చాతుర్మాస్యంలో విశిష్టంగా చేసుకునే 16 సోమవారాల వ్రతం.. ఇదెంత శక్తివంతమైనదో తెలుసా.!
.webp)
చాతుర్మాస్యం అంటే.. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే కాలం. ఈ నాలుగు నెలలలో పరమేశ్వరుడు సృష్టి బాధ్యతలు స్వీకరిస్తాడని చెబుతారు. ఈ నాలుగు మాసాలలో.. ప్రతి మాసంలో నాలుగు సోమవారాలు వస్తాయి. అలా నాలుగు మాసాలకు 16 సోమవారాలు వస్తాయి. ఈ నాలుగు మాసాలలో వచ్చే 16 సోమవారాలలో పరమేశ్వరుడిని పూజించి, ఆయన అనుగ్రహం పొందే అద్బుతమైన వ్రతమే 16 సోమవారాల వ్రతం. ఈ వ్రతం చాలా శక్తివంతమైనదని చెబుతారు. అసలు ఈ వ్రతం ఎలా చేస్తారు? ఈ వ్రతాన్ని చాతుర్మాస్యంలోనే చేయాలా? వ్రత నియమాలు ఏంటి? ఈ వ్రతం శక్తి ఏమిటి? పూర్తీగా తెలుసుకుంటే..
16 సోమవారాల వ్రతం..
చాతుర్మాస్యంలో వచ్చే 16 సోమవారాలలో శివుడిని, పార్వతీ సమేతంగా ఆరాధించడం ఈ వ్రతంలో జరుగుతుంది. ఈ వ్రతానికి చాతుర్మాస్యంలో వచ్చే 16 సోమవారాలు చాలా విశేషమైనవని చెబుతారు. అయితే.. చాతుర్మాస్యం కాకపోయినా.. మిగిలిన మాసాలలో భక్తి మేరకు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మహిళలకు ఈ వ్రతం చేసేటప్పుడు ఏమైనా ఆటంకాలు వస్తే.. ఆ వారం వదిలి ఆ తరువాత కొనసాగించవచ్చని పండితులు, పెద్దలు చెబుతారు. అయితే చాతుర్మాస్యంలో వచ్చే సోమవారాలను మాత్రం మిస్ చేసుకోకూడదని చెబుతారు. వీలైనంత వరకు 16 సోమవారాల వ్రతాన్ని చాతుర్మాస్యంలో చేయడానికి ప్రయత్నించడం మంచిది.
మృణ్మయ లింగ ప్రత్యేకం..
16 సోమవారాల వ్రతంలో అన్నింటికంటే పెద్ద ఆకర్షణ మృణ్మయ లింగం. మృణ్మయం అంటే మట్టి.. మట్టితో శివలింగాన్ని తయారు చేసి, పూజించడం ఈ వ్రతంలో ప్రధానం. ప్రతి వారం ఒక కొత్త లింగాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా 16 వారాలు అయ్యాక.. 16వ వారం ఆ శివలింగాలను నదిలో నిమజ్జనం చేయడం ఎంతో పుణ్యప్రమైనదని చెబుతారు. ఎప్పుడైనా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళితే అక్కడ ఆ శివలింగాలను నిమజ్జనం చేయవచ్చని చెబుతారు.
16 సోమవారాల వ్రతం కోసం చాలావరకు పుట్ట మన్నును సేకరిస్తారు. పుట్టను ఎవరూ తొక్కరు.. కాబట్టి ఈ కారణంగా పుట్టమన్నును ఉపయోగించాలని చెబుతారు. పుట్ట మన్ను దొరకని పక్షంలో.. ఇంట్లో తులసి మొక్క పాదులో ఉన్న మట్టిని కూడా ఉపయోగించవచ్చని చెబుతారు. ఒకవేళ మృణ్మయ లింగం పెట్టుకోలేని వారు.. ఇంట్లో ఉండే శివలింగాన్ని అయినా ఈ వ్రతం కోసం ఉపయోగించవచ్చు.
నియమాలు..
16సోమవారాల వ్రతం చేసుకునేవారు నిష్టగా చేసుకోవాలి, ఎవరినీ నిందించడం, ఎవరితో గొడవ పడటం, నిందలు వేయడం వంటివి చేయకూడదు.
సోమవారాల వ్రతం చేసుకునే రోజు.. పరమేశ్వరుడికి గోధుమ నూక, బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యం తయారుచేసి పెట్టాలి.
సోమవారాల వ్రతం చేసుకునే వారు.. ఆ రోజు ఉప్పు తినకూడదు.
బ్రహ్మ చర్యం పాటించడం, నేల మీద నిద్ర చేయడం ఎంతో మంచిది.
వ్రతం శక్తి..
16సోమవారాల వ్రతం సాధారణమైనది కాదు.. దీన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీ దేవికి ఉపదేశించినట్టు చెబుతారు. ఏదైనా కోరిక కోరి వ్రతాన్ని చేయవ్చచని చెబుతారు.. ఈ వ్రతం ముగిసేలోపు తప్పకుండా కోరిన కోరికను ఆ పరమేశ్వరుడు తీర్చుతాడని చెబుతారు.
కోరిక కోరకుండా వ్రతం చేసేవారికి ఆ పరమేశ్వర అనుగ్రహం.. జీవితంలో ఎంతో గొప్ప స్థానం ఇస్తాడని చెబుతారు.
ఈ వ్రతం ఆచరించే మహిళలకు సౌభాగ్యం, పురుషులకు జీవితంలో ఉన్నత స్థాయి.. లభిస్తాయని, మనసులో ఉన్న ధర్మబద్దమైన కోర్కెలు నెరవేరతాయని చెబుతారు.
*రూపశ్రీ.





