Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
చావులేనిపాట
అన్నా
శతధా విభిన్నమైన ఈ గుండెలో
సంగీతం యింకా వినపడుతోంది
చావనని నమ్మకం కలిగింది
చావులేదు నా కని ఎలుగెత్తి చాటాలనిపించింది
అన్నా ఒక సమ్మెట పోటుకే
ఉరలిన రక్తాన్ని తుడుచుకొనే లోపలనే
చక్కని సన్నజాజి పందిరికింద స్వాప్నిక సురవధూటి
నిలబడుతుంది
నవ్వుతూ పిలుస్తుంది
వదనాన జారే స్వేదాంబుకణాన్ని
వలాహక చేలాంచలంతో తుడుస్తుంది
అన్నా
నేను నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో
కాలం కరిగి వెన్నెలయింది
నా భావం వీణా నిక్వాణమయింది
నా గీతం రటన్నటన్నూపుర నినాదమైంది,
నేను యౌవనాన్ని ఆనంద జీవన వనాన్ని
ఒక్క నిశాంత నిహార కణం సోకినా
ఒక్క కౌముదీ శీతల కిరణరేఖ జాల్వారినా
ఒక దయామయి అడుగు సవ్వడి పలుకరించినా
కోటి పువ్వుల్ని పూస్తాను
కోటి నవ్వుల్ని జల్లుతాను
అన్నా
దూరతీరాన తెల్లని ఓడ తెరచాప కదలినపుడు
భావహృదయాన నిశ్వసనానిలం వీచినపుడు
ఒక్క దుఃఖితుడు నవ్వినపుడు
ఒక్క పతితుడు కన్విప్పినపుడు
అక్కడ నా అడుగుజాడ గుర్తించగలవు
అక్కడ నా సందేశాన్ని అశ్రుసంగీతాన్ని ఆహ్లాదించగలవు
* * *
---1964



