త్రయంబకేశ్వరం.. ఇక్కడ కాల సర్ప దోష పూజలు ఎందుకంత ప్రసిద్ధి తెలుసా.!

కాల సర్ప దోషం జీవితంలో చాలా ఇబ్బందులు పెడుతుందని చెబుతారు. జీవితంలో ఎదుగుదల పరంగా, సంబందాల పరంగా, ఆరోగ్య పరంగా.. ఇలా ప్రతి విషయంలోనూ కాల సర్పదోషం ప్రభావితం చేస్తుంది. అయితే కాల సర్పదోష పరిహారానికి కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. వాటిలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి. మహారాష్ట్ర లోని నాసిక్ లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ కాలసర్ప దోషాలు చాలా ప్రత్యేకంగా జరిపిస్తారు. ముఖ్యంగా, రాహు-కేతువుల అశుభ ప్రభావం వల్ల జాతకంలో కాలసర్ప దోషం ఉంటే.. అది చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి సమస్యలకు త్రయంబకేశ్వరం లో పరిహారాలు చేస్తారు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ కాలసర్ప దోష పూజలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
శ్రావణ మాసం..
శ్రావణ మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివారాధన వల్ల శివుడి ఆశీస్సులు తొందరగా లభిస్తాయని చెబుతారు. ఈ సమయంలో చేసే కాలసర్ప దోష శాంతి పూజలు, మహా మృత్యుంజయ జపాలు, రుద్రాభిషేకాలు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగించడంలో సహాయపడతాయి.
త్రయంబకేశ్వర ఆలయానికి, కాలసర్ప దోషానికి సంబందం..
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయం, శివుడు వెలసిన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయానికి స్వతహాగా ఉన్న ప్రాముఖ్యత మాత్రమే కాకుండా, కాలసర్ప దోష శాంతి పూజ, నారాయణ నాగబలి , పితృ దోష నివారణ వంటి ప్రత్యేక వైదిక ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివునితో పాటు సర్పదేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ కారణంగా, రాహు కేతువుల దుష్ప్రభావాలను శాంతపరచుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
గోదావరికి మూలం..
త్రయంబకేశ్వర ఆలయం పవిత్ర గోదావరి నది మూలానికి సమీపంలో ఉంది. ఇక్కడి కుశావార్త కుండం చాలా పవిత్రమైనదని చెబుాతారు. సాంప్రదాయకంగా, కాలసర్ప దోష పూజను మొదలుపెట్టే ముందు ఈ కుండంలో స్నానం చేసిన తర్వాతే పూజలు చేస్తారు. ఈ ప్రదేశంలో చేసే పూజ, దానధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతారు.
కాలసర్పదోష శాంతి పూజ.. శ్రావణ మాసంలోనే ఎందుకు?
శ్రావణ మాసం మొత్తం శివుడికి ఎంతో ప్రీతి అని చెబుతారు. మత నమ్మకాల ప్రకారం, ఈ కాలంలో శివుడిని పూజించడం, రుద్రాభిషేకం చేయడం , మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం విశేషంగా చాలా ఫలప్రదమైనవిగా పరిగణించబడతాయి.
శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం, నాగ పంచమి, అమావాస్య.. ఈ తిథులు అన్నీ శివపూజలకు చాలా ప్రత్యేకంగా పరిగణించబడతాయి. అందుకే సాధారణ రోజులలో కంటే.. శ్రావణ మాసంలో కాలసర్ప దోష పూజలు ఎక్కువగా జరుగుతాయి.
*రూపశ్రీ.





