కిష్కింద రాజ్యం తెలుగువారిదేనా!
రామాయణం గురించి విన్నవారెవ్వరూ కిష్కిందను మర్చిపోరు. రాముడు సీతమ్మ జాడ కోసం తిరుగుతున్న కాలానికి కిష్కింద రాజ్యాన్ని వాలి పరిపాలిస్తున్నాడు. వాలికీ, అతని సోదరుడైన సుగ్రీవునికీ మధ్య తగని వైరం ఉండేది. అందుకే సుగ్రీవుడు రుష్యశృంగ అనే పర్వతం మీద తలదాచుకునేవాడు. ఆయన వద్ద హనుమంతుడు మంత్రిగా ఉండేవాడు. అలాంటి సమయంలోనే హనుమంతునికి, సీతాదేవి జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులు కనిపిస్తారు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే! ఆంజనేయుని సాక్షిగా రాముడు, సుగ్రీవునితో స్నేహం చేయడం... వాలిని చంపి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని రాజుగా నియమించడం జరిగిపోతాయి.
రాముడు, సుగ్రీవుని మధ్య జరిగే ఘట్టాలన్నీ కూడా ప్రస్తుతం కర్ణాటకలో చోటు చేసుకున్నాయని చెబుతారు. రుష్యమూక పర్వతమూ, సుగ్రీవుడు సీతమ్మవారి నగలని భద్రపరచిన గుహ, వాలి దహనమైన చోటు, హనుమంతుడు విశ్రమించిన చోటు... అంటూ హంపి చుట్టుపక్కల అనేక క్షేత్రాలని భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఈ క్షేత్రాలన్నీ హంపీ చుట్టుపక్కల ఉన్న బళ్లారి, కొప్పాల్ జిల్లాలలో కనిపిస్తాయి.
బళ్లారి, కొప్పాల్ జిల్లాలలో తెలుగువారి సంఖ్య చాలా ఎక్కువ. ఇప్పటికీ అక్కడ దాదాపు 50 శాతం మంది తెలుగువారే కనిపిస్తారు. కాబట్టి ఒకప్పుడు ఇవన్నీ తెలుగువారు నివసించే ప్రాంతాలే అనే వాదనలు లేకపోలేదు. విజయనగర రాజులు సైతం తెలుగువారేననీ, అందుకే వారు తెలుగువారికి దగ్గరలో ఉన్న హంపీనే తమ రాజధానిగా నిర్మించుకున్నారన్న వాదనలూ ఉన్నాయి. తెలుగు మీద శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న అభిమానం ఆ అనుమానానికి మరింత బలం చేకూరుస్తోంది.
కొందరు పండితులు ఈ వాదనలను కాస్త ముందుకు తీసుకువెళ్లి... అసలు సుగ్రీవుడు తెలుగువాడేననీ, కిష్కింద రాజ్యం ఒకప్పుడు తెలుగువారు నివసించే ప్రదేశమేనని వాదిస్తూ ఉంటారు. తెలుగువారిలో ఒక భిన్నమైన తెగనే వానరులుగా చిత్రీకరించారని అనుమానించేవారూ లేకపోలేదు. అయితే ఇలాంటి వాదనలని ఇప్పుడు నిరూపించడం కష్టం. వీటి గురించి గట్టిగా మాట్లాడితే లేనిపోని వివాదాలూ రేగే ప్రమాదం లేకపోవచ్చు. కాబట్టి భగవద్ స్వరూపం అయినా ఆంజనేయుడూ, ఆయన సన్నిహితుడైన సుగ్రీవుడు... అందరివారూ అనుకుంటే ఏ బాధా లేదు!
- నిర్జర.