Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుస్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు
అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!
* * *
---1962
లయగీతం
(నిరంతరమూ యుద్ధానికి సన్నద్ధమౌతున్న ప్రభుత్వాల మనస్థితీ,
మెగాటన్ బాంబులు కల్పింపబోయే భయంకర పరిణామాన్నీ ఊహించి)
అంతరిక్ష
మవలిపక్క
హఠాద్గర్జ నినదించెను
అతలమందు వినిపించెను
ఇరుసు వంగి
భూమి కుంగె
జరత్కారు పూర్వీకుల శాఖలపై వ్రేలాడుచు
శరణు శరణు వచనమ్ముల
సాశ్రునయన దీనులైరి
అంతరాళ
మంత నిండి
ఊదారంగుల మంటలు
ఉవ్వెత్తుగ సుడి తిరిగెను
దిగ్గజాలు
తీండ్రించెను
రణకాష్టము లన్ని దెసల కణకణమని రాజుకొనెను
రాలుచున్న పిడుగువాన రాబందులు గొణిగికొనెను
చీకటిలో
వాకిటిలో
ఉన్మాదుల సంభాషణ
ఉలూకముల అన్వేషణ
ఎవరువారు
గుండెలదరు



