ఈ ముద్రకు వంక పెట్టలేరు!

ఆడవారికి నెల నెలా ఎదురయ్యే సమస్య మాములే అనుకుంటారు అందరూ. అయితే అది రావడం పోవడం మాములే అయినా దాని వల్ల శరీరానికి కలిగే ఇబ్బంది మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే వస్తుంది. మరీ ముఖ్యంగా ఒళ్ళు వేడిగా మారిపోవడం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒళ్ళంతా కాల్చినట్టు, జ్వరం వచ్చినట్టు ఫీలవ్వని మహిళలు అంటూ ఉండరు. అయితే టెంపరేచర్ చెక్ చేస్తే మాత్రం శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే కనిపిస్తుంది. ఈ వింత స్థితి ఆడవారిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితికి చక్కని సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది శంఖు ముద్ర. ఎంతో సులువుగా వేసేయ్యగల ఈ ముద్రతో శరీర స్థితిని సాధారణానికి తీసుకురావడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 

యోగాసనాలు, ముద్రలు వేయడానికి ముందుగా…

ప్రశాంతంగా ఉన్న స్థలం ఎంపిక చేసుకోవడం ప్రతి ఒక్క ఆసనానికి కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి ఆసనాలు వేసేవారు, ముద్రలు వేసేవారు, ధ్యానం చేసేవారు ఇలా ఏదైనా సరే దేనికైనా సరే మొదట రణగొణ ధ్వనులు లేని ప్రాంతం చూసుకోవడం ఎంతో ముఖ్యం.

శంఖు ముద్ర వేసే విధానం!

మెత్తని ఆసనం వేసుకుని కూర్చోవాలి. పద్మాసనంలో కూర్చుంటే బాగుంటుంది. ఎవరి అనుకూలాన్ని బట్టి వారు కూర్చోవచ్చు.

పద్మాసన స్థితిలో నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు వెన్నుపూస నిటారుగా ఉండాలి. వంగకూడకూడదు.

రెండు చేతులను ముందుకు చాపి వాటిని ఛాతీ భాగానికి ఎదురుగా తీసుకురావాలి. ఛాతీకి తగిలించకూడదు.

మొదట ఎడమ చేతి బొటన వేలిని కుడి చేతి నాలుగు వేళ్ళతో మూసి ఉంచాలి. తరువాత ఎడమ చేతి చూపుడు వేలు, మధ్యవేలును నిటారుగా ఉంచి ఆ రెండు వేళ్ళకు కుడిచేతి బొటన వేలును ఆనించాలి. 

ఇలా ఆనించిన తరువాత గమనించుకుంటే అది శంఖు ఆకారంలో కనిపిస్తుంది. ఈ ముద్రను వేసినప్పుడు ఇది ఛాతీ నుండి దూరంగా ఉండాలి. శరీరానికి తగలకూడదు. 

ఈ ముద్రలో అలాగే కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా గాలిని పీల్చి వదులుతూ గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి మీదనే ధ్యాస పెట్టాలి. 

ఇలా ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం ఐదు నిమిషాలు శంఖు ముద్ర సాధన చేయాలి. 

దీనివల్ల పెరిగిపోయినట్టు అనిపించే శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధమవడమే కాకుండా ఇంకా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే….

ఎక్కువ మంది ఆడవారు ఈకాలంలో ఎదుర్కొంటున్న గర్భాశయ సమస్యలు ఈ ముద్రతో తగ్గుతాయి.

ఆకలి లేకపోవడం కొందరికి సమస్యగా ఉంటుంది. అలాంటివారికి ఈ ముద్ర చక్కగా పనిచేస్తుంది. ఆకలి పెంచుతుంది. అలాగే తిన్న ఆహారం జీర్ణమవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది.

చర్మవ్యాధి కోవలోకి వచ్చే దద్దుర్లు, అలర్జీలు మొదలైన సమస్యలు తగ్గుతాయి.

ఆడవారిలో ఎక్కువ మంది ఎదుర్కొనే థైరాయిడ్ సమస్య కూడా అదుపులోకి వస్తుంది.

మహిళల్లో సాధారణం అయిపోయిన ఒత్తిడి అనే సమస్యను అధిగమించవచ్చు.

శరీరం వేడెక్కిపోయినట్టు అనిపించడం, జ్వరం వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు తగ్గుతాయి. 

ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే శంఖు ముద్రకు ఎవరైనా వంక పెడతారా చెప్పండి. హాయిగా సులువుగా దీన్ని సాధన చేసేయండి.

                                     ◆నిశ్శబ్ద.


More Yoga