కోరిక. అందుకని ఆమె యిప్పుడు తన ఆరోగ్యాన్ని మదుపు పెట్టి జాలి సంపాదించడానికి ప్రయత్నిస్తోంది.
    "నీకు వయసు రావడమేమిటమ్మా - నిండా యాభై ఏళ్ళయినా లేవు ----' అన్నాడు రాజారావు.
    "యాభై ఏమిటిరా -- నాకింకా నలభై అయిదే - అయితేనేం ---- ఏమిటో తెలియని గుండె నీరసం . నాబాధ ఒకళ్ళకు కనిపించేది కాదు. వచ్చినప్పుడు చెప్పుకోగలిగిందీ కాదు...."
    ఆ సంభాషణ దారి మళ్ళించడానికి కన్నట్లుగా ----" అవున్లే .....ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే - ఎంత విశ్రాంతి ఉన్నా ప్రయోజనముండదు ....' అన్నాడు.
    "అబ్బే , నాకా బెంగ లేదురా - అన్నీ చూసుకుందుకు మీరే ఉన్నారు. ఒక్కసారి నన్ను డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళి ......" పార్వతమ్మ ఏదో చెబుతుండగా రాజారావు ఆలోచనలో పడ్డాడు.
    తల్లికి వైద్యం పిచ్చి. తనకు మొట్టమొదటిసారి కూతురు పుట్టినప్పుడు వసుంధరకు సాయంగా ఉండడానికి ఆవిడ కూడా భువనేశ్వర్ వచ్చింది. అప్పుడక్కడ అతను తల్లిని అనుభవజ్ఞుడైన ఆఫీసు డాక్టర్ కి చూపించగా అయన జబ్బేమీ లేదనీ- విశ్రాంతి అవసరమనీ చెప్పి ఒక మామూలు టానిక్ ఇచ్చాడు. ఆ డాక్టర్ ఇంగ్లీషులో చెప్పాడు కాబట్టి పార్వతమ్మకా మాటల అర్ధం తెలియలేదు. రాజారావు మాత్రం గుండె నీరసానికి మందిచ్చాడని చెప్పాడు. ఆవిడ మందు చూసి చాలా సంబరపడింది. కోడలికి -- "ఒసేవ్- రోజూ భోజనం కాగానే గుర్తు చేయి. మందు వేసుకోవడం మరిచిపోతాను --' అని చెప్పింది. గుర్తు చేయడం కోడలు మరిచిపోయేది కానీ ఆవిడ టంచనుగా మందు వేసుకునేది. మందు వాడినంత కాలం ఆవిడకు గుండె నీరసం రాలేదు. మంచి మందిచ్చాడని డాక్టర్నభినందించింది కూడా. ఆ తర్వాత మళ్ళీ స్వగ్రామం వెళ్ళేముందు ఒకటి రెండు టానిక్సు కొనిచ్చాడు రాజారావు. స్వగ్రామంలో ఆ టానిక్సు వాడినంతకాలమూ బాగానే వుంది. ఆవై పోగానే ఆవిడకు గుండె నీరసం ప్రారంభమయింది. వెంకట్రామయ్య ఊళ్ళోని డాక్టరుకు చూపించగా - అయన జబ్బేమీ లేదని, మందులు వాడనవసరం లేదనీ, బాగా విశ్రాంతి తీసుకుంటే చాలుననీ తెలుగులో చెప్పాడు. ఇంటికి వచ్చి ఆ డాక్టర్ని నానా మాటలూ అందావిడ. "నాకు జబ్బు లేదనే వాడు - వాడికి వైద్యమేం తెలుసు --" అని సవాల్ చేసింది.
    ప్రస్తుతం తల్లి చెప్పేది వినకపోయినా -- అనుభవాన్ని బట్టి ఆవిడేం చెప్పిందో ఊహించుకుని -- 'ఇప్పుడు తక్కువ సెలవు మీద వచ్చెనమ్మా - మళ్ళీ వాచ్చినప్పుడు నిన్నో మంచి డాక్టరు కి చూపించి తప్పకుండా మంచి మందిప్పిస్తానమ్మా ----" అని చెప్పాడు రాజారావు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.