Home » Dr S V S Kishore Kumar » Nari Nari Naduma Murari
ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అని ఆశ్చర్యంగా అన్నాడు కృష్ణకుమార్.
లేదండి. నిద్ర రాలేదు. కబుర్లు చెప్పుకుంటున్నాము అంది రేణు.
వాళ్లకి పోలీస్ స్టేషన్ లో జరిగిన తతంగమంతా వివరించి చెప్పాడు.
తన లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా అక్కడికి వచ్చినట్లు చెప్పాడు.
విద్యావతి తో రేపు లాయర్ కిరణ్ బ్రాంచ్ కి వస్తున్నట్లు, తను తీసుకురావలసిన డాక్యుమెంట్స్ వాటి గురించి విశదంగా చెప్పాడు.
మూర్తి డివోర్స్ కి ఒప్పుకున్నట్లు ఇంకేమీ ప్రాబ్లెమ్ చెయ్యనని రాసిచ్చాడని చెప్పాడు.
విడాకులు మంజూరయ్యేంతవరకు అతని జుట్టు తమ చేతిలో ఉందని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని మరీ మరీ చెప్పాడు.
ఆ మాటలతో విద్యావతికి కాస్త సంతోషం కలిగింది.
ఇన్నాళ్లకు తన జీవితంలో వెలుగు రేఖలు వస్తున్నట్లు హాయిగా అనిపించింది. ఈ ముప్పై ఏళ్లలో తను పడిన కష్టాలు గుర్తుకొచ్చి విపరీతమైన బాధ కలిగింది. ఏ రోజూ తను సుఖపడిందిలేదు.
సంసార జీవితమంతా యాంత్రికంగా గడిచింది.
ఒక విధంగా దినగండం నూరేళ్లు ఆయుశ్హు అన్నట్లు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సి వచ్చింది. తన భర్త ఏ రోజు ఏం చేస్తాడో అని మానసిక వేదన అనుభవించింది.
ఇన్నిరోజులు బ్రతికుందంటే అది కేవలం తన పిల్లల కోసం. వాళ్ళే లేకుంటే తను ఎప్పుడో తనువూ చాలించి ఉండేది.
ఎంతో దయనీయమైన బ్రతుకు తనది.
ఈ రోజు కృష్ణకుమార్ పూనుకుని ధైర్యం చెయ్యడం వల్ల తన జీవితానికి ఓ పరిష్కారం లభించబోతోంది. విడాకులు వస్తే తన బ్రతుకు తను బతకొచ్చు. ఇప్పుడు భయం భయం గా కాలం వెళ్లబుచ్చుతోంది.
భర్త ఎప్పుడు ఏమి సమస్య తెస్తాడో అని రోజూ దిగులు. ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయిన క్షణాలు లేవు.
విడాకులు వచ్చి తన జీవితానికి స్వాతంత్ర్యం వస్తే ఇక చేసినన్ని రోజులు బ్యాంకు లో వర్క్ చేసి, అవసరం లేకుంటే వి ఆర్ ఎస్ తీసుకుని కొడుకు దగ్గరికి వెళ్లొచ్చు.
ఇలా సాగాయి ఆమె ఆలోచనలు.
రేణూ , అందరం కొంచెం కాఫీ తాగుదామా అన్నాడు కృష్ణకుమార్ భార్యతో . బాగా అలసటగా ఉంది అతనికి.
గత నాలుగు గంటల్లో శారీరకంగా, మానసికంగా విపరీతమైన వత్తిడి కలిగింది. బ్యాంకు లో ఇలాంటి టెన్షన్స్ ఎన్నో చూసాడు కాబట్టి అతనికి పెద్ద ఇబ్బందేమీ కలగలేదు.
కాకుంటే అలాంటి సమయాలలో తన ప్రియ నేస్తం కాఫీ తాగితే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది.
ఆ విషయం తన శ్రీమతి రేణుకకు బాగా తెలుసు. మనసెరిగిన అర్ధాంగి నా శ్రీమతి అనుకున్నాడు.
ఆ విషయం గమనించి తప్పకుండా అండి అంటూ లేచింది రేణుక కిచెన్ లోకి దారితీస్తూ .
మమ్మీ! నాకు కూడా కాఫీ ప్లీజ్ అన్నాడు మోహిత్ గదిలోనుంచి.
సరేరా అంది.
కృష్ణకుమార్ రిఫ్రెష్ అయ్యి వచ్చే సరికి పొగలు కక్కుతున్న కాఫీ రెడీ గా ఉంది టీపాయ్ మీద.
