ఈ రోజే మాఘపూర్ణిమ.. ఈరోజు సాయంత్రం ఇలా చేయండి..!
పూర్ణిమ తిథికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలోనూ ఒక పూర్ణిమ వస్తుంది. అయితే శ్రావణం, మాఘం, కార్తీకం, ఆషాఢం ఇలా.. కొన్ని పూర్ణిమలకు చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పూర్ణిమ రోజు సముద్రానికి దగ్గరగా వెళ్లకూడదు అంటారు. కానీ మాఘ పూర్ణిమకు మాత్రం సముద్ర స్నానం చేస్తే మంచిదని చెబుతారు. పైగా కుంభమేళా జరుగుతున్న సందర్భంగా ఈ పూర్ణిమ నాడు సముద్ర స్నానం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మాఘ పూర్ణిమ రోజు సాయంత్రం ఒక్క పని చేస్తే ఎంతో పుణ్యం, మరెంతో అదృష్టం కలసి వస్తాయి. ఇంతకీ పూర్ణిమ రోజు సాయంత్రం చెయ్యాల్సిన పనులేమిటో తెలుసుకుంటే..
పూర్ణిమకు సాయంత్రం, రాత్రి సమయం ప్రధానం. ఎందుకంటే చంద్రోదయం అయ్యాక పూర్ణిమ శక్తివంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు శక్తి ఉపాసకులు, గురువు ఉపాసించేవారికి చాలా శ్రేష్టం. పూర్ణిమ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి, పూజాదికాలు ముగించుకుని ఆరోజు ఉపవాసం ఉండాలని అనుకునే ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేనివారు ఆరోజు సాత్విక ఆహారం తీసుకోవచ్చు.
ఇక పూర్ణిమ రోజు సాయంత్రం.. ఆవుపాలు తెచ్చి కాచి చల్లార్చాలి. ఈ పాలలో యాలకుబుడ్డ, కండచక్కెర వేయాలి. ఈ పాలను ఇంటి ఆరు బయట పెట్టుకుని చంద్రుడి వెన్నెల పాల మీద పడేలా చూసుకోవాలి. వర్షాకాలం కాస్త తగ్గుముఖం పట్టి చలి కూడా తగ్గతూ వస్తోంది కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజు పాలలో చంద్రుడి దర్శనం కలుగుతుంది. ఇప్పుడు లలిత సహస్రనామాలు పారాయణం చేయాలి. దీన్నే వెన్నెల పారాయణం అంటారు.
వెన్నెల పారాయణం చాలా మంది 9 సార్లు చేయాలని అనుకుంటారు. కానీ కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా అన్నిసార్లు చేయడానికి ఇబ్బంది పడేవారు ఉంటారు. అమ్మవారికి ఇష్టమైన సంఖ్య 9.. అందుకే 9 సంఖ్య ఎంచుకుంటారు. కానీ వెన్నెలలో ఒకసారి లలితా పారాయణ చేసినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.
చంద్రుడు మనస్సును ప్రభావితం చేస్తాడు. ఈయన మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాడు. వెన్నెలలో లిలిత సహస్రనామాలు పారాయణ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మాఘ పూర్ణిమ రోజు ఈ పనులు చేస్తే చాలా మంచి ఫలితం, పుణ్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
*రూపశ్రీ.
