నారద పురాణం చెప్పిన నిజాలు.. ఈ వస్తువులను ఎప్పుడూ తాకరాదు!

హిందూ ధర్మంలో మొత్తం 18 మహా పురాణాలు ఉన్నాయి. వాటిలో నారద పురాణం కూడా ఒకటి. నారద మహర్షి పేరు మీద దీనికి నారద పురాణం అని పేరు వచ్చింది. పురాణాలలో నారదుడు చెప్పిన ఎన్నో విషయాలను నారద పురాణంలో పొందుపరిచారు. నారద పురాణంలో కేవలం దేవతల గురించి మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, పూజా విధానం, తీర్థయాత్రలు, వ్రతాలు,మోక్షం, సంగీతం, దేవాలయాల ఆరాధన వంటి అనేక విషయాలు కూడా ఉంటాయి. నారద పురాణంలో ఎప్పుడూ తాకకూడని వస్తువుల గురించి కూడా ప్రస్తావించారు. ఒకవేళ పొరపాటున వాటిని తాకితే జీవితంలో అన్నీ కోల్పోతారని, వినాశనమే జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయం నారద పురాణం ఉత్తర భాగంలో కూడా వివరించబడింది. నారద పురాణంలో చెప్పిన ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే..
అంత్యక్రియల పద్దతులు..
ఎవరిదైనా అంత్యక్రియలకు హాజరై, మృతుని ఎముకలు, పారవేసిన బట్టలు లేదా ఆభరణాలు వంటి అపవిత్రమైన వాటిని తాకితే, ప్రతికూల శక్తి ఆవహిస్తుందట. ఇది దురదృష్టాన్ని కలిగించవచ్చని, ఒకవేళ పొరపాటున గానీ లేదా ఏదైనా కారణం చేత గానీ అలా చేయవలసి వస్తే పవిత్ర నదిలో స్నానం చేయాలని నారద పురాణం పేర్కొంది.
ఒలికిన ఆహారం..
నేలపై పడిన ఆహారాన్ని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు. ఇలా చేయడం బుధ గ్రహానికి కోపం కలిగిస్తుందట . అంతేకాకుండా, ఇది ధన నష్టానికి కారణమవుతుందని, లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుందని అంటున్నారు. నేలపై పడిన ఆహారాన్ని ఎల్లప్పుడూ తీసివేసి, జంతువులు లేదా పక్షులు తినగలిగే చోట పెట్టాలట.
కుక్క..
కుక్కను పాదాలతో ఎప్పుడూ తాకకూడదు. ఇలా చేయడం శనికి కోపం తెప్పిస్తుంది, ఇది జీవితంలోకి పేదరికాన్ని తెస్తుందని నారద పురాణం స్పష్టంగా చెబుతోంది.
చీపురు..
నారద పురాణం ప్రకారం, చీపురును పాదాలతో తాకడం చెడుగా చెప్తారు. అది జీవితంలోకి పేదరికాన్ని తెస్తుందట. చీపురు లక్ష్మీదేవి నివాసంగా భావించబడుతుంది కాబట్టి, దానిని ఎప్పుడూ పాదాలతో తాకకూడదని కూడా ఆ పురాణం చెబుతుంది .
దహన సంస్కార వస్తువులు..
ఎవరిదైనా దహన సంస్కారంలో ఉపయోగించిన కట్టెలు, కొబ్బరికాయలు, వస్త్రాలు, కుండలు మొదలైనవాటిని తాకకూడదు. అలా చేయడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని చెబుతారు.
*రూపశ్రీ.