అందరూ కాఫీ తాగుతూ హాల్లో కూర్చున్నారు.
రేణుక, విద్యావతి సోఫాలో పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
వారి కెదురుగా కృష్ణకుమార్ కూర్చున్నాడు.
రేణుక తో మాట్లాడుతూ విద్యావతి ఒకమారు కృష్ణకుమార్ వైపు చూసింది. అతను బాగా అలసిపోయున్నాడు.
అతన్ని చూసి మనసులో అయ్యో అనుకుంది.
తన కోసం ఇంత కష్టపడుతున్నాడు. ఎంతో రిస్క్ కూడా ఉంది తన విషయంలో.
అయినా ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం ఈ కొద్ది రోజుల పరిచయానికి ఇంత సహాయం చేస్తున్నాడు అనుకుంది.
తను మొదటినుంచి అతనితో సరదాగా మాట్లాడుతున్నా ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు.
అతని మంచితనం తెలిసే తనుకూడా అతన్ని ఉడికిస్తూ మాట్లాడేది.
పదేళ్ల క్రితం అతని తో వర్క్ చేసినప్పుడే ఎంతో సదభిప్రాయం కలిగింది అతని మీద.
అలా ఇంప్రెస్స్ అయ్యే అప్పుడు అతని రేఖా చిత్రం వేసింది.
నిజానికి అది తన కోసం వేసుకుంది. తన బాధాతప్త జీవితంలో అతనితో వర్క్ చేసిన ఆ పదిరోజులు తనకు ఎంతో నచ్చిన క్షణాలు.
మామూలుగా బ్యాంక్లో కానీ, ఇంకే ఆర్గనైసేషన్ లో కానీ ఆడవారు పొరపాటున కొంచెం గీత దాటి మాట్లాడితే కొంతమంది మగవారు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది.
కానీ కృష్ణకుమార్ గురించి తరువాత కూడా గమనిస్తూ ఉండేది.
అతని గురించి తమ బ్యాంకు లో మంచి పేరే గాని ఎక్కడా రిమార్క్స్ లేవు. అతను తమ బ్యాంకు మ్యాగజిన్ లో రాసే రచనలు కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించేట్లు ఉండేవి.
అలా కృష్ణకుమార్ పై ఒక తెలియని అనురాగం పెంచుకుంది తన మనసులో. అది కేవలం తనలోనే దాచుకుంది.
ఎప్పుడూ ఎక్కడా ఎవరితోనూ బయటపెట్టలేదు.
ఇన్నాళ్లకు ఆ మంచితనం తనకు తోడుగా నిలబడి తన జీవితాన్ని ఒక నిప్పుల కొలిమిలోనుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తోంది.
అందుకు అతనిపై తన కున్న ఆ మంచి అభిప్రాయం ఇంకా పెరిగి పెరిగి కొండంతయ్యింది.
కృష్ణకుమార్ అప్రయత్నంగా ఎదురుగా మాట్లాడుతున్న భార్యనీ, విద్యావతినీ పక్క పక్కనే చూస్తే ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నట్లు కనిపించింది అతనికి.
అందం, చదువు, ధైర్యం అన్నీ ఉన్నాయి ఇద్దరిలో అనుకున్నాడు.
కవి గారు అన్నట్లు 'అందం యొక్క విషయం ఎప్పటికీ ఆనందం' అని, ప్రకృతి, ఆడవారు, సృష్టి లోని ప్రతి అంశం అందంగా ఉన్నప్పుడు అది మనసుకు ఎల్లప్పుడూ ఆనందం కలిగిస్తుంది.
చూసేందుకు రేణుక కొంచెం బొద్దుగా ఉంటుంది.
విద్యావతి వయసులో రేణుక కంటే పెద్దదైనా సన్నగా రివటలాగా చిన్న వయసుగా కనపడుతుంది.
అందులోనూ విపరీతమైన ఆమె చలాకీతనం చూపరులను యిట్టె ఆకట్టుకుంది. ఆమెలో ఏదో తెలియని అందం దాగుంది.
అది కేవలం బాహ్య సౌందర్యమే కాదు, ఆ మాట తీరు, ఆ నవ్వు అలా ఒకటేమిటి కవి వర్ణించగలిగితే తనపై చక్కటి కావ్యమే రాయగలడు అనుకున్నాడు.
ఆమెపై నుంచి దృష్టి మరల్చాలంటే మనసుకు కూడా పెద్ద సాహసమే.
అది మామూలు విషయం కాదు.
