శ్రీసాయిసచ్చరిత్రము
ముప్పైఎనిమిదవ అధ్యాయము
ఆరవరోజు పారాయణ
మంగళవారము
1. బాబా వంటపాత్ర. 2. దేవాలయమును గౌరవించకుండుట.
3. కాలా లేదా మిశ్రమము 4. మజ్జిగ.
గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవం వర్ణించాము. ఈ అధ్యాయంలో మనం బాబా వంటపాత్ర మొదలై వాటి గురించి చదువుకుందాము.
తొలి పలుకు :
ఓ సద్గురుసాయి! నీవు పావనమూర్తివి! ప్రపంచమంతటికి సంతోషాన్ని ప్రసాదించావు, భక్తులకు మేలు కలగజేశావు నీ పాదములను ఆశ్రయించినవారి బాధలను తొలగించావు. నిన్ను శరణు కోరినవారిని ఉదారస్వభావుడవు కావడంతో వారిని పోషించి రక్షిస్తావు. నీ భక్తుల కోరికలు నెరవేర్చటం కోసం, వారికీ మేలు చేయటం కోసం నీవు అవతరిస్తావు. పవిత్రాత్మ అనే ద్రవసారాన్ని బ్రహ్మం అనే అచ్చులో పోస్తే దానినుండి యోగులలో అలంకారమైన సాయి వెళ్ళారు. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్చమైన దైవికానందానికి వారు పుట్టినిల్లు. జీవతేచ్చలన్నీ పొందినవారై, వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులను చేశారు.
బాబా వంటపాత్ర :
యుగయుగాలకు శాస్త్రాలు వేర్వేరు సాధనాలను ఏర్పాటు చేసి ఉన్నాయి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం, కలియుగంలో దానం చేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దానాలన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమైంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనం దొరకకపోతే మనం చాలా బాధపడతాము. అలాంటి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అలాంటే బాధపడతాయి. ఈ విషయం తెలిసి ఎవరయితే బీదలకు, ఆకలితో ఉన్న వారికి భోజనం పెడతారో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇలా చెబుతుంది, "ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండే సమస్తజీవులు ఉద్భవించాయి. చచ్చిన తరువాత అవి తిరిగి ఆహారంలో ప్రవేశిస్తాయి'' మిట్టమధ్యాహ్నం మన యింటికి ఎవరైనా అతిథి వచ్చినట్లుయితే, వారిని ఆహ్వానించి భోజనం పెట్టడం మన విధి. ఇతర దానాలు అనగా ధనం, బట్టలు మొదలైనవి ఇస్తున్నప్పుడు కొంచెం విచక్షణ కావాలి, కానీ ఆహార విషయంలో అలాంటి ఆలోచన అనవసరం. మన యింటికి మిట్టమధ్యాహ్నం ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట భోజనం పెట్టాలి. కుంటి, గ్రుడ్డి, రోగిష్టులు వచ్చినట్లయితే వారికి మొట్టమొదట భోజనం పెట్టిన తరువాత ఆరోగ్యవంతులకు, అటు తరువాత మన బంధువులకు పెట్టాలి. మన బంధువులు మొదలైన వారికి పెట్టడంకంటే, నిస్సహాయులైన అంగవికలాంగులు తదితరులకు పెట్టడం ఎంతో శ్రేయస్కరం. అన్నదానం లేకపోతే ఇతర దానాలు ప్రకాశించవు. ఎలాగంటే చంద్రుడు లేని నక్షత్రాలలా, పతకంలేని కంఠహారంలా, పింఛంలేని కిరీటంలా, కమలం లేని చెరువులా, భక్తిలేని భజనలా, కుంకుమబొట్టులేని పుణ్యస్త్రీలా, బొంగురు కంఠం కలవాడి పాటలా, ఉప్పులేని మజ్జిగలా రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎలా ఎక్కువో అలాగే అన్ని పుణ్యాలలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎలా తయారుచేసి పంచి పెడుతూ ఉండేవారో చూద్దాము.
