Home » VASUNDHARA » ఆపరేషన్ మేడిపండు


    క్షణంమాత్రంఫ అప్రతిభుడైన రాజు తెరవెనక్కు వెళ్ళేలోగా ఆమె ఇటు  తిరిగింది.
    ఇందాకటి అమ్మాయి గదిలో దీపం వెలగడంలేదు. కానీ ఈ గది ట్యూబ్ లైట్ వెలుగులో ప్రకాశవంతంగా వుంది. ఆమె ఇంకా చీరకు  కుచ్చుళ్ళు పెట్టలేదు. పైట వేసుకోలేదు. అలాగని రాజుని చూసి తడబడాలేదు.
    "కాస్త తలుపులు గడియవేసి లోపలకు  రా నాయనా!" అందామె చీర కుచ్చెళ్ళు పెట్టడం మొదలుపెడుతూ. అయితే అతణ్ణి చూసి కూడా ఇంకా ఆమె పైట వేసుకోలేదు.
    రాజు లోపల అడుగుపెట్టి తలుపులు మూయబోయాడు.
    "ఈ తలుపులు కాదు నాయనా, వీధితలుపులు" అంటూ  ఆమె చీరకుచ్చిళ్ళు పెట్టుకుంది.
    అప్పుడు రాజుకు స్పురించింది. ఇందాకా ఆ అబ్బాయి వీధితలుపులు వేయకుండానే లోపలకు వెళ్ళిపోయాడు. అంటే ఈమెకు కాలింగ్ బెల్ మోగడం, ఆ అబ్బాయి తలుపు తీసి క్లోపలకు వెళ్ళిపోవడం అన్నీ తెలుసున్నమాట. అయినా తను వెళ్ళేసరికి చీర కట్టుకుంటోందంటే ఆమె గురించి ఏమనుకోవాలి?
    అతడు వెళ్లి వీధితలుపు వేసి వచ్చాడు. అప్పటికామె పైట వేసుకొనివుంది.
    ఆమె రాజుని చూస్తూనే "రా నాయనా! ఇలా కూర్చో. నీ పేరు రాజే కదూ! నువ్వొస్తావని మావారు చెప్పారులే" అంది.
    రాజు తడబడుతూ అక్కడున్న  సోఫాలో కూర్చుని ఆ ఇంటికి అదే డ్రాయింగ్ రూమని గ్రహించాడు. అయితే తలెత్తి  ఆమె ముఖంలోకి చూసే దైర్యమింకా అతడిలో కలుగలేదు. ఆమె చీర కట్టుకుంటున్నాననేగా. ఏం? మీ అమ్మ నీముందెప్పుడూ చీర కట్టుకోలేదా?" అనేసింది.
    ఆమె ఆ విషయం ప్రస్తావిస్తుందనీ, తననలా  సూటిగా అడిగేస్తుందనీ ఊహించని రాజు తడబడిపోయాడు. అయితేర్ ఆమ్మ తనముందు చీరకట్టుకోడానికి సంకోచించదన్నవిషయం కూడా ఆ వెంటనే గుర్తుకొచ్చి-ఆమె చెప్పేదాకా ఆ నాట గుర్తురానందుకు సిగ్గుపడిపోయాడు కూడా!
    "ముగ్గురు పిల్లల తల్లిని. నీ ఈడు కొడుకున్నాడు నాకు. పదేళ్ళక్రితం దాకా ఏమో కానీ- ఇప్పుడు నేను ఆడదానినన్న స్పృహే వుండదు నాకు. నీ ఈడు వాళ్ళంతా నాకు కొడుకుల్లాగే అనిపిస్తారు...."అందామె.
    ఆ మాటల్లో చొరవ, చనువు, సందేశం ఎన్నో తోచాయి రాజుకి. సీఎంగారు  తన గురించి ఏం చెప్పారని అడుగబోయి ఆమె ఇంకా ఏదో చెప్పబోతుందని గ్రహించి ఆగిపోయాడు.
