వనదేవి ఆలయం రహస్యం.. సూర్యాస్తమయం తర్వాత ఎందుకు నిషేధం.!

భారతదేశంలో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక , రహస్యాలతో కూడిన ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఉదయం అంతా భక్తితో మార్మోగిపోయి, సాయంత్రం అవ్వగానే స్మశాన నిబ్దాన్ని ఆవరించుకుంటాయి. అలాంటి దేవాలయాలలో వనదేవి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం చాలా విచిత్రమైనది , రహస్యమైనదిగా పేరుగాంచింది. వనదేవి ఆలయానికి సంబంధించి చాలా వింత విషయాలు, రహస్యాలు, కథనాలు , అక్కడ జరిగే వింత సంఘటనలు ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఒక వైపు భక్తుల కోరికలు తీర్చే శక్తిగా, మరొక వైపు రాత్రి వేళల్లో భయంకరమైన రహస్యం చోటు చేసుకునే ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
వనదేవి ఆలయం ఎక్కడుంది?
ఈ ఆలయం బీహార్ రాజధాని పాట్నా నగరం నుండి సుమారు 30 నుండి 35 కిలోమీటర్ల దూరంలో, బిహ్తా అనే ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇది అంహరా, కాంచన్‌పూర్ , రాఘవ్‌పూర్ అనే మూడు గ్రామాల సరిహద్దుల మధ్య దట్టమైన అడవిలో నెలకొని ఉంది
వనదేవి ఆలయ విశిష్టత..
అడవి మధ్యలో లేదా ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా, అడవిని , స్థానిక ప్రజలను కాపాడే దేవతగా పూజలందుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలను అమ్మవారికి నివేదిస్తే తప్పక నెరవేరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు , జీవితంలోని తీవ్రమైన కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. అమ్మవారి శక్తి చాలా ప్రభావవంతమైనదని, ఇక్కడ చేసే ప్రార్థనలు నిష్ఫలం కావని భక్తులు బలంగా నమ్ముతారు.
సూర్యాస్తమయం తర్వాత రహస్యం..
ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత , కఠినమైన నియమం ఏంటంటే, సూర్యాస్తమయం కాగానే ఆలయ పరిసరాల్లో ఎవరూ ఉండకూడదు. సూర్యుడు అస్తమించిన వెంటనే అర్చకులతో సహా అందరూ ఆలయాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోతారు. రాత్రి వేళ ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళడానికి లేదా అక్కడ గడపడానికి ఎవరూ సాహసించరు. దీని వెనుక కొన్ని బలమైన ఆధ్యాత్మిక , జానపద కారణాలు ఉన్నాయి.
అమ్మవారి సంధ్యా సమయ విహారం..
రాత్రి వేళల్లో వనదేవి తన పరివారంతో కలిసి ఆలయ ప్రాంగణంలో సంచరిస్తుందని నమ్ముతారు. ఆ సమయంలో మానవులు ఎవరైనా అక్కడ ఉంటే, దేవత ఉగ్రరూపానికి లేదా, శక్తి యొక్క తీవ్రతకు గురవుతారని నమ్ముతారు. ప్రకృతి దేవత తన ప్రాంగణాన్ని రాత్రి వేళల్లో తన అధీనంలోకి తీసుకుంటుందని భావిస్తారు.
అదృశ్య శక్తులు , పూజలు..
చీకటి పడిన తర్వాత ఈ ఆలయంలో మనుషులు చేయని విచిత్రమైన శబ్దాలు, గజ్జెల చప్పుడు , సువాసనలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. రాత్రి వేళల్లో దేవతలకు, యక్షులకు లేదా అదృశ్య శక్తులకు చెందిన పూజలు అక్కడ జరుగుతాయని ప్రచారం ఉంది. ఈ శక్తుల కార్యకలాపాలకు భంగం కలిగిస్తే తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయని ప్రజలు భయపడతారు.
అనుభవాలు , హెచ్చరికలు..
గతంలో ఈ నియమాన్ని ఉల్లంఘించి, సూర్యాస్తమయం తర్వాత ఆలయం దగ్గర ఉండటానికి ప్రయత్నించిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని లేదా కొందరు మతి భ్రమించి పిచ్చి పట్టిపోయారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు భయంతో స్పృహ తప్పిపోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతారు. అందుకే పెద్దలు, అర్చకులు సూర్యాస్తమయం కాకముందే భక్తులను అక్కడి నుండి పంపించివేస్తారు.
సంప్రదాయం , భయం మధ్య భక్తి..
ఈ ఆలయం భక్తికి ఎంత ప్రసిద్ధమో, అక్కడి కఠినమైన నియమాలకు కూడా అంతే పేరుగాంచింది. శాస్త్రవేత్తలు లేదా హేతువాదులు వీటిని కేవలం స్థానిక నమ్మకాలుగా లేదా జానపద కథలుగా కొట్టిపారేసినప్పటికీ, తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడ కఠినంగా పాటిస్తున్నారు. పగటి పూట ఎంతో ప్రశాంతంగా, దివ్యమైన వాతావరణంతో అలరారే ఈ వనదేవి ఆలయం, చీకటి పడగానే ఒక నిశ్శబ్ద రహస్య కేంద్రంగా మారిపోతుంది.
*రూపశ్రీ.





_medium.png)
