బాలలకు విద్యను ప్రసాదించే బాలగణపతి

 

 

భగవంతుని సర్వశక్తిమంతుడిగా భావించి ఆయన ముందు మోకరిల్లడం ఎంత తృప్తిని ఇస్తుందో... ఆయనను పసిబాలునిలా ఊహించుకొని, లాలించి పాలించుకోవడమూ అంతే తృప్తిని ఇస్తుంది. శ్రీకృష్ణుని బాల్యచేష్టలను తరచి తరచి చదువుకోనివారు ఎవరుంటారు. బాలరాముడి వినయాన్ని తల్చుకోనివారు ఎవరుంటారు. మరి వినాయకుని సంగతో! అసలు వినాయకుడు అంటేనే ఆయన జన్మవృత్తాంతం, ఆపై జరిగిన సంఘటనలే గుర్తుకువస్తాయి కదా! అందుకే వినాయకుని 32 రూపాలలో బాలగణపతి రూపం తొలుతగా ప్రస్తావనకు వస్తుంది.

 

 

పారాడే వినాయకుడు

బాలగణపతిని చిత్రించడంలో చిత్రకారులు తమ ఊహలను పరుగులెత్తించారు. కొందరు ఆయనను పారాడే బిడ్డగా చిత్రిస్తే, మరికొందరు తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్నట్లుగా రూపమిచ్చారు. కానీ నాలుగు చేతులతో బుద్ధిగా, ఒద్దికగా కూర్చుని ఉండే బాలగణపతి ప్రతిరూపమే ఎక్కువగా కనిపిస్తుంది. ముద్దులొలికే ఆయన మోముని చూడగానే బాలగణేశుడు అన్న అర్థం స్ఫురిస్తుంది. కొన్ని సందర్భాలలో దిగంబరంగా ఉండే బాలగణపతిని పూజించడమూ కద్దు. ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదవ్‌ అనే గ్రామంలో, బాలదిగంబర గణపతికి ఒక ఆలయం ఉండటం విశేషం! ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తూ ఆ కణ్వ మహర్షి ప్రతిష్టించాడని క్షేత్ర పురాణం చెబుతోంది.

 

 

అరుదైన రూపం

గణపతికి ఆహారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పేదేముంది. అందుకనే ఆయనకు ఉన్న నాలుగు చేతులలోనూ ఆహారసంబంధ విషయాలే కనిపిస్తాయి. అరటిపండు, పనసతొన, చెరుకుగడ, మామిడిపండ్లతో దర్శనమిస్తాడు. కొన్ని సందర్భాలలో వెలగపండు, మోదకాలు కూడా కనిపిస్తాయి. మరి బాలలకు ఆహారమే కదా ఆరోగ్యం! బాలగణపతి అచ్చు ఆ బాలసూర్యునిలాగే (ఉదయించే సూర్యుడు) ఎర్రటి ఎరుపు రంగులో ఉన్నట్లుగా ఆయనని ధ్యానించే శ్లోకంలో పేర్కొంటారు.

 

 

ధ్యానం

బాలగణపతిని కనుక పూజిస్తే పిల్లలకు విద్య చక్కగా ఒంటపడుతుందని నమ్మకం. అంతేకాదు, వారికి మంచి బుద్ధులు కూడా అలవడతాయట. ఇక బాలగణపతిని ధ్యానించే పిల్లల సంతోషానికీ, ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు పెద్దలు. ఆ బాలగణపతి రూపాన్ని గుర్తుకుతెచ్చేలా ఆయనను ధ్యానించే శ్లోకం ఇదిగో...
కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ |

బాలసూర్యమిమం   వందే దేవం బాలగణాధిపమ్॥

 

- నిర్జర.

 


More Vinayakudu