    "వెధవపుస్తకాలు నాయనా! ఓ వావీ వరసా వుండదు. పెద్దా చిన్నా వుండదు. మంచీ మన్ననా వుండదు. ఆడదంటే మగాడికి ఆబ. మగాడంటే ఆడదానికి పిచ్చి. ఇవీ కథలు. అది అమాన సంస్కృతి కాదు. పద్దతీ కాదు. నీ వయసు కుర్రాడు నా వయసు ఆడదాన్ని అమ్మా అని పిలవలేని సంస్కృతిని బలవంతంగా మనమీద రుద్దుతున్నారు నాయనా! ఆ పుస్తకాలు చదవకుండా  పిల్లల్నాపగలమా? అందుకని వాటిని మేమే కొంటాం. కొనడమెందుకంటావూ-వాటిల్లో ఎంత చెడ్డ  వుందో అంత మంచీ వుంది.
    చెడేవాళ్ళకు ఇవొక్కటే మార్గాలుకాదుకదా! ఇవో వంక-అంతే! చెడును వదిలి మంచిని ఏరుకోవడం  పిల్లలకు చిన్నప్పట్నుంచీ అలవాటు చేయాలికదా! అందుకీ పుస్తకాలెంతగానో సాయపడతాయి. వాటికి దూరంగా వుంచితే కుతూహలం. గుప్పిట తెరిస్తే  ఏమీ వుండదు. అదీ నా పద్ధతి. మొదట్లో మావారికి నచ్చేది కాదు. కానీ క్రమంగా అర్థం చేసుకున్నారు, ఇప్పుడాయన స్నేహితుల ముందు చీర సరిచేసుకున్నా తప్పుపట్టారు....." అని ఆగి, "నన్ను చూస్తే నీకు  నీ తల్లి గుర్తురావడంలేదా?" అందామె.
    రాజు అప్పుడామె వంక చూశాడు.
    ఆమెకు వయసు నలభైఅయిదుండవచ్చు. నాజూగ్గా లేదుకానీ మరీ  ఒళ్ళుగానూ లేదు. పచ్చని ఛాయ. అందమైన ముఖం.
    అప్పుడు రాజుకు ఆమెలో అమ్మ మాత్రమే కనిపించింది.
    "కాటన్ చీరలు ఇట్టే నలిగిపోతాయి. సింథటిక్ వి బాగుంటాయి కానీ ఒంటిమీద నిలవ్వు. బయటకు వచ్చినప్పుడు పిన్నులూ గట్రా  వాడతాం  గానీ- ఇంట్లో మాటిమాటికీ చీర సవరింపు తప్పదు. అందులో నా ఒంటిమీద  అసలు నిలవదు. వేళాకోళం చేస్తారు కానీ- ఆయనేం తక్కువా? కూర్చుని లేస్తే లుంగీ చెత్తో పట్టుకోవలసిందే! మా పిల్లలు ఒక్కటే నవ్వు" అంటూ తనూ నవ్విందామే.
    రాజుకీ సంభాషణ చిత్రంగా అనిపించింది. ఆమె ఎవరు? తానెవరు? ఇప్పుడీ మాటలన్నీ ఎందుకు చెబుతున్నట్లు? ఇంతకీ  సీఎం ఇంట్లో వున్నాడా లేదా? ఆయన తన  గురించి ఈమెకేం చెప్పివెళ్ళాడు?......ఒకటి కాదు .....రెండు కాదు....ఎన్నో సందేహాలు!
    ఆమెమాత్రం మళ్ళీ కొనసాగించింది. "వెధవ సినిమాలు-తల్లి లాంటి అత్తగారి మీద అసభ్యపు మాటలు వదిలే హీరో పాత్రలు- ఆ హీరోలకు అభిమానులు-మన సంస్కృతి ఎటు పోతోందో మరి" అని ఆగి, "నా ధోరణికి ఆశ్చర్యపోకుఅ నాయనా! ఈమధ్య  పాడుతా తీయగా కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం చూడూ-ప్రోగ్రామ్ మధ్యలో ఓ సందేశాన్నివ్వడం మొదలెట్టాడు. అలాగే  నేనూ  నా ఇంటికొచ్చినవాళ్ళకు-ముఖ్యంగా నీ వయసు కుర్రాళ్ళకు ఓ సందేశాన్నివ్వడం ప్రధానంగా పెట్టుకున్నాను.