బాబా కోసం చాలా తక్కువ భోజం కావలసి ఉండేది. అదీ కొన్ని ఇళ్ళనుండి భిక్షాటన చేసి తెచ్చుకునేవారని ఇదివరకే తెలుసుకున్నాము. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టాలని బాబా నిశ్చయించుకున్నట్లయితే మొదటినుండి చివరివరకు కావలసిన ఏర్పాట్లు అన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు; ఎవరికీ బాధ కలగ చేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధ్యానం, పిండి, మసాలా దినుసులు మొదలైనవి అన్నీ నగదు యిచ్చి కొనేవారు. వారే విసురుతూ ఉండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీళ్ళు పోసి పెట్టేవారు. వారి దగ్గర వంటపాత్రలు రెండు ఉన్నాయి. ఒకటి పెద్దది వందమందికి సరిపోయేది, రెండవది చిన్నది 50 మందికి మాత్రం సరిపోయేది. ఒక్కొక్కప్పుడు చక్కర పొంగలి వండేవారు. మరొకప్పుడు మాసపు పులావు వాడేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమపిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దాన్ని వంటపాత్రలో వేసేవారు. పదార్థాలు చాలా రుచిగా ఉండడానికి ఎంతో శ్రమ తీసుకోవాలో అంత శ్రమను పడుతుండేవారు.
అప్పుడప్పుడు అంబలి వండేవారు. అంటే జొన్న పిండిని నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుతుండేవారు. భోజన పదార్థాలతో ఈ అంబలిని కూడా అందరికి కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగా ఉడికిందో లేదో అని పరీక్షించడానికి బాబా తన కఫనీని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుతున్న డేకిసాలో పెట్టి కలుపుతూ ఉండేవారు. వారి ముఖంలో భయచిహ్నాలు కానీ, చేయి కాలుతున్నట్టు కానీ కనిపించేది కాదు. వంట పూర్తికాగానే, బాబా ఆ పాత్రలను మసీడులోనికి తెచ్చి, మౌల్వీతో ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదంగా పంపించిన తరువాత మిగతా దాన్ని బీదవాళ్ళకు, దిక్కులేనివారికి సంతృప్తిగా పెడుతూ ఉండేవారు. బాబా స్వయంగా తన చేతులతో తయారుచేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసినవారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు అయి ఉండాలి.
బాబా తన భక్తులందరికీ శాకాహారం, మాంసాహారం ఓకే రీతిగా పెడుతుండేవారా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభం, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అలాంటి వారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారాలు కానివారు ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీన్ని తినడానికి కోరిక కూడా కలగనిచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని తినవచ్చునా లేదా అని ఆలోచించే శిష్యుడు నరకానికి వెళతాడని రూడీ ఉండి. దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేరుస్తూ ఉన్నారో లేదో చూడడానికి బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షిస్తూ ఉండేవారు. దీనికొక ఉదాహరణ. ఒక ఏకాదశిరోజు దాదాకేల్కరుకి కొన్ని రూపాయలు ఇచ్చి కోరాల్బాకి వెళ్ళి మాంసం కొని తీసుకురమ్మన్నారు. ఇతడు సనాతన ఆచార పరాయణుడైన బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనం, ధాన్యం, వస్త్రాలు మొదలైనవి ఇవ్వటం చాలదనీ, కావలసింది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించటమే అనీ, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చటమే అనీ, ఇదే నిజమైన దక్షిణ అనీ, దీనివల్లనే గురువు సంతృప్తి చెందుతారానీ అతనికి తెలుసు. కాబట్టి దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరారు. కాని బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయంగా వెళ్ళవద్దనీ, ఇంకెవరినైనా పంపమని చెప్పారు. అతడు పాండు అనే నౌకరుని పంపించారు. వాడు బయలుదేరటం చూసి బాబా వాణ్ణి కూడా వెనక్కి పిలిపించి ఆనాడు మాంసం వండటం మానుకున్నారు. ఇంకొకసారి