Home » Festivals » Deepavali » దీపావళి రోజు ఈ పనులు తప్పక చేయండి.. అంతా శుభమే జరుగుతుంది!

దీపావళి రోజు ఈ పనులు తప్పక చేయండి.. అంతా శుభమే జరుగుతుంది!

దీపావళి పండుగ అంటేనే వెలుగుల జిలుగులు, పటాసుల సందడి, ఇంటా బయటా పండగ వాతావరణం. అమావాస్య చీకట్లను తరిమివేస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఈ పవిత్రమైన రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పెద్దలు నమ్ముతారు. ఏడాదంతా సిరిసంపదలు కురవాలంటే దీపావళి రోజున ఏయే పనులు విధిగా ఆచరించాలి? ఎందుకు ఆచరించాలి? పురాణ పండితులు చెబుతున్న విషయాలేంటో వివరంగా తెలుసుకుంటే..


దీపావళి పర్వదినం రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా మంచిది. రోజూలాగా ఆలస్యంగా లేవకుండా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని ఇల్లు , వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి, మామిడి ఆకుల తోరణాలతో ఇళ్ళను అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

స్నానానికి ముందు నువ్వుల నూనెను శరీరానికి, తలకు నలుగులా పెట్టుకుని తలస్నానం చేయడం ఈ రోజు మరో ముఖ్యమైన ఆచారం. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి, సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్నానం చేసే నీటిలో ఉత్తరేణి ఆకులు వేసుకోవడం లేదా ఆకులతో దిష్టి తీసి స్నానం చేయడం మరింత శుభప్రదంగా భావిస్తారు.


స్నానం ముగించుకున్నాక సరికొత్త వస్త్రాలను లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులను ధరించి సాంప్రదాయబద్ధంగా ఉండటం మంచిది. ఆ తర్వాత పూజా గదిలో పీఠం ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణుల ప్రతిమలను లేదా ఫోటోలను ఉంచి పూజించాలి. కొందరు కేదారేశ్వర వ్రతం లేదా గౌరీదేవి పూజలను కూడా ఆచరిస్తారు. అరిసెలు, గారెలు, బూరెలు, పరమాన్నం వంటి సాంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పించి, కనకధార స్తోత్రం , లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలవాలి.

సూర్యాస్తమయం  అవుతున్న సమయంలో.. ప్రదోష వేళలో ఇంటా బయటా దీపాలు వెలిగించడం  దీపావళి రోజు ఆచరించే చాలా ముఖ్యమైన  ఘట్టం. తులసి కోట దగ్గర, సింహద్వారం ముందు , పూజా గదిలో సరి సంఖ్యలో దీపాలు వెలిగించాలి. ప్రతి దీపంలోనూ నాలుగు ఒత్తులు వేసి, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం శ్రేయస్కరం. దీపం నేల మీద నేరుగా పెట్టకుండా ఏదైనా ఆకుపై ఉంచి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజించాలి. కొవ్వొత్తులకు బుధులు మట్టి ప్రమిదలు లేదా ఇత్తడి దీపాలను ఉపయోగించడం మంచిది.


దీపావళి రోజున పేదలకు, బంధువులకు వాయనాలు ఇవ్వడం, అలాగే పితృదేవతలను స్మరించుకుంటూ టపాసులు కాల్చడం చేస్తారు. అయితే దేవుని చిత్రపటాలు ముద్రించిన పటాసులను కాల్చకుండా జాగ్రత్తపడాలి. ఈ నియమాలను పాటిస్తూ భక్తితో దీపావళిని జరుపుకుంటే ఇంట్లో సర్వదా సుఖసంతోషాలు, అష్టైశ్వార్యాలు సిద్ధిస్తాయి.

                               *రూపశ్రీ.

google-ad-img