    గుర్తుంచుకో నాయనా- పెళ్ళికాని  ఏ ఆడదీ మగాడు కావాలనుకోదు. మగడేకావాలనుకుంటుంది. మగడున్న ఏ ఆడదీ  మరో మగాణ్ణి కోరుకోడు. ఇక నా వయసు ఆడడైతే తను ఆడదాన్ననే అనుకోదు. భక్తితో గౌరవాన్ని ఆశిస్తుంది. బయట ఏ వయసు ఆడదాన్ని చూసినా నా ఈ మాటకు మర్చిపోవుకదూ"
    రాజు ఉలిక్కిపడ్డాడు. అందరాడవాళ్ళకూ ఇలా మాట్లాడే చొరవ వుండకపోవచ్చు. కానీ వారి  మనసుల్లో వుండేది- సందేహం లేదు. సమకాలీన సమాజంలో ఎందరో మహిళల ఆవేదననామె గొంతెత్తి పలుకుతున్నట్లుంది. ఈ ఆవేదన ఇంతవరకూ తనకు వినిపించనందుకు రాజు మనసులో సిగ్గుపడ్డాడు.
    అతడప్పుడు అప్రయత్నంగా చేతులు జోడించి, "గుర్తుంచుకుంటానమ్మా- తప్పకుండా గుర్తుంచుకుంటాను. జీవితాంతం గుర్తుంచుకుంటాను" అన్నాడు. అప్పుడతనికి  సీఎం కూడా గుర్తులేడు.
    అప్పుడామె "నా పేరు జయంతి" అంది.
    సందేశమివ్వడమైపోయిందేమో ఆమె ఇక తన వివరాలు చెప్పసాగింది.
    ఆమెను తల్లిదండ్రులు జయా అని పిలుస్తారు. భర్త కూడా  అలాగే పిలుస్తాడు. పిల్లలు కూడా అలాగే పిలిచేవారు. కానీ  ఆమె తప్పని మానిపించి అమ్మా అనడం  నేర్పించింది. అదీ మూడోవాడికి మూడేళ్ళోచ్చాక. ఆమెకు మొత్తం  ముగ్గురు పిల్లలు. పెద్దవాడు ఎంబిబియస్ ఫైనలియర్లో వున్నాడు. రెండోపిల్ల ఇక్కడే బియస్సీ చదువుతోంది. ఇద్దరేచాలానుకున్నారు కానీ   సీఎం ఆపరేషన్ చేయించుకునేలోగా మూడోవాడూ  కడుపున పడ్డాడు. అయితే  వాడు చాలా బ్రిలియంట్. తన చదువేమితో లోకమేమిటో-అంతే! కాలింగ్ బెల్ మోగితే తలుపు తీస్తాడు కానీ వేయడు.
    'ఈమెకి వాగుడెక్కువ' అనుకున్నాడు రాజు. కానీ అతడికి వినడానికిబ్బందిగా లేదు. ఎంతోకాలంగా తెలిసిన ఆత్మీయులతో అనుభూతులు పంచుకున్నట్లుంది.
    రాజుకి  సీఎం గురించి అడగాలని వుంది. కానీ ఆమె ఆగితే అవతలివారెక్కడ అవకాశం తీసేసుకుంటారోనన్నట్లు గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తోంది. ఎక్కడైనా ఆపినా అది షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్ లా  వుంది. బ్యాట్స్ మన్ కి అవకాశం రాదు.
    స్ట్రోక్ లెస్ వండర్ అనిపించుకున్న రవిశాస్త్రి కూడా ఏదో బాల్ కి సింగిల్ చేయకపోడు కదా- రాజు కూడా మొత్తంమీద అవకాశం పుంజుకుని  సీఎం గురించి  అడిగేశాడు.
    "ఆయన వచ్చేస్తారు నాయనా- వచ్చేదాకా నువ్వుండాల్సిందే మరి! నీకు కాఫీ  కావాలా, టీ కావాలా చెప్పు-చిటికెలమీద చేసి తెస్తాను...." అంది జయంతి.
    "ఏదీ వద్దండీ! అనవసరపు శ్రమ" అన్నాడు రాజు.
    "ఇందులో శ్రమేముంది? ఇది  నా టీ టైము. నేనోక్కర్తినీ  కలుపుకుని తాగితే  బాగుండదు కదా! నువ్వొద్దంటే నాకు బాగా  అయిపోతుంది" అంటూ లేచిందామె.
