వినాయక చవితి వ్రతంలో వాడే పత్రి రహస్యాలు..ఏ పత్రి వల్ల ఏ ఫలితం ఉంటుందో తెలుసా.!

వినాయక చవితి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మట్టి గణపతి, రంగురంగుల పూలు, , వివిధ రకాల పత్రాలు. వినాయకుని పూజలో ఏకవింశతి పత్రి అంటే ఇరవై ఒక్క రకాల మొక్కల ఆకులను ఉపయోగించి పూజించడం అనవాయితీ. సాధారణంగా ఏ దేవుడి పూజలోనైనా పూలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ, వినాయక చవితి వ్రతంలో మాత్రం పత్రి అని పిలువబడే ఈ మొక్కల ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పత్రి పూజ వెనుక ఎన్నో రహస్యాలు, లోతైన విశేషాలు దాగి ఉన్నాయి.
సాధారణంగా పత్రిలో వాడే మొక్కలకు ఆయుర్వేదంలో ఎన్నో మూలికా గుణాలు ఉన్నప్పటికీ, ఏ మొక్కల ఆకులతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. వినాయక చవితి పూజలో ఉపయోగించే ముఖ్యమైన పత్రాలు, వాటి వల్ల కలిగే ఫలితాలు వివరంగా తెలుసుకుంటే..
మాచీ పత్రం..
మాచీ పత్రంతో వినాయకుడిని అర్చించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాప్రాప్తి లభిస్తాయి. చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరిగి విద్యారంగంలో రాణిస్తారు.
బృహతీ పత్రం..
ములక లేదా వాకుడు ఆకుతో పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధించి, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బిల్వ పత్రం..
మారేడు ఆకు శివునికి ఎంత ప్రీతిపాత్రమో గణపతికి కూడా అంతే ఇష్టం. బిల్వ పత్రంతో పూజించడం వల్ల సమస్త పాపాలు నశించి, మహాదేవుని పరిపూర్ణ అనుగ్రహం , ఐశ్వర్యం లభిస్తాయి.
దూర్వా పత్రం..
గరిక విఘ్నేశ్వరునికి అత్యంత ప్రియమైనది. గరికతో పూజ చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్త విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి లభిస్తుంది.
దత్తూర పత్రం..
ఉమ్మెత్త ఆకుతో అర్చించడం వల్ల మనస్సులోని అహంకారం, ప్రతికూల ఆలోచనలు నశిస్తాయి. సమాజంలో మంచి పేరు, అధికార యోగం సిద్ధించేందుకు ఇది తోడ్పడుతుంది.
బదరీ పత్రం..
రేగు ఆకుతో పూజించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆందోళనలు, భయాలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అపామార్గ పత్రం..
ఉత్తరేణి ఆకుతో గణపతిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురిలో మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.
తులసీ పత్రం..
వినాయక చవితి రోజున మాత్రమే వినాయకునికి తులసితో పూజ చేసే వెసులుబాటు ఉంది. ఈ రోజు తులసీ పత్రంతో పూజించడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభించి పుణ్యఫలం దక్కుతుంది.
చూత పత్రం..
మామిడి ఆకుతో వినాయకుడిని పూజించడం వల్ల గృహంలో మంగళకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన ప్రాప్తి, కుటుంబంలో శుభకార్యాలు జరిగేందుకు ఇది విశేషమైనది.
కరవీర పత్రం..
గన్నేరు ఆకుతో పూజించడం వల్ల సంకల్పాలు నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆటంకాలు తొలగి అనుకూల ఫలితాలు వస్తాయి.
విష్ణుక్రాంత పత్రం..
ఈ ఆకుతో వినాయకుడిని అర్చించడం వల్ల సద్బుద్ధి, సత్సంగం లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
దాడిమీ పత్రం..
దానిమ్మ ఆకుతో గణపతిని పూజిస్తే సమస్త అనారోగ్యాలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శరీరంలో కాంతి, శక్తి పెరుగుతాయి.
దేవదారు పత్రం..
దేవదారు ఆకుతో పూజించడం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకునే ధైర్యం, స్థిరత్వం లభిస్తాయి. శత్రు భయం తొలగిపోతుంది.
మరువక పత్రం..
మరువంతో పూజించడం వల్ల దాంపత్య జీవితంలో అనురాగం, సంతోషం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలిగి సఖ్యత నెలకొంటుంది.
సింధువార పత్రం..
వావిలి ఆకుతో పూజ చేయడం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది.
జాజి పత్రం..
జాజి ఆకులతో వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. సుఖ సంతోషాలు, ప్రశాంతత లభిస్తాయి.
శమీ పత్రం..
జమ్మి ఆకుతో పూజించడం వల్ల శని దోషాలు, వివిధ గ్రహ దోషాల నివారణ జరుగుతుంది. పాపాలు నశించి ఆటంకాలు లేని జీవితం లభిస్తుంది.
అశ్వత్థ పత్రం..
రావి ఆకుతో స్వామిని పూజించడం వల్ల వంశాభివృద్ధి, పితృ దేవతల అనుగ్రహం లభిస్తాయి. ఇంట్లో సిరిసంపదలు సమకూరుతాయి.
అర్క పత్రం..
జిల్లేడు ఆకుతో వినాయకుడిని అర్చించడం వల్ల నరదృష్టి, గ్రహబాధలు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది.
కేతకీ పత్రం..
మొగలి ఆకుతో పూజించడం వల్ల శత్రు బాధలు తొలిగిపోతాయి. సమాజంలో ఆధిపత్యం, నాయకత్వ గుణాలు పెరుగుతాయి.
పున్నాగ పత్రం..
పున్నాగ ఆకుతో గణపతిని అర్చించడం వల్ల ఆత్మశుద్ధి లభించి, సమస్త కోరికలు నెరవేరుతాయి. జీవితంలో ప్రశాంతత, మంచి అనుభూతి కలుగుతాయి.
ఈ విధంగా వినాయక చవితి రోజున వివిధ రకాల పత్రాలతో విఘ్నేశ్వరుడిని పూజించడం వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేక రహస్య ఫలం దాగి ఉంది. నిష్ఠతో, భక్తితో చేసే పత్రి పూజ సకల అభీష్టాలను నెరవేర్చి, జీవితంలో సంతోషాన్ని, ప్రశాంతతను నింపుతుంది.
*రూపశ్రీ.





_medium.png)
