తీరని కష్టాల్లో ఉన్నప్పుడు హనుమ ఆరాధన చేయమని చెబుతారు ఇందుకే..!
.webp)
మనిషి జీవితంలో సుఖదుఃఖాలు సహజం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, మనోధైర్యంతో వాటిని ఎదుర్కొని ముందుకు సాగడం ఎంతో ముఖ్యం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు కష్టాలు తొలగకపోవడానికి జాతకంలో గ్రహ దోషాలు కూడా ఒక కారణం కావచ్చని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మన సనాతన ధర్మంలో ఎన్నో పరిహారాలు, పూజా విధానాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించడం వల్ల ఎంతో త్వరగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. కలియుగంలో హనుమంతుడు భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తారని పెద్దలు నమ్ముతారు.
కలియుగంలో దైవారాధన త్వరగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పేందుకు మన సంప్రదాయంలో కలౌ కపి వినాయకౌ అనే నానుడి ప్రసిద్ధి చెందింది. అంటే ఈ కలియుగంలో వినాయకుడు , హనుమంతుడు అత్యంత వేగంగా భక్తుల మొరను ఆలకించి, వారి కష్టాలను తొలగించి ఫలితాలు ప్రసాదిస్తారని దీని అర్థం. అందుకే అనేక సమస్యలతో బాధపడేవారికి నిపుణులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం లేదా హనుమంతుడికి సంబంధించిన పూజలు చేయడం మంచిదని సూచిస్తుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో ఉండే గ్రహాల వల్ల అనేక రకాల దోషాలు కలుగుతుంటాయి. గ్రహాలు అనేవి మతాలను బట్టి కాకుండా, మనుషుల జన్మ నక్షత్రాన్ని బట్టి వారి జాతకంలో ఏర్పడే దోషాలను బట్టి ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు రాహువు వంటి శాక్త గ్రహాల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోవాలంటే చండికా అమ్మవారిని ఆరాధించాలి. అలాగే విష్ణువును నిత్యం పూజించడం వల్ల బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు తొలగి ప్రసన్నత కలుగుతుంది. అదేవిధంగా శివారాధన చేయడం వల్ల శని గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది.
ఇలా గ్రహాలను బట్టి వేర్వేరు దేవతలను ఆరాధించే పద్ధతి ఉన్నప్పటికీ, హనుమంతుడు సాక్షాత్తు శివాంశతో జన్మించిన రుద్ర స్వరూపుడు. ఆయన ఆరాధన చేయడం వల్ల కేవలం ఒక గ్రహం మాత్రమే కాకుండా, జాతకంలోని సకల గ్రహాలు శాంతిస్తాయి. శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడిగా, దాసుడిగా ఉంటూ రామ భక్తాగ్రేసరుడిగా పేరుగాంచిన హనుమంతుడిని పూజించడం వల్ల శైవ, వైష్ణవ అనే తేడా లేకుండా అన్ని గ్రహాల అనుగ్రహం లభిస్తుంది.
జీవితంలో తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, ఆర్థికంగా లేదా అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు హనుమాన్ చాలీసాను నిష్టతో పారాయణం చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి మంగళవారం , శనివారం హనుమంతుడిని దర్శించుకుని ప్రదక్షిణలు చేయడం, దీపారాధన చేయడం వల్ల మనసులోని భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేవారికి హనుమ ఆరాధన ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని భక్తుల గాఢమైన నమ్మకం. కనుక నిత్య జీవితంలో భక్తి శ్రద్ధలతో హనుమను స్మరిస్తూ, ఆయన అనుగ్రహాన్ని పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపడం ఎంతో ఉత్తమం.
*రూపశ్రీ