    అప్పుడు రాజు కూడా చనువుగా, "అయితే మీరు టీ అలవాటు. ఒక్కసారంటే నీళ్ళు తెచ్చిపెట్టండి. నాకు రోజూ పొద్దున్నే  కాఫీ, మధ్యాహ్నం టీ  అలవాటు  ఒక్కసారంటే  ఒక్కసారి. మళ్ళీమళ్ళీ తాగలేను. ఏమీ అనుకోకండి" అనేశాడు.
    జయంతి వెంటనే చతికిలబడిపోయి, "ఆడాళ్ళ బ్రతుకింతే-మా కోసం మేము  ఏమీ చేసుకోలేం అయినా ఓ పూటకు టీ లేకపోతే  ఏమైందిలే" అంది.
    "సారీ అండీ. నేను నిజంగానే రెండోసారి టీ తాగలేను" అన్నాడు రాజు.
    "ఇందులో సారీకేముంది నాయనా- కుడితి తాగినట్లు టీ పుచ్చుకోవడం అలవాటై పోయి మేము పడుతున్న బాధ నీలాంటి కుర్రాళ్ళు పడకూడదు. అందుకే నేనూ, ఆయనా ఎన్నిసార్లు తాగినా మా పిల్లలకు మాత్రం  ఈ వెధవలవాటు చేయలేదు" అంది జయంతి.
    అంతలోనే రాజు అలవాటును నిందించానని స్పృహ కలిగిందో ఏమో-
    "క్రమశిక్షణ ఉన్నంతసేపూ ఏ అలవాటైనా మంచిదే! నీ పద్ధతి   నాకు నచ్చింది. మావాళ్ళ కుర్రాడివై ఉంటే ఎంత బాగుండేది? నీకు అమ్మాయిని చూపించి- మీ పెద్దవాళ్ళతో మాటలకు వెళ్ళేదాన్ని" అంది మళ్ళీ.
    రాజు గతుక్కుమన్నాడు. ఉన్నట్లుండి సంభాషణ పెళ్ళిమీదకు మళ్లిందేమిటి?
    అయితే సంభాషణ అక్కడాగలేదు. ఆమె రాజు కుటుంబం గురించీ, తల్లిదండ్రుల గురించీ ఆరాలు తీసింది. అతడికింకా ఏ పెళ్ళిసంబంధాలూ నలగడంలేదని తెలుసుకుంది.
    "బాగుంది నాయనా! నీ రొట్టే కాదు-పాపదీ విరిగి నేతిలో పడింది"
    ఆమె మాటలు విని, "పాప ఎవరండీ?" అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ.
    "పాప తెలియదూ నీకు- అయితే వారు నీకు బొత్తిగా ఏమీ చెప్పలేదా?"
    రాజు తల అడ్డంగా ఊపి ఆమె వంక అయోమయంగా చూశాడు.
    "పాప-అజేయ్ గారి  ఏకైకపుత్రిక. ఆయనకా పిల్లంటే ప్రాణం. మంచి కుర్రాణ్ణి తెచ్చి పెళ్లిచేయాలని చూస్తున్నాడాయన. తన  చెప్పుచేతుల్లో వుండే  అల్లుడు  కావాలాయనకు. అలాగని ఇంటిపనులేం చేయించడులే. దగ్గరుంచుకుని తనంతటివాణ్ణి చేస్తాడు. ఆ ఇంటల్లుడు కావడమంటే మాటలు కాదు. నక్కను తొక్కిరావాలి...."
    అప్పటికి రాజుకి కొంత అర్థమైంది.
    "సీఎంగారు మీకు నా గురించి ఎం చెప్పారు?" అన్నాడు ఆత్రుతగా.
    'నీ ఉద్యోగం మన పెళ్ళికి ప్రతిబంధకం' రాణి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ జ్యోతిష్కుడెవరో  చాలా అద్భుతంగా చెప్పాడు. అయినా అందుకు జ్యోతిషం కావాలా-లోకజ్ఞానమున్నవాడెవడైనా ఉద్యోగం కోరే విద్యాధికుడికిదే చెబుతాడు.
    జయంతి గొంతు సవరించుకుని, "రాజమండ్రిలో బయోడేటా ఇచ్చావట-అది చూసేక నీలాంటి కొందర్నీ దియానగరం పిలిచారు. మావారు  అందర్నీ  ఇంటర్వ్యూలు చేశారు. అజేయ్ గారితో మాట్లాడేరు. నీకు  మా ఇంటికి పిలుపొచ్చింది" అంది.
    "మీ ఇంటికెందుకూ?"
