కర్మయోగం మనకు భోదించేది ఇదే...
ప్రపంచంలో అందరూ కర్మను చేస్తూనే ఉన్నారు. ఎందుకు? స్వతంత్రం కోసం, మోక్షం కోసం. మనస్స్వతంత్రం కోసం, శరీర స్వతంత్రం కోసం, ఆత్మ స్వతంత్రం కోసం! ఇలా మనిషి కోరుకునేవి ఎన్నో ఉన్నాయి. ఒకే లక్ష్యం కోసం అణువు మొదలుకుని మహోన్నత జీవి వరకు కర్మను చేస్తున్నారు ఉన్నారు. సమస్త వస్తువులూ స్వాతంత్ర్యం కోసమే నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.
ఇంతగా కర్మలు చేస్తుంటాం కదా.. ఈ కర్మయోగం ఏం బోధిస్తుంది?
'అసక్త స్సతతం కార్యం కర్మ సమాచార' (ఫలాపేక్ష రహితుడవై విహితమైన కర్మను ఎప్పుడూ చేస్తూండు). దేనితోనూ తాదాత్మ్యం పొందవద్దు. నీ మనస్సును స్వతంత్రంగా ఉంచుకో.
లోకంలో మనకు కనబడే ఈ దుఃఖాలు, ఈ బాధలన్నీ సంసారంలో అనివార్యాలైన పరిస్థితులు. దారిద్య్రం, సంపదలు, సౌఖ్యం, అన్నీ క్షణికాలు. ఇవి మన యథార్థ స్వరూపంలోవి కావు. యథార్థస్వరూపం సుఖ దుఃఖాతీతం, ఇంద్రియాతీతం, భావనాతీతం. అయినా మనమెప్పుడూ కర్మను నిర్వర్తిస్తూనే ఉండాలి.
కర్మ చేత గాదు, సంగం చేత దుఃఖం కలుగుతోంది. మనం చేసే కర్మతో తాదాత్మ్యం పొందగానే దుఃఖం అనుభవిస్తాం. తాదాత్మ్యం పొందకపోతే దుఃఖం అనుభవించం. ఎవరైనా తనది కాక మరొకరి చిత్రపటాన్ని తగలబెడితే సాధారణంగా బాధ పడరు. కానీ తన చిత్రపటాన్నే తగలబెడితే ఎంతో బాధపడతారు. ఎందువల్ల? ఎందుకంటే ఒక పటం పట్ల అతడు తాదాత్మ్యం పొందుతున్నాడు. రెండవదాని విషయంలో పొందడం లేదు.
ఈ 'నేను, నాది' అనే అహంకార మమకారాలే సర్వ దుఃఖాలకూ కారణాలు. మనది అనుకోవడంతోనే మమకారం పుడుతుంది. మమకారం వల్ల దుఃఖం కలుగుతుంది.
మనస్సులో పుట్టే 'నేను, నాది' అనే ప్రతివృత్తి వెంటనే మన చుట్టూ ఒక గొలుసును తగిలిస్తుంది. మనల్ని బానిసల్ని చేస్తుంది. నేను, నాది అని చెప్పుకొనేకొద్దీ బానిసతనం పెరుగుతుంది. బానిసతనంతో దుఃఖమూ పెరుగుతుంది.
కాబట్టి లోకంలో ఉన్న అన్ని పటాల సౌందర్యాన్నీ అనుభవించు, కానీ వాటిలో వేటితోనూ తాదాత్మ్యం మాత్రం పొందవద్దు అని కర్మయోగం మనకు బోధిస్తుంది. ఏదీ 'నాది' అనుకోవద్దు. 'నాది' అని అనుకోగానే దుఃఖం మనల్ని ఆవరిస్తుంది. 'నా దేహం' అనుకోకు. ఉన్న చిక్కంతా ఇందులోనే ఉంది. ఈ శరీరం నీది కాదు, నాది కాదు, మరెవ్వరిదీ కాదు. ప్రకృతి నియమాల వల్ల ఈ శరీరాలు వస్తూ పోతున్నాయి. కానీ మనకు బంధం లేదు, మనం సాక్షులం.
పటానికి ఎంత స్వాతంత్య్రం ఉందో, గోడకెంత స్వాతంత్య్రం ఉందో ఈ శరీరానికీ అంతే స్వాతంత్య్రం ఉంది. అలాంటప్పుడు ఈ శరీరం పట్ల మనకెందుకింత వ్యామోహం? చిత్రకారుడు చిత్రాన్నొకదాన్ని గీచి వెళ్ళిపోతున్నాడు. 'ఇది నా అధీనంలో ఉండాలి' అనే మమకారాన్ని పొందవద్దు. పొందితే, నీకు దుఃఖం మొదలైనట్లే!
కర్మయోగం మనం చేసే కర్మల గురించి చెబుతుంది. ఈ కర్మ నేను చేయలేదు, దేవుడు నా చేత చేయించాడు. ఈ కర్మల పలితం అంతా ఆయనకే చెందుతుంది అనుకుంటే.. మనం చేసే కర్మలు ఏవీ మనల్ని దుఃఖంలోకి నెట్టలేవు.
◆నిశ్శబ్ద.