జ్ఞానం గురించి వివేకానందుడు ఏమి చెప్పాడు?

విద్య జ్ఞానాభివృద్ధికే గాని ఉద్యోగం చేయడానికి కాదని లోగడ వివరించడమైనది. అయితే “అసలు జ్ఞానం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావములు ఏ విధంగా వుంటాయి? అట్టి జ్ఞానమును సంపాదించటం ఎట్లా??

జ్ఞానమంటే - ప్రకాశం, కాంతి, వెలుగు అని అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. ఇట్టి జ్ఞానమే మానవునికి నిజమైన శక్తి. ఒక్కొక్క వస్తువు  పూర్వాపరములను తెలుసుకోవటమే జ్ఞానం. వ్యక్తి సంబందాన్ని  గుర్తించడమే జానము. మన మనస్సులలో ఉన్న పాత అనుభవాలతో క్రొత్త అనుభవాలను జోడించి సరిక్రొత్త విషయాలను కనుగొనుటమే జ్ఞానం.

అసలు మనిషిలో ప్రకాశం, క్రాంతి, వెలుగు ఎలా వస్తుంది ? 

వేద వేదాంగములు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక శాస్త్రములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, నీతిని బోధించే ఉద్గ్రంధములు, మహానుభావుల చరిత్రలు,  భౌతిక విజ్ఞాన సాంకేతిక శాస్త్రములు, మానసిక శాస్త్రములు మొదలయినవి ఎన్నో ముఖ్యమైన గ్రంథముల గురించి వినడం, వాటిని చదివి తెలుసుకోవడం వల్ల  ఈ 'జ్ఞానం' కలుగుతుంది, వివేకంతో, విచక్షణాయుతంగా ఆలోచించే శక్తి వస్తుంది.  అలాంటి జ్ఞానమే నిజమైన, వాస్తవికమైన విద్య, శాస్త్రములు చదువితే  వచ్చిన జ్ఞానమును "శాస్త్ర జన్య జ్ఞానము” అంటారు. ఇది పరోక్షపు జ్ఞానము మాత్రమే. విస్తృతంగా దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అయా ప్రాంతాల స్థితి గతులను నేరుగా చూడటం, అర్థం చేసుకోవడం వల్ల  'అనుభవ జ్ఞానము' లభిస్తుంది.

"జ్ఞానహీనాః పశుభిన్నమానాః" జ్ఞాన హీనులైన వారు పశువులతో సమానము, జ్ఞాన విజ్ఞానములతో సమానమైనది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మొట్ట మొదట జ్ఞానం యొక్క ఆవశ్యకతను, స్వరూప స్వభావాలను చూస్తే..

జ్ఞానం  ఆవశ్యకతను గురించి భగవద్గీతలో “సహిజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే" అనగా ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది లేనే లేదుగదా!' అని అర్ధం. ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులెన్నో వున్నాయి. అతి ప్రియమైనవి కూడా వున్నాయి. అయినప్పటికి వాటన్నికన్నా పవిత్రమయినది, ప్రియమయినది, మానవునికి వెలుగు ప్రసాదించేది ఒక్క "జ్ఞానము' మాత్రమే. అలాంటి జ్ఞానాన్ని జీవిత కాలంలో ఈ గడ్డమీద పుట్టిన ప్రతి వ్యక్తి సంపాదించి తీరాలి, జ్ఞానమే జీవులకు చరమ లక్ష్యం. 

అసలు ఈ జ్ఞానము అనే తేజస్సును ఎవరు పొందగలుగుతారు??

 గీతలో దీనికి చక్కటి సమాధానం ఉంది..  శ్రద్ధ గలవాడు మాత్రమే జ్ఞానమును పొందగలుగుతాడు. ఏ కార్యమును సాధించ-- వలెననినప్పటికి “శ్రద్ధ” చాలా అవసరం. ఏ విద్యార్థి అయినా సరే పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు. కావాలంటే 'శ్రద్ధ' ముఖ్యం. 'శ్రద్ధ' ఉన్నప్పుడే నుంచి ఫలితాలను సాధించ గలుగుతారు. శ్రద్ధతో పాటు 'ఏకాగ్రత' కూడా తప్పనిసరిగా వుండాలి... తన శక్తియుక్తులను అన్నింటిని ఒకచోట కేంద్రీకరించి శ్రద్ధతో, పట్టుదలతో పని చేసినప్పుడే విజయం లభిస్తుంది. ఒక వైపు పాఠముల చదువుతూ, మరొక ప్రక్క అమ్మ చేసిన పిండివంటల మీదకు గాని, బడిలోని ఆటల మీదకు గాని మనస్సు పోనివ్వరాదు. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే తన యావత్ దృష్టిని కేంద్రీకరించి శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేస్తే.. సత్ఫలితాలు చేకూరుతాయి.

                                         ◆ నిశ్శబ్ద.


More Subhashitaalu