    "కాసేపట్లో ఆయన పాపను తీసుకొస్తారు. ఓసారి చూద్దువుగాని"  
    "పెళ్ళిచూపులా?" అన్నాడు రాజు హడిలిపోయి.
    "అయ్యో! పెళ్ళిచూపులైతే మా ఇంట్లో ఎందుకు జరుగుతాయీ? ఏదో-పరిచయం-అంతే! పిల్లనీకు వాతప్పుగా అనిపించకపోతే పెళ్ళిచూపులు సంప్రదాయంప్రకారం జరుగుతాయి-అజేయ్ గారికి  మన సంప్రదాయమంటే ఎంతో ఇష్టం" అందామె.
    "ఇందుకా అమ్మాయి ఒప్పుకుందా?" అన్నాడు రాజు అప్పటికింకేమీ అనలేక. ఎంత ఉన్నత స్థాయిలో వున్నామనదేశపు ఆడపిల్లలకు పెళ్ళి విషయంలో ఎలాంటిస్వేచ్చ వుంటుందీ అతడికి తెలియదు కనుకనా!
    అయితే జయంతి సమాధానం వేరేగా వుంది- "ఈ పరిచయాలెందుకనుకున్నావ్! ఆమెకు నచ్చితేనే వ్యవహారం ముందుకు వెడుతుంది. కానీ కంగారుపడకు. నువ్వు  తప్పక పాపకు నచ్చుతావని నా నమ్మకం"
    అప్పుడు రాజు అహానికి గట్టి దెబ్బే తగిలింది. తను పిల్లను చూడ్డంలేదు. పిల్లే తనను చూడ్డానికి వస్తోంది. పిల్లకు తను నచ్చితే-పెళ్ళి! పెళ్ళితోపాటు ఉద్యోగం. బంగారం లాంటి భవిష్యత్తు. పేరుప్రతిష్ఠలు. ప్రపంచఖ్యాతి!
    అవకాశం. ఎంతటి ప్రతిభావంతుడికైనా అవకాశం కావాలి, రావాలి.
    ఇప్పుడు తనేం చేయాలీ అని ఆలోచించేడతను. అప్పటికే రాణిని ప్రేమించివున్నాడు. కాబట్టి అసలువిషయం చెప్పెయాలా అనుకుంటే ఆ విషయం ఇంకా అటు తనవారికీ- రాణి పెద్దలకూ కూడా తెలియదే! పాపను చూడాలా  అంటే-తనను చూడ్డానికి వస్తున్న ఆమెను తన అహం అంగీకరిస్తుందా?
    రాజులో అహనికీ, వాస్తవానికీ మధ్య పెద్దగా సంఘర్షణ ప్రారంభమయింది.
    ముందతడు లేచి వెళ్ళిపోవాలనే అనుకున్నాడు. అయితే అలా చేయడం కంటే- పాప వచ్చేదాకా ఆగి ఆమెను చూసి  అప్పుడు  నిరాకరిస్తే ఆమె అహాన్ని దెబ్బతీయడం ద్వారా తన అహాన్ని తృప్తిపరచుకోవచ్చునన్కున్నాడు. అది అవకాశవాదమో. ఆత్మవంచనో, వాయిదా మనస్తత్వమో, నిర్లప్తతో అప్పటికింకా అతడికి తెలియదు.
    ఆ తర్వాత కాసేపటికే ఆ ఇంటిముందు కారాగింది.
    "ఆయనొచ్చినట్లున్నారు" అంది జయంతి.
    రాజు ఊపిరి బిగపట్టాడు. ఒక ఆడపిల్ల తనను చూసుకుందుకు వస్తోందన్న భావం అతడి నరనరాల్లో అదోరకంగా ప్రవహిస్తోంది. ఆ అనుభూతి అతడికి బాగానే వుంది.
    డ్రాయింగ్ రూమ్ లోకి తెర తొలగించుకుని ప్రవేశించాడు  సీఎం.
    రాజు అతణ్ణి చూస్తూనే వినయంగా లేచి నిలబడ్డాడు. కానీ అతడి కనులు గదిలో అడుగుపెట్టబోయే మరో వ్యక్తికోసం ఎదురుచూస్తున్నాయి.