బాబా దాదాకేల్కరుని పిలిచి పొయ్యి మీదున్న పులావు ఉడికిందో లేదో చూడమన్నారు. కేల్కర్ దాన్ని పరీక్షించకుండానే సరిగ్గా ఉందని జవాబిచ్చారు. అప్పుడు బాబా "నీవు కళ్ళతో దాన్ని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎలా చెప్పావు. మూత తీసి చూడు'' అంటూ బాబా అతని చేతిని పట్టుకొని మరుగుతున్న డేకిసాలో పెట్టారు. ఇంకా ఇలా అన్నారు "నీ చేయిని తీయి. నీ ఆచారం ఒక ప్రకక్కు పెట్టి తెడ్డుతో తీసి, కొంచెం ప్లేటులో వేసి సరిగ్గా ఉడికిందో లేదో తెలుసుకో.'' తల్లి మనస్సులో నిజమైన పరమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడుస్తున్నప్పుడు వాణ్ణి కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటుంది. అలాగే బాబా కూడా కన్నతల్లిలా దాదాకేల్కరుని ఈ విధంగా గిల్లారు. నిజంగా ఏ యోగి కాని, గురువు కాని తన శిష్యుడికి నిషిద్ధ ఆహారం తిని చెడిపొమ్మని చెప్పడు.
ఈ విధంగా బాబా పులావు వండటం 1910వ సంవత్సరం వరకు జరుగుతూ ఉండేది. పూర్వం చెప్పిన రీతిగా దాసగణు, బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశారు. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండాలుగా షిరిడీకి వస్తూ ఉన్నారు. కొన్ని రోజులలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రం అయ్యింది. భక్తులు అనేక రకాల ఆహారాలను బాబాకు నైవేద్యం పెడుతుండేవారు. వారు తెచ్చిన పదార్థాలు ఫకీరులు, బీదలు తినగా ఇంకా మిగులుతూ ఉండేది. నైవేద్యాన్ని ఎలా పంచి పెట్టేవారో చెప్పడానికి ముందు బాబాకు షిరిడీలోని దేవాలయాలలో, అందులో దేవతల పట్ల గల గౌరవాన్ని చాటే నానాసాహెబు చాందోర్కరు కథ తెలుసుకుందాం.
నాసాహెబు దేవాలయమును అగౌరవించుట :
ఎవరికీ తోచినట్టు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెపుతుండేవారు. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కాదు. వారెప్పుడు పుట్టారో, ఏ జాతిలో పుట్టారో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కాబట్టి వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కానీ ఎలా కాగలరు? వారు మహమ్మదీయులు అయినట్లయితే మసీదులో ఎప్పుడు ధుని ఎలా మండనిస్తారు? అక్కడ తులసీబృందావనం ఎలా వుంటుంది? శంఖం ఊదడానికి ఎవరు ఒప్పుకుంటారు? గంటలను మ్రోగించటానికి ఎవరు సమ్మతిస్తారు? సంగీత వాద్యాలను ఎలా వాయించనిస్తారు? హిందువుల మతం ప్రకారం షోడశోపచార పూజలను ఎలా జరగనిస్తారు? వారు మహమ్మదీయులు అయినట్లయితే వారి చెవులకు కుట్లు (రంధ్రాలు) ఎలా వుంటాయి? గ్రామంలోని హిందూ దేవాలయాలన్నిటికీ ఎలా మరమ్మత్తు చేయించారు? బాబా హిందూ దేవాలయాలను దేవతలను ఏ మాత్రం అగౌరవించినా ఊరుకునేవారు కాదు. ఒకరోజు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడు అయిన బినీవాల్యాతో షిరిడీకి వచ్చారు. బాబా దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి "నా సహవాసం ఇన్నాళ్ళు చేసినా ఇలా ఎందుకు చేశారు?'' అన్నారు. నానాసాహెబు మొదట దీన్ని గ్రహించలేక పోయారు. కాబట్టి అదేమిటో వివరించవలసిందిగా ప్రార్థించారు. కోపర్ గాం నుండి షిరిడీకి ఎలా వచ్చావు అని బాబా అతన్ని అడిగారు. నానాసాహెబు వెంటనే తన తప్పు గ్రహించారు. సాధారణంగా షిరిడీకి వెళ్ళినప్పుడల్లా నానాసాహెబు కోపర్ గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవారు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతన్ని కూడా వెళ్ళనీయకుండా, ఆలస్యం అయిపోతుందని చెపుతూ తిన్నగా షిరిడీకి తీసుకువచ్చారు. ఇదంతా బాబాకు తెలియ చేస్తూ, తాను గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక ముళ్ళు పాదంలో గ్రుచ్చుకుని తనను చాలా బాధ పెట్టిందని చెప్పారు. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అంటూ ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించారు.
