విదేశీయుల లక్ష్మీదేవి - వసుంధర

 


మన దేశంలో లక్ష్మీదేవిని వివిధ రూపాలలో కొలుచుకోవడం అందరికీ తెలిసిందే! వారివారి ఆకాంక్షలు, ఊహలకు అనుగుణంగా భక్తులు ఆ చల్లని తల్లిని తమకు తోచిన రీతిలో ఆరాధిస్తారు. కానీ కొందరు బౌద్ధులు సైతం లక్ష్మీదేవిని ఆరాధిస్తారని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాలలోని బౌద్ధులు వసుంధర పేరుతో కొలుచుకునే ఓ దేవత లక్ష్మీదేవికి ప్రతిరూపమే అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఆ వసుంధర గురించి మరికొన్ని వివరాలు...
సుచంద్రుచి కథ

‘వసుంధర ధారణి’ అనే ఒక బౌద్ధ లిఖితం ప్రకారం సుచంద్ర అనే ఒక పేద బౌద్ధుడు ఉంటేవాడు. తన మీద ఆధారపడి ఉన్న కుటుంబాన్ని పోషించలేని సుచంద్రుడు ఒకనాడు బుద్ధుని చెంతకు చేరాడు. తన దారిద్ర్యాన్ని తీర్చమనీ... తన కుటుంబాన్నీ, దీనజనులనూ పోషించేందుకు వీలుగా తగినంత ధనాన్ని అనుగ్రహించమనీ వేడుకున్నాడు. దానికి బుద్ధుడు, వసుంధరను పూజించమని సుచంద్రునికి సలహా ఇచ్చాడట. ఆ సలహాను పాటించిన సుచంద్రుడు అచిరకాలంలోనే అపరధనవంతుడై, తన సంపదతో సమాజానికి ఉపయోగపడ్డాడు.

 

బుద్ధుని నోట సంపద మాట?

కోరికలే అన్ని అనర్థాలకూ మూలం అని చెప్పిన బుద్ధుని నోట సంపద గురించిన మాట వినిపించడం నిజంగా చిత్రమే! కానీ సుచంద్రుడు తన సంపదను ఇతరుల సంతోషం కోసం ఉపయోగించే స్వభావం ఉన్నవాడు కనుకనే, బుద్ధుడు ఈ ఉపాయాన్ని సూచించాడంటారు. పైగా ఈ సుచంద్రుని కథ ‘మహాయాన బౌద్ధానికి’ సంబంధించింది. మహాయాన బౌద్ధం ఒక పక్క బుద్ధుని బోధలను అనుసరిస్తూనే... మంత్రతంత్రాలనూ, దేవీదేవతలను విశ్వసిస్తుంది.

వసుంధర ఆరాధన

లక్ష్మీదేవిని తలపించే వసుంధర మూర్తిని నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఖాట్మాండు లోయ చుట్టుపక్కల నివసించే నేవార్‌ అనే తెగలోని బౌద్ధులు ఈమెను కులదేవతగా భావిస్తారు. వసుంధరను ఆరాధిస్తే కేవలం సిరిసంపదలే కాదు... ధనధాన్యాలు, సంతానభాగ్యం లభిస్తాయన్నది భక్తుల నమ్మకం. వసుంధర అనుగ్రహం కేవలం భౌతికమైన సంపదలను మాత్రమే కాకుండా, ఆధ్మాత్మిక ఔన్యత్యాన్ని కూడా ప్రసాదిస్తుందన్నది వారి విశ్వాసం.

 

అదే రూపం!

వసుంధరాదేవి రూపు ముమ్మూర్తులా లక్ష్మీదేవిని పోలి ఉంటుంది. ఒక పద్మం మీద ఆసీనురాలై, లలితాసనంలో కూర్చుని ఉంటుంది. అభయవరద హస్తాలతో... వరికంకులు, ధనరాశులూ నిండిన చేతులతో, లక్ష్మీదేవికి మరో రూపు అన్న నమ్మకాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఒకో సందర్భంలో కుబేరునికి ప్రతిరూపం అయిన వైశ్రవణుడు అనే బౌద్ధ దేవత ఆమె చెంతనే ఉంటాడు.

ఇదీ నేపాలువారు ఆరాధించే లక్ష్మీదేవి కథ! కేవలం నేపాలు ప్రజలే కాదు, ధనప్రాప్తి పొందాలనుకునేవారు ఎందరో ‘ఓం వసుంధరే స్వాహా!’ అన్న మంత్రాన్ని జపించడం ద్వారా సంపదను పొందవచ్చని నమ్ముతారు. ఈ మంత్రాన్ని ‘Buddhist Money Mantra’ అని కూడా పిలుస్తారు.

- నిర్జర.

 


More Lakshmi Devi