    అయితే డ్రాయింగ్ రూమ్ లోకి  సీఎం ఒక్కడే వచ్చాడు. అతడు రాజుని చూస్తూ తృప్తిగా తలాడించి, "మా ఆవిడ మీకేం బోరుకొట్టలేదుకదా!"అన్నాడు.
    అతడు తనని మీరు అని మన్నిస్తున్నాడు. ఆమె తనని నువ్వంది. ఎందుకో ఆమె పట్ల కలిగిన గౌరవభావం అతడిపై కలగడంలేదు.
    "లేదు సర్!" అన్నాడు రాజు.
    "గుడ్" అని తలపంకించాడు. కాసేపు రాజుతో పొడిపొడిగా మాట్లాడేడు.
    మరికాసేపటికి జయంతి లోపల్నుంచి పిల్లల్ని తీసుకొచ్చింది.
    పెద్దవాడు మెడిసిన్-వేరేచోట చదువుతున్నాడుట. ఆ సంగతి చెప్పాక-"మా అమ్మాయి ఇందిర" అందామె అక్కడున్నవాళ్ళ పరిచయం ప్రారంభిస్తూ.
    అక్కడ ఇద్దరాడపిల్లలున్నారు. ఒకామె పరికిణీ కండువాలో వుంది. రెండో ఆమె జీన్స్ లో  వుంది. పరికిణీ అమ్మాయిని కండువా వేసుకుంటుండగా చూశాడు. ఆమె ఇందిర అయుండాలి అనుకుంటూండగానే ఆమె "నమస్తే!" అంది.
    అప్పుడు రాజు జీన్స్ అమ్మాయిని చూశాడు.
    వేరే సందేహమెందుకూ -ఆమె పాప! పరిచయం అవసరంలేదు.
    రాజుకు జయంతి తన చివరి కొడుకును కూడా చూపించింది. కానీ రాజు రెటీనాలో పాప స్థిరపడిపోయింది.
    చూడగానే ఆడపిల్ల అనిపిస్తుంది. ఆధునికంగా ఆలంకరించుకున్నా ఎబ్బెట్టుగా లేదు. అది తనకు  ప్రకృతి సహజమన్నట్లుగా వుంది.
    పిల్లలనక్కడ వదిలేసి పెద్దలు అక్కణ్ణించి వెళ్లిపోయారు.
    కాసేపు కూర్చుని తనకు పనుందని అక్కణ్ణించి వెళ్లిపోయాడు ఇందిర తమ్ముడు.
    ఇక అక్కడ ఇందిర, పాప, రాజు-ముగ్గురే మిగిలారు.
    సంభాషణ ఆరంభంలో మందకొడిగా నడిచింది. తర్వాత వేగం పుంజుకుంది.
    సంకోచం తొలగిపోయాక రాజుకూడా విజృంభించి తన అభిప్రాయం చెప్పాడు.
    "సాధారణంగా ఆడపిల్లలముండు అబ్బాయిలు ఆదర్శాలే వల్లిస్తారు. ఆచరణలో కానీ వాళ్ల అసలురంగు తెలియదు" అంది పాప చటుక్కున.
    రాజు గతుక్కుమని, "మీరు నన్ను అఫెండ్ చేస్తున్నారు" అన్నాడు.
    "అలాగైతే అయాంసారీ-నేను జనరల్ గా అబ్బాయిల గురించి చెప్పాను"
    "జనరల్ గా అమ్మాయిలూ అంతే! కాదంటారా?" అన్నాడు రాజు పంతంగా.
    పాప నవ్వి. "ఆడపిల్లలకు ఎన్నో అడుపులు. మన సంప్రదాయంవుండనే వుంది. ఆపైన తల్లిదండ్రులు. ఎక్కడైనా విశాలభావాలు కనపడ్డా అవి హిపోక్రసీ ముసుగులో వుంటాయి. అందువల్ల ఆడపిల్ల వ్యక్తిత్వం కూడా ముసుగులోనే వుండిపోతోంది. అబ్బాయిల విషయం అలా కాదు. వాళ్ళు అసలుసిసలు స్వేచ్చను అనుభవిస్తున్నారు. అయినా అడపాదడపా ఆదర్శాలు వల్లిస్తూ- తమ స్వేచ్చను అమ్మాయిల స్వేచ్చను హరించాదానికే ఉపయోగించుకుంటున్నారు. మీరలాంటివారు  కాకపోతే నాకు చాలా సంతోషం" అంది.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.