అలా అనుకున్నపుడల్లా తన మనసును బలవంతంగా బ్యాంకు వైపు కు మరల్చటం కృష్ణకుమార్ కి అలవాటైపోయింది.
అన్నం పెట్టె బ్యాంకు అంటే అతనికి మొదటినుంచి తల్లితో సమానం.
అతని దృష్టిలో తన బ్యాంకు చాలా గొప్పది.
తన కుటుంబం ఈ రోజు ఇలా ఉందంటే దానికంతటికీ కారణం తనకు ఉద్యోగమిచ్చిన బ్యాంకు.
****
రేణు, విద్యావతి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు.
రేణూ ! ఆల్రెడీ మూడు గంటలు దాటిందిరా. ఇక అందరం పడుకుందాం అన్నాడు కృష్ణ కుమార్.
సరే అని లేచారు అందరూ.
రేణు, విద్యావతి గెస్ట్ బెడ్ రూమ్ లోకి దారి తీశారు.
ఇక మాటలు ఆపి పడుకోండి అని హెచ్చరించి కృష్ణకుమార్ తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
మోహిత్ రూమ్ లో లైట్ లేదు. అప్పుడే నిద్రలోకి జారుకున్నట్లున్నాడు.
పొద్దున్న లెచేప్పటికీ తొమ్మిదయ్యింది. కృష్ణకుమార్ టైం చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమ్మో! తొమ్మిదయ్యింది అంటూ బాత్రూం లోకి పరుగు తీసాడు ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవడానికి.
బ్రష్ చేసుకుని హాల్ లోకి వచ్చాడు. రేణుక కాఫీ ఇచ్చింది.
తను లేచిందా అని అడిగాడు.
విద్యావతి పొద్దున్నే ఏడుగంటలకు తమ ఇంటికి వెళ్ళిందండి. చెప్పాను ఉండమని తను వినలేదు అంది.
ఓకే లే అన్నాడు కృష్ణకుమార్.
వాట్సాప్ లో విద్యావతి కి మెసేజ్ ఇచ్చాడు. లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి ఇవాళ్టికి. లాయర్ కిరణ్ ని రేపు రమ్మంటాను అని.
ఇమ్మీడియేట్ రిప్లై ఇచ్చింది తన నుంచి .
లేదు సర్. నేను ఓకే . బ్యాంకు కు వస్తున్నాను. ఒక గంట లేట్ పర్మిషన్ కావాలి అంది.
రెస్ట్ తీసుకుని మెల్లగా లంచ్ టైం కి రండి అని మెసేజ్ ఇచ్చాడు.
థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.
చక చక రెడీ అయ్యి టిఫిన్ చేసి బ్యాంకు కు బయలుదేరాడు.
కళ్ళు బాగా మండుతున్నాయి. నిద్ర సరిపోలేదు. అయినా తప్పదు.
ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని బయలుదేరాడు.
రేణు కు చెప్పాడు లంచ్ అక్కడేదన్నా తింటాను నువ్వు హైరానా పడొద్దు అని.
దారిలోనే కిరణ్ కి మెస్సేజ్ ఇచ్చాడు నాలుగు గంటలకు బ్యాంకు కు రమ్మని.
ఆరోజు శుక్రవారం. బాగా బిజీ గా ఉంది బ్రాంచ్.
శనివారం, ఆదివారం సెలవు కాబట్టి జనంతో కిటకిటలాడుతోంది.
తను కేబిన్ లోకి వెళ్ళగానే కొంతమంది కస్టమర్స్ తన వెనకాలే వచ్చారు.
అందరితోనూ మాట్లాడుతూ ఉంటే జోనల్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది.
సోమవారంనుంచి మూడు రోజులు బెంగళూరు లో కన్సార్టియం మీటింగ్. కృష్ణకుమార్ ని అటెండ్ అవ్వమని చెప్పాడు.
అసిస్టెన్స్ కోసం విద్యావతి ని కూడా తీసుకెళ్లమన్నాడు .
హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉందట ఇంకో వంద కోట్ల లోన్ కోసం.
సరే అన్నాడు. బాగా బిజీ గా ఉండటంతో టైం తెలీలేదు.
అప్పుడే లంచ్ టైం అయ్యింది. క్యాబిన్లో కస్టమర్స్ వెళ్లిపోయారు.
ఏదైనా టిఫిన్ చెపుదాం అనుకునేంతలో విద్యావతి వచ్చింది కేబిన్ లోకి.
ఏంటి, టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారా అంది.





