దేవుడి పూజలో ఈ లోహంతో చేసిన వస్తువులు అస్సలు వాడకూడదట.. !
దేవుడి పూజ ప్రతి ఇంట్లో తప్పకుండా జరిగేది. హిందూ సాంప్రదాయంలో దేవుడి పూజకు పెద్ద ప్రాధాన్యతే ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో పూజలకు పెద్ద పీట వేస్తారు కూడా. అయితే దేవుడి పూజకు ఉపయోగించే వస్తువుల విషయంలో కొందరు గందరగోళానికి గురవుతారు. ముఖ్యంగా దేవుడి మీద భక్తి ఉండి, పూజలు చేసుకోవాలనే ఇష్టం నేటికాలం యువతలో కొందరికి ఉంటుంది. కానీ ఎలా పూజ చేసుకోవాలి? పూజకు ఎలాంటి వస్తువులు వాడాలి? ఎలాంటివి వాడకూడదు వంటి విషయాలు చెప్పడానికి పెద్దలు వారితో లేకపోవడం వల్ల పూజ వస్తువులు, పూజకు ఎంచుకునే లోహాల విషయంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దేవుడి పూజకు వాడే వస్తువులను ఈ కింది లోహాలతో తయారు చేసినవి మాత్రం అస్సలు వాడకూడదు అంట. అవేంటో తెలుసుకుంటే..
దేవుడి పూజకు వినియోగించే వస్తువులలో అల్యూమినియం పాత్రలు ఉండకూడదు. దీపాల నుండి దేవుడి ప్రసాదం వండే పాత్రల వరకు ప్రతి ఒక్కదానికి ఇది వర్తిస్తుంది. ఎవరైనా అల్యూమినియం పాత్రలు వాడుతుంటే వాటిని నేటి నుండే మానేయడం మంచిది. అల్యూమినియం పాత్రలు వాడటం అశుభంగా పరిగణించబడుతుందట.
కేవలం అల్యూమినియం మాత్రమే కాదు.. నేటి కాలం ప్రజల ఇళ్లలో అల్యూమినియంతో పాటూ స్టీల్ పాత్రలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే దేవుడి పూజకు మాత్రం స్టీల్ పాత్రలు అస్సలు ఎంచుకోకూడదట.
పూజకు ఉపయోగించే పాత్రలు లోహంతో చేసినవి ఉండటం కూడా మంచిది కాదట. ఇలాంటి పాత్రలకు ఏమాత్రం గాలి, తడి తగిలినా చాలా సులువుగా తుప్పు పట్టిపోతాయి. దేవుడి పూజకు వినియోగించే వస్తువులు ఎప్పుడూ కళగా ఉండాలి. అలా ఉన్నప్పుడే చేసిన పూజ కూడా కంటికి ఇంపుగా ఉంటుంది.
*రూపశ్రీ.