పరమాత్మను తెలుసుకోవడం ఎలా??

అందరూ పరమాత్మ అనే పేరు విని ఉంటారు. ఇంకా అసలు ఎవరు పరమాత్మ అని అనుకుంటారు?? పరమాత్మను గురించి తెలుసుకోవడం ఎలా? అని ప్రశ్నవేసుకుంటే దానికి రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. కొంత మంది మొదటిది ఆచరించి తరువాత రెండవ దానికి వెళతారు. అంటే సగుణోపాసనతో మొదలు పెట్టి, క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్లుతారు. మరి కొంతమంది నేరుగా రెండవ దానికి వెళతారు. సగుణోపాసన చేసిన వారు, నేను ఈశ్వరుని గురించి తెలుసుకున్నాను అని ఎవరన్నా అంటే వారు ఈశ్వరుని గురించి కొంచెమే తెలుసుకున్నారనీ, పూర్తిగా తెలుసుకోలేదనీ అర్థం. 

సగుణోపాసన అంటే ఏకరూపంగా పరమాత్మను అర్చించడం, రాముడు, కృష్ణుడు, లక్ష్మీదేవి, దుర్గ, పార్వతి, శివలింగము, వినాయకుడు, కుమారస్వామి మొదలగు దేవతామూర్తులను ఎవరినైనా అర్చన మూర్తిగా ఇంటిలో పెట్టుకొని, వారికి ఆవాహన, అర్చన మొదలగు షోడశ ఉపచారములను చేస్తూ పూజించడం. పరమాత్మను ఒక రూపంలో పూజించడం. ఆయనే సర్వస్వం అనుకొని పూజించడం. ఈ అర్చన మూర్తులను పూజించడం పరమాత్మను గురించి తెలుసుకోడానికి మొదటి మెట్టు మాత్రమే కానీ ఇదే ముఖ్యం కాదు. కాని ఈ రోజుల్లో చాలా మంది ఇక్కడే ఆగిపోతున్నారు. అర్చన మూర్తులకు చేసే అలంకారాలమీదా ఉత్సవాలమీదా, ఆ విగ్రహాల విశిష్ఠత మీదా, మహిమల మీదా దృష్టిపెడుతున్నారు వాటి వెనుక ఉన్న పరమాత్మ తత్వము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. దీని గురించి శాస్త్రములు స్పష్టంగానే చెబుతున్నాయి కానీ మన తాత్కాలిక ప్రయోజనాలకు, మన కోరికలు తీరడం కోసం ఇదే ముఖ్యం అనుకొని ఇక్కడే ఆగిపోతున్నాము. శాస్త్రము ముందు సగుణోపాసనతో మొదలు పెట్టి, తరువాత నిర్గుణోపాసన వైపు వెళ్లమని చెబుతుంటే, మనం సగుణోపాసనతోనే ఆగిపోతున్నాము. ఇదంతా శాస్త్రములను సరిగా అవగాహన చేసుకోకపోవడం వలన కలిగే అపోహ తప్ప వేరుకాదు.

సగుణోపాసనలోనే తరువాతి ఘట్టం... మన ఇంట్లో మన పూజాగృహంలో ఉన్న చిన్ని విగ్రహం, అర్చన మూర్తి, ఎవరో కాదు అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపము అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఒక్కడే, వేరు వేరు రూపాలు కాదు. మన సౌకర్యాన్ని బట్టి మనం వేరు వేరు రూపాలలో అర్చనమూర్తులుగా పూజిస్తున్నాము అనే జ్ఞానం రావాలి. "ఇందుగలడందులేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు" అనే భావన రావాలి. ఈ భావన రావడానికి తొలిమెట్టు సగుణోపాసన. పరమాత్మ ఒకడు ఉన్నాడు అనే భావన మనలో కలగడానికి ముందు సగుణోపాసన ప్రతివాడికీ అవసరమే.

 మానవుడు కూడా ఏడాది వయసు నుండి ఐదేళ్లదాకా తల్లి వేలుపట్టుకొని నడుస్తుంటాడు. వేలు వదిలిపెట్టడు. ఎందుకంటే అది ఆ వయసులో అవసరం. కాని పాతికేళ్లు వచ్చిన తరువాత కూడా తల్లి వేలుపట్టుకొని నడవాలని అనుకోడు. ఎందుకంటే ఒక వయసు దాకా తల్లిరక్షణ అవసరం. తరువాత స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్లగలదు. అలాగే పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోవడానికి సగుణోపాసన అవసరం కాని అదే పరమార్థం కాదు. జీవితాంతం సగుణోపాసన చేస్తుంటే మనకు వయసు వచ్చినా మనలో చిన్నపిల్లవాడి మనస్తత్వము, మరొకరి మీద ఆధారపడే తత్వము పోనట్టే కదా! కాబట్టి ప్రతివాడూ ఈ స్థితి నుండి బయట పడి, విశ్వచైతన్యస్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి, అవ్యయుడు, నిరాకారుడు, నిర్గుణుడు, అయిన పరమాత్మను దర్శించడానికి ప్రయత్నం చేయాలి.

అప్పుడు మనిషి ఆత్మతత్వము గురించి తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదం లేదు అని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్న గుణములను అన్నీ పోగొట్టుకొని నిర్గుణుడు, నిరాకారుడు అయిన పరమాత్మలో ఐక్యం కావడానికి ప్రయత్నిస్తాడు. అదే సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మళ్లడం. ఆ ప్రయత్నం ద్వారానే పరమాత్మను తెలుసుకోగలం.

                                         ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu