సంపదలు తెచ్చిపెట్టే లక్ష్మీ గవ్వలు
Seashells brings wealth
గవ్వలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకూ వాటిని అపురూపంగా తడిమిచూస్తారు. గవ్వలు పవిత్రమైనవి, లక్ష్మీదేవితో సమానమైనవి అంటే నమ్మగలరా? ఇది అక్షరాలా నిజం.
గవ్వలు స్థూలంగా ఒకటే ఆకృతిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న తేడాలతో అనేక రకాలు ఉన్నాయి. ఈ గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలను, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఈ లక్ష్మీ గవ్వలు గనుక పూజామందిరంలో ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తాండవమాడుతుంది.
అసలు లక్ష్మీ గవ్వలు ఎక్కడివి, ఎలా వచ్చాయి అనే సందేహం కలుగుతోందా? అయితే లక్ష్మీ గవ్వలు గురించిన సందేహాన్ని వెంటనే నివృత్తి చేసుకుందాం. క్షీర సాగర మధనం సమయంలో అమృతం, హాలాహలంతో పాటు శంఖాలు, లక్ష్మీ గవ్వలు కూడా ఉద్భవించాయట. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా, గవ్వను సోదరిగా భావిస్తారు. ఆ విధంగా లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపం అయ్యాయి.
గవ్వను లక్ష్మీదేవి చెల్లెలిగా భావించేవారు కనుక, నాణాలు, రూపాయలు పుట్టకముందు వాటినే కాసులుగా వాడేవారు. ఆర్ధిక లావాదేవీల్లో గవ్వలనే మారకంగా వినియోగించేవారు. అంటే, ఒకప్పుడు డబ్బుకు మారుగా గవ్వలే ఉమడేవన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ గవ్వలు ఉంటే వారే ధనవంతులు. గవ్వలకు చాలా ప్రాధాన్యత ఉండేది. గవ్వలు లేనివాళ్ళు నిరుపేదలు. ఇప్పటికీ బొత్తిగా డబ్బు లేదని చెప్పడానికి ''చిల్లి గవ్వ కూడా లేదు'' అనడం ఎన్నోసార్లు విని ఉంటాం.
గవ్వలను కాసులుగా వినియోగించారంటే, అందుకు కారణం లేకపోలేదు. లక్ష్మీ గవ్వలు సామాన్యమైనవి కావు. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉంటే సంపదలు వచ్చిపడతాయి. ధనధాన్యాలు వృద్ది చెందుతాయి. అంటే, గవ్వలకు, లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.
అదీ లక్ష్మీ గవ్వల విశిష్టత. అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహం తోబాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. మీరు కూడా లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజా మందిరంలో ఉంచండి. సిరిసంపదలను పెంచుకోండి.
wealth with sea shells, sea shells or gavvalu equal to goddess lakshmidevi, goddess of wealth lakshmidevi lives in gavvalu, lakshmidevi lives in sea shells