Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
గిరిపుత్రి కడగంటి
మణిదీప్తి విరిసికొని
హిమశైల శిఖరమ్ము
కటకమ్ము నొరసికొని
నాలోన
లోలోన
గుండెలను చుట్టుకుని
బ్రదుకునే మలచుకుని
గళసీమ నవజాత
మకరంద ధారగా
మనసులో అరవింద
మోరగా వ్రాలగా
నాలోన
లోలోన
ఒక శ్రుతి
ఒక గతి
గగనపధ విష్ణుపద
భవ పవిత్ర స్వర్ధుని
దిగివచ్చి దిగివచ్చి
గంధర్వ సంగీత
ద్రుతవేగయై హేలయై
పాయలుగ విచ్చి
ఒక మెరుపు బంగారు కెరటమ్ము
విరిగి పడినటుల
నాలోన
కెరలి సుడి తిరిగినటుల
ఒక శ్రుతి
ఒక గతి
ఒక లేత నెత్తావి చరణమ్ము
నా సుప్త సౌంద్రయ హృదయమ్ము
లో మెత్తగా మెల్లగా
నడచినటు పరుగిడినటు
ఝుణం ఝుణ క్వణ రవళి
గిర్రునం దిరిగినటు
కుచ్చెళుల చెరగు లొరసికొని
బెరసికొని
తలపు చివరల మొరసినటు
నాలోన
లోలోన
ఒక శ్రుతి
ఒక గతి



