Home » D Kameshwari » Madhupam
"అదీ నిజమే. ఏదో ఉద్యోగాలు చేసుకు సంపాదించుకుంటూ సుఖంగా బతికే వాళ్ళకి అనవసరమైన ఆశలు కల్పించి అవస్థల పాలు చేయడం ఎందుకు...."
"మరి ఇంత డబ్బు ఒక్కర్తివి ఏం చేస్తావు చెప్పు మరి...."
"ఆలోచనలో పడ్డాను. ఇంతంత బంగారం ముద్దలు కొని పడేస్తే! బోలెడు నగలు చేయించుకోవచ్చుగా.... నా మొహం , ఉన్న చంద్రహారాలు, పలకసర్లె ఎప్పుడూ వేసుకోలేదు. ఆ ముసలి వయసులో వంటినిండా నగలెం దిగేసుకుని ఏడుస్తాను . పిల్లలకివ్వడానికి లేదన్న షరతు లేకపోతే బాగుండు."
"పోనీ దేశదేశాలన్నీ చుట్టి రానా... పాతిక ముప్పై ఏళ్ళ క్రితం యూరప్, అమెరికా వెళ్ళినప్పుడే ఆ ఏర్ పోర్టు లో గంటల వెయిటింగు, ఇరవై గంటల ప్రయాణం, ఏది చూడాలన్నా గంటలు గంటలు క్యూలో నిలబడలేక కాళ్ళు పీక్కుపోయి, మైళ్ళ కొద్ది నడిచి చూడాల్సిన ప్రదేశాలు.... అమ్మో ఇవన్నీ చేసే ఓపిక యిప్పుడెక్కడిది నాకు వద్దు బాబూ...." నా ఆలోచన తెమలలేదు.
"ఏమిటి వరం కోరుకోడానికింత సేపా - తొందరగా చెప్పు . నీలాంటి వాళ్ళు చాలా మందున్నారు మరి."
"ఏం కోరుకుందామన్నా నాకోక్కర్తికే అన్నీ అని మెలిక పెట్టావు మరి - పోనీ ఏదో బతికినన్నాళ్ళు హాయిగా వుండడానికి పెద్ద భవంతి, ఓ న్దమైన తోట ఓ లోటస్ ప్యాలస్సో, మైసూర్ పెలస్సు లాంటిదేదో పెద్ద ఇల్లు ఇచ్చేయి. ఈ రెండు గదుల ప్లాట్ పిల్లలు వస్తే సరిపోవడం లేదు...."దేముడు నా మొహం చూసి నవ్వాడు.
"సరే ఇచ్చాననుకో, మరి మెయిన్ టైన్ చెయ్యగలవా, నీకొచ్చే డబ్బులతో కొంటెగా అన్నాడు. తెల్ల మొహం వేశాను" అదేమిటి ఇల్లు తోటలు ఇచ్చావంటే అన్నీ మెయిన్ టైన్ నువ్వే చెయ్యాలి."
'అమ్మా ఆశ! .... అసలు ఒక్కటే వరం - కొసర్లుండవు- ' అల్లరిగా అన్నాడు.
"అయ్యాబాబోయ్ అంత పెద్ద భవంతులు చూసుకోవాలంటే ఎంత మంది నౌఖర్లు చాకర్లు మాలీలుండాలి- నా బోడి పెన్షన్ తిండానికి సరిపోతుందిగా ఈ ఖర్చులు నా వల్ల అవుతాయా - పనిమనిషి రాకపోతే రెండు గదుల కొంప తుడవడమే న వల్ల కావడం లేదు. ఈ వయసులో , నావల్ల ఏం అవుతుంది . వద్దు బాబూ...."
"అబ్బ ఏమిటయ్యా నాయనా వరం యిస్తానని వచ్చి అన్నింటికీ నీవే అడ్డుపుల్లలు వేస్తున్నావు."
'అవును మరి. వరాలు యిచ్చేటప్పుడు మేమూ కాస్త జాగ్రత్తగా ఆలోచించాలని సావిత్రి కధ, భస్మాసురుడి కదల వల్ల తెలుసుకుని కాస్త జాగ్రత్త పడుతున్నాం. సావిత్రి మాటలతో యముడిని బోల్తా కొట్టించి మొగుడ్ని పట్టుకుపోయింది గదా. బోళాశంకరుడు వరమిచ్చి తనే చిక్కుల్లో పడ్డాడు గదా. నీకు ఓ వెయ్యి కొట్లిచ్చి పెద్ద భవంతులు యిచ్చేస్తే ఇన్ కంటాక్స్ వాళ్ళూ, సిఐడి వాళ్ళు ఆ డబ్బు నేనిచ్చనని తెలిసి తిన్నగా నా దగ్గరికే వస్తే .... నే చిక్కుల్లో పడను మరీ. అందుకే మరీ అంతంత గొప్ప వరాలు వద్దు కాస్త మాములువి అడుగు.
"పోనీ కారు లేదు. ఓ పెద్ద కారిచ్చేయి. కాస్త మీటింగులకు వాటికి వెళ్ళాలంటే ఈ అటో వాళ్ళతో ఇబ్బందిగా ఉంది. పెద్ద పడవ లాంటి కారు.... " ఆశగా అడిగా - అంతలోనే అసలు తప్ప కొసర్లు లేవు అన్న దేముడి మాట గుర్తొచ్చి - 'అమ్మో - ఆ కారు పెట్రోలు, డ్రైవరు ఇవన్నీ భరించగలనా - ఈ హైదరాబాద్ రోడ్లు , త్రాఫిక్స్ లో పడవలాంటి పెద్ద కారు - బాబోయ్ భరించే శక్తి నాకు లేదు.
"ఏమిటి ఆలోచన ,కారడిగావు ఇవ్వనా - "వద్దులే , నాకంత శీను లేదు " నిరాశగా అన్నా.
"మరయితే ఇంకేం కావాలి - ఒక వరం అడగడానికింత సేపా.
"ఏమిటయ్యా బాబు , ఏం అడగాలో తెలిసి చావడం లేదు" తల పట్టుకున్నాడు.
'అయితే సరే , నీకన్నీ ఉన్నాయి. ఉన్నదాంతో సుఖంగానే ఉన్నావు. మరి నే వెళ్లిరానా...." దేముడు బాయలుదేరబోయాడు.
"అయ్యయ్యో వెళ్ళిపోకు దేముడూ.... ఉండు ఉండు ఆలోచించనీ..... అయ్యో నా మతి మండా , మర్చేపోయాను, నేనో రచయిత్రిని కదా.... 'కేంద్ర సాహిత్య అకాడమీ 'అవార్డు' ఛా.... ఛా... కాదు కాదు అడిగే వరకు వస్తే జ్ఞాపపీఠ అవార్డు అడిగిస్తే పోతుంది గదా...." దేముడూ గత ఏభై ఏళ్ళ నుంచి సాహిత్య సేవ చేస్తున్నాను. కాని రావల్సినంత గుర్తింపు రాలేదని కాస్తంత బాధగా ఉంది. నగలు, డబ్బు, మేడలు కార్లు ఏం వద్దు గాని సాహిత్యంలో పెద్ద అవార్డు "జ్ఞానపీఠ" అవార్డు ప్రసాదించు . రచయిత్రిగా మంచి గుర్తింపు వస్తుంది."
దేముడు సూటిగా నా వంక చూసి చిరునవ్వు నవ్వి.... "సరే అలాగే, కాని ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. ఆ అవార్డు పుచ్చుకునేంత అర్హత నీకు ఉందనిపిస్తుందా' అవమానం ఫీలయిపోయాను. కోపంగా, పౌరుషంగా "ఏం ఎందుకు లేదు. ఏభై ఏళ్ళుగా ఆపకుండా రాస్తున్నాను. మరీ చెత్త కాకుండా కాస్త ప్రయోజనకరసాహిత్యమే రాశాను. ఏం వచ్చినా వాళ్ళందరూ ఏం ఊడబోడిచేశారు" సమర్ధించుకున్నాను."
"చూడమ్మా - అవార్డులు నిన్ను వెతుక్కుంటూ రావాలి గాని నీవు వాటి వెంట పడకూడదు. నీ ప్రతిభ గుర్తించితే అవార్డులు అవే వస్తాయి."
'అవన్నీ పాతమాటలు, ఇప్పుడు అడగందే అమ్మన్నా పెట్టదు. పైరవీలు చెయ్యాలి. 'మన' అనే వాళ్ళున్న వారికే వస్తాయి. నిజంగా ప్రతిభ గుర్తించి ఇచ్చే రోజులు కావు.
"అవుననుకో - "ఈవిడ కింకా ఈ అవార్డు ఎందుకివ్వలేదు' అని జనం అనుకోవాలి గాని ' 'ఈవిడకెందుకీ అవార్డు ఇచ్చారు' అనిపించుకోకూడదు. ఇప్పుడు అవార్డు నీకు ఇచ్చాననుకో- అబ్బో ఈవిడ దేముడినే మస్కాకొట్టి పైరవీ చేసి అవార్డు సంపాదించుకుంది అనుకుంటే అది నీకు గౌరవమా ఆలోచించుకో."
"బాబూ, నీకో దండం , నాకీ వరాలు వద్దులే, వెళ్ళు స్వామీ ..... ఆ ... సరే.... ఎలాగో వచ్చావు . ఏదో బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా, మంచాన పడకుండా సునాయసన మరణం అన్నా ప్రసాదించు-" అన్నా విసుగ్గా.
దేముడు నవ్వాడు "అమ్మయ్య. ఇప్పటికి సరి అయిన దారికి వచ్చావు - చూడమ్మా ఈ వయసులో నీకు కోట్ల డబ్బు, బంగారాలు భవంతులు, సుఖాన్నివ్వక పోగా ఉన్న మనశ్శాంతిని హరిస్తాయి. హాయిగా మనశ్శాంతిగా , ఆరోగ్యంగా బతకడం ముఖ్యం. నీవు కోరుకున్న సునాయాస మరణం కంటే నీకింకేం కావాలి ఈ వయసులో. నీకీ వరం ఇస్తున్నాను - తధాస్తు.... "చెయ్యెత్తి దీవించి వెనుదిరిగాడు. హటాత్తుగా గుర్తొచ్చింది - ' అయ్యో దేముడూ - అగు అగు సునాయసన మరణం ఎప్పుడో చెప్పకుండా వెళ్ళిపోతున్నావేమిటి - 'గాభరాగా అడిగాను.' దేముడు తలతిప్పి నవ్వాడు.
"చూడు తల్లీ , చావు పుట్టుకల రహస్యం మీకు ముందే తెలిస్తే దేముడి ఉనికే మాయం అవుతుంది గదా, అయినా ఆ చిట్టావర్జలు యమధర్మరాజు దగ్గరుంటాయి."
'అలా కాదు స్వామి, ఆ సునాయాస మరణం నేననుకున్నప్పుడు రావాలి. అలా వరం ఇవ్వు."
"చెప్పాగా చావు పట్టుకుల నియంత్రణ మనిషి చేతికి వచ్చిననాడు మా మనుగడకే ముప్పు. అది మాత్రం అడక్కు...." అంటూ చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు.