కాలా (మిశ్రమము) :
ఇక నైవేద్యం ఎలా పంచి పెట్టేవారో చూద్దాము. హారతి తరువాత, భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదాలు ఇచ్చి పంపించేసిన తరువాత, బాబా మసీదులోకి వెళ్ళి నింబారువైపు వీపు పెట్టి కూర్చుంటూ ఉండేవారు. కుడివైపు, ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చుంటూ ఉండేవారు. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళేలను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదం కోసం, ఊదీ కోసం కనిపెట్టుకుని బయట నిలబడుతూ ఉండేవారు. అన్ని రకాల ప్రసాదాలు బాబాకు వస్తుండేవి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నం మొదలైనవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచేవారు. బాబా దీన్ని దైవానికి అర్పించి, పావనం చేస్తూ ఉండేవారు. అందులో కొంతభాగం బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబాకు అటూ ఇటూ రెండు వరుసలలో కూర్చున్న భక్తులు సంతృప్తిగా తింటుండేవారు. శ్యామా, నానాసాహెబు నిమోన్ కర్ వడ్డించేవారు. వచ్చినవారి సౌకర్యాలను వీరు చూసేవారు. వారు అ పని అతి జాగ్రత్తగా, ఇష్టంగా చేస్తుండేవారు. తిన్నటువంటి ప్రతి రేణువు కూడా తృప్తీ, సత్తువా కలుగచేస్తూ ఉండేవి. అది అలాంటి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనదీ, పవిత్రమైనదీ.
ఒక గిన్నెడు మజ్జిగ :
ఒకరోజు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపునిండా తిన్నారు. అలాంటి సమయంలో బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగమని యిచ్చారు. అది తెల్లగా చూడటానికి ఇంపుగా వుంది. కాని అతని కడుపులో ఖాళీ లేనట్టు ఉంది. కొంచెం పీల్చగా అది అత్యంత రుచిగా ఉండింది. అతను గుంజాటన కనిపెట్టి బాబా అతనితో ఇలా అన్నారు. "దాన్ని అంతా త్రాగు. నీకిక్క మీదట ఇలాంటి అవకాశం దొరకదు.'' అతడు వెంటనే దాన్ని అంతా త్రాగారు. బాబా పలుకులు సత్యమయ్యాయి. ఎలాగంటే త్వరలో బాబా సమాధి చెందారు.
పాఠకులారా! హేమాడ్ పంతుకి మనం నిజంగా నమస్కరించాలి. అతను గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా త్రాగారు. కాని మనకు కావలసినంత అమృతాన్ని బాబా లీలల రూపంగా యిచ్చారు. మనం ఈ అమృతాన్ని గిన్నెలతో త్రాగి సంతృప్తి చెంది ఆనందించెదముగాక!
ముప్